ఒత్తిడికి ఇలా చెక్‌!

ఒత్తిడి... ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సమస్యే. అయితే ఒక్కొక్కరూ ఒక్కోలా దాన్నుంచి బయటపడుతుంటారు.

Published : 21 Jan 2023 23:26 IST

ఒత్తిడికి ఇలా చెక్‌!

ఒత్తిడి... ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సమస్యే. అయితే ఒక్కొక్కరూ ఒక్కోలా దాన్నుంచి బయటపడుతుంటారు. మరి భిన్న రంగాల్లో సాటిలేని మేటి వ్యక్తులుగా ఎదిగిన కొందరు ప్రముఖులు ఒత్తిడిని ఎలా దూరం చేసుకుంటారో వారి మాటల్లోనే...


నాన్న కవితలతో...
- అమితాబ్‌ బచ్చన్‌

త్తిడిగా అనిపిస్తే మా పెంపుడు కుక్కతో గడుపుతా. నాన్న హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ రాసిన కవితలు చదువుతా. అప్పుడపుడూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఆ సమయంలో అలా కళ్లు మూసుకుని నాన్న కవితా పంక్తులను గుర్తు చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. జీవితంలో కొన్ని రోజులు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటాయి. మరికొన్ని చప్పగా సాగిపోతాయి. కొన్నిసార్లు గెలుస్తాం... ఇంకొన్నిసార్లు ఓడిపోతాం. వాటి గురించి ఆలోచిస్తూ డిప్రెషన్‌లోకి వెళ్లకుండా.. ఏది ఎలా జరిగినా ముందడుగు వేస్తూనే ఉండాలి. అలాగని ఎప్పుడూ ఒకేలా ఉండటం కూడా సాధ్యంకాదు. ఒకవేళ ఎవరైనా అలా ఉండగలుగుతున్నారంటే- సమస్యలతో కుస్తీ పట్టగలిగేంత శక్తి ఆ వ్యక్తిలో ఉన్నట్టే.


ప్రశాంతతకు యోగా
- నరేంద్ర మోదీ

రుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి మన జీవనశైలిలో భాగమైంది. దాన్నుంచి బయటపడటానికి సమయం దొరికినప్పుడల్లా యోగనిద్రను సాధన చేస్తా.అది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనసును చల్లబరిచి... ఒత్తిడి, ఉద్వేగాలను తగ్గిస్తుంది. నిజంగానే కొన్ని యోగాసనాలు నాకు చాలా మేలు చేశాయి. నేను ఎవరికైనా చెప్పేది ఒకటే... మైండ్‌ అనేది ప్రెజర్‌ కుక్కర్‌ లాంటిది. బాధపెట్టే ఆలోచనల్నీ, భావాల్నీ బయటకు చెప్పకుండా అణచిపెట్టేస్తే ఆ ప్రెజర్‌కి కుక్కర్‌ పేలిపోతుంది. అలాంటప్పుడు ఓ పచ్చని చెట్టు కింద కూర్చుని సమస్యేంటో రాసుకోవాలి. కాసేపటికి తేడా మీకే తెలుస్తుంది.


కథలు చదువుతా
- ఆనంద్‌ మహీంద్రా

మానసిక ఒత్తిడికి ఎవరూ అతీతులు కారు. దాన్నుంచి బయటపడటానికి నవలలూ, పిల్లల పుస్తకాలూ చదువుతా. ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా ఉండే వీడియోలు చూస్తా. చార్లీ మాకేసీ పుస్తకం ‘ది బాయ్‌, ది మోల్‌, ది ఫాక్స్‌ అండ్‌ ది హార్స్‌’ నాకు చాలా ఉపయోగపడింది. ఏదైనా ఇబ్బందిలో చిక్కుకోగానే ఊరికే కంగారుపడే బదులు ఏదో ఒక ప్రయత్నమైతే చేయాలి. అప్పుడే గండం గడిచే దారేదో తెలుస్తుంది. ఈ విషయం ఆ పుస్తకం నుంచే నేర్చుకున్నా. అలానే మన లక్ష్యం చాలా దూరంలో ఉందని- ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తే ఒత్తిడిపెరిగిపోతుంది. గమ్యం మర్చిపోయి చేయాల్సిన పనులను చేసుకుంటూ వెళ్తే చాలు. టెన్షన్‌ లేకుండా అదే మనల్ని లక్ష్యం దగ్గరికి చేరుస్తుంది.


కుటుంబంతోనే హాయిగా...
- రిషి సునాక్‌

రాజకీయాలు చాలా సవాళ్లతో కూడుకున్నవి. నిద్రపోవడానికి నేనెప్పుడూ సమయం వెతుక్కుంటూ ఉంటా. అయినా సరే నన్ను శాంతపరిచేది ఒక్క నా కుటుంబం మాత్రమే. ఎందుకంటే వాళ్లే నా బలం. ఎన్ని చిరాకులున్నా... ఇంట్లో వాళ్లతో కలిసి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌నో రాత్రిపూట డిన్నరో తింటే చాలు మనసు తేలికపడిపోతుంది. ఒత్తిడి మరీ ఎక్కువ అనిపిస్తే మాత్రం నాకు ఇష్టమైన సినిమాలు చూస్తా. మా పిల్లలతో కలిసి ఎంతగానో అభిమానించే క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ఆడతా. వాటివల్ల మనసూ, శరీరం రిలాక్స్‌ అయిపోతాయి.


పాపతో ఆడుకుంటా
- విరాట్‌ కోహ్లీ

టగాళ్లకు నిరంతర ఒత్తిడి ఉంటుంది. అది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కూడా. ఆ కఠిన పరిస్థితులను నేనూ అనుభవించా. నా చుట్టూ ఇష్టమైనవాళ్లు ఉన్నా... ఒంటరిగా ఫీలయ్యేవాణ్ని. అటువంటి సమయంలో నాతో నేను గడుపుతా. నాకిష్టమైన పనులే చేస్తుంటా. పాటలంటే పిచ్చి. పంజాబీ, హిందీ, పాటల కలెక్షన్‌ ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది. మూడ్‌ బాగోకపోతే అవే వింటా. ఇంట్లో ఉంటే మాత్రం మా పాప వామికతో ఆడుకుంటా. విదేశాల్లో ఉంటే  వీడియో కాల్‌లో తనతో మాట కలుపుతా. అంతే, ఒత్తిడి ఇట్టే మాయమైపోతుంది.


ధ్యానమే మార్గం
- సత్య నాదెళ్ల

ప్రతిరోజూ ఉదయం లేవగానే ధ్యానం చేయడం అలవాటు. అలానే మౌనంగా ఉండి కాసేపు నా గురించి ఆలోచించుకుంటా. అలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. ఆఫీసులో కూడా ఒత్తిడిగా అనిపిస్తే ఓ 90 సెకన్లు ధ్యానం చేస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంటా. ఒత్తిడి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టే మా ఉద్యోగులకు మానసిక నిపుణుల ఆధ్వర్యంలో మెడిటేషన్‌ క్లాసులు ఏర్పాటు చేస్తుంటాం అప్పుడప్పుడూ. అలానే ఏదైనా కొత్త విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటా. ప్రతి రోజూ మనల్ని మనం సరికొత్తగా ఆవిష్కరించుకోవడం ముఖ్యం. అలా చేయడం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..