సముద్రపు దొంగలు!

సంద్రానికి ఈత నేర్పుతారు. భారీ నౌకలను గుప్పిట్లో బంధిస్తారు. నౌకాదళాల కన్ను కప్పుతారు. రాడార్లకు దడ పుట్టిస్తారు. డ్రోన్లను ఏమారుస్తారు. ప్రభుత్వాల్లో ప్రకంపనలు సృష్టిస్తారు. అనంత జలనిధిపైన అనధికారిక సామ్రాజ్యాల్ని నిర్మించుకుని.. అంతర్జాతీయ వాణిజ్య ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నారు సముద్రపు దొంగలు.

Updated : 05 May 2024 00:25 IST

సంద్రానికి ఈత నేర్పుతారు. భారీ నౌకలను గుప్పిట్లో బంధిస్తారు. నౌకాదళాల కన్ను కప్పుతారు. రాడార్లకు దడ పుట్టిస్తారు. డ్రోన్లను ఏమారుస్తారు. ప్రభుత్వాల్లో ప్రకంపనలు సృష్టిస్తారు. అనంత జలనిధిపైన అనధికారిక సామ్రాజ్యాల్ని నిర్మించుకుని.. అంతర్జాతీయ వాణిజ్య ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నారు సముద్రపు దొంగలు.

ముసుగు మనుషులు.
చేతిలో ఆయుధాలు.
కొన్నిసార్లు ఐదారుగురు.
కొన్నిసార్లు పాతిక ముప్పైమంది.  
లక్ష్యాన్ని బట్టి సంఖ్య మారుతుంది.
చాపకింద నీరులా వాణిజ్య నౌకను చుట్టుముడతారు. ప్రవేశ ద్వారాల్ని బద్దలుకొట్టి లోపలికి చొరబడతారు.
కీలక ప్రాంతాల్ని స్వాధీనం చేసుకుంటారు. కెప్టెన్‌ తలకు పాయింట్‌ బ్లాంక్‌లో తుపాకీ గురిపెడతారు. సహకరిస్తే ఫర్వాలేదు. మొండికేస్తే మొండెం లేచిపోద్ది. చమురు, మాదక ద్రవ్యాలు, బంగారం, మద్యం, ప్రాచీన కళాఖండాలు.. సరుకు ఏదైనా క్షణాల్లో ఖాళీ చేస్తారు. అంతే వేగంగా మరపడవలో మాయం అవుతారు.  
‘సముద్రపు దొంగలు..
సముద్రపు దొంగలు’
సిబ్బంది ఏడుపులు సాగర ఘోషలో కలిసిపోవాల్సిందే.

ఆ వ్యూహాలు ఊహలకు సైతం అందవు. నౌక నడిసంద్రంలో ఉన్నప్పుడు.. దారితప్పిన ప్రయాణికులమంటూ పరిచయం చేసు కుంటారు. బోటులో ఇంధనం నిండు కుందంటూ సాయం అడుగుతారు. నేవీ అధికారులమని బుకాయిస్తారు. చేపలవేటకు వచ్చిన మత్స్యకారుల్లా నటిస్తారు. అదంతా నిజమే అనుకుని, నౌకలోకి ఆహ్వానిస్తే కోరి కొరివితో తలగోక్కున్నట్టే. సరుకుల స్వాధీనంతో సరిపెట్టుకోకుండా.. సిబ్బంది ప్రాణాలకూ వెలకడతారు. గీసిగీసి బేరాలాడతారు. కొన్నిసార్లు, ఏకంగా నౌకనే సొంతం చేసుకుంటారు. ఇక నుంచీ అదే ‘మదర్‌ షిప్‌’, సదరు ముఠా కీలక స్థావరం. అత్యాధునిక మారణాయుధాలు, తేలికపాటి బోట్లు, వాకీటాకీలు, జీపీఎస్‌ పరికరాలు.. సముద్రపు దొంగల పనిని సులభం చేస్తున్నాయి. గతంలో, ఇంత సాంకేతికత లేదు. కండబలంతోే కానిచ్చేవారు. సత్తువ సరిపోనప్పుడు, సముద్రంలో దూకి పారిపోయేవారు. తప్పనిసరి అయితే, పోరాడి ప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఎవరికివారు ప్రైవేటు సైన్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతర్జాతీయ మాఫియాతో జతకట్టి ఆయుధాలు, రాకెట్‌ లాంచర్లు సమకూర్చుకుంటున్నారు. అందమైన అమ్మాయిల్ని రంగంలోకి దించి.. నౌకలోని కీలక వ్యక్తులకు వలపు వలలు విసురుతున్నారు. పోర్టు సిబ్బందికి లంచాలిచ్చి, వాణిజ్య నౌకల కదలికలు తెలుసుకుంటున్నారు. మెరుపు దాడులతో విలువైన ఉత్పత్తుల్ని తరలించుకుని వెళ్తున్నారు.  

సముద్రపు దొంగల సమస్య ఇప్పటిది కాదు. మొఘలుల కాలం నాటికే ఉంది. స్థానిక పాలకులూ, సంస్థానాధీశులూ బొక్కసం నింపుకోడానికి విదేశీ నౌకలను లక్ష్యంగా చేసుకునేవారు. వాటాలిచ్చి మరీ బందిపోట్లను ప్రోత్సహించేవారు. మార్కో పోలో రాతలలోనూ ఈ ప్రస్తావన ఉంది. ఇంటర్నేషనల్‌ మెరైన్‌ బ్యూరో రికార్డుల ప్రకారం.. గత ఏడాది నూట ఇరవైకి పైగా సముద్రపు దొంగతనాలు నమోదు అయ్యాయి. ఈ ముఠాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నౌకలోని సరుకు గమ్యాన్ని చేరుతుందో లేదో కూడా చెప్పలేనంత అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ప్రత్యేకించి ఎర్రసముద్ర మార్గంలో రవాణా అంటే.. కోట్ల రూపాయల విలువైన వస్తువుల్ని హారతిపళ్లెంలో పెట్టి దొంగల ముఠాలకు అప్పగించడమే. కాబట్టే, కొన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ఆ దార్లో కనుక వెళ్తే.. సరుకుల బీమా సౌకర్యాన్ని ఉపసంహ రిస్తామని తెగేసి చెబుతున్నాయి.

*        *        *

అన్నింటిలోకి, ఈ ఐదు మార్గాలూ మహా ప్రమాదకరమని నిపుణులు నిర్ధారించారు..   

గినియా సింధుశాఖ - ఆఫ్రికా పశ్చిమతీర ప్రాంతం. చాలాచోట్ల అరాచకం రాజ్య మేలుతోంది. 

గల్ఫ్‌ ఆఫ్‌ ఆడెన్‌ - యెమన్‌, సోమాలియా మధ్యలో ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది.  

సులు ప్రావిన్స్‌, సెలెబ్స్‌ సీ - ఈ ప్రాంతం ఫిలిప్పీన్స్‌, ఇండొనేషియాలకు దగ్గరగా ఉంటుంది.

మలక్కా జలసంధి- హిందూ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రం మధ్య ప్రాంతం. ఈ మార్గం గుండా వాణిజ్య నౌకల రాకపోకలు ఎక్కువే.

భారత్‌, బంగ్లా సరిహద్దు -  అందులోనూ సుందర్‌బన్‌ పరిసరాలు.  

రాజకీయ అనిశ్చితి, తీవ్ర పేదరికం, నిరుద్యోగం.. ‘హాట్‌స్పాట్స్‌’లో సముద్రపు చోరీలకు ప్రధాన కారణాలు. అంతర్జాతీయ సంస్థలూ, ఐక్యరాజ్య సమితి వంటి వేదికలూ సముద్రపు దొంగల్ని కట్టడి చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అయినా ఆ ఆగడాలు మితిమీరుతూనే ఉన్నాయి.

