స్టార్టప్‌ పెడతారా... అంతా ఉచితమిక్కడ!

ఓ స్టార్టప్‌ ప్రయాణంలో... ఆలోచన అన్నది విత్తనం మాత్రమే. అది మొలకెత్తాలంటే అడుగడుగునా దారిచూపే మెంటార్‌ కావాలి. అంతకన్నా- మనం పనిచేయడానికి ఓ ఆఫీస్‌ కావాలి, దానికి అద్దె, కరెంటు బిల్లూ కట్టేంతగానైనా పెట్టుబడి ఉండాలి.

Updated : 09 Jun 2024 07:08 IST

ఓ స్టార్టప్‌ ప్రయాణంలో... ఆలోచన అన్నది విత్తనం మాత్రమే. అది మొలకెత్తాలంటే అడుగడుగునా దారిచూపే మెంటార్‌ కావాలి. అంతకన్నా- మనం పనిచేయడానికి ఓ ఆఫీస్‌ కావాలి, దానికి అద్దె, కరెంటు బిల్లూ కట్టేంతగానైనా పెట్టుబడి ఉండాలి. బయట ప్రాంతమైతే- మనం నిలదొక్కుకునేదాకా బస, భోజనం అవసరాలూ తీర్చేవాళ్ళుండాలి. పల్లెటూళ్ళ నుంచి వచ్చే యువతకి ఇవన్నీ ఉచితంగా అందిస్తోంది ‘ఆలమరమ్‌’ అన్న ఇన్‌క్యుబేషన్‌ సంస్థ! మిగతావాటిల్లా లాభాల్లో వాటా అడక్కుండా కేవలం సేవాదృక్పథంతో వీటిని సమకూరుస్తోంది. దాని వెనకున్న స్ఫూర్తి ఇది...

ఆ అమ్మాయి పేరు మోహన దీప. తమిళనాడు తూత్తుకుడిలోని ఓ కుగ్రామం తనది. చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీయడంలో ఆసక్తి ఉండటంవల్ల విజువల్‌ కమ్యూనికేషన్స్‌లో బీఎస్సీ చేసింది. ‘ఇక చదివింది చాలు... పెళ్ళి చేసేస్తాం’ అని పెద్దవాళ్ళంటే- పట్టుబట్టిమరీ ఉద్యోగంలో చేరింది. అక్కడ గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నప్పుడే- వెబ్‌ గ్రాఫిక్‌ డిజైనింగ్‌లకి సంబంధించి- తానూ ఓ స్టార్టప్‌ పెట్టాలన్న ఆలోచన వచ్చింది దీపకి. ఉద్యోగానికే వెళ్ళొద్దన్న వాళ్ళు కంపెనీ పెడతామంటే ఊరుకుంటారా... ‘మన కుటుంబంలో ఏడు తరాలు వెదికి చూసినా ఎవరూ వ్యాపారం చేయలేదు... వద్దేవద్దు’ అంటూ వెనక్కిలాగారు. తను తగ్గలేదు. అప్పుడే దీపని ‘ఆలమరమ్‌’ ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌ ఆదుకుంది. తన ఆలోచనల్ని ఆచరణలో పెట్టడానికి ఆఫీసుని ఇచ్చింది. మెంటార్‌నీ ఏర్పాటుచేసింది. ఆ సాయంతో గత ఏడాది ‘హనటోరియం’ అనే అంకురసంస్థని స్థాపించింది దీప. ఏడాది తిరక్కుండానే వందకుపైగా కంపెనీలని వినియోగదారులుగా మార్చుకుని నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్థాయికొచ్చింది.

అరుణ్‌కుమార్‌ తండ్రి వ్యాను డ్రైవర్‌. ఎంతో కష్టపడి అరుణ్‌ని ఇంజినీరింగ్‌ చదివించాడు. కోడింగ్‌లో పట్టు సాధించిన అరుణ్‌ ఐదేళ్ళు ఉద్యోగం చేశాక తన స్నేహితులు ముగ్గురితో కలిసి ‘షెల్‌కోడ్‌’ అన్న సంస్థని ప్రారంభించాడు. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతికతల సాయంతో ఈ-కామర్స్‌ సంస్థల సామర్థ్యాన్ని పెంచడమే దీని లక్ష్యం. కానీ- ఈ కొత్తవాళ్ళని నమ్మి ఆ పెద్ద సంస్థలు ఎలా పని ఇస్తాయి... ఇక్కడే వాళ్ళకి అండగా నిలిచింది ఆలమరమ్‌. వెబ్‌సైట్‌ ఏర్పాటుకే కాదు- వినియోగదారులతో మంతనాలకీ వేదికగా మారింది. ప్రస్తుతం జెప్టో, క్రెడిట్‌ బీ, డ్రీమ్‌11 వంటి పెద్ద కంపెనీలకి సేవలందిస్తోంది షెల్‌కోడ్‌. వందమంది ఉద్యోగులతో ఏటా 20 కోట్ల రాబడి చూస్తోంది!

