అద్దాల అందాలు... అన్నింటిలోనూ!

అద్దం హరివిల్లు వర్ణాలు అద్దుకుని జిగేల్‌మని మెరిసిపోతే.. అదే ఓ కళాఖండమై కళ్లను కట్టిపడేయదూ! మరి ఆ అందాల అద్దమే రకరకాల వస్తువిశేషాల్లోకి చేరిపోయి మ్యాజిక్‌ చేస్తే... రంగులలోకంలో విహరిస్తున్న భావన కలుగుతుంది కదూ.

Updated : 19 May 2024 06:02 IST

అద్దం హరివిల్లు వర్ణాలు అద్దుకుని జిగేల్‌మని మెరిసిపోతే.. అదే ఓ కళాఖండమై కళ్లను కట్టిపడేయదూ! మరి ఆ అందాల అద్దమే రకరకాల వస్తువిశేషాల్లోకి చేరిపోయి మ్యాజిక్‌ చేస్తే... రంగులలోకంలో విహరిస్తున్న భావన కలుగుతుంది కదూ. అలాంటి మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లి ‘అబ్బ ఎంత బాగుందో’ అంటూ ఆశ్చర్యపోయేలా చేయడమే స్టెయిన్డ్‌గ్లాస్‌ కళ గొప్పదనం. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద భవనాల అలంకరణకోసమే అందుబాటులోకి వచ్చిన ఈ స్టెయిన్డ్‌గ్లాస్‌ ఆర్ట్‌... ఇప్పుడు నట్టింట్లోకి వచ్చేసి గృహాలంకరణలో భాగమైంది, ఫ్యాషన్‌ ప్రియుల్నీ ఆకట్టుకుంటోంది.

మనం వాడే వస్తువేదైనా సరే, రంగురంగుల్లో కనిపిస్తూ అదనంగా వెలుగులూ విరజిమ్మేలా ఉంటే... చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. స్టెయిన్డ్‌గ్లాస్‌ ఆర్ట్‌ అలాంటి అద్భుతమైన కళా వైభవమే. సాధారణ అద్దాన్ని కేవలం ప్రతిబింబం చూడటానికి మాత్రమే ఉపయోగించుకోవడం లేదా పారదర్శకంగా ఉండే గాజును ఓ బొమ్మగా మార్చడంతో పోలిస్తే స్టెయిన్డ్‌గ్లాస్‌ ఆర్ట్‌ పూర్తిగా భిన్నం. రంగుల మాయాజాలంలా కనిపించే ఈ ఆర్ట్‌ చేసే వర్ణ విన్యాసాన్ని చూస్తే తెలుస్తుంది దాని అందం, ప్రత్యేకత.

ఒకప్పుడు కేవలం భవనాలపైనా, కిటికీలూ తలుపులపైనా మాత్రమే కనిపించిన ఈ ఆర్ట్‌... ఇప్పుడు డ్రాయింగ్‌రూమ్‌ నుంచి బెడ్‌రూమ్‌ వరకూ వంటింటి నుంచి ఆఫీస్‌ వరకూ ఉపయోగించుకునే అన్నిరకాల వస్తువులపైనా చేరిపోయి ఈతరాన్నీ మెప్పించేస్తూ ‘స్టెయిన్డ్‌గ్లాస్‌ కళ... కథే వేరు’ అంటూ అందరి ప్రశంసలూ అందుకుంటోంది. సాధారణ గాజు పలకపైన బొమ్మను వేసుకుని రకరకాల రంగులు నింపడం, గాజుతో బొమ్మలు చేసి త్రీడీ రూపంలో మార్చడంతో పోలిస్తే స్టెయిన్డ్‌గ్లాస్‌ ఆర్ట్‌ను ప్రత్యేక పద్ధతిలో రూపొందిస్తారు. వేల సంవత్సరాల క్రితం రోమన్లూ, ఈజిప్షియన్లూ రంగుల అద్దాలతో చిన్నచిన్న వస్తువుల్ని తయారుచేసేవారట. అలా వెలుగులోకి వచ్చిన ఈ స్టెయిన్డ్‌ గ్లాస్‌ కళ క్రమంగా బ్రిటన్‌కూ వ్యాపించింది. చరిత్రను గమనిస్తే దాదాపు ఏడో శతాబ్దంలో అక్కడి చర్చిలమీదా, మత ప్రచారం చేసే భవనాలపైనా ఆర్టిస్టులు ఈ స్టెయిన్డ్‌ గ్లాస్‌ ఆర్ట్‌ను ఆవిష్కరించేవారు. ఇప్పటికీ ఆ ప్రాంతాల్లోని చర్చిల్లో ఈ కళను చూడొచ్చు. ఆ విధంగా వెలుగులోకి వచ్చిన ఈ ఆర్ట్‌ ఇంకాస్త అప్‌డేట్‌ అయిపోయి మరికొన్ని మెరుపులతో కనికట్టు చేస్తోందిప్పుడు. నిజానికి స్టెయిన్డ్‌గ్లాస్‌ ఆర్ట్‌ అనేది ఒకప్పుడు ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఎలాగంటే ఒక చిత్రాన్ని అనుకుని... దానికి తగినట్లుగా రంగురంగుల గాజు ముక్కల్ని ఓ పద్ధతి ప్రకారం కత్తిరించుకుని ఎంతో జాగ్రత్తగా అతికించేవారు. అయితే ఆ గాజు ముక్కల్ని కట్‌ చేయడం, అతికించడం అనేది కష్టసాధ్యం కావడంతో దాన్ని ఇంకాస్త సులభతరం చేశారు కళాకారులు. గాజు పలకలపైన ఓ డిజైను వేసుకుని వాటికి స్టెయిన్డ్‌గ్లాస్‌ లుక్‌ను తెచ్చేందుకు రకరకాల రంగుల్ని అద్దడం మొదలుపెట్టారు. రోజులు మారేకొద్దీ ఇందులోనూ ప్రయోగాలు చేసిన డిజైనర్లు ఇప్పుడు త్రీడీ ప్రింటింగ్‌ తరహాలో ముద్రించేస్తున్నారు. దాంతో మనం కోరుకున్న వస్తువులపైనా ఈ కళను తీసుకొచ్చే పనిలో పడ్డారు వివిధ రంగాలకు చెందిన డిజైనర్లు. అలా ఇప్పుడు స్టెయిన్డ్‌గ్లాస్‌ ఆర్ట్‌ అన్నింటిపైనా చేరిపోయి... వన్నె తగ్గని ట్రెండ్‌ అనే పేరునూ తన ఖాతాలో వేసుకుంది.

అన్నింట్లోనే అదే కళ...

ఇంటిని వీలైనంత మోడ్రన్‌గా కట్టుకోవాలని తపనపడేవారే ఇప్పుడు ఎక్కువ. ఆ ఇంటికోసం ఎంచుకునే ప్రతి వస్తువునూ ఇంకాస్త కొత్తగా, రిచ్‌లుక్‌తో ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటివారి అభిరుచులకు తగినట్లుగా - స్టెయిన్డ్‌గ్లాస్‌ కళ కూడా మరిన్ని మెరుపులు అద్దుకుని ఇల్లంతా వెలుగులు విరజిమ్ముతోంది. నట్టింట్లోకి వెళ్లగానే గోడపైన కనిపించే గడియారం నుంచి మన ప్రతిబింబాన్ని చూసుకునే అద్దం వరకూ... కుటుంబసభ్యులంతా సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకునే సోఫా నుంచి డైనింగ్‌ టేబుల్‌వరకూ... వేలాడదీసే పరదాల నుంచి ఆర్ట్‌పీస్‌ల వరకూ.. పడకగదిలో వేసుకునే మంచం నుంచి కప్పుకునే దుప్పట్ల వరకూ... వంటింట్లో వాడే సింకు, బాత్రూంలో ఉపయోగించే వాష్‌బేసిన్‌, మ్యాట్స్‌, కాఫీ మగ్గులు, కార్పెట్స్‌, ల్యాంప్‌ షేడ్‌లు, అతిథుల్ని ఆకట్టుకునేందుకు ఏర్పాటు చేసే నిలువెత్తు కళాకృతులు... ఇలా అన్నింటిపైనా స్టెయిన్డ్‌గ్లాస్‌ ఆర్ట్‌ చేరిపోతోంది. అదే ఫ్యాషన్‌ విషయానికొస్తే వాచీలు, హ్యాండ్‌బ్యాగులు, దుస్తులు, ఫోన్‌కవర్లు... తదితరాలపైన ఈ గాజుకళ అందంగా ఒదిగిపోయి ఫ్యాషన్‌ ప్రియుల్నీ మురిపిస్తోంది. ఇన్నిరకాల వస్తువులపైన స్టెయిన్డ్‌గ్లాస్‌ ఆర్టా... అసలు సాధ్యమేనా అనే సందేహానికి ఆస్కారమే లేకుండా ఎన్నో జాగ్రత్తలతో ఈ కళను ఆవిష్కరించేస్తున్నారు డిజైనర్లు. దాదాపు అన్నిరకాల గృహాలంకరణ వస్తువులూ, ఫ్యాషన్‌ వస్తువులపైన ఈ ఆర్ట్‌ను త్రీడీ హంగులతో ముద్రించేస్తున్నారు. బల్లలు, మంచం, వంటింట్లో వాడే సింకులు, వాష్‌బేసిన్‌లకు స్టెయిన్డ్‌గ్లాస్‌ కళ తీసుకొచ్చేందుకు స్క్రీన్‌ ప్రింటింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్నింటిపైన పాత పద్ధతి తరహాలోనే రంగుల గాజు ముక్కల్ని అతికించినట్లుగా కనిపించేలా మాయ చేస్తున్నారు. 

కోరుకున్న డిజైన్లలో...

ప్రకృతి అందాలను మరింత అందంగా, వీలైనంత వర్ణరంజితంగా ఆవిష్కరించడమే ఈ ఆర్ట్‌ ప్రత్యేకత కాబట్టి... వస్తువును బట్టి ఆయా డిజైన్లకు జీవంపోసేలా తీర్చిదిద్దుతున్నారు కళాకారులు. అలా రూపొందిస్తున్న డిజైన్లలో విరబూసిన రంగురంగుల పూలూ, పచ్చటి వనాలూ, పశుపక్ష్యాదులూ, జాలువారే జలపాతాలూ, ప్రవహించే సరస్సులూ, ముచ్చటగొలిపే మంచుకొండలూ, సీతాకోకచిలుకలూ, జలపుష్పాలూ... ఇలా సమస్త ప్రకృతి సౌందర్యాన్నీ చూపించేందుకు శ్రమిస్తున్నారు. అదేవిధంగా దేవతారూపాలూ, ఆబ్‌స్ట్రాక్ట్‌ డిజైన్లూ, పిల్లలు ఇష్టపడే కార్టూన్‌పాత్రలూ... అభిరుచికి తగినట్లుగా కోరుకున్న డిజైన్లలో తీసుకొచ్చేసి కనువిందు చేస్తున్నారు. ఇలా రూపొందించిన స్టెయిన్డ్‌గ్లాస్‌ ఆర్ట్‌ ఎంతకాలమైనా మన్నేందుకు తగు జాగ్రత్తలనూ సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..