అత్తరుతో... అదరగొట్టేశాడు!

చిన్నప్పుడు తీవ్ర ఉబ్బసం బాధితుడతను. ఉదయం వేళ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. నెలలో పదిరోజులు ఆసుపత్రుల్లోనే గడిపేవాడు.

Updated : 14 Apr 2024 00:37 IST

చిన్నప్పుడు తీవ్ర ఉబ్బసం బాధితుడతను. ఉదయం వేళ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. నెలలో పదిరోజులు ఆసుపత్రుల్లోనే గడిపేవాడు. ఆ తీవ్రవ్యాధికి పేదరికమూ తోడై- ఐదో తరగతిలోనే చదువుమానేశాడు! అలాంటివాడు నేడు ఎంబీఏ పట్టభద్రులకీ ఉద్యోగాలిస్తున్నాడు. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు! అంతకన్నా- సహజ సుగంధాల భారతీయ అత్తరుకి తన పేరుతోనే ‘ఆదిల్‌ కాద్రి’ అనే బ్రాండ్‌ని సృష్టించాడు. ఆ గెలుపు పయనంలో ఎదురైన రాళ్ళూ రప్పలూ, వాటిని దాటుకొచ్చిన అతని దీక్షాదక్షతలూ ఏమిటో చూద్దామా...

 ఆదిల్‌ కాద్రి తండ్రి ఒకప్పుడు ఓ అత్తరు దుకాణంలో చిరుద్యోగి. దుకాణం కట్టేశాక నేరుగా వచ్చి- చిన్నారి ఆదిల్‌ని ఎత్తుకుని ముద్దాడాలంటే భయపడిపోయేవాడు. ఆయన బట్టలకి అంటుకున్న అత్తరు వాసన పసివాడి ముక్కుకి ఏ కాస్త సోకినా చాలు - ఎగశ్వాసతో కొట్టుమిట్టాడేవాడు. ఊపిరాడక అల్లాడిపోయేవాడు. అప్పటికప్పుడు ఆసుపత్రికి వెళితేకానీ కుదుటపడేవాడు కాదు.అందువల్ల- శుభ్రంగా స్నానం చేసి అత్తరు వాసన పూర్తిగా వదిలి పోయిందనుకున్నాక గానీ ఆ చిన్నారిని చేరదీసేవాడుకాదు. ‘సివియర్‌ పర్సిస్టెంట్‌ ఆస్తమా’ అన్న ఈ సమస్య ఆదిల్‌కి రెండేళ్లున్నప్పుడే మొదలైంది. తండ్రిది అత్తెసరు జీతం. దాంతో అతని తల్లి ‘మెహెందీ కోన్‌’లు అమ్ముతూ అటు ఇంటినీ, ఇటు ఆదిల్‌ చికిత్సకయ్యే ఖర్చునీ భరిస్తుండేది. గుజరాత్‌లోని సూరత్‌ దగ్గర బిలిమోరా అనే ఊరు వాళ్ళది. ఉబ్బసం కారణంగా అదిల్‌ని ఏడేళ్ళకిగాని బడిలో చేర్చలేదు. చేరాకా- ఉదయం వేళ రాలే మంచూ, పువ్వుల్లోని పుప్పొడీ ఆ పసివాడిని ఉక్కిరిబిక్కిరిచేసేవి. దాంతో తొమ్మిది గంటల తర్వాతే బడికెళ్ళేవాడు. ఇంటికి వచ్చాక- ఆరుగంటల తర్వాత బయటకు అడుగుపెట్టేవాడు కాదు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అదిల్‌ నెలలో పదిరోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చేది. దాంతో- చదువబ్బక ఐదో తరగతి ఫెయిలై బడిమానేశాడు.

మరో నాలుగేళ్ళకి...

ఆదిల్‌కి పదేళ్ళు నిండాక- వైద్యులు చికిత్స చేసే విధానాన్ని మార్చడంతో అది కొంతవరకు ఫలితాన్నివ్వసాగింది. ఆసుపత్రిలో ఉండాల్సిన రోజులు తగ్గాయి. మరో ఐదేళ్ళకు అతని పరిస్థితి మెరుగైంది. మిగతా చిన్నారుల్లాగే అన్నిచోట్లకూ వెళ్ళసాగాడు. మెల్లగా తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు తెలియసాగాయి. దాంతో పదహారో ఏట మొబైల్‌ రిపేరింగ్‌ నేర్చుకున్నాడు. పలు దుకాణాల్లో పనిచేశాడు. అలా మూణ్ణాలుగేళ్ళు గడిచాయి. అప్పుడే వాళ్ళ మావయ్య అతనికి ‘సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌’(ఎస్‌ఈఓ) కోర్సు చేయమని సలహా ఇచ్చాడు. గూగుల్‌లాంటి సెర్చ్‌ ఇంజిన్‌లలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించేలా- మన వెబ్‌సైట్‌ని ఎలా తీర్చిదిద్దాలో నేర్పే ‘ఎస్‌ఈఓ’ నైపుణ్యాలు అతని జీవితాన్ని మార్చేశాయి. ముందుగా తన తల్లి సహకారంతో మెహందీ డిజైనింగ్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు! ఆరునెలలు శ్రమిస్తే నెలకి రూ.50 వేలదాకా ఆదాయం రాసాగింది. ఆ ఊపుతో ఎన్నో ప్రయోగాలకి తెరతీశాడు...

అన్నింటా ఓటమే...

ఆదిల్‌కి వెబ్‌ డిజైనింగ్‌ కొట్టినపిండి కావడంతో- రకరకాల ఈ-కామర్స్‌ సైట్‌లని రూపొందించాడు. టీషర్టులూ, చెప్పులూ, అలంకరణ వస్తువులూ... ఇలా అన్నీ అమ్మడానికి ప్రయత్నించాడు. కానీ అన్నింటా నష్టపోయాడు. అప్పుడోసారి రంజాన్‌ వచ్చింది. ఇస్లాం మతస్థులకి కావాల్సిన వస్తువులు అమ్మడానికి తన పేరుతోనే ‘ఆదిల్‌ కాద్రి’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ‘సీజన్‌’లో అది చక్కగా పనిచేసింది కానీ- ఆ తర్వాత సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. అమ్మకాలు ఆగిపోయాయి. అప్పుడే- ఆదిల్‌ దృష్టి వాళ్ళ నాన్న ‘అత్తరు దుకాణం’పైన పడింది. వాటికి, ఇంకొన్ని ఫారిన్‌ బ్రాండ్‌లని కలిపి మార్కెటింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. అది క్లిక్‌ అయ్యింది. ఓ దశలో ‘మనమే సొంత బ్రాండ్‌ ఒకటి రూపొందిద్దాం’ అనుకున్నాడు. అత్తరు మార్కెట్‌ ఎలా ఉందో అధ్యయనం చేశాడు. విదేశీ కృత్రిమ రసాయనాలకి ఉన్నంత డిమాండు భారత్‌లో సహజసిద్ధ పరిమళాలతో తయారయ్యే అత్తరుకి లేదని అర్ధమైంది. ముఖ్యంగా- ఆ సువాసనలోని ‘ఘాటు’తనం కొత్తతరానికి నచ్చట్లేదని గ్రహించాడు. అగరు, గంధంలాంటి సంప్రదాయ సువాసనలతోపాటూ పూలతోనూ ప్రయోగాలు చేశాడు. తమ ఉత్పత్తుల్లో చుక్కకూడా ఆల్కహాలు వాడకూడదన్న కట్టుబాటు విధించుకున్నాడు. అలా- 2019లో ‘ఆదిల్‌ కాద్రి’ వెబ్‌సైట్‌తో విక్రయాలు మొదలుపెట్టాడు. రెండు రోజుల తర్వాత 20 సీసాలు అమ్ముడుపోయాయి. వారం గడిచాక 50, తర్వాతి రోజు వంద, 200... ఇలా అమ్మకాలు వరస కట్టాయి. మణికట్టుకి రాసుకునే అత్తరుగానే కాకుండా, సరికొత్త ‘యూ డే పెర్‌ఫ్యూమ్‌’ తరహాలోనూ తీసుకురావడం ప్రారంభించాడు. ఈ ఏడాది ఆరంభానికల్లా నెలకి 80వేల ఆర్డర్‌లూ, ఏడుకోట్ల రూపాయల అమ్మకాలూ నమోదు చేశాడు! ముంబయి సహా పలుచోట్ల 15 ఆఫ్‌లైన్‌ రీటైల్‌ షాపులూ నిర్వహిస్తున్నాడు.

ఏది ఎలా ఉన్నా చిన్నప్పుడు ఏ కాస్త అత్తరువాసన సోకినా ఉక్కిరిబిక్కిరైనవాడు- నేడు ఆ అత్తరుకంటూ స్వదేశీ బ్రాండ్‌ని సృష్టించడం వింతే కదూ?!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..