- ఈ రెండే కాదు... ఇటువంటి 20 స్టార్టప్‌ ఆలోచనలకి రూపాన్నిచ్చింది ‘ఆలమరమ్‌’ సంస్థ. ఈ స్టార్టప్‌ల వ్యవస్థాప కులందరూ గ్రామీణ ప్రాంతాలవాళ్ళు. తొలితరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. వాళ్ల కోసమే ఈ సంస్థని ఏ లాభాపేక్షా లేకుండా ప్రారంభించాడు అంబి మూర్తి. ప్రభుత్వాలు పెట్టినవి కావొచ్చు, విద్యాసంస్థల్లో ఏర్పాటైనవి కావొచ్చు, ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌ ఏదైనా సరే... ప్రతి స్టార్టప్‌ నుంచీ కనీసం ఏడుశాతం వాటా ఆశిస్తుంది. అవేవీ లేకుండా మంచి ఆలోచన ఉండి, కనీసం ఐదేళ్ళపాటు స్టార్టప్‌ని నడపగలరన్న నమ్మకం తనకి కలిగిస్తే చాలు- అంకుర సంస్థలకి అండగా నిలుస్తున్నాడు అంబిమూర్తి. ఆలమరమ్‌ అంటే మర్రిచెట్టు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఎన్నో అంకుర పక్షులకి ఆశ్రయాన్ని కల్పిస్తున్న ఈ సంస్థ నేపథ్యం ఇది... 

తండ్రి స్ఫూర్తితో...

అంబి మూర్తి తండ్రి త్రిమూర్తి తమిళనాడు ఖాదీ సంస్థలో పనిచేస్తుండేవాడు. మామూలు ప్రభుత్వ ఉద్యోగే అయినా ఎంతోమంది పేద పిల్లల్ని సొంత ఖర్చుతో చదివించాడు. ప్రతివారం అన్నదానాలు చేసేవాడు. ఇవన్నీ అంబిమూర్తిని ఎంతో ప్రభావితం చేశాయి. వీఐటీలో ఇంజినీరింగ్‌ చేసిన అతను కాలిఫోర్నియాలోని ఓ ఐటీ సంస్థలో పనిచేశాడు. తర్వాత భారతదేశానికి వచ్చి శ్రీధర్‌ వేంబుకి చెందిన ‘జోహో’లో చేరాడు. చిన్నగ్రామాలూ, పట్టణాల్లోనూ పెద్ద కంపెనీలూ పెట్టొచ్చన్న స్ఫూర్తిని సొంతం చేసుకున్నాడు. జోహో తరపున ఇంగ్లండు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడి స్టార్టప్‌ వాతావరణాన్ని దగ్గరగా చూశాడు. ఆ అనుభవాలతో తన మిత్రుడితో కలిసి గో-జెన్‌ అనే సంస్థని కోయంబత్తూరులో ఏర్పాటుచేశాడు. ఆ చిన్న నగరంలో తొలితరం పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయినా పట్టుదలతో శ్రమించి దేశవిదేశాల్లో వందలమంది వినియోగదారుల్ని సొంతం చేసుకున్నాడు. ఆ సంస్థ మెల్లగా లాభాలబాట పడుతుండగానే- అంబిమూర్తి తండ్రి త్రిమూర్తి అనారోగ్యంతో కనుమూశాడు. ఆయన స్మృతీ, సేవాస్ఫూర్తీ కలకాలం నిలవాలన్న ఆలోచనతో ‘ఆలమరమ్‌’ సంస్థని స్థాపించిన అంబి మూర్తి ఏంజల్‌ ఇన్వెస్టర్‌లు 70 శాతం వాటాలు అడుగుతుంటే బెదిరిపోయి బిత్తరచూపులు చూస్తున్న యువతని అక్కున చేర్చుకున్నాడు. వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా మలుస్తున్నాడు. గో-జెన్‌ సంస్థ నుంచి తన వాటాగా వచ్చే లాభాలన్నింటినీ ఇందుకోసం వినియోగిస్తున్నాడు. దేశంలోని ఏ ప్రాంతం వాళ్ళైనా తన వద్దకు రావొచ్చంటున్నాడు. అంతేకాదు- ‘ఆలమరమ్‌’ ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌లో పుట్టిన స్టార్టప్‌లు 150 మందికి ఉద్యోగాలిస్తుంటే- ఆ ఉద్యోగుల్లోనూ స్టార్టప్‌ ఆలోచన ఉన్నవాళ్ళని గుర్తించి వాళ్ళచేతా అంకుర సంస్థలు పెట్టిస్తున్నాడు అంబి మూర్తి... అచ్చం- తన ఊడల్ని మహావృక్షాలుగా మలిచే ఓ మర్రిచెట్టులాగే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..