యుద్ధానికి సిద్ధం

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. నడిసంద్రం సాక్షిగా జరిగే దోపిడిని సముద్ర జలాలతోనే అడ్డుకోవడం సంప్రదాయమైన వ్యూహం. ముష్కర ముఠాల మరపడవలు చుట్టుముట్టగానే.. శక్తి మంతమైన పంపింగ్‌ యంత్రాలతో నీటిని ఎగజిమ్ముతూ ఎదురుదాడికి దిగుతారు నౌక సిబ్బంది.

ఆ ప్రవాహ వేగానికి దొంగలు ఉక్కిరిబిక్కిరి అవుతారు. నీరు చేరిపోవడంతో పడవలు బరువెక్కుతాయి. క్రమంగా మునిగిపోతాయి. దీంతో ఆ ముఠాలు ఆత్మరక్షణలో పడతారు. కెప్టెన్‌ అనుమతి లేనిదే ఎవరూ ఓడలోకి ప్రవేశించకుండా.. పదునైన తీగలతో చుట్టూ కంచె నిర్మిస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలతో.. పరిసరాల్ని గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ధూర్తుల దుశ్చర్యలు ఆగడం లేదు. కొత్తకొత్త ఎత్తుగడలతో విలువైన సంపదను ఎత్తుకెళ్తున్నారు. గత ఏడాది చివర్లో మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సముద్రపు దొంగలు హైజాక్‌ చేశారు. ఎర్ర సముద్రం వైపుగా వెళ్తుండగా.. సాయుధ మూకలు దాడికి తెగబడ్డాయి. భారత వైమానికదళం రంగంలోకి దిగాక కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అంతకు ముందు, సింగపూర్‌ వాణిజ్య నౌక మీద కూడా కన్నేశారు. సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడటంతో.. పలాయనం చిత్తగించారు. పుష్కరకాలం క్రితం.. దుబాయ్‌ నుంచి వెళ్తున్న నౌకపైనా పైరేట్లు పట్టు బిగించారు.

దీంతో కోట్లాది రూపాయలు ముట్టజెప్పి సరుకు విడిపించుకున్నారు యజమానులు. గ్రీస్‌ వాణిజ్య నౌక నుంచి అయితే అక్షరాలా పదమూడున్నర లక్షల డాలర్లు ముక్కుపిండి వసూలు చేశారు. తాజాగా, బంగ్లాదేశ్‌ కార్గో నౌకను స్వాధీనం చేసుకుని.. బేరాలు సాగించాలని చూశారు. కానీ, మన నావికాదళం ఆ ఆటలు సాగనివ్వలేదు. బల్గేరియాలోనూ ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టారు పైరేట్లు. సంక్షోభ సమయంలో ఆ దేశం మన సాయం కోరింది. మరుక్షణమే భారత వాయుసేన రంగంలోకి దిగింది. సముద్ర మార్గంలో రెండున్నర వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ.. మెరైన్‌ కమెండోలను మోహరించింది. మెరుపు దాడులతో పైరేట్ల పీచమణచింది. బందీలుగా ఉన్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. అన్నిసార్లూ ఇలాంటి క్లైమాక్స్‌లు సాధ్యం కాకపోవచ్చు. సాధారణంగా అంతర్జాతీయ వ్యాపార సంస్థలు.. రాజీమార్గాన్నే ఎంచుకుంటాయి. మధ్యవర్తుల ద్వారా బేరసారాలు సాగించి.. ఎంతోకొంత ముట్టజెపుతాయి. ఈ మధ్యే దాదాపు ఐదు మిలియన్‌ డాలర్లు సమర్పించుకుని.. బంగ్లా నౌక ఎంవీ అబ్దుల్లాను విడిపించుకున్నారు యజమానులు. కొన్నిసార్లు, సముద్రపు దొంగల ఆశకు అంతులేకుండా పోతోంది. ఆ గొంతెమ్మ కోరికలు తీర్చలేమంటూ సరుకు సొంతదారులు చేతులెత్తేస్తున్నారు. అలాంటి సమయంలో అమాయక సిబ్బంది బలి పశువులు అవుతున్నారు.

పైరేట్స్‌ పుట్టినిల్లు

సోమాలియా.. నిరుపేద ఆఫ్రికా దేశం. కటిక కరవు నేల. ఇప్పటికీ మట్టిని తిని బతుకుతున్నవారు ఎంతోమంది. పోషక విలువల లోపాలు, తీవ్ర అనారోగ్యాలు అనునిత్యం వేధిస్తుంటాయి. దానికితోడు రాజకీయ అనిశ్చితి, శాంతిభద్రతల వైఫల్యం. ఫలితంగా ఎటుచూసినా అరాచకమే. ఆయుధం ఉన్నవాడే బలవంతుడు. సముద్రతీర ప్రాంతం కావడంతో, ఒకప్పుడు చేపల వేట ప్రధాన వృత్తిగా ఉండేది. రకరకాల కారణాల వల్ల ఆ ఉపాధి కూడా దూరమైంది. పొట్టనింపుకోడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దొమ్మీలకు తెగబడ్డారు. కల్లోల సముద్రంలోనూ ఒడుపుగా నావను నడపగల నైపుణ్యం సోమాలియన్ల సొంతం. దీంతో బృందాలుగా వెళ్లి.. వాణిజ్య నౌకలను అడ్డుకుని.. దౌర్జన్యంగా సరుకును తరలించుకుని వచ్చేవారు. దాన్ని చీకటి వ్యాపారులకు విక్రయించేవారు. రాత్రికి రాత్రే కట్టలకొద్దీ డబ్బు వచ్చిపడేది. క్రమంగా ముఠాల సంఖ్య పెరిగింది. నేర తీవ్రతా అధికమైంది. సంఘ విద్రోహశక్తులూ, వేర్పాటు వాదులూ ఆశగా ఇటువైపు వచ్చారు. సోమాలియాతో పాటు.. ఘనా, నైజీరియా, కాంగో తదితర ఆఫ్రికన్‌ దేశాల ముఠాలూ వాణిజ్య నౌకల్ని లక్ష్యం చేసుకుంటున్నాయి.

మనకూ సవాలే

భారత్‌కు సువిశాల తీర ప్రాంతం ఉంది. మన విదేశీ వాణిజ్యంలో తొంభై అయిదుశాతం సముద్ర మార్గంలోనే సాగుతోంది. దీంతో సోమాలియా దొంగలనైనా, మరో ముఠానైనా కట్టడి చేయాల్సిన అవసరం మనకే ఎక్కువ ఉంటోంది. భారత్‌ కూడా ఆ బాధ్యతను సవినయంగా స్వీకరించింది. దాదాపు పదకొండు యుద్ధనౌకలు అరేబియా సముద్రంలో అనునిత్యం పహరా కాస్తున్నాయి. నిఘా విమానాలు గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి. ఏ క్షణాన పిలుపు వచ్చినా.. స్పందించి ఆయుధాలు సంధించడానికి వాయుసేన సిద్ధంగా ఉంటోంది. అందులోనూ హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా తీరం నుంచి భారత్‌ వరకూ ఉన్న సముద్ర మార్గాన్ని ‘హై రిస్క్‌’ జోన్‌గా పరిగణిస్తారు. మరో మార్గంలో రావాలంటే.. చుట్టూ తిరగాలి. ఇరవైశాతం మేర రవాణా ఖర్చులు పెరుగుతాయి. అంతిమంగా ఆ భారం వినియోగదారుల మీదే పడుతుంది. దీంతో బిక్కుబిక్కుమంటూ అలవాటైన దార్లోనే రాకపోకలు సాగిస్తున్నాయి వాణిజ్య నౌకలు. దోపిడీ మూకలు ఖరీదైన సరుకునే కాదు.. సామాన్య మత్స్యకారుల కష్టాన్నీ వదలడం లేదు. ఆ మధ్య సముద్రజలాల్లో చేపల వేటకు వెళ్లిన ఓ బృందాన్ని బెదిరించి.. అప్పటిదాకా పట్టిన చేపలన్నీ తీసుకున్నారు. మొబైల్‌ఫోన్లూ, ఆహార పదార్థాలనూ లాగేసుకున్నారు. వెళ్తూ వెళ్తూ బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఎప్పుడో కానీ ఆ బోటు ఒడ్డుకు చేరలేదు. అప్పటికే, ఆనవాళ్లు తెలియనంతగా కుళ్లి పోయాయి ఆ అమాయకుల శవాలు.  

అంతర్జాతీయ పరిణామాలూ

యెమన్‌, సూడాన్‌తోపాటు అనేక మధ్యప్రాచ్య దేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విద్రోహ శక్తులు పన్నని పన్నాగాలు లేవు. అయితే, ఆ వ్యూహాలను అమలు చేయాలంటే చేతినిండా డబ్బు కావాలి. దీంతో, కిరాయి మూకలను రెచ్చగొట్టి.. వాణిజ్య నౌకల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. యెమన్‌లో హూతీ సాయుధ తిరుగుబాటుదారులు ఇందుకు అతిపెద్ద ఉదాహరణ. వీళ్లు తరచూ నౌకల్ని బంధించి బేరాలకు దిగుతుంటారు. బలహీనమైన పాలన వ్యవస్థలు సముద్రపు దొంగలకు వరంగా మారాయి.

పూర్వం ఇలాంటి విద్రోహక చర్యలకు కఠిన శిక్షలు ఉండేవి. బహిరంగ ప్రదేశాల్లో నిలబెట్టి, రాళ్లతో కొట్టి చంపేవారు. మానవ సంచారంలేని ద్వీపాల్లో వదిలేసి వచ్చేవారు. బానిసలుగా మార్చి విక్రయించేవారు. ప్రస్తుతం, ఆయా దేశాలలో అమలులో ఉన్న శిక్షా స్మృతి ప్రకారం విచారణలు జరుగుతున్నాయి. మహా అయితే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నారు. అప్పుడప్పుడూ నేరాన్ని రుజువు చేయడమూ కష్టం అవుతోంది. అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తూ.. నేరస్థులను మాతృదేశాలకు అప్పగిస్తున్న సందర్భాలూ అనేకం. సముద్రపు దొంగలను సాధారణ నేరస్థులతోపాటు జమకట్టకుండా.. ప్రత్యేక శిక్షా స్మృతిని అమలు చేయాలనే ప్రతిపాదనా ఉంది. అదే కనుక సాధ్యమైతే, శిక్షలు కఠినం అవుతాయి. నేరాలు నియంత్రణలోకి వస్తాయి. సముద్రం ఊపిరి పీల్చుకుంటుంది. ఓడలు నిశ్చింతగా గమ్యాన్ని చేరుకుంటాయి.

*          *           *

‘ఇండియా జిందాబాద్‌.
ఇండియా జిందాబాద్‌’ నినాదాలు మిన్నంటాయి.

తాజాగా, సోమాలియా పైరేట్స్‌పై పైచేయి సాధించి.. బందీలుగా ఉన్న ఇరవై మూడు మందిని విముక్తుల్ని చేసింది భారత వాయుసేన. వాళ్లంతా అప్పటికే ప్రాణాల మీద ఆశలు వదులుకున్నారు. చివరిసారిగా ప్రార్థనలు చేసుకున్నారు. ఆత్మీయులను తలుచుకున్నారు. అంతలోనే, భారత నౌకాదళం బరిలోకి దిగింది. సముద్రపు దొంగలతో మూడు సముద్రాల నీళ్లు తాగించింది.

వీడ్కోలు తీసుకుంటూ ఆ ఇరవైమూడు మందీ మరోసారి మనసారా నినదించారు..

‘ఇండియా జిందాబాద్‌
ఇండియా జిందాబాద్‌’ అంటూ.

వాళ్లంతా పాకిస్థాన్‌ ప్రజలు!

కింగ్‌ ఆఫ్‌ పైరేట్స్‌.. బాయ్సీ సింగ్‌

బాయ్సీ సింగ్‌ పేరు చెబితే ఓడలు వణికిపోయేవని అంటారు. అతను కరడుగట్టిన సముద్రపు దొంగ. బాయ్సీ తండ్రి భారతీయుడు. ఏదో కేసులో శిక్ష తప్పించుకోడానికి ట్రినిడాడ్‌ అనే ద్వీప దేశానికి పారిపోయాడు. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. బాయ్సీ అక్కడే పుట్టాడు. బాల్యంలోనే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. కౌమారం నాటికి కిరాయి హంతకుడిగా అవతరించాడు. స్మగ్లింగ్‌ ముఠాలతో చేతులు కలిసి సముద్రపు దొంగగా మారాడు. 1947 నుంచి దాదాపు
ఓ దశాబ్దకాలం వెనిజువెలా సముద్ర మార్గాన్ని శాసించాడు. ఆ తర్వాత, ఎప్పుడో పోలీసులకు దొరికాడు. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ‘మర్డర్స్‌ ఆఫ్‌ బాయ్సీ సింగ్‌’ పుస్తకం అతని జీవిత కథ.

నిబంధనలు వర్తిస్తాయి

ఎంత దుర్మార్గులైనా వాళ్లకూ నియమాలు ఉంటాయి. ఎంత అక్రమ సంపాదన అయినా పంపకంలో కొన్ని పద్ధతులు పాటిస్తారు. తేడావస్తే తలకాయలు తెగిపోతాయి. సంఘ బహిష్కరణ తప్పదు. సముద్రపు దొంగలు నాయకుడిని ఎన్నుకునే విధానం, సంపదను పంచుకునే పద్ధతి ఆసక్తికరం.

  • సముద్రపు దొంగల్లో జూదం నిషిద్ధం. వ్యసనం మనిషిలోని విచక్షణను చంపేస్తుంది. దీంతో అసూయలు మొదలవుతాయి. గొడవలు జరుగుతాయి. ఐకమత్యం లోపిస్తుంది. పతనానికి అదే తొలిమెట్టు.
  • దోపిడి ముఠాలు కీలక నిర్ణయాల విషయంలో ఓటింగ్‌ నిర్వహించుకుంటాయి. మెజారిటీ అభిప్రాయమే శిరోధార్యం. నాయకుడిని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నుకుంటారు.  
  • దోపిడిలో పాల్గొన్న వ్యక్తి పనితనాన్ని బట్టి వాటా నిర్ణయిస్తారు.
  • ప్రతి సభ్యుడూ సర్వకాల సర్వావస్థల్లో ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలి. ఆయుధాల్ని అందుబాటులో ఉంచుకోవాలి. దాడులకూ, పంపిణీకీ మధ్య వ్యవధి ఎక్కువగా ఉన్నప్పుడు.. ఆ సంపదను ఓ రహస్య ప్రదేశంలో దాచేవారు.
  • ఆ బాధ్యత నాయకుడిదే.

ఏ కారణంగానైనా ఆ నిధి రహస్యం తెలిసిన దళపతి కనుక మరణిస్తే.. సొమ్ము నేలపాలు అయ్యేది.

ఆ తర్వాత ఎప్పుడో, ట్రెజర్‌ హంటర్స్‌ ఆ సొత్తును చేజిక్కించుకున్న దాఖలాలూ ఉన్నాయి. ప్రస్తుతం దొంగ సొత్తు అమ్మకాలూ, పంపకాల సొమ్మూ హవాలా మార్గంలో చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు