ఎదిగే చిన్నారి... ఎప్పుడేమి నేర్వాలి..?

పొట్టలోంచి పొత్తిళ్లలోకి చేరిన కలలపంటని చూసుకుని ఎంత ఆనందిస్తున్నా మనసులో ఓ మూల ఎక్కడో ఇదీ అని చెప్పలేని ఆందోళన అమ్మానాన్నలకు సహజం. పిల్లవాడు పెరగాలంటే ఊరు ఊరంతా పూనుకోవాలని సామెత. దానికి తగ్గట్టే ఒకప్పుడు ఇంటినిండా మనుషులుండే సమష్టి కుటుంబాలు ఉండేవి

Updated : 09 Oct 2022 10:53 IST

ఎదిగే చిన్నారి... ఎప్పుడేమి నేర్వాలి..?

పొట్టలోంచి పొత్తిళ్లలోకి చేరిన కలలపంటని చూసుకుని ఎంత ఆనందిస్తున్నా మనసులో ఓ మూల ఎక్కడో ఇదీ అని చెప్పలేని ఆందోళన అమ్మానాన్నలకు సహజం. పిల్లవాడు పెరగాలంటే ఊరు ఊరంతా పూనుకోవాలని సామెత. దానికి తగ్గట్టే ఒకప్పుడు ఇంటినిండా మనుషులుండే సమష్టి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు బాధ్యత అంతా అమ్మానాన్నలిద్దరిదే. దాంతో పిల్లల పెంపకం విషయంలో ఎన్నెన్నో సందేహాలు వారిని తొలిచేస్తుంటాయి. నిజానికి పిల్లల ఎదుగుదల వయసుని బట్టి ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. ఆ పద్ధతి గురించి తెలుసుకుంటే నిబ్బరంగా పిల్లల్ని పెంచవచ్చు. వారి తొలి అడుగులూ తొలి పలుకులూ... ఇలా ప్రతి మైలురాయినీ ఆస్వాదించవచ్చు.

‘పాపాయి తాగిన పాలు తాగినట్లు కక్కేస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు...’
‘ఏడాది దాటినా బాబు నోట్లోంచి ఒక్క మాటా రావడం లేదు ఎందుకనో...’
‘మా పాప ఎంతసేపూ ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతోంది, క్రెష్‌లో వేరే పిల్లలతో కలిసి ఆడుకోవడం లేదు...’
‘పక్కింట్లో పాప ఏడాదికే నడిచేస్తోంది. మా పాపకి ఇంకా నిలబడడమే కష్టంగా ఉంది...’
‘కజిన్‌ వాళ్ల అబ్బాయికి ఆటిజం సమస్య ఉందన్నారు. అది విన్నప్పటినుంచీ టెన్షన్‌గా ఉంది. అలాంటి సమస్యను ముందే గుర్తించగలిగితే బాగుంటుంది కదా...’
నలుగురు తల్లులు కలిస్తే ఇలాంటి ఫిర్యాదులెన్నో విన్పిస్తుంటాయి. ఒకప్పుడంటే- ఇంట్లోనో బంధువుల్లోనో ఎప్పుడూ ఎవరో ఒకరు చిన్నపిల్లలు ఉండేవారు. ఆ పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడుతూ వారి ఎదుగుదలని గమనిస్తూ చాలా విషయాల్ని సహజంగా తెలుసుకునేవారు. క్రమంగా చిన్న కుటుంబాలు పెరగడం, ఆడా మగా అంతా చదువుల్లో పడిపోవడంతో ఈ గమనింపు తగ్గిపోయింది. దాంతో తాము తల్లిదండ్రులయ్యే వరకూ పిల్లల పెంపకం గురించి ఏమీ తెలియనివారే ఎక్కువగా ఉంటున్నారు. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా తరాల అంతరం, పిల్లల పెంపకంలోనూ, సమాజంలోనూ వచ్చిన ఆధునిక మార్పులూ వారి పాత్రను పరిమితం చేస్తున్నాయి. మరోపక్క ఇతర విషయాల్లాగే పిల్లల ఎదుగుదలనీ పక్కవాళ్లతో పోల్చి చూసుకుంటున్నారు
ఈ తరం తల్లిదండ్రులు. ఈ పరిస్థితులన్నీ కలిసి పేరెంటింగ్‌ని ఒక సవాలుగా మార్చేశాయి. సాధారణంగా కాన్పు తర్వాత ఆస్పత్రిలోనే పిల్లల వైద్యులు కూడా తల్లులకు సలహాలూ సూచనలూ ఇస్తారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్‌కి తీసుకెళ్లినప్పుడు కూడా పిల్లల బరువూ ఎత్తూ లాంటివన్నీ కొలిచి ఎదుగుదల సక్రమంగా ఉందీ లేనిదీ అంచనా వేస్తారు. అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా వైద్యుల్ని అడిగి తమకున్న సందేహాలను తీర్చుకోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో అటు వైద్యులూ బిజీగా ఉండి, ఇటు తల్లిదండ్రులూ పనుల ఒత్తిడిలో ఉంటే ఈ సందేహాల నివృత్తికి అవకాశం ఉండటం లేదు. అందుకే- పిల్లల ఎదుగుదలకు సంబంధించి అమ్మానాన్నల్లో ఇంత కలవరం. దాన్ని తగ్గించేందుకే- నిపుణులు చెబుతున్న ఈ సమాచారం.


