ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే.. మనం కలిసి ఉంటాం.. లేకుంటే..

ఆఫీసు నుండి వచ్చి అలసటగా కూర్చుండి పోయింది వింధ్య. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది. పిల్లలు వెనకాల గార్డెన్‌లో ఆడుతున్నట్లున్నారు.

Updated : 05 May 2024 08:37 IST

- మణి గోవిందరాజుల

ఆఫీసు నుండి వచ్చి అలసటగా కూర్చుండి పోయింది వింధ్య. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది. పిల్లలు వెనకాల గార్డెన్‌లో ఆడుతున్నట్లున్నారు. లేచి కాఫీ చేసుకుందామన్నా ఓపిక లేదు. కిచెన్‌లో చప్పుడు వినిపించి తొంగి చూసింది. వివేక్‌ కాఫీ కలుపుకుంటున్నాడు. ‘‘వివేక్‌, నాక్కూడా ఒక కప్పు’’ లోపలికి వినపడేట్లుగా కేసింది.
జవాబు లేదు. మనసు ఉసూరుమని నిట్టూర్చింది. మళ్ళీ ఏదో విషయానికి కోపం వచ్చినట్లుంది. ఇక నాలుగురోజులు మాటలుండవు. అడిగిన దానికి జవాబు ఉండదు. పిల్లలను పట్టించుకోడు. ఒక్కసారిగా కళ్ళముందు తరువాతి నాలుగురోజుల సినిమా కనపడేసరికి నీరసం రెట్టింపయింది. అసలు ‘అతని కోపానికి కారణమేమిటా’ అని ఆలోచించింది కాసేపు.
లీనాకి ప్రమోషన్‌ వచ్చిన సందర్భంగా... లీనా భర్త ఆడమ్‌, నిన్న చిన్న పార్టీ ఇచ్చాడు. తనకు ఎక్కడికి వెళ్ళినా శారీ కట్టుకోవడం ఇష్టం. పైగా లీనా ప్రత్యేకంగా చెప్పింది- శారీలో రమ్మని. అందుకే ‘ఏది కడదామా’ అని చాలా ఆలోచించి లేత గులాబీ చీర మీద చిన్న ప్రింట్‌ జార్జెట్‌ శారీ కట్టుకుని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్‌ వేసుకుని జుట్టుని వదిలేసింది. అద్దంలో తనకు తానే ముద్దొచ్చింది. తన రంగులో కలిసిపోయిందా లేత గులాబీ రంగు. నిజానికి తనకు ఏ డ్రెస్‌ అయినా, చీర అయినా, లెహెంగా అయినా అన్నీ బాగా నప్పుతాయి. లోపలికి వచ్చి తనని చూసిన వివేక్‌ మొహం చిట్లించాడు.
‘‘మనం వెళ్ళేది అమెరికన్స్‌ ఇంటికి. జీన్స్‌ కానీ ఫ్రాక్‌ కానీ వేసుకుంటే బాగుంటుంది. అప్పలమ్మలా ఈ చీరేంటి?’’ విసుక్కున్నాడు వివేక్‌.
ఒక్కసారిగా మనసు కుంచించుకు పోయింది. మరుక్షణం తేరుకుని ‘‘హే! వివేక్‌ ఇప్పుడు నాకు ఇదంతా మార్చే ఓపిక లేదు. చలో చలో’’ నవ్వుతూ కొట్టేసి లేవబోయింది. 
లేవబోతున్న వింధ్యని ఆపేసి ‘‘మార్చుకో అంటుంటే వినిపించుకోవేం. నా మాటంటే నీకు లెక్కలేదు’’ కోపంగా అన్నాడు వివేక్‌.
ఇంతలో ‘‘మామ్‌, వి ఆర్‌ రెడీ’’ అంటూ పట్టు లంగా వేసుకుని హరిణీ, కుర్తా పైజామా వేసుకుని హర్షా పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళను చూసేసరికి కోపం నషాళానికి అంటింది వివేక్‌కి. ‘‘నువ్వే కాకుండా అందరినీ అలానే అప్పలమ్మల్లా తయారు చేశావా?’’ గట్టిగా అరిచాడు. అప్పుడు అతని మొహం చూస్తే భయానికి బదులు అసహ్యం వేసింది. 

‘‘నాన్నా! మాకు ఈ డ్రెస్సులే ఇష్టం. పైగా గారీ అండ్‌ కార్లీలకు  కూడా ఇవే తీసుకున్నాం’’ తల్లిని భయంగా హత్తుకుంటూ చెప్పాడు హర్ష. కోపంతో చేతికందిన ఫ్లవర్‌వేజ్‌ని నెట్టేసి బయటకెళ్ళిపోయాడు వివేక్‌. అప్పటికే తల్లి చీరలో తల దాచుకుంది హరిణి. 
‘‘నాన్న బ్యాడ్‌’’ తండ్రి వెళ్ళాక చీరలోంచి తల బయటపెట్టి అక్కసుగా అంది హరిణి. ఆ సమయంలో దాని మొహం చూసి నవ్వొచ్చింది. కానీ, వెంటనే వాళ్ళ భయం చూసి జాలేసింది వింధ్యకి... ‘‘ఓయ్‌ బంగారాలూ, నాన్న కోపం చూసి భయపడ్డారా? ఉత్తిదే... చూడండి మళ్ళీ ఇప్పుడే పిలుస్తారు. పదండి... పదండి... గారీ వాళ్ళు మీ కోసం బోలెడు ప్లాన్స్‌ వేసి ఉంచారు. లేట్‌ అయితే అవన్నీ మిస్‌ అవుతారు. అవునుగానీ, కార్లీ తనిచ్చే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌  మిమ్మల్ని గెస్‌ చేయమంది చేశారా?’’ అనడంతో వెంటనే డైవర్ట్‌ అయ్యారిద్దరూ. అక్కడికెళ్తున్నామన్న ఉత్సాహం వచ్చేసింది. ఉరుక్కుంటూ బేస్‌మెంట్‌ కెళ్ళారు. కానీ అక్కడ తండ్రి కనపడలేదు. అంతే స్పీడ్‌తో వెనక్కొచ్చారు. ‘‘అమ్మా! నాన్న లేడు పార్కింగ్‌లో. కార్‌ కూడా లేదు’’ గస పోసుకుంటూ చెప్పారు.

అర్థమైపోయింది వింధ్యకి. వెళ్ళిపోయాడు ఎక్కడికో. కోపం వచ్చినప్పుడల్లా అంతే. వెంటనే చెప్పింది... ‘‘నాన్న ఇప్పుడే నాకు మెసేజ్‌ చేశారు. డైరెక్ట్‌గా అక్కడికే మనల్ని రమ్మన్నారు. పదండి వెళ్దాం. ఈ లోపల గెస్‌ చేస్తూ ఉండండి. నేను క్యాబ్‌ బుక్‌ చేస్తాను’’ చెప్పి ఊబర్‌ బుక్‌ చేసి తాళాలూ అవీ చూసుకుని వచ్చే లోపల క్యాబ్‌ గుమ్మం దగ్గర ఉంది.
అక్కడికి వెళ్ళేసరికి వివేక్‌ అందరితో చలాకీగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతున్నాడు. ఒళ్ళు మండిపోయింది వింధ్యకి. తమాయించుకుని నవ్వుతూ ఎదురొచ్చిన లీనాతో లోపలికి వెళ్ళిపోయింది. చాలా బాగా అరేంజ్‌ చేసింది లీనా పార్టీని. లీనా హజ్బెండ్‌ ఆడమ్‌, చాలా హుందాగా ఉంటాడు. అందర్నీ చక్కగా కలుపుకుని మాట్లాడతాడు. ముఖ్యంగా భార్య లీనాకి అతనిచ్చే గౌరవం చూస్తుంటే ‘పెళ్ళికీ బంధానికీ విలువ ఇస్తాం’ అని చెప్పుకునే భారతీయ దంపతులు కూడా సిగ్గుపడాలి. ఆ మాట అంటే- ‘వాడు ఆడంగి వెధవ’ అంటాడు వివేక్‌.

గారీ, కార్లీలు చాలా పొంగిపోయారు వాళ్ళ డ్రెస్సులు చూసి. వెంటనే వెళ్ళి వేసుకొచ్చారు. లంగాను గుండ్రంగా తిప్పుతూ కార్లీ, హరిణీ ఆటల్లో పడిపోయారు. గారీ హర్షలు- గారీ రూములోకెళ్ళి గేమ్స్‌ ఆడుకోవడం ప్రారంభించారు.
పార్టీలో వీరుకాక ఇంకో ఇండియన్‌ ఫ్యామిలీ, మూడు అమెరికన్‌ ఫ్యామిలీలు ఉన్నారు, ఇండియన్‌ ఫ్యామిలీలోని తల్లీ కూతుళ్ళు పూర్తి పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నారు. చూపులేవో గుచ్చుకొంటున్నట్లై వెనక్కి చూసింది. ‘వాళ్ళను చూడు’ అన్నట్లుగా సైగ చేస్తున్నాడు వివేక్‌ కళ్ళతో. మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మిగతా మూడు అమెరికన్‌ ఫ్యామిలీ వాళ్ళకు వింధ్య డ్రెస్‌ చాలా నచ్చింది. చాలా మెచ్చుకున్నారు కూడాను, అది వివేక్‌ని ఇంకా ఇరిటేట్‌ చేసింది. 
కార్లీ అందరికీ మంచి గిఫ్ట్స్‌ ప్రెజెంట్‌ చేసింది. ఇంటికి వస్తుంటే కార్లోనే నిద్రపోయారిద్దరూ.

మర్నాడు పక్క విలేజ్‌కి క్యాంప్‌ ఉండటంతో పిల్లల్ని స్కూల్లో డ్రాప్‌ చేయమని మెసేజ్‌ పెట్టేసి, వాళ్ళంతా లేవకముందే వెళ్ళిపోయింది వింధ్య. లేట్‌ అవుతుందనిపించి పికప్‌ కూడా చేసుకొమ్మని, మెసేజ్‌ చేసి ఇంటికొచ్చేసరికి ఆరయింది.చాలా అలసటగా ఉంది. ‘ఎవరన్నా కాఫీ కలిపి ఇస్తే బాగుండు’ అన్నట్లుగా ఉంది ప్రాణం. కాఫీ కాదు కదా... ఇక మాటలు కూడా ఉండవు. రేపటినుండీ పిల్లల డ్రాపింగ్‌, పికప్‌ కూడా తానే చేసుకోవాలి. నాల్రోజులయ్యాక ఆ కోపం చల్లారితే మాట్లాడినా తను ‘సారీ’ చెబితే కానీ శాంతించడు. కాసేపు అలానే కళ్ళు మూసుకుని కూర్చుంది. కానీ పిల్లల ఆకలి తీర్చే బాధ్యత గుర్తొచ్చి లేచింది. అప్పటికే శీతాకాలం చీకటితో అర్ధరాత్రి అయినట్లుగా ఉంది. కుకర్‌ పెట్టేసి గబగబా ఆలూ వేయించింది. అప్పటికే పిల్లలు తూగుతున్నారు. ఎలాగో బతిమలాడి వాళ్ళకు తినిపించింది. ఆఖరు ముద్ద పూర్తవుతూనే నిద్రలోకి జారుకున్నారు. మూతి తుడిచి, దిష్టి తీసి ఇద్దరి నుదుటి మీదా ముద్దు పెట్టుకుంది. లేచి చేయి కడుక్కుని వచ్చి, వాళ్ళను సరిగా పడుకోబెట్టి, బ్లాంకెట్‌ కప్పింది. వంట ఇంట్లోకి వెళ్ళి డైనింగ్‌ టేబుల్‌ సర్ది, తాను పెట్టుకుని తినేసి, మిగతావన్నీ మూతలు పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయింది. అంతసేపూ కూడా వివేక్‌ టీవీ చూస్తూ కూర్చున్నాడే కానీ పిల్లలేడుస్తుంటే వాళ్ళని ఓదార్చలేదు సరికదా, హరిణి దగ్గరకెళ్తే నెట్టేశాడు- ‘మమ్మీ దగ్గరకెళ్ళూ’ అంటూ. దాన్ని దగ్గరకు తీసుకుంటూ వంట చేయాల్సొచ్చింది. 

పడుకున్నదే కానీ నిద్ర పట్టలేదు వింధ్యకు. కళ్ళల్లోనుండి కారుతున్న కన్నీళ్ళకు దిండు తడుస్తోంది. మనసు వేదనతో భారంగా అయింది. తనకే ఎందుకిలా? నిజానికి ఏ లోటూ లేని జీవితం తమది. ముత్యాల్లాంటి పిల్లలు. ఏ బాధ్యతలూ లేవు. హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం. నిజానికి వివేక్‌ పూర్తి చెడ్డవాడు కూడా కాదు. కానీ రెండో మనిషి ఉన్నాడు తనలో. మొదటివాడు బయటి వాళ్ళకు ఇష్టుడు. రెండోవాడు పూర్తి వ్యతిరేకం. వివేక్‌ ఆఫీసునుండి ఇంటికి వచ్చాడంటే భయం. ఏ క్షణానికి ఏ రకమైన మూడ్‌తో ఉంటాడో తెలియదు. పైనుండి విపరీతమైన కోపంతో అతనంటున్న మాటలకు, ఒకరకంగా తాను, తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతోంది. ప్రతి చిన్నదానికీ పక్కవాళ్ళతో పోల్చడమే. ప్రతి విషయానికీ ఎత్తి చూపడమే. పెళ్ళయ్యి పదేళ్ళయింది. సర్దుకోవడమూ చికాకు పడటమూ ఇంకా వీలయితే అరుచుకోవడమూ. ‘ఒక్క రోజైనా ఆనందంగా ఉన్నామా’ అంటే సందేహమే... కలిసి ఉన్నామంతే. ఇద్దరమూ వయసులోని వారమే కాబట్టి పిల్లలు పుట్టారు. ఏదో అంతవరకే తన బాధ్యత అనుకుంటాడు. వాళ్ళ పెంపకంలో చిన్న సహాయం కూడా ఉండదు.

పొద్దున్నే అలారం మోతకు మెలకువ వచ్చింది. బద్ధకంగా ఒక నిమిషం పడుకున్నా, వెంటనే చేయాల్సిన పనంతా గుర్తొచ్చి తప్పదన్నట్లుగా లేచింది. పిల్లలిద్దరూ చెరో పక్కన హాయిగా నిద్రపోతున్నారు. వాళ్ళను లేపాలంటే మనసొప్పదు కానీ స్కూల్‌ టైమ్‌ అవుతోంది. మళ్ళీ హడావుడి అవుతుంది. బస్‌ వచ్చే టైమ్‌కి అక్కడుంచాలి.
‘‘బంగారాలూ లేవండి...’’ సున్నితంగా ఇద్దర్నీ దగ్గరికి తీసుకుంటూ  మెల్లగా తట్టసాగింది.
‘‘అమ్మా! ఫైవ్‌ మినిట్స్‌ అమ్మా’’ గారంగా అమ్మ ఒళ్ళో ముడుచుకుంటూ దగ్గర దగ్గరికి జరుగుతూ మురిపాలు పోయారు పిల్లలు. ఒక అయిదు నిమిషాలు వాళ్ళతో ముచ్చట్లాడి, లేవమని చెప్పి వచ్చేసింది చేయాల్సిన పనులు తలుచుకుంటూ. ఆ తర్వాత ఆఫీసుకు వెళ్ళిందే కానీ తలనొప్పిగా ఉండి ఇంటికి వచ్చేసింది.
కాఫీ కలుపుకుని ఆలోచించసాగింది. ఎలా ఈ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేసుకోవడం? అప్పటికీ ఒకసారి చూచాయగా అత్తగారూ మామగారూ ఉండగా చెప్పింది. ‘అమ్మో! నా కొడుకు మీద నింద వేయకు. నా గుండె ఆగిపోతుంది’ అంటూ గుండె పట్టుకుని గోల చేసిన ఆవిడది- మూర్ఖత్వం అనుకోవాలో కొడుకుమీద ప్రేమ అనుకోవాలో అర్థం కాలేదు.
ఆవిడ ఆలా మాట్లాడుతుంటే- నోరు తెరిచి సమస్య చెప్పుకుంటున్న కోడలిని ‘సమస్య ఏంటమ్మా’ అని అడగాల్సింది పోయి, ‘దేవత లాంటి అత్తగారిని బాధ పెట్టకు’ అంటూ కోడల్నే అరిచిన డమ్మీ లాంటి మామగారిని చూస్తే గౌరవించాలని అనిపించలేదు. ‘పెళ్ళాన్ని ప్రేమించడం’ అనే మామగారి పోలిక వివేక్‌కి కూడా వస్తే బాగుండేదనిపించింది.
ఆలోచిస్తూ టీవీ రిమోట్‌ తిప్పసాగింది. పిల్లల కార్యక్రమం ఏదో వస్తోంది. ‘ఒరులేయవి ఒనరించిన’ పద్యం నిన్న చెప్పా కదా... ఇవాళ దాని అర్థం చెప్పుకుందాం- చెప్పసాగింది యాంకరు.
సడన్‌గా ఒక ఆలోచన ఫ్లాష్‌లా వెలిగింది. ఉత్సాహంగా లేచి కాఫీ కలుపుకుని తాగింది.

ఇంతలో లాక్‌ ఓపెన్‌ చేసుకుని వివేక్‌ లోపలికి వచ్చాడు. ‘‘వివేక్‌, కాఫీ తాగుతావా?’’ అడిగింది ఏమీ జరగనట్లే. ఏ కళనున్నాడో, కావాలని చెప్పి సోఫాలో కూలబడ్డాడు. మంచి కాఫీ కలిపి వివేక్‌కి ఇచ్చింది- థ్యాంక్స్‌ ఆశించకుండా.
‘‘వివేక్‌, ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు. కాస్త వెళ్ళి ఫ్రెషప్‌ అవొచ్చు కదా?’’ అంది.
‘‘నువ్వేమీ నాకు చెప్పక్కర్లే. నా సంగతి నాకు తెలుసు’’ విసురుగా లేచి వెళ్ళి ఫ్రెష్‌ అయి వచ్చాడు.
‘‘అదేంటి వివేక్‌, ఆ డ్రెస్‌ ఏంటి... అంత ఛండాలమైనది వేసుకున్నావు? ఒకసారి అద్దంలో చూసుకున్నావా? నీ కలర్‌కి ఆ డ్రెస్‌ ఏమైనా నప్పిందా?’’ పకపకా నవ్వేసింది.
ఫస్ట్‌ టైమ్‌ వింధ్య అలా మాట్లాడటం. వింతగా చూసి, ‘‘నాకిష్టమైనది నేను వేసుకుంటాను. నువ్వెవరు అడగడానికి?’’ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.
‘‘వివేక్‌, ఆ పక్కింటాయన చూడు... ఎప్పుడు చూసినా నీట్‌గా ఉంటాడు. నువ్వేంటి... ఎప్పుడూ జిడ్డోడుతూ ఉంటావు?’’
‘‘వివేక్‌, కీర్తనా వాళ్ళాయన ఎప్పుడూ వాళ్ళావిడకు వంటల్లో సహాయం చేస్తూ ఉంటాడు. నువ్వెందుకు కిచెన్‌లోకి రావు?’’

...వారం రోజులు ‘తగ్గేదే లే’ అన్నట్లు ఇలాగే వింధ్య ఏదో ఒకటి అనటం... వివేక్‌కి కోపం వచ్చి బయటకు వెళ్ళటం జరుగుతోంది. ఇంతకు ముందైతే వివేక్‌ వెంటనే నోరేసుకుని అరిచేవాడు. కానీ ఇప్పుడు వింధ్య ముఖంలో కనపడుతున్న ఆత్మస్థైర్యమో, మొండి ధైర్యమో వివేక్‌ని నోరెత్తనీయటం లేదు. వివేక్‌ అలా బయటకు వెళ్ళినప్పుడు మొదట్లోలాగా ఇప్పుడు వింధ్య భయపడటం లేదు. ‘వచ్చినప్పుడే వస్తాడులే’ అని ఊరుకుంటోంది. మొండితనం కూడా తెలియని ధైర్యాన్ని ఇస్తుందేమో!
ఆరోజు ఇంకో ఇండియన్‌ ఫ్రెండ్‌ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు. గబగబా పిల్లల్ని రెడీ చేసి, తాను వివేక్‌కి ఇష్టమైనట్లుగానే జీన్స్‌, షర్ట్‌ వేసుకుని రెడీ అయింది. చూసి వేరే కామెంట్‌ ఏమీ చేయకుండా, తాను కూడా రెడీ అయ్యాడు వివేక్‌.
వింధ్య మటుకు వివేక్‌ని చూస్తూనే ‘‘వివేక్‌, ఈ జన్మకు నీకు రెడీ అవడం రాదా? మా ఫ్రెండ్స్‌ అందరూ నవ్వుతున్నారు. బఫూన్‌లా రెడీ అవుతున్నావట. ఆల్రెడీ జుట్టంతా ఊడిపోయి ముసలి ఆకారం పడింది. కాస్త డీసెంట్‌గా రెడీ అవడం ఎప్పుడు నేర్చుకుంటావు?’’
అడుగుతూనే, నిశ్చేష్టుడై నించున్న వివేక్‌ని వదిలేసి, పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళింది. కాసేపటికి కారు బయలుదేరిన శబ్దం వినపడింది.
వివేక్‌ ఉడికిపోయాడు. రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చేవరకూ కోపంగానే ఉన్నాడు. ‘రానీ... అంతు తేలుస్తాను’ ఏ వందోసారో అనుకున్నాడు.
రాగానే పిల్లల్ని పడుకోబెట్టి, స్నానం చేసి నైటీ వేసుకుని పక్క మీద వాలబోతున్న వింధ్యను చేయి పట్టి బరా బరా బయటికి లాక్కొచ్చి పడేసి బెడ్‌రూమ్‌ తలుపు వేశాడు. అర్థమయింది వింధ్యకు సమయం వచ్చిందని.

‘‘నిన్ను చంపేస్తాను ఏమనుకున్నావో... నన్నేమన్నా అనడానికి నువ్వెవరివి? నీకేం హక్కుంది? ఎంత ధైర్యం అసలు... నువ్వూ... నువ్వూ...’’ మాటలు తడుముకుంటున్న వివేక్‌ని ఆగమని సైగ చేసి, చక్కగా బాసింపట్టు వేసుకుని కూర్చుంది.
‘‘వివేక్‌ కూర్చో... ఇప్పుడు నువ్వు అడిగావే, అదే నేనూ అడుగుతున్నాను... నన్ను అనే హక్కు నీకు మాత్రం ఎక్కడిది? ‘ప్రేమిస్తున్నాను’ అని నా వెంటపడ్డావు. నన్ను ప్రేమించే వాళ్ళను పెళ్ళి చేసుకుంటే వారితో నా జీవితం బాగుంటుందని- అందరూ వద్దన్నా, ‘కాకి ముక్కుకు దొండపండులా ఉంటా’రని అన్నా కూడా నీతోనే నా జీవితం అనుకున్నాను. నువ్వు కాకపోయినా, నీ మనసు అందంగా ఉన్నదని భ్రమపడి పెళ్ళికి ఒప్పుకున్నాను. ప్రేమిస్తున్నప్పుడు ఎలా తయారయినా అందంగా కనపడ్డ నేను, పెళ్ళి తర్వాత అలా కనపడటం లేదు. కానీ, నేను అప్పుడెలా ఉన్నానో... ఇప్పుడూ అలానే ఉన్నాను. నువ్వు మాత్రం నీకులాగే నీ మనసును వికారంగా చేసుకున్నావు. వారం రోజులకే నేను అన్న మాటలు తట్టుకోలేక నన్ను చంపాలన్నంత కోపం వచ్చింది నీకు. చంపేయటమే కరెక్ట్‌ అయితే నిన్ను ఎప్పుడో చంపేదాన్ని. ఆ ఆలోచనే రాకుండా, పదేళ్ళుగా నువ్వు పెడుతున్న మానసిక హింసను తట్టుకుంటున్నానంటే, నిన్ను నిన్నుగా నీలోని లోపాలతో సహా ప్రేమిస్తున్నాను కాబట్టి. నీది సుపీరియర్‌ కాంప్లెక్సో... అందరూ నన్ను మెచ్చుకుంటున్నారనే ఇన్ఫీరియర్‌ కాంప్లెక్సో తెలీటం లేదు. ఇక ఇంత స్ట్రెస్‌ భరించే శక్తి నాకు లేదు. కలిసి ఉందామా విడిపోదామా?’’
వింటూనే విపరీతమైన కోపంతో లేచి బయటికి విసురుగా వెళ్ళబోయాడు.
‘‘ఆగు. మొత్తం విను. ఇప్పుడు వెళ్ళావంటే ఇదే మనం చివరిసారి కలుసుకోవడం.’’
ఆగి భయంగా చూశాడు. మనిషి శాంతంగా ఉన్నా, వింధ్య మాటలు కత్తిలా ఉన్నాయి.

‘‘నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు. ప్రతిసారీ తక్కువ చేసి మాట్లాడితే- అది చాలు నాకు డిప్రెషన్‌ రావడానికి. అసలు ఇన్నేళ్ళూ నేను
ఇంత సహనంతో ఉండటమే గ్రేట్‌. నీకు నేను అవసరం లేకపోయినా నా పిల్లలకు నేను కావాలి. ఇక నా వల్లకాదు. ‘ఒకరి వల్ల మనం దేనికి అయితే బాధపడతామో, మనం అలా ప్రవర్తించి బాధపెట్టకూడదు’ అనేది వెనకటి మాట. కానీ నీలాంటి మూర్ఖులకు ఎదుటివారి వేదన అర్థం కావాలంటే మీరన్నది మీకు తెలియాలి. అందుకే వారంనుండీ అలా అంటున్నాను. ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే- నువ్వు మారితే- మనం కలిసి ఉంటాం. లేదా హాయిగా ఇద్దరమూ ఎవరి దోవన వాళ్ళం ఉందాం. నువ్వే నిర్ణయించుకో. ఏదైనా నాకు ఓకేనే’’ గుడ్‌ నైట్‌ చెప్పి వెళ్తున్న వింధ్యను నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలోపడ్డాడు వివేక్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు