వారి జ్ఞాపకంగా...

తల్లిదండ్రులకు తిండి పెట్టడమే భారంగా భావిస్తున్న రోజులివి. అలాంటిది అమ్మానాన్నలు బతికుండగా చేయాలనుకుని చేయలేకపోయిన పనుల్ని వారి మరణానంతరం పూర్తి చేస్తున్నారు పిల్లలు.

Published : 17 Mar 2024 00:08 IST

తల్లిదండ్రులకు తిండి పెట్టడమే భారంగా భావిస్తున్న రోజులివి. అలాంటిది అమ్మానాన్నలు బతికుండగా చేయాలనుకుని చేయలేకపోయిన పనుల్ని వారి మరణానంతరం పూర్తి చేస్తున్నారు పిల్లలు. పెద్దల జ్ఞాపకంగా  సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆ బిడ్డలు ఎవరంటే..

ఆకలి తీర్చుతూ...

‘పేదలకు ఉచితంగా ఆహారం అందించాలనుంద’ని కొడుకు రాకేశ్‌తో చెప్పిన రెండు రోజులకే కన్నుమూశాడు గుజరాత్‌లోని వాసోకు చెందిన వ్యాపారి మున్నాభాయ్‌. చివరి క్షణాల్లో తండ్రి అన్న ఆ మాటలు పదేపదే గుర్తుకు రావడంతో ఆయన ఆఖరి కోరిక తీర్చాలనుకున్నాడు రాకేశ్‌. ఊళ్లోని ప్రభుత్వాసుపత్రిలోని నిరుపేద గర్భిణులకు ఉదయం, సాయంత్రం ఆహారం అందించడం మొదలుపెట్టాడు. వారి ఆకలి తీర్చడం రాకేశ్‌కు చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ఆ సేవల్ని ఎప్పటికీ అందించాలనే ఉద్దేశంతో వాసో పట్టణంలోని అభాగ్య వృద్ధులకు కూడా మధ్యాహ్న భోజనం అందించి ఆకలి తీర్చడం ప్రారంభించాడు. పదిహేను మందితో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి.. ఇప్పుడు వాసో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారికీ, వాళ్ల బంధువులకీ, రోడ్లపైన భిక్షాటన చేసే వృద్ధులందరికీ కలిపి దాదాపు 500 మందికి రోజూ భోజనం పెడుతున్నాడు. ‘విసమో టిఫిన్‌ సేవ’ పేరిట ట్రస్ట్‌ను ప్రారంభించి ఒక కిచెన్‌ ఏర్పాటుచేసిన రాకేశ్‌- అభాగ్యుల కడుపు నింపడానికి రోజుకు సుమారు పాతికవేల దాకా ఖర్చు పెడుతున్నాడు.

ఒకరికిఒకరు...

బెంగళూరుకు చెందిన అజయన్‌ తండ్రికి తొడ ఎముక విరగడంతో ఆపరేషన్‌ చేయించాల్సి వచ్చింది. డిశ్ఛార్జి అయ్యాక మెడికల్‌ బెడ్‌, వాకర్‌, వీల్‌ఛైర్‌ వంటివి కొనుగోలు చేశారు. ఆ పెద్దాయనకు నయమయ్యాక ‘ఇవన్నీ అవసరం ఉన్నవాళ్లకి ఇవ్వ’మని కొడుకు అజయన్‌కు చెప్పాడు. దాంతో అతను అలానే చేశాడు. కొంతకాలానికి తండ్రి మరణించాక ఆయన జ్ఞాపకార్థంగా- అనారోగ్య సమస్యలతో మంచం పట్టిన వారికి కావల్సిన సదుపాయాలు కల్పించాలనుకున్నాడు. అందుకోసం ‘సన్యతా ఫౌండేషన్‌’ను ప్రారంభించి అవసరం ఉన్నవారు తనని సంప్రదించాల్సిందిగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ద్వారా ‘వీల్‌ఛైర్‌, వాకర్‌, వాకింగ్‌ స్టిక్‌, బెడ్‌ లాంటివి ఖాళీగా ఉంటే  అవసరమైన వారికి ఇద్దాం’ అంటూ ప్రచారం ప్రారంభించాడు. ఉద్యోగం చేసుకుంటూనే మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ను సేకరిస్తున్నాడు. అవసరమైతే కొత్తవి కూడా కొంటూ పేద రోగులకు సేవ చేస్తున్నాడు అజయన్‌. బెంగళూరులో దాదాపు రెండు వేల మంది అవసరాలు తీర్చాడు. సాయం అడిగిన చాలామందికి  మందులూ, చికిత్సలూ కూడా ఉచితంగా అందిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..