పోలిక తగదు
పిల్లల ఎదుగుదల అనేది నిరంతరం జరిగే సంక్లిష్ట ప్రక్రియ. పుట్టగానే ఏడవడం దగ్గర్నుంచి వారి ప్రతిచర్యా అపురూపమే. అద్భుతమే. అలాగని పిల్లలందరూ కచ్చితంగా ఒకేలాగా ఎదగరు. అంటే తల నిలపడం, బోర్లపడడం, పాకడం, నడవడం లాంటివన్నీ సరిగ్గా ఫలానా వారంలోనో ఫలానా నెలలోనో చేయాలని రూలేం లేదు. ఉదాహరణకు బడికెళ్లే పిల్లల్ని తీసుకుంటే- ఒక తరగతిలో పిల్లలందరూ ఆర్నెల్లు అటూ ఇటూగా ఒకే వయసు వాళ్లై ఉంటారు కానీ వాళ్ల ఒడ్డూ పొడుగూ నేర్చుకునే సామర్థ్యాలూ వేర్వేరుగా ఉంటాయి. అయినా అందరి సామర్థ్యాలనూ కలిపి అంచనా వేసి ఆ తరగతి పిల్లలకు ఉండే సగటు ప్రతిభా పాటవాలను నిర్ణయిస్తారు కదా. అదే చిన్న పిల్లలకీ వర్తిస్తుంది. అందుకే పిల్లల్ని పక్కవాళ్లతో పోల్చి చూడకుండా, మామూలుగా
ఆ వయసుకి తగిన ఎదుగుదల ఉందా లేదా అన్నది గమనించుకుంటే చాలు.   సాధారణంగా ఏ వయసు పిల్లలు ఏయే పనులు చేయగలరో తెలుసుకుంటే- అప్పుడు అసాధారణ పరిస్థితి ఏదన్నా ఉన్నా, ఎదుగుదల లోపాలున్నా గుర్తించడం తేలికవుతుంది.


ఇవీ... మైలురాళ్లు!
సాధారణంగా పిల్లల ఎదుగుదలలో మైలురాళ్లు ఇలా ఉంటాయి. పుట్టినప్పటినుంచి ఆరువారాల్లోపు: పాపాయి వెల్లకిలా పడుకుంటుంది. తల ఒక పక్కకి తిప్పగలుగుతుంది. రోజుకు 20 గంటలు నిద్రపోతుంది. అకస్మాత్తుగా అయ్యే శబ్దాలకు ఉలిక్కి పడుతుంది. గుప్పిళ్లు మూసి ఉంటాయి. పాపాయి చేతిలో మన వేలు పెడితే గట్టిగా పట్టుకున్నట్లు గుప్పిట బిగిస్తుంది.

