ఈ రాష్ట్రాలు భేష్‌!

ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందిస్తాయి. కానీ ముందే చర్యలు తీసుకుంటే... ఆ ఇబ్బందుల్ని అడ్డుకోవచ్చు అంటున్నాయి ఈ రాష్ట్రాలు.

Published : 04 May 2024 23:26 IST

ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందిస్తాయి. కానీ ముందే చర్యలు తీసుకుంటే... ఆ ఇబ్బందుల్ని అడ్డుకోవచ్చు అంటున్నాయి ఈ రాష్ట్రాలు. మహిళలూ, చిన్నారులూ కీలకంగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల గురించి ఆలోచించి...వాటిని సమూలంగా దూరం చేయాలని నడుంబిగించి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి ఈ ప్రభుత్వాలు.


ఆ వ్యాక్సిన్లు ఉచితం!

నదేశంలో  ప్రతి ఏడు నిమిషాలకొకరు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో కన్నుమూస్తున్నారని చెబుతోంది డబ్ల్యూహెచ్‌ఓ. దాన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకోసం వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నా... చాలామందికి ఈ సమస్య గురించి అవగాహనే ఉండట్లేదు. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే... సిక్కిం మాత్రం మహిళల ఆరోగ్యానికి పెద్ద పీట వేసి ఆ సమస్యను సమూలంగా దూరం చేయాలని ఆరేళ్ల క్రితమే ఓ పథకానికి శ్రీకారం చుట్టింది. తొమ్మిది నుంచి పదిహేనేళ్ల లోపు ఆడపిల్లలకు హెచ్‌పీవీ(హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) వ్యాక్సిన్‌ను ఉచితంగా వేస్తోంది. దాదాపు ఐదువేల రూపాయల ఖరీదు చేసే ఈ వ్యాక్సిన్‌ను ఆడపిల్లలకు ఆరు నెలల వ్యవధిలో మూడు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణమయ్యే వైరస్‌ను దూరం చేసి ఈ సమస్య బారిన పడకుండా చూస్తుంది. ఎంతో కీలకమైన ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఆడపిల్లలకు అందించడానికి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను వేదికగా చేసుకుని ఉచితంగా ఇస్తోంది సిక్కిం ప్రభుత్వం. దాంతోపాటు  గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ గురించి అవగాహన కల్పిస్తూనే వ్యక్తిగత పరిశుభ్రతనూ చదువులో భాగం చేశారు. తమ గ్రామంలోని మహిళలకూ, చదువులకు దూరమైన ఆడపిల్లలకూ అవగాహన కల్పించే బాధ్యతనూ విద్యార్థినులకు అప్పగించి- పల్లెల్లోనూ పెద్ద ఎత్తున ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు టీచర్లు. ఇప్పటి వరకూ దాదాపు వందశాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు- ఇక మీదట తొమ్మిదేళ్లు నిండిన వారికి వేయడానికి సిద్ధమయ్యారు.


వైద్యసేవలు ఇంటికే!

ఇంటిల్లిపాదినీ చూసుకునే మహిళలు తమ గురించి మాత్రం పట్టించుకోరు. ఆరోగ్యం బాగోకపోయినా ఏ పనులూ ఆపకుండా... అందరికీ అన్నీ అమర్చి పెడుతుంటారు. అలాంటి మహిళ బాధ్యత మాది అంటూ మూడేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ‘దాయి-దీదీ(అమ్మ- అక్క) క్లినిక్‌’లను ప్రవేశ పెట్టింది. అందుకోసం కొన్ని బస్సుల్లో పరీక్షలకు కావల్సిన పరికరాలనూ, మందులనూ ఉంచి మొబైల్‌ ఆసుపత్రులుగా మార్చారు. వాటిలో వైద్యుల నుంచి సహాయకుల వరకూ మహిళలనే నియమించి మురికివాడలకూ, పల్లెలకూ పంపి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల ద్వారా క్యాన్సర్‌, గుండె, సంతాన సాఫల్య సమస్యలతోపాటు దాదాపు యాభై రకాల పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. తీవ్ర సమస్యలున్నవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా శస్త్రచికిత్సలూ చేయిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ, అంగన్‌వాడీ సిబ్బంది సహకారంతో వీధివీధినా తిరుగుతూ వైద్యసేవల్ని మహిళ ముంగిట్లోకి తీసుకెళ్లిన ఘనత మాత్రం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికే దక్కుతుంది. అంతేకాదు, ఈ బస్సుల ద్వారా సేవలు అందించడానికి మహిళా సిబ్బందికీ మరిన్ని ఉద్యోగావకాశాల్ని కల్పిస్తోంది ప్రభుత్వం.


ఇన్సులిన్‌ కిట్లు ఇస్తూ...

పుట్టుకతోనే ఎందరో చిన్నారులు మధుమేహంతో ఈ భూమ్మీదకొస్తున్నారు. మరికొందరికి ఆ సమస్య తరవాత వచ్చినా తల్లిదండ్రులు సకాలంలో గుర్తించకపోవడంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. టైప్‌-1 డయాబెటిస్‌తో బాధపడే వీరికి ఇన్సులిన్‌ తప్పనిసరి. పైగా అది ఖరీదుతో కూడుకున్నది కూడా కావడంతో కేరళ ప్రభుత్వం ‘మిఠాయి క్లినిక్‌’లను అందుబాటులోకి తీసుకొచ్చి... మధుమేహ చిన్నారుల వైద్య అవసరాలను తీర్చుతోంది. మొదట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఈ సేవల్ని ప్రారంభించి చిన్నారులకు పరీక్షలు చేసి మధుమేహం ఉన్నవారికి ఇన్సులిన్‌ కిట్‌ అందించసాగింది. ఈ కిట్‌లో ఇన్సులిన్‌ క్యాట్రిడ్జ్‌లు, పెన్‌, సూదులూ, గ్లూకోమీటర్‌, రక్తం సేకరించే ప్రత్యేకమైన సూదులు ఉంటాయి. కిట్‌లు అందుకున్న చిన్నారుల గ్లూకోజ్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది తెలుసుకుంటూ.. వారికి తగిన సలహాలూ, సూచనలూ అందిస్తున్నారు. ఈ మధ్యనే ఆ రాష్ట్ర ప్రభుత్వం కేరళలోని అన్ని జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రులకు మిఠాయి సేవల్ని విస్తరించి- ఐదేళ్లు నిండిన మధుమేహ బాలలకు అండగా నిలుస్తోంది. ప్రభుత్వ స్కూళ్లకూ, మారుమూల పల్లెలకూ వైద్య సిబ్బందిని పంపి ఎప్పటికప్పుడు మధుమేహ బాధితుల్ని గుర్తించి- వారికి ఏడాదికి దాదాపు రెండు లక్షలరూపాయల విలువైన వైద్యసాయం అందిస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..