అమ్మ చేతి రుచి... ఆలిండియాని మెప్పించింది!

తెలుగబ్బాయి అరుణ్‌కి వ్యాపారవేత్తగా చాలా ‘ప్రథమా’లున్నాయి! దేశంలోనే తొలి స్టూడెంట్‌ ఫుడ్‌ ట్రక్‌ని ఏర్పాటుచేసినవాడు. ప్రపంచానికి తొలి ‘బుల్లెట్‌బండి బార్బెక్యూ’ ట్రక్‌ని పరిచయం చేసినవాడు.

Updated : 03 Mar 2024 10:10 IST

తెలుగబ్బాయి అరుణ్‌కి వ్యాపారవేత్తగా చాలా ‘ప్రథమా’లున్నాయి! దేశంలోనే తొలి స్టూడెంట్‌ ఫుడ్‌ ట్రక్‌ని ఏర్పాటుచేసినవాడు. ప్రపంచానికి తొలి ‘బుల్లెట్‌బండి బార్బెక్యూ’ ట్రక్‌ని పరిచయం చేసినవాడు. ఆ క్రమంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకే కాదు లండన్‌లో కూడా తొలి ‘స్ట్రీట్‌ ఫుడ్‌ చెయిన్‌’ని నిర్వహిస్తున్నవాడు. వెరసి... 28 ఏళ్ళకే కోట్లవ్యాపారాన్ని సొంతం చేసుకున్నవాడు! విద్యార్థిగా పాకెట్‌మనీ కోసం మొదలుపెట్టిన అతని వ్యాపారం ఇంతగా ఎలా విస్తరించిందో... అరుణ్‌ మాటల్లోనే చూద్దామా?

హాయ్‌! మాది విజయవాడ. నాన్న సైనికాధికారి. ఆయన బదిలీల కారణంగా నా స్కూలు చదువు దిల్లీ, ఝాన్సీ, ఊటీ, హైదరాబాద్‌లలోని కేంద్రీయ విద్యాలయాల్లో సాగింది. నేను డిగ్రీలో చేరే సమయానికి మా కుటుంబం కర్ణాటకలోని కరవా అన్న ప్రాంతానికి వచ్చింది. అక్కడ మంచి కాలేజీలు లేకపోవడంతో నన్ను బెంగళూరులో చేర్చారు. ఎంత పొదుపుగా వాడుకున్నా- అమ్మావాళ్ళు పంపే డబ్బు రెండు వారాలకంతా ఖర్చయ్యేది. వాళ్ళని మళ్ళీ అడగాలంటే గిల్టీగా అనిపించేది. దాంతో- నా పాకెట్‌మనీ కోసం ఏదైనా వ్యాపారం చేయాలనిపించింది. అప్పటికే నాకు ‘టీఎల్‌సీ’ విదేశీ ఛానల్‌ ద్వారా విదేశీ ఫుడ్‌ ట్రక్కులపైన అవగాహన ఉంది. అలాంటివాటిని ఇక్కడా పెడితే బావుణ్ణని స్నేహితులకి చెబితే ఓ ముగ్గురు నాతో చేతులు కలిపారు. దాంతో- ప్రతిరోజూ రాత్రి వేళల్లో బెంగళూరులోని స్ట్రీట్‌ ఫుడ్‌లూ, రెస్టరంట్‌ల దగ్గర నిల్చుని ప్రతి చిన్న అంశాన్నీ గమనించడం మొదలుపెట్టాం. నాలుగునెలలపాటు ఇలా ‘రీసెర్చ్‌’ చేశాక మా వ్యాపారానికి నాలుగు లక్షలు అవసరమన్న అంచనాకి వచ్చాం. అమ్మానాన్నల్నీ బంధువులందర్నీ అభ్యర్థించి అతికష్టంపైన ఆ డబ్బు సేకరించాం. 2015లో ఓ పాత టెంపో ట్రావెలర్‌ వ్యాన్‌ని కొని- ఫుడ్‌ట్రక్‌గా మార్చాం! తొలిరోజు రూ.3 వేల మేరకు అమ్ముడుపోతే చాలనుకున్నాం కానీ- అనూహ్యంగా 10 వేల రూపాయల మేరకు వ్యాపారం జరిగింది. నెల తిరిగేసరికల్లా అది పాతికవేలకి చేరింది. ‘దేశంలో విద్యార్థులు నడుపుతున్న తొలి ఫుడ్‌ట్రక్‌’ అంటూ పలు పత్రికలు రాశాయి. కాకపోతే- ఏడాది గడిచే సరికి బెంగళూరులో మాలాంటి ఫుడ్‌ట్రక్కులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అంత పోటీని ఎలా తట్టుకోవాలోనని ఆలోచిస్తున్నప్పుడే...

అమ్మా నేనూ తమ్ముడూ!

ఓరోజు మా కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్‌లో భాగంగా కర్ణాటకలోని రామనగర అన్న గ్రామానికి వెళ్ళాం. హిందీ ‘షోలే’ సినిమా ఇక్కడే చిత్రీకరించారని చెప్పారు. అక్కడి పంచాయతీ కార్యాలయంలో- అమితాబ్‌, ధర్మేంద్రలు బైక్‌పైన కూర్చున్న ఫొటో ఒకటి కనిపించింది. ‘సైడ్‌కార్‌’తో కూడిన బుల్లెట్‌ బైక్‌ అది. దాన్ని చూడగానే సైడ్‌ కార్‌ స్థానంలో చిన్నపాటి ‘మాడ్యులర్‌ కిచెన్‌’ ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచనొచ్చింది. ఆ కిచెన్‌ ద్వారా మాంసానికి మసాలా దట్టించి గ్రిల్‌ చేసి ఇచ్చే బార్బెక్యూ(బీబీక్యూ) అందించగలిగితే మా వ్యాపారానికి తిరుగుండదన్న నమ్మకమూ కుదిరింది. దాంతో రెండు సెకండ్‌హ్యాండ్‌ బుల్లెట్‌ బండ్లు కొని అన్వర్‌ అనే మెకానిక్‌ సాయంతో ప్రయోగాలకి దిగాను. అలా సిద్ధమైన బైకుని నడుపుతూ వెళుతుంటే- అకస్మాత్తుగా కిచెన్‌ భాగం ఊడిపోయి... నేను అదుపుతప్పి పడిపోయాను. అలా నాలుగైదు మోడళ్ళు ఫెయిలయ్యాకే ఒకదాన్ని సిద్ధం చేయగలిగాను. బైక్‌-బీబీక్యూ ఆలోచన కొత్తదే కావొచ్చు... రుచి కూడా భిన్నంగా ఉండాలి కదా! అప్పటికి నాన్నకి విశాఖ బదిలీ అయ్యి- అమ్మా, తమ్ముడూ నాతోపాటే వచ్చి ఉండసాగారు. అమ్మకి ‘బీబీక్యూ’ ఆలోచన నచ్చి తనే మసాలాలు తయారుచేస్తానంది. మాతో కలిసి సుమారు నెలపాటు రకరకాల ప్రయోగాలు చేసి- ఒక రుచిని సెలెక్ట్‌ చేసి ఇచ్చింది. మా తమ్ముడూ బిజినెస్‌లోకి రావడంతో- మొత్తం కలిసి నలుగురం భాగస్వాములమయ్యాం. అలా- ‘బీబీక్యూ ఇండియా రైడ్‌’ పేరుతో బెంగళూరులో రెండు చోట్ల మా బైకుల్ని పెట్టాం. తొలిరోజే రెండింటికీ కలిపి రూ.50 వేల అమ్మకాలు జరిగాయి! రెండోవారంలోనే ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ‘మాకు ఫ్రాంచైజీ ఇస్తారా?’ అని అడిగితే ఆశ్చర్యపోయాం. ఆ ఇద్దరికీ శిక్షణతోపాటూ ఓ బైకునీ సిద్ధంచేసి ఇచ్చాం. అవీ హిట్టవ్వడం, విదేశీ మీడియా కూడా కవరేజీ ఇవ్వడంతో మా దశ తిరిగి పోయింది. ఇక- తమిళనాడు, దిల్లీ, ముంబయి, పుణె, లఖ్‌నవూ, అండమాన్‌- హావ్‌లాక్‌ అంటూ పలు చోట్లకి విస్తరించాం. తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖతోపాటూ కాకినాడ, కొవ్వూరుల్లోనూ పెట్టి సక్సెస్‌ అయ్యాం. 114 బైకులతో దేశంలో తొలి ‘స్ట్రీట్‌ చెయిన్‌’గా గుర్తింపు సాధించాం. ఖతార్‌, లండన్‌లకి కూడా ఫ్రాంచైజీలు ఇవ్వగలిగాం. వీటన్నింటిపైన వస్తున్న రాయల్టీలతో ఏటా కోట్లరూపాయల మేర టర్నోవర్‌ సాధిస్తున్నాం.  

ఓ సైనికాధికారిగా నాన్నకి- నన్నూ తమ్ముణ్ణీ వైమానిక పైలట్‌లుగా చూడాలన్న ఆశ ఉండేది. నేను అటువెళ్ళలేకపోయాను. మొదట్లో మా బంధువుల్లో కొందరు ‘మీ వాడు బెంగళూరు వీధుల్లో టిఫిన్లు అమ్ముకుంటున్నాడట’ అని చెబుతుంటే నాన్న చాలా నామోషీగా ఫీలయ్యేవారు. కానీ క్రమంగా - మా వల్ల ఎంతోమంది యువత ఉపాధి అందుకోవడం చూసి ‘ఇది కూడా దేశసేవేరా!’ అంటూ భుజం తడుతున్నారు! అంతకన్నా ఏం కావాలి... చెప్పండి?!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..