ఆరు నుంచి 12 వారాల్లోపు: తల నిలపడానికి ప్రయత్నిస్తుంది. ఎత్తుకున్న వారి ముఖంపై కానీ ఇతరత్రా వస్తువులపై కానీ దృష్టి నిలిపి చూడగలుగుతుంది. నవ్వుతుంది.
మూడు నెలలు నిండాక: వెల్లకిలా పడుకుని చేతుల్నీ కాళ్లనీ బాగా కదిలించగలుగుతుంది. నోటితో రకరకాల శబ్దాలు చేస్తుంది. తల్లిని గుర్తుపట్టి, ఆమె గొంతు వినగానే కేరింతలు కొడుతుంది. గుప్పిట మూసి ఉంచడం తగ్గిస్తుంది. ఎత్తుకున్నప్పుడు కొంచెంసేపు తల నిలపగలుగుతుంది. ఏదైనా వస్తువు చూపిస్తే అందుకోవటానికి చేయి చాపుతుంది. బొమ్మ పట్టుకుని ఆడుకుంటుంది. తన దగ్గర ఎవరూ లేకపోతే ఏడుస్తుంది.

ఆర్నెల్లకు: రెండు చేతుల మధ్యా సమన్వయం వస్తుంది. ఒక చేతిలో వస్తువును మరో చేతిలోకి మార్చుకుంటుంది. చుట్టుపక్కల శబ్దాలకు స్పందించి తల తిప్పి చూస్తుంది. కొత్త మనుషుల్నీ, దృశ్యాల్నీ కుతూహలంగా గమనిస్తుంది. మనం మాట్లాడిస్తే తనూ మాటలు చెబుతున్నట్లుగా శబ్దాలు చేస్తుంది. బోర్లపడి, పొట్ట మీద ముందుకు కదలడానికి ప్రయత్నిస్తుంది. సపోర్టు ఉంటే కాసేపు కూర్చోగలుగుతుంది. తన బరువుని కాళ్ల మీద మోపడం ఇప్పుడే మెల్లగా అలవాటవుతుంది. అమ్మానాన్నలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంది. వాళ్లు ఎత్తుకుని ముద్దాడుతుంటే సంతోషిస్తుంది.

తొమ్మిది నెలలు: ఏ సపోర్టూ అక్కర్లేకుండా కూర్చుని ఆడుకుంటుంది. చేతులూ మోకాళ్ల మీద పాకడం బాగా వచ్చేస్తుంది. పేరు పెట్టి పిలిస్తే చూసి నవ్వుతుంది. మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కొత్తవాళ్లు పలకరిస్తే ఏడుస్తుంది. కొంతమంది పిల్లలు చేయందిస్తే లేచి నిలబడడానికీ ప్రయత్నిస్తారు. కొన్ని బొమ్మల్ని ప్రత్యేకంగా ఇష్టపడడం మొదలెడతారు. ‘వద్దు’ అని చెబితే చేసే పని ఆపుతారు.

పన్నెండు నెలలు: అమ్మ, తాత లాంటి మాటలు పలుకుతుంది. లేచి నిలబడగలుగుతుంది. కుర్చీలూ బల్లలూ పట్టుకుని నడిచేస్తుంది. చప్పట్లు కొట్టడం, చేయి ఊపి టాటా చెప్పడం తెలుస్తుంది. చిన్న చిన్న మాటలు చెబితే అర్థం చేసుకుంటుంది. వస్తువుల్ని ఇవ్వడం తీసుకోవడం తెలుస్తుంది. తల అడ్డంగా ఊపడం ద్వారా తనకి ఇష్టం లేదని చెబుతుంది. తల్లి అన్న మాటని అలాగే పలకడానికి ప్రయత్నిస్తుంది.

పద్దెనిమిది నెలలు: స్వయంగా గ్లాసు పట్టుకుని పారబోసుకోకుండా పాలు తాగగలదు. ప్లేటులో పెట్టిస్తే తనంతట తను తీసుకుని తినగలుగుతుంది. ఏదీ పట్టుకోకుండా ఇంట్లో చకచకా నడిచేస్తుంది. చిన్న చిన్న మాటలు చెబుతుంది.
అయితే తల్లిదండ్రులంతా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం- ఇవన్నీ కూడా కొందరు పిల్లలకు రెండు మూడు వారాల నుంచీ రెండు మూడు నెలల వరకూ ముందూ వెనకా జరగొచ్చు. ఉదాహరణకు- కొందరు తొమ్మిదో నెల నుంచే నడవడానికి ప్రయత్నిస్తారు. తొలి పుట్టినరోజు నాటికల్లా నడిచే అలాంటి పిల్లల గురించే ‘ఏడాదికి ఎదురు నడిచార’ని చెప్పేవారు పెద్దలు. చాలామంది 12-14 నెలల మధ్య నడుస్తారు. మిగతా పనుల్లోనూ ఇలాంటి తేడా ఉండవచ్చు.

