ఇంటి చెత్త వీధికి వెలుగు!

ఇప్పుడు ఇంటింటికీ సోలార్‌ ప్యానెల్స్‌ వచ్చేస్తున్నాయి. కొన్ని ఇళ్ళనుంచి మిగులు విద్యుత్తుని నేరుగా డిస్కమ్‌లకి అమ్ముకుని ఆదాయం చూస్తున్నారు.

Published : 14 Apr 2024 00:03 IST

ఇప్పుడు ఇంటింటికీ సోలార్‌ ప్యానెల్స్‌ వచ్చేస్తున్నాయి. కొన్ని ఇళ్ళనుంచి మిగులు విద్యుత్తుని నేరుగా డిస్కమ్‌లకి అమ్ముకుని ఆదాయం చూస్తున్నారు. ఇలాగే- ప్రతి ఇంట్లోనూ పోగుపడే చెత్త నుంచీ కరెంటూ, దాంతోపాటు వంట గ్యాసూ తయారుచేసుకోవచ్చంటోంది గ్రీనేరియా అనే సంస్థ. అనడమేకాదు అటు అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటీలూ, ఇటు ఇండివిడ్యువల్‌ హౌస్‌లూ అన్నింటికీ తగ్గ ప్లాంట్‌లని నిర్మించి ఇస్తోంది. మరోవైపు - మైక్రోసాఫ్ట్‌ నుంచీ రాష్ట్రపతిభవన్‌ దాకా దేశంలో పలుచోట్ల ఇలాంటి ప్లాంట్లని ఏర్పాటుచేసి ‘ఔరా’ అనిపిస్తోంది!  

మహానగరాల్లో పదోపాతికో కుటుంబాలు కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో తలదాచుకోవడం పాత పద్ధతైపోయింది. ఇప్పుడు కొన్ని అపార్ట్‌మెంట్లు కలిసి ఓ పెద్ద కమ్యూనిటీగా మారుతున్నాయి. ఒకే ప్రాంగణంలో కనీసం వెయ్యి నుంచి మూడువేల కుటుంబాలదాకా నివాసం ఉంటున్నాయి. బెంగళూరులోని ‘ప్రెస్టీజ్‌ జిందాల్‌ సిటీ’ అలాంటిదే. 18 అపార్ట్‌మెంట్లూ, మూడున్నర వేల ఫ్లాట్‌లతో కళకళలాడుతుంటుందది. అందుకు తగ్గట్టే- అక్కడ చెత్త కూడా టన్నుల కొద్దీ పోగుపడుతుంది. అందులో- ఆహారపదార్థాలూ, పండ్లూ, కాయగూరల్లాంటి సేంద్రియ చెత్తని మాత్రమే తీసుకుని వాటి నుంచి బయోగ్యాస్‌నీ, దాన్నుంచి విద్యుత్తునీ తయారుచేసి ఇస్తోంది గ్రీనేరియా. ఇది మన దేశంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌. ఈ ప్లాంట్‌ ద్వారా ప్రెస్టీజ్‌ జిందాల్‌ సిటీలోని 300 వీధి దీపాలని వెలిగిస్తున్నారు.

ప్రతిదీ ఇంతపెద్ద కమ్యునిటీయే కానక్కర్లేదు- వెయ్యీ, ఐదొందలూ, వంద ఇళ్ళున్నా సరే అక్కడ తమ ప్లాంట్‌లని ఏర్పాటుచేస్తోంది గ్రీనేరియా. కాకపోతే, రోజుకి ఒకటన్ను(వెయ్యికిలోల) సేంద్రియ చెత్త ఉంటేనే- బయోగ్యాస్‌ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి సాధ్యమవుతుంది. లేకపోతే- ఈ బయోగ్యాస్‌ని వంటలకి ఉపయోగించుకోవచ్చు. అవసరానికిపోగా ఐఓసీ, భారత్‌ పెట్రోలియం, హిందూస్థాన్‌ పెట్రోలియం వంటి సంస్థలకి అమ్ముకోవచ్చు. అంతేకాదు, ఈ ప్లాంట్‌లతో సారవంతమైన ఎరువులూ తయారుచేయొచ్చు. ఒక టన్ను చెత్త ఆధారంగా ఏర్పాటుచేసే ఒక బయోగ్యాస్‌ ప్లాంట్‌కి- రూ.35 లక్షలదాకా ఖర్చవుతుంది. ఓ కమ్యూనిటీలో వెయ్యి ఇళ్ళు ఉన్నాయనుకుంటే ప్రతి గడపకి రూ.3,500 పడుతుంది. ప్లాంట్‌ సామర్థ్యం తగ్గేకొద్దీ ఖర్చూ తక్కువవుతుంది. దేశంలోనే తొలిసారి ఇండివిడ్యువల్‌ హౌస్‌లకీ రూ.45 వేలల్లోనూ ఇలాంటి ప్లాంట్‌లు ఏర్పాటుచేసి ఇస్తోంది గ్రీనేరియా సంస్థ! విద్యుత్తు ఉత్పత్తీ, వంటగ్యాస్‌ అవసరాలూ, ఎరువుల తయారీ- ఈ మూడూ కాకుండా ఇలాంటి ప్లాంట్‌ల వల్ల ఒనగూరే మరో పెద్ద ప్రయోజనం ఒకటుంది- అదీ పర్యావరణ హితం. కేవలం ఆ కారణంతోనే విదేశాల్లో ఉన్నతోద్యోగాన్ని వదులుకుని భారత్‌కి వచ్చాడు గ్రీనేెరియా వ్యవస్థాపకుడు ఎమ్మెస్‌ రాజేంద్రకుమార్‌!

