మురిపించే మార్మికత

కవిత్వ సదృశ వర్ణనలతో అనూహ్య సంఘటనలతో మార్మిక కథన శైలితో మెరిసిన విభిన్న రచనలివి. మొత్తం తొమ్మిది కథల్లో దేనికదే ప్రత్యేకం.

Updated : 16 Mar 2024 23:49 IST

కవిత్వ సదృశ వర్ణనలతో అనూహ్య సంఘటనలతో మార్మిక కథన శైలితో మెరిసిన విభిన్న రచనలివి. మొత్తం తొమ్మిది కథల్లో దేనికదే ప్రత్యేకం. తర్కాన్నీ, సందేహాలనూ వదిలిపెట్టి బాల్యపు పసిమనసుతో చందమామను అడిగిన ప్రశ్నలకు కాగితమ్మీద చంద్రకిరణాలు రాసిన జవాబులు వెన్నెల వెలుగులో కనపడతాయి ఓ కథలో. పక్షిలా గాల్లో ఎగరాలనే కోరిక ఉన్న వ్యక్తికి మనిషిలా నేలమీద బరువుగా నడవాలనుకునే పక్షి కళ్ల వ్యక్తి తారసపడటం.. పౌర్ణమి రాత్రి వాళ్లిద్దరూ లోయ అంచున రైలుపట్టాల వెంట నడుస్తూ, సుదీర్ఘమైన çËన్నెల్లో వేగంగా పరుగు పెట్టటం.. చివరికి ఏమైందన్నది ‘లోయ చివరి రహస్యం’. జీవిత సత్యాన్ని తెలిపే పదార్థం ఏమిటో తెలుసుకోవాలని ఓ వ్యక్తి సాగించిన అన్వేషణ అనూహ్యంగా సొంత ఊళ్లోనే ఫలించడం ‘చిట్టచివరి సున్నా’ కథ. ప్రకృతి సౌందర్యం, మృత్యు స్పర్శ, జీవన లాలస, తాత్విక అన్వేషణలు అంతర్లీనమై సాగే ఈ రచనలు పాఠకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

 సీహెచ్‌.వేణు 

లోయ చివరి రహస్యం 

రచన: భగవంతం
పేజీలు: 118; వెల: రూ.150/-
ప్రతులకు: ఫోన్‌- 9399328997


సమకాలీన సంక్షోభాలు

మకాలీన పరిణామాలకు స్పందిస్తూ రాసిన కథలివి. తెలుగు సమాజంలోని ముస్లింల జీవితాల సంక్లిష్టతను చూపిస్తూనే పౌరసత్వ నిరూపణ చట్టం మూలంగా వారిలో ఏర్పడిన ఆందోళనకు ‘కాయితాల రుజువు’ అద్దం పడుతుంది. అమరావతి నిర్మాణానికి జరిపిన ల్యాండ్‌ పూలింగ్‌ వెలుగునీడలు ‘ఫౌలింగ్‌’. సమస్యల పరిష్కారం కోసం విప్లవపార్టీ ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరవటానికి ఆదివాసీలు చీమలదండులా దూరప్రాంతాల నుంచి తరలిరావటం, పోలీసుల నిర్బంధం.. వీటన్నిటినీ ‘ప్రవాహం తిరోగమించదు’ కథ ఆసక్తికరంగా చెపుతుంది. మహాభారతంలోని ఓ విశిష్ట ఘట్టానికి సృజనాత్మక రూపం ‘నియోగం’. కథలన్నీ జీవితాల్లోని ఆటుపోట్లను ప్రతిభావంతంగా చూపెడతాయి.     

 నీహారిక

కాయితాల రుజువు (కథలు)

రచన: నల్లూరి రుక్మిణి
పేజీలు: 199; వెల: రూ.170/-
ప్రతులకు: ఫోన్‌- 9989133401  


సిరివెన్నెల జీవితం

అద్భుతమైన పాటలతో అలరించిన సీతారామశాస్త్రి జీవిత చరిత్ర ఇది. స్వయంకృషి, రుద్రవీణ, స్వర్ణకమలం, శృతిలయలు, శివ, గాయం... ఇలా ఆయన పేరు తలచుకోగానే గుర్తొచ్చే పాటలెన్నో. ఆయన ఐదు నిమిషాల్లో రాసిన పాటలూ ఉన్నాయి, ఐదు నెలలు కష్టపడి రాసిన పాటలూ ఉన్నాయి. అసలు అనుకోకుండా సినిమా కవి అయిన ఆయన అక్కడ నిలదొక్కుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, పాటకు ప్రాణం పోసి ప్రేక్షకుల గుండెల్లో గుడికట్టుకున్న ఆయన ఒక పాట రాయడానికి ముందు ఎన్ని విషయాలు తెలుసుకునేవారు, ఆ పాటల వెనకున్న వ్యక్తులెవరు, సంఘటనలెలాంటివి... లాంటి విషయాలతో పాటు- ఆయన పాటలనే సందర్భోచితంగా ఉదహరిస్తూ ఆయన జీవితాన్ని వివరించిన పుస్తకమిది.

 పద్మ

పాట షికారుకొచ్చింది

రచన: ఆకెళ్ల రాఘవేంద్ర
పేజీలు: 274; వెల: రూ.250/-
ప్రతులకు: ఫోన్‌- 8897826108  


విలక్షణ కథలు

రవయ్యవ దశాబ్దపు మరాఠీ రచయిత హమీద్‌ దల్వాయీ సోషలిస్టు, లౌకికవాది. పీడితుల పక్షం వహించి పలు రచనలు చేశారు. చదువు పూర్తిచేసుకుని ఇంటికొచ్చిన కరీమ్‌కి ఇల్లు చీకటిగా కనిపిస్తుంది. ఆ ఇంట్లో అతని అక్కాచెల్లెళ్లూ, తండ్రీ క్షయతో చనిపోతారు. ‘చీకటే మన సమస్యలన్నిటికీ కారణం. మనందరం చచ్చిపోయేదాకా చూస్తూ ఉండాలా’ అని తల్లికి ఎదురు తిరిగే కరీమ్‌కి పై ‘కప్పు’ పీకి పడేయాలనిపిస్తుంది. సమాధులు తవ్వి శవాలకు చుట్టిన కొత్త బట్టల్ని సేకరించి మార్వాడీకి అమ్ముకునే రసూల్‌ కథ ‘కఫన్‌ చోర్‌’. మనుషుల్లో లోపించిన కార్యాచరణ గురించి రచయిత ఆవేదనా జాలీ పలు కథల్లో కనిపిస్తాయి.

 శ్రీ

హమీద్‌ దల్వాయీ కథలు

అనువాదం: ఓల్గా
పేజీలు: 197; వెల: రూ.260/-
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..