ఓ కాలనీ గెలుపు కథ!

ఓ సంకల్పం, సమస్యలపైన పోరాటం, చివరిగా విజయం!- ఏ గెలుపు కథలోనైనా ఇవన్నీ ఉంటాయి. వ్యక్తిగా ఏ ఒక్కరో ఇద్దరో అందుకునే విజయాలకే కాదు- వందలాదిమంది కలసికట్టుగా సాధించే సమష్టి గెలుపులోనూ ఇదే వరసని చూడొచ్చు.

Updated : 24 Mar 2024 11:36 IST

ఓ సంకల్పం, సమస్యలపైన పోరాటం, చివరిగా విజయం!- ఏ గెలుపు కథలోనైనా ఇవన్నీ ఉంటాయి. వ్యక్తిగా ఏ ఒక్కరో ఇద్దరో అందుకునే విజయాలకే కాదు- వందలాదిమంది కలసికట్టుగా సాధించే సమష్టి గెలుపులోనూ ఇదే వరసని చూడొచ్చు. వ్యక్తిగత విజయాలు ఎంతటి స్ఫూర్తినిస్తాయో- అరుదుగా ఈ ఉమ్మడి గెలుపూ అంతే ప్రేరణగా నిలుస్తుంటుంది. విశాఖపట్నంలోని జేఆర్‌ నగర్‌ కాలనీ కథ అలాంటిదే! జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆ కాలనీ అందించే స్ఫూర్తేమిటో చూద్దామా!

వేసవి అప్పుడే మొదలైపోయింది. ఎప్పట్లాగే సముద్రతీర నగరాల్లో నీటి మట్టం అడుగంటుతోంది. విశాఖపట్నంలోనూ ఇదే పరిస్థితి... ఇప్పటికే పలు కాలనీల్లో నీటి ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు. సిరిపురం, బాలయ్యశాస్త్రి నగర్‌ వంటి చోట్ల 300 అడుగుల లోతుకి వెళ్తే కానీ బోరుబావుల్లో నీరు పడట్లేదు. కానీ- ఆ రెండు ప్రాంతాలకి దగ్గర్లో ఉన్న జగన్నాథరాజు(జేఆర్‌) నగర్‌లో 50 అడుగులకే నీళ్ళొస్తున్నాయి! అంతేకాదు, నగరమంతా ఉక్కపోత పీడిస్తుంటే ఇక్కడ వీధివీధినా చల్లటి చెట్ల నీడ హాయి గొలుపుతుంది. ఇది ఎలా సాధ్యమైందీ అంటే- చెప్పడానికి చాలా పెద్ద కథే ఉంది...

ఒకప్పటి విశాఖ నగరం శివారు ప్రాంతం ఇది. చెన్నై-కోల్‌కతా రహదారిలో పాత వెంకోజిపాలెం పక్కన పంటచేను స్థలం. జగన్నాథరాజు అనే లెక్చరర్‌ దాన్ని రెసిడెన్షియల్‌ లే ఔట్‌గా మార్చడంతో మొదట్లో రెండు అపార్ట్‌మెంట్లు వెలిశాయి. ఓ పదిమంది ఫ్లాట్‌లు కొని నివాసానికొచ్చారు.  సింహాచలం కొండల కింద ఉండే లోతట్టు ప్రాంతం కావడంతో నాలుగు చినుకులు పడ్డా చాలు- కొండలోని నీళ్ళన్నీ వచ్చి కాలనీని ముంచేసేవి. పాములూ తేళ్ళతోపాటూ రోగాలూ విరుచుకుపడేవి. జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకీ అడ్డాగా ఉండేది. చెయిన్‌ స్నాచింగ్‌లు యథేచ్ఛగా సాగేవి. ఈ బాధలు పడలేక- ఇక్కడ ఇళ్ళు తీసుకున్న కొందరు వేరేచోట్లకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళడం పరిష్కారం కాదనుకున్న ఓ ముగ్గురు మాత్రం- సమస్యల నివారణకి సంకల్పం చేసుకున్నారు. ఆ ముగ్గురే సభ్యులుగా జగన్నాథరావు నగర్‌ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(ఆర్‌డబ్ల్యూఏ) ఏర్పాటైంది!

తొలి విజయాలు...

ముందుగా ఈ ప్రాంతంలోని అసాంఘిక కార్యకలాపాలకి అడ్డుకట్ట వేయాలనుకున్నారు. కుర్రాళ్ళ నుంచి వృద్ధుల దాకా కర్రలు చేతబట్టి రాత్రుళ్ళు కాపలా కాయడం మొదలుపెట్టారు. జాతీయ రహదారే కదాని- తాగి తందనాలాడేవాళ్ళని తరిమేయసాగారు. చెయిన్‌ స్నాచర్స్‌ని స్వయంగా పోలీసులకి పట్టించారు. అలా శాంతిభద్రతల సమస్యకి తెరపడింది. ఈ విజయంతో మిగతా వాళ్ళందరూ భయాన్ని వీడి చేయి కలిపారు. కచ్చారోడ్డు కూడా లేని ఈ ప్రాంతంలో- రూ.20 వేలు ఖర్చుచేసి పక్కా రోడ్డు వేసుకున్నారు. దాంతో షాపులు వెలిశాయి. వాళ్ళ స్ఫూర్తిని మెచ్చి- స్థానిక ఎమ్మెల్యే మిగతా రోడ్లనీ వేయించడంతో కాలనీకి తొలి రూపురేఖలు ఏర్పడ్డాయి.

పైసా ఖర్చులేదు!

రోడ్లుండి ఏం ప్రయోజనం... వర్షం వస్తే కొండమీది నీళ్ళన్నీ వచ్చి కాలనీని ముంచేసేవి. దానికి ఓ తిరుగులేని పరిష్కారం కనిపెట్టారు- అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా వచ్చిన కేఎస్సార్‌ మూర్తి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో డైరెక్టర్‌గా చేసినవారాయన. తనదైన శాస్త్రీయ అవగాహనతో ఇక్కడి రోడ్లలో రికార్డుస్థాయిలో 16 ఇంకుడు గుంతలు ఏర్పాటుచేశారు. సింహాద్రి కొండల నుంచి వచ్చే ఒక్క నీటి చుక్క కూడా వృథాకాకుండా- భూమిలోకి వెళ్ళేలా చూశారు. దాంతో- కాలనీలో నీటి ముంపు సమస్య మటుమాయమైంది. ప్రతి అపార్ట్‌మెంటూ ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చిత్తశుద్ధిగా అమలు చేయడంతో 2011 నాటికల్లా ఇక్కడి జలమట్టం 50కి చేరింది. వేసవి వస్తే చుట్టుపక్కల కాలనీలు నీటి ట్యాంకర్‌లకి లక్షల రూపాయలు ఖర్చుచేస్తుంటే- ఒక్కపైసా కూడా ఖర్చుచేయాల్సిన అవసరం రాలేదు వీళ్ళకి. అంతేకాదు, 2000ల నుంచి ప్రతి పండగకీ పబ్బానికీ పిల్లల చేత చెట్లు నాటించడాన్ని ఓ ఆనవాయితీగా మార్చుకుందీ కాలనీ. అలా నాటినవాటిని హుద్‌హుద్‌ తుపాను- కూల్చేసింది. అయితేనేం- మళ్ళీ అదే పట్టుదలతో చెట్లు నాటడం మొదలుపెట్టారు. ఐదారేళ్ళలోనే పాత చల్లదనాన్ని తెచ్చుకున్నారు. కాలనీలో ఇప్పుడు 600 కుటుంబాలున్నాయి. పచ్చదనంలోనూ శుభ్రతలోనూ ఆంధ్రప్రదేశ్‌లోనే ది బెస్ట్‌ కాలనీగా గుర్తింపు తెచ్చుకుంది.

ఎన్నెన్నో అవార్డులు...

నీటి సంరక్షణలో ఈ కాలనీ స్ఫూర్తిని ప్రశంసిస్తూ 2018లో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జల సంరక్షణలో మూడో బహుమతి అందజేసింది. అంతేకాదు, కేఎస్సార్‌ మూర్తి వ్యక్తిగతంగా అదే శాఖ నుంచి 2020లో ‘వాటర్‌ హీరో’ అవార్డునీ అందుకున్నారు. ఇటీవల ‘వాటర్‌ డైజెస్ట్‌’ అన్న ఆంగ్లపత్రిక యునెస్కో- కేంద్ర ప్రభుత్వాలతో కలిసి 2023కిగాను ఉత్తమ రెసిడెన్షియల్‌ కాలనీగా మొదటి బహుమతిని ఈ కాలనీకే అందించింది!

కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..