34 దేశాల కోసం.. విమానాలు చేస్తాడు!

విమానం... ప్రతి చిన్నారి ఊహకూ రెక్కలు తొడుగుతుంది. ఇట్టే దాన్ని నడిపేయాలని ఆశపడని పిల్లలుండరు కానీ... ఎదుగుతున్నకొద్దీ ఆ కోరిక ఎటో మరుగునపడిపోతుంది

Updated : 26 Dec 2023 13:17 IST

విమానం... ప్రతి చిన్నారి ఊహకూ రెక్కలు తొడుగుతుంది. ఇట్టే దాన్ని నడిపేయాలని ఆశపడని పిల్లలుండరు కానీ... ఎదుగుతున్నకొద్దీ ఆ కోరిక ఎటో మరుగునపడిపోతుంది. కెప్టెన్‌ అగస్టిన్‌ జోసఫ్‌ మాత్రం ఆ ఆశని... 54 ఏళ్ళదాకా ప్రాణప్రదంగా నిలుపుకున్నాడు. పట్టుదలతో ఎన్నో కష్టాలు అధిగమించాడు... భారత వైమానిక దళంలో ఉన్నతహోదానీ, బాగా లాభాలు తెచ్చే కంపెనీనీ వదులుకున్నాడు. నేడు- అమెరికాలో శిక్షణ విమానాలు తయారుచేసే అతిపెద్ద కంపెనీని నడుపుతున్నాడు. అతని ఆకాశయానం ఇది...

 నింగిలోని విమానాలని చూస్తేనే కేరింతలు కొట్టే చిన్నారులు... వాటిని దగ్గరగా చూస్తే మరింతగా సంబరపడిపోరూ! ఆ సంబరాన్ని దాదాపు ప్రతిరోజూ అనుభవించేవాడు అగస్టిన్‌ జోసఫ్‌. కేరళ తిరువనంతపురంలోని విమానాశ్రయం ‘రన్‌ వే’ పక్కనున్న ఓ చిన్నపల్లెటూరు అతనిది. విమానాలు ఇళ్ళపైకే వస్తున్నాయా అన్నట్టు... అతిదగ్గరగా ‘టేకాఫ్‌’ అవుతుండేవి. వాటిని చూస్తూ పెరగడం వల్లనేమో- తానూ విమానం నడపాలన్న కోరిక అగస్టిన్‌లో నాటుకుపోయింది. కానీ ఇంట్లో అతనితోపాటూ ఐదుగురు పిల్లలు. అగస్టిన్‌కి ఐదేళ్ళున్నప్పుడే తండ్రి చనిపోతే- తల్లి అన్నీ తానై సంసార భారాన్ని మోస్తుండేది. ఎన్‌సీసీలో చేరితే నేరుగా వైమానిక దళంలోకి వెళ్లొచ్చని ఎవరో చెప్పారు. దాంతో తొమ్మిదో తరగతప్పుడే ఎన్‌సీసీలో చేరి... బెస్ట్‌ క్యాడెట్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఇంటర్‌ తర్వాత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్డీఏ)లో ప్రవేశానికని వెళ్లాడు...

ఆ పట్టుదలకి మెచ్చి...

ఎన్డీఏ రాత పరీక్షలన్నింటా నెగ్గాడు అగస్టిన్‌. వైద్య పరీక్షలకి వచ్చాక... ‘నువ్వు 21 కేజీలు ఎక్కువ బరువున్నావ్‌’ అంటూ అతణ్ణి తిరస్కరించారు. వారంపాటు కార్యాలయం ముందు పడిగాపులు కాసి అక్కడి కమాండర్‌ని కలిశాడు. ‘నాకు ఒక్క నెల అవకాశమిస్తే బరువు తగ్గి చూపిస్తాను సార్‌’ అని ప్రాదేయపడ్డాడు. ఆయన ఒప్పుకోవడంతో- ఎంతో శ్రమించి నెలలో 18 కిలోల బరువు తగ్గాడు. అతని పట్టుదలని మెచ్చిన కమాండర్‌ ఎన్డీఏలో చేర్చుకున్నాడు. వైమానిక దళంలో చేరాక యుద్ధవిమానాలు నడపడమే కాదు... సాంకేతిక అంశాలన్నింటా పట్టుసాధించాడు అగస్టిన్‌. వింగ్‌ కమాండర్‌ స్థాయికెళ్లాడు. కానీ హోదా పెరిగేకొద్దీ విమానాలు నడిపే సమయం తగ్గింది. ఎప్పుడూ ఫైళ్లలో కూరుకుపోవాల్సి వచ్చేది. అది నచ్చక... స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. అప్పటికే పెళ్ళై ఓ బాబున్నాడు అగస్టిన్‌కి. అప్పుడే అతనికో ఆలోచన వచ్చింది...

హెలికాప్టర్‌ కూలింది!

వైమానిక దళాల్లో శిక్షణ కోసం చిన్నపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌లని వాడుతుంటారు. వాటిని తయారుచేసే కంపెనీ స్థాపించాలనుకున్నాడు అగస్టిన్‌. కానీ పేరూ ఊరూలేని తనలాంటివాళ్లు అందుకోసం అనుమతులు తీసుకోవడం సాధ్యంకాలేదు. ఆ పనేదో అమెరికాలో చేయొచ్చనుకున్నాడు. అక్కడో హెలికాప్టర్‌ కంపెనీలో పైలట్‌గా చేరాడు. హవాయి దీవుల్లో సదా లావాను వెలిగక్కుతుండే కిలోవేయా అగ్నిపర్వతంపైకి పర్యటకుల్ని తీసుకెళ్లే పని అతనిది. కొంతకాలానికి తానే అలాంటి హెలికాప్టర్‌ సేవల్ని అందించే సంస్థని స్థాపించాడు. అది బాగానే నడిచిందికానీ... ఓసారి భూగర్భశాస్త్రవేత్తలు కొందర్ని అగ్నిపర్వతం వద్దకు తీసుకెళుతుండగా హెలికాప్టర్‌ ఇంజిన్‌ మొరాయించింది. కింద చూస్తే లావా- పైకి వెళ్లడానికేమో వీల్లేదు! దాంతో ఓ చిన్న ఖాళీస్థలం కనిపిస్తే అక్కడ - క్రాష్‌ ల్యాండింగ్‌ చేశాడు. శాస్త్రవేత్తలకి ఏమీకాకున్నా... ఇతని మెడా, వెన్నెముకా విరిగిపోయాయి. మూడేళ్లు ఆసుపత్రి బెడ్డుకే పరిమితమయ్యాడు...!

వీధినపడ్డారు!

ఇది ఇలా ఉంటే, అగస్టిన్‌ హెలికాప్టర్‌లో ప్రయాణించిన శాస్త్రవేత్తలు తాము మరణం అంచులదాకా వెళ్ళాల్సి వచ్చిందంటూ అతనిపైన కోర్టులో కేసు వేశారు. దాంతో ఆస్తిమొత్తం అమ్ముకోవాల్సి వచ్చింది. అతని కుటుంబం నిలువనీడ కోల్పోయి... కొన్నినెలలపాటు కారులోనే తలదాచుకుంది! ఆ సమయంలోనే ఆసుపత్రి నుంచి వీల్‌ఛెయిర్‌కి మారాడు అగస్టిన్‌. ఆసుపత్రిలో తన అనుభవంతో- రోగులకి తోడూనీడగా ఉండే సిబ్బందిని అందించే ‘సర్జరీ ప్లానెట్‌’ అన్న సంస్థని ఏర్పాటుచేశాడు. అది బాగా సక్సెస్‌ అయ్యింది. ఆర్థిక కష్టాలన్నీ తీరాయి. అయినా సరే- తన మనసుకి అతిదగ్గరైన విమానాలకి దూరమవుతున్న విషయం అతణ్ని వేధించింది. దాంతో-  ‘సర్జరీ ప్లానెట్‌’ సంస్థని అమ్మేసి... యువకులకి పైలట్‌ శిక్షణ అందించే ‘జెట్‌-ఎక్స్‌’ అన్న కంపెనీని స్థాపించాడు. ఆ తర్వాత- లాన్స్‌ఎయిర్‌ అన్న విమాన నిర్మాణ సంస్థని కొని శిక్షణ విమానాలని రూపొందించసాగాడు. కొలంబియా, మెక్సికో సహా 34 దేశాలు అతని విమానాలని కొంటున్నాయిప్పుడు. వాటి కోసం ఇప్పటిదాకా 2400 విమానాలని రూపొందించిందా సంస్థ!  మరి మీ తర్వాతి లక్ష్యమేంటీ అనడిగితే- ‘ఎప్పటికైనా మా సంస్థ భారతదేశంలోకి అడుగుపెట్టాలి. కారు డ్రైవింగ్‌ నేర్పినంత సులభంగా మన యువతకి విమానం నడపడం నేర్పించాలి..’ అంటున్నాడు అగస్టిన్‌! సంకల్పం బలంగా ఉన్న మనిషిని అవరోధాలు ఏం చేయగలుగుతాయి చెప్పండి...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు