చిన్న క్లిక్‌తో... పాపాయి ఫొటో- కోరిన గెటప్‌లో!

చిన్నారి బాబును చిటికెలో చిన్నికృష్ణుడిలా చూపొచ్చు... చిట్టి పాపాయిని అందాల రాకుమారిలా క్షణంలో మార్చొచ్చు... అబ్బాయిని తనకిష్టమైన సూపర్‌మ్యాన్‌లా చేయొచ్చు... అంతేనా... ఊహించిన ప్రతి పాత్రలోకీ ఇట్టే దూరిపోవచ్చు... నిమిషాల్లో అనుకున్న చిత్రంతో ప్రత్యక్షం అవ్వొచ్చు... అబ్రకదబ్ర... ఇదంతా ఏఐ మాయ!

Updated : 03 Mar 2024 11:18 IST

చిన్నారి బాబును చిటికెలో చిన్నికృష్ణుడిలా చూపొచ్చు... చిట్టి పాపాయిని అందాల రాకుమారిలా క్షణంలో మార్చొచ్చు... అబ్బాయిని తనకిష్టమైన సూపర్‌మ్యాన్‌లా చేయొచ్చు... అంతేనా... ఊహించిన ప్రతి పాత్రలోకీ ఇట్టే దూరిపోవచ్చు... నిమిషాల్లో అనుకున్న చిత్రంతో ప్రత్యక్షం అవ్వొచ్చు... అబ్రకదబ్ర... ఇదంతా ఏఐ మాయ!

ముద్దులొలికే పాపాయికి సరదాగా కృష్ణుడి వేషం కట్టి ముచ్చటపడిపోయే వారెందరో. కానీ మన చిన్నారి ఆ అల్లరి కృష్ణయ్య అవతారంలో కనిపించడం వెనక పెద్ద తతంగమే ఉంటుంది. బుడిబుడి అడుగులు వేసే బుజ్జాయిని రకరకాల దుస్తులతో తీసుకునే ఫొటోషూట్ల కోసమూ చాలానే శ్రమ ఉంటుంది. కానీ ఇప్పుడు- ఎలాంటి ప్రత్యేకమైన దుస్తులూ, యాక్సెసరీలూ లేకపోయినా పర్వాలేదు. మనం గంటల తరబడి ఫొటోలూ తీయనక్కర్లేదు. ఏమాత్రం ఖర్చు చేసే పనీలేదు. అయినా క్షణాల్లో కావాలనుకున్న రూపంలో పిల్లల్ని చూసుకోవచ్చు. దీనంతటికీ కారణం ఏఐ (కృత్రిమ మేధ) సాంకేతికత.

చూశారా... ఇక్కడ విల్లుతో నిలబడ్డ బాల రాముడు, చిరునవ్వులు చిందిస్తున్న శివయ్య, వీణతో కనిపిస్తున్న సరస్వతి... ఇలా ప్రతీ ఫొటో అలా ఏఐ మాయతో చేసిందే. రకరకాల దేవుళ్లే కాదు... వ్యోమగామీ, స్పైడర్‌మ్యాన్‌, రకరకాల కార్టూన్‌ పాత్రలూ... ఇలా ఏదైనా సరే, ఎంచుకున్న ఫొటోల్లో పిల్లల ముఖాల్ని పెట్టుకుని అచ్చం మన పిల్లలే అలా రెడీ అయ్యారా అన్నట్లు ఫొటోలు తయారుచేసుకోవచ్చు. అంతేకాదు, ఊహల్లో మాత్రమే సాధ్యమయ్యే చిత్రాల్లానూ మార్చుకోవచ్చు. బుజ్జి బాబును పులి మీద స్వారీ చేయించొచ్చు, చిట్టి పాపను రాజుల కాలంలోకి తీసుకెళ్లొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సృజనకు పనిచెబుతూ నచ్చిన చిత్రంలో మన చిన్నారి రూపాన్ని తీసుకురావొచ్చన్నమాట. అందుబాటులో ఉన్న ఏఐ ఫొటో టూల్స్‌ ఉపయోగిస్తూ ఈమధ్య చాలా మంది తమ ముఖాల్ని ఈ ఏఐ ఫొటోలుగా మార్చుకుంటున్నారు. అలాంటివాటిల్లో ఒకటి రీమేకర్‌ ఏఐ టూల్‌. దీంట్లో ఒక్కరి ఫొటో లేదా మల్టిపుల్‌ ఫేసెస్‌ ఫొటోల్నీ రీమేకింగ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు, వీడియోలోని మనుషుల ముఖాల్లోనూ మనకిష్టమైన ముఖాల్ని సెట్‌ చేయొచ్చు. చేయాల్సిందల్లా... ముందుగా మనం కోరుతున్న గెటప్‌ చిత్రాన్ని ఒరిజినల్‌ ఫొటో దగ్గర అప్‌లోడ్‌ చేసి, ఆ తర్వాత టార్గెట్‌ ఫేస్‌ దగ్గర పాపాయి ఫొటోని అప్‌లోడ్‌ చేయాలి. ఇప్పుడు కిందనున్న స్వాప్‌ ఆప్షన్‌ని క్లిక్‌ చేయగానే... ఇచ్చిన ఫొటో పోలికలతో కోరుకున్న చిత్రం కళ్ల ముందు కనిపిస్తుంది.  

పెద్దల ఫొటోల విషయం ఎలా ఉన్నా- నచ్చిన రూపాల్లోనూ, కథల్లోని అందమైన పాత్రల్లోనూ చిన్నారుల ముఖాలు ప్రత్యక్షమైతే... చూడ్డానికి మనకెంత మురిపెంగా ఉంటుందో, పిల్లలకంత సరదాగానూ ఉంటుంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..