రెండేళ్లు: కదలికల్లో నైపుణ్యం పెరుగుతుంది. అప్పటివరకూ కాస్త తప్పటడుగులు వేసినవారు కూడా ఇప్పుడు పాదం కాస్త స్థిరంగా వేసి నడవగలుగుతారు. రెయిలింగ్‌ పట్టుకుని నెమ్మదిగా మెట్లు ఎక్కుతారు. పార్కులో జారుడుబల్ల ఎక్కి ఆడుకుంటారు. పరుగులు తీస్తారు. కొన్ని రంగులు గుర్తుపట్టగలరు. దుస్తులు స్వయంగా వేసుకోవడానికీ విప్పడానికీ ప్రయత్నిస్తారు. బొమ్మల పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తారు. తనకేం కావాలో చెప్పగలుగుతారు. ఇతరులు మాట్లాడిన మాటల్ని విని అర్థం కాకపోయినా వాటిని ఉపయోగిస్తారు. శరీరంలో భాగాలను గుర్తుపడతారు. సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు. ఎత్తులో ఉన్న వస్తువుని అందుకోవడానికి స్టూలు తెచ్చుకుని ఎక్కడం, డబ్బాల మూతలు తీయగలగడం, పెన్నో పెన్సిలో దొరికితే గీతలు గీయడం... చేస్తుంటారు. ఏ పని ఏ చేత్తో చేయాలన్నది తెలియకపోయినా చురుగ్గా రెండు చేతుల్నీ ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు. ఏ పనైనా ఎలా చేయాలో మెల్లగా నేర్పిస్తే నేర్చుకుంటారు. రెండు మూడు మాటలతో చిన్న చిన్న వాక్యాలు సొంతంగా తయారుచేసుకుని చెప్పగలుగుతారు. అన్నీ మనకి చెప్పగల భాష వారికి రాదు కానీ మనం వివరించి చెబితే చాలా విషయాల్ని అర్థం చేసుకుంటారు.  

మూడు నుంచి ఐదేళ్లు: నీ పేరేంటి, అమ్మ పేరేంటి... లాంటి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు. బంతిని బలంగా, గురిచూసి విసరగలరు. మూడు చక్రాల సైకిల్‌ని తొక్కగలుగుతారు. ఈ గ్లాసు అక్కడ పెట్టిరా, రిమోట్‌ తీసుకురా... లాంటి చిన్న చిన్న పనులు చెబితే చేస్తారు. ఆహారం విషయంలో, దుస్తుల విషయంలో ఇష్టాయిష్టాలను ప్రకటిస్తారు. చుట్టుపక్కల పిల్లలతో స్నేహం చేస్తారు. మనుషుల్ని గుర్తుపట్టి ఫలానా వాళ్లు అని చెప్పగలుగుతారు. అక్షరాలూ అంకెలూ జంతువులూ పక్షుల బొమ్మలూ గుర్తుపడతారు. స్కూల్లో జరిగిన విషయాలను చెప్పగలరు. చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకోగలుగుతారు. పెద్దవాళ్లలాగా ఒక్కో మెట్టు మీద ఒక్కో కాలు పెడుతూ మెట్లు దిగగలుగుతారు. పెద్దల మాటనీ ప్రవర్తననీ అనుకరించడం ఎక్కువగా ఉంటుంది.