జర్మనీలో చూసి...

రాజేంద్రకుమార్‌ పుట్టిపెరిగింది బెంగళూరులో. అక్కడే ఇంజినీరింగ్‌ చదివి కెనడాలోని ఓ భారీ వాహనాల సంస్థలో ఉన్నతోద్యోగిగా చేరాడు. అప్పుడప్పుడూ భారతదేశానికీ వస్తూ- ఇక్కడి నగరాల శివార్లలోని డంపింగ్‌ కేంద్రాల్లో కొండల్లా పేరుకుపోయిన చెత్తని చూసి కలవరపడ్డాడు. ప్లాస్టిక్‌, కాగితాల వంటివి నేలకి కలిగించే అనర్థాలపైన మనకున్న ఏ కొద్దిపాటి అవగాహన కూడా - సేంద్రియ చెత్త వల్ల ఏర్పడే దుష్ప్రభావంపైన లేదని గ్రహించాడు. నిజానికి ఈ తడిచెత్త నీటితో కలిసి ‘లీచెన్‌’ అన్న విషపదార్థంగా మారుతుంది. అది నేలలోకి ఇంకి- చుట్టూ ఉన్న భూగర్భజలాన్ని కలుషితం చేస్తుంది. క్యాన్సర్‌లాంటి తీవ్ర సమస్యలకి దారితీసే కారణాల్లో ఇదీ ఒకటి. ఎలాగైనా దీనికో పరిష్కారం సాధించా లనుకున్నాడు రాజేంద్ర. అప్పుడే ఓ సారి జర్మనీలో తడిచెత్తతో విద్యుత్తుని ఉత్పత్తిచేసే బయోగ్యాస్‌ ప్లాంట్‌లని చూసి వాటిని భారత్‌లోనూ ఏర్పాటుచేయాలనుకున్నాడు. అందుకోసమే ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగొచ్చాడు. తనలాంటి భావజాలమే ఉన్న పర్యావరణ నిపుణులతో కలిసి ‘ఇండియన్‌ బయోగ్యాస్‌ అసోసియేషన్‌’ని ఏర్పాటు చేశాడు. ఆ సంస్థలో భాగంగానే 2014లో గ్రీనేరియా సంస్థని స్థాపించాడు. ఏ నగరమైనా రెస్టరంట్‌లూ, షాపింగ్‌ మాల్‌లూ, మార్కెట్‌లూ వీటిల్లోనే తడిచెత్త ఎక్కువగా చేరుతుంది కాబట్టి ముందు వాటిపైనే దృష్టిపెట్టాడు. బెంగళూరులోని ఫోరమ్‌ మాల్‌లో తొలి బయోగ్యాస్‌ ప్లాంట్‌ని ఏర్పాటుచేశాడు. ఏ దుర్వాసనా లేకుండా, మహాశుభ్రంగా చెత్త విద్యుత్తుగా మారే తీరు పలు కార్పొరేట్‌ సంస్థల్ని ఆకట్టుకుంది. అలా- హెచ్‌పీ, విప్రో, ఇన్ఫోసిస్‌, ఎల్‌ అండ్‌ టీ, రిలయన్స్‌ వంటి పెద్ద కార్పొరేట్‌ సంస్థలూ, ప్రిస్టీజ్‌ గ్రూప్‌ వంటి సంస్థల్లో వీటిని ఏర్పాటుచేశాడు. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ క్యాంపస్‌లోనూ ఈ సంస్థకి చెందిన ప్లాంట్‌నే వాడుతున్నారు!

ప్రభుత్వాలకూ...

దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోనూ ఇలాంటి ప్లాంటు ఏర్పాటుచేసి అక్కడ నాలుగైదు క్యాంటీన్‌లకి సరిపడా వంటగ్యాస్‌ని తయారు చేస్తోంది గ్రీనేరియా. ఇలాగే ప్రయాగరాజ్‌ (అలహాబాద్‌), బెళగావి వంటి మున్సిపాలిటీ ల్లోనూ గ్రీనేరియా సాయంతో చెత్తనంతా విద్యుత్తుగా మార్చి- వీధి దీపాలకి వాడుతున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..