తొలి రెండేళ్లూ కీలకం
పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగానూ మానసికంగానూ తొలి రెండేళ్ల వయసూ చాలా కీలకం. పిల్లలు పుట్టే నాటికి మెదడు రూపు దిద్దుకుంటుంది కానీ దానిలోని కణాలన్నిటినీ కలుపుతూ నాడీవ్యవస్థ ఏర్పడడానికి సమయం పడుతుంది. దాదాపు 90 శాతం మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతుంది. కాబట్టి మేధోపరంగా, ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయమైపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడుకన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుందట. పెరిగే పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల మెదడు అంత ఆరోగ్యకరంగా ఎదుగుతుంది.
ఆటిజం లాంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా 18- 24 నెలల మధ్య గుర్తించవచ్చు. అలా గుర్తించగలిగితే త్వరగా సరిదిద్దడానికి అవకాశం ఎక్కువ. పైన చెప్పిన మైలు రాళ్లను దృష్టిలో పెట్టుకుని పిల్లలకు ఏ వయసులో ఏ మార్పు కన్పించిందో రాసిపెట్టుకుంటూ ఉంటే సాధారణంగా ఉండాల్సిన దానికన్నా ఏమన్నా భిన్నంగా ఉంటే తెలిసిపోతుంది.
కంటి చూపు, వినికిడి, మాట లాంటివన్నీ సరిగ్గా ఉన్నదీ లేనిదీ కూడా తల్లిదండ్రులకు తెలుస్తుంది.
సాధారణంగా పిల్లల శారీరక ఆరోగ్యమూ ఆహారాల విషయంలో తీసుకున్నంత శ్రద్ధ- వారు ఏం నేర్చుకుంటున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు... అన్న విషయాల మీద పెట్టరు తల్లిదండ్రులు. కానీ చిట్టి మనసుల మీద ప్రభావం
చూపే అంశాలు చాలానే ఉంటాయి. ఆ మనసు మీద పడే రకరకాల అనుభూతుల ముద్రలు వారిని ‘హ్యాపీ చైల్డ్‌’గా పెరిగేలా చేయాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


వెయ్యి రోజుల సవాలు!
పిల్లల సంపూర్ణ ఎదుగుదలే లక్ష్యంగా మొదలుపెట్టిన కార్యక్రమం... ‘ఫస్ట్‌ థౌజండ్‌ డేస్‌’. పిల్లల ఎదుగుదల తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది కాబట్టి తల్లిదండ్రులు బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమైన నాటి నుంచి బిడ్డ ప్రాణం పోసుకుని, పుట్టి రెండు పుట్టినరోజులు పూర్తి చేసుకునేవరకూ- దాదాపు మూడేళ్ల కాలాన్ని ఇలా ‘తొలి వెయ్యి రోజులు’ అంటున్నారు.
ఆ సమయంలో...

* తల్లి కడుపులో ఉన్నప్పుడూ, పుట్టాకా బిడ్డకు అన్నిరకాల పోషకాలతో కూడిన ఆహారం అందాలి.
* కుటుంబ సభ్యులంతా ప్రేమానురాగాలతో వ్యవహరించాలి.
* బిడ్డకు సురక్షితమైన, భద్రమైన పరిసరాలనివ్వాలి.
* స్వేచ్ఛగా ఆడుకునే పరిస్థితి ఉండాలి.
* ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి.
పిల్లల మెదడూ శరీరమూ సంపూర్ణ ఆరోగ్యంతో ఎదగడానికి ఈ ఐదు అంశాలూ కీలకం. వీటిమీదే భవిష్యత్తులో బిడ్డ వ్యక్తిత్వం కూడా ఆధారపడివుంటుంది. అందుకని పిల్లల్ని కనాలి- అనుకున్నప్పటి నుంచీ తల్లి వైద్యుల సలహాతో పోషకాహారం తీసుకోవాలి. వ్యాధులూ ఇన్‌ఫెక్షన్ల నుంచి తనను తాను కాపాడుకోవాలి. అవసరమైన మందులూ వ్యాక్సిన్లూ తీసుకోవాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఎలాంటి మానసిక ఒత్తిళ్లకూ లోనవకుండా సంతోషంగా గడపాలి. బిడ్డ పుట్టాక ఇంట్లో ఎలాంటి అశాంతీ ఆందోళనలూ ఉండకూడదు. బిడ్డను తల్లిదండ్రులిద్దరూ ప్రేమా ఆప్యాయతలతో పెంచుతూ మేమున్నామన్న భద్రత కల్పించాలి. ఇలాంటి చక్కని కుటుంబంలో పెరిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఎంచుకున్న వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. కుటుంబానికీ సమాజానికీ కూడా గర్వకారణంగా నిలుస్తారు.
డెలివరీ అయిందనగానే- ‘పాపా బాబా... ఎవరిలా ఉన్నారూ’ అని అడగడం సహజం. నిజానికి అందమూ, పోలికలూ, లైంగికతా... ఏవీ మన చేతుల్లో ఉండవు. ఉన్నదల్లా శిశువుని ఆరోగ్యంగా ఆనందంగా పెంచడం ఒక్కటే.
ఆ పనినే చక్కగా చేయగలిగితే అంతకన్నా ఏం కావాలి..?


తేడా తెలుసుకోవచ్చు..!

పిల్లల ఎదుగుదలని నిశితంగా గమనిస్తూ ఉంటే ఏవైనా తేడాలు ఉన్నప్పుడు త్వరగా తెలుసుకోవచ్చు. అప్పుడు సవరించే చికిత్స తేలికవుతుంది. ఉదాహరణకు ఆటిజం విషయమే చూస్తే- మన దేశంలో పదేళ్లలోపు పిల్లల్లో నూటికొకరు చొప్పున ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే...
సాంఘికపరంగా: నేరుగా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేరు. దేనిమీదా దృష్టి నిలపలేరు. ముఖంలో ఎలాంటి హావభావాలనూ వ్యక్తంచేయలేరు. తల్లిదండ్రులు నవ్వినా, కోపంగా చూసినా స్పందించరు. అమ్మానాన్నల పట్ల ప్రేమని వ్యక్తం చేయలేరు. చెల్లెలో తమ్ముడో పడిపోయి దెబ్బ తగిలించుకుంటే సానుభూతి చూపలేరు. కొత్తవారితో స్నేహం చేయలేరు. నచ్చని రుచి, వాసన, శబ్దాలకు విపరీతంగా చిరాకు పడిపోతారు.

కమ్యూనికేషన్‌పరంగా: బొమ్మల్ని కానీ తినుబండారాల్ని కానీ తోబుట్టువులతో పంచుకోరు. విన్న మాటల్నే తిరిగి అంటారు తప్ప సొంతంగా మాట్లాడలేరు. పాటలూ పద్యాలూ లాంటివి తరచూ వినిపిస్తే మాత్రం చక్కగా కంఠతా పడతారు. పేరు పెట్టి పిలిస్తే పలకరు. కాలింగ్‌ బెల్‌ లాంటి చప్పుళ్లకు స్పందించరు. చాలావరకూ సంభాషణకు ఇష్టపడరు. ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పరు. ఒకవేళ చెప్పినా- నువ్వు, నేను లాంటి పదాల్ని తారుమారు చేసి మాట్లాడతారు. సాధారణంగా పిల్లలు బొమ్మలనే మనుషులుగా భావిస్తూ ఆడుకుంటారు. ఈ సమస్య ఉన్నవాళ్లు అలాంటి ఆటలు ఆడరు. కొన్ని సందర్భాల్లో అప్పటివరకూ నేర్చుకున్న విషయాల్ని కూడా మర్చిపోతారు(రిగ్రెషన్‌). అలాంటి సందర్భాల్ని గుర్తించినా వైద్య సలహా తీసుకోవాలి.

ప్రవర్తనపరంగా: మామూలుగా నడవకుండా అదే పనిగా బొటనవేలి మీదో, చేతులు ఊపుతూనో, గుండ్రంగా తిరుగుతూనో నడుస్తుంటారు. రొటీన్‌లో ఏ చిన్న మార్పు వచ్చినా తట్టుకోలేరు. బొమ్మని మొత్తంగా కాకుండా అందులో ఒక భాగాన్ని మాత్రమే తీసుకుని ఆడుకుంటారు. భయపడరు, దెబ్బ తగిలినా నొప్పిగా ఉందని ఏడవరు. వాసన, శబ్దం, వెలుతురు, చలి లాంటి వాటికి అయితే అతిగా స్పందిస్తారు, లేకపోతే అసలు స్పందించరు. ఏదైనా వస్తువుని మామూలుగా కాకుండా కంటి కొసల నుంచీనో, కంటికి చాలా దగ్గరగా పట్టుకునో, ఒక కన్ను మూసుకునో చూస్తుంటారు.
క్లుప్తంగా చెప్పాలంటే... ఏడాది వయసులో పేరు పెట్టి పిలిస్తే స్పందించకపోయినా, ఏడాదిన్నర వయసులో సొంతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నా, రెండేళ్ల వయసులో తల్లి కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతున్నా- ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవడం మంచిది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..