చిన్నారులకు... రక్ష!

పిల్లలంటే అందరికీ అపురూపమే, అందుకే పసి వయసు నుంచి కాస్త పెద్ద పిల్లలయ్యే వరకూ వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కానీ అనుక్షణమూ అంటిపెట్టుకుని ఉండలేం కదా.

Published : 21 Apr 2024 00:23 IST

పిల్లలంటే అందరికీ అపురూపమే, అందుకే పసి వయసు నుంచి కాస్త పెద్ద పిల్లలయ్యే వరకూ వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కానీ అనుక్షణమూ అంటిపెట్టుకుని ఉండలేం కదా. ఉయ్యాల్లోని పాపాయి బోసినవ్వుల్ని చూసి మురిసిపోయినా, మనం ఒక్క క్షణం పక్కకెళితే ఎక్కడ కింద పడిపోతారోనని కంగారు పడతాం. బుడిబుడి అడుగులు వేస్తూ దేంట్లో చేయి పెడతారోనని భయపడిపోతాం. కాస్త పెద్దవాళ్లయితే ఆడుకుంటూ ఎక్కడ దెబ్బలు తగిలించుకుని వస్తారో అని ఆందోళన చెందుతాం, చీకటిపడే సమయానికి ఇంకా ఇంటికి రాలేదే అని బెంబేలు పడతాం. ఇలా పిల్లలు ఎదిగేక్రమంలో పెద్దవాళ్లకు ఎన్నెన్ని చింతలో. వాటన్నింటినీ పోగొట్టడానికే వచ్చాయి కొన్ని గ్యాడ్జెట్లూ, కిడ్స్‌ సేఫ్టీ ప్రొటెక్షన్‌ వస్తువులూ...


ఎక్కడున్నా కనిపెట్టేలా!

సెలవుల్లో పిల్లలకు ఏదో ఒకటి నేర్పించాలనుకుంటూ చాలామంది అమ్మానాన్నలు సమ్మర్‌ క్యాంపుల్లోనో, ప్రత్యేక తరగతుల్లోనో చేర్పిస్తారు. అంతవరకూ బాగానే ఉంది కానీ వాళ్లను ఆ కాస్త దూరం పంపడానికే కొంచెం ఆలోచిస్తుంటారు. ఆ ఇబ్బంది లేకుండా నిశ్చింతగా ఉండాలంటే వాళ్లు ఎక్కడికి వెళ్లినా మనకు తెలిసేలా చేసే జీపీఎస్‌ ట్రాకర్‌ గ్యాడ్జెట్లను ప్రయత్నించొచ్చు. ‘మ్యాప్‌ మై వరల్డ్‌ స్మార్ట్‌ బ్యాగ్‌, స్మార్ట్‌ షూ, స్మార్ట్‌ వాచీ, ఎయిర్‌ట్యాగ్‌ రిస్ట్‌ బ్యాండ్‌’ అంటూ జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌)తో ఉండే రకరకాల వస్తువులున్నాయి. ఇంకా ‘స్మార్ట్‌ కీ ఫైండర్‌ లొకేటర్‌ జీపీఎస్‌ ట్రాకింగ్‌ డివైజ్‌’ పేర్లతో కీ చెెయిన్లూ వచ్చాయి. పిల్లల దగ్గరున్న బ్యాగుకో, వేసుకున్న దుస్తులకో లేదంటే మెడలో చిన్న లాకెట్‌లానో వీటిని వాడుకోవచ్చు. వీటికి సంబంధించిన ఆప్‌ని పెద్దవాళ్ల ఫోన్‌లో వేసుకుని ఎక్కడున్నా పిల్లల జాడను చూడొచ్చు. అంతేకాదు, అత్యవసరమైతే పిల్లలు- వాళ్ల దగ్గరున్న గ్యాడ్జెట్‌ మీది బటన్‌ నొక్కితే వెంటనే ఆ సమాచారం పెద్దవాళ్లకు వెళ్లిపోతుంది. అనుకోకుండా ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నా పెద్ద శబ్దంతో చుట్టూ ఉన్న వాళ్లకు వినిపించేలా మోగే అలారంతోనూ ఉంటాయీ కీ చెెయిన్లు. ఈ సేఫ్టీ గ్యాడ్జెట్లతో చిన్నారులు ఒంటరిగా ఏ దుకాణానికో, స్నేహితుల్ని కలవడానికో బయటకు వెళ్లినా బెంగపడక్కర్లేదు.


ఫోనూ పిల్లలూ దూరం దూరం!

తరం పిల్లల్ని ఫోన్ల నుంచి దూరంగా ఉంచడమన్నది కుదరని పని. పెద్దవాళ్లు ఎంత చెప్పినా, వద్దని వారించినా... ఆడుకోవడానికీ, నేర్చుకోవడానికీ అంటూ ఏదో ఒక కారణం చెబుతూ చిన్నారులు ఫోన్లూ, ట్యాబులూ పట్టుకుని కూర్చుంటారు. తీక్షణంగా స్క్రీన్‌ చూడటం వల్ల పిల్లల కళ్లకు ఇబ్బందే. తెర నుంచి వచ్చే కాంతి- కంటి సమస్యల్ని పెంచుతుంది.
ఆ సమస్యలకు చెక్‌ పెడుతూ మార్కెట్లో కొత్తగా ‘మొబైల్‌ ఐ ప్రొటెక్టర్‌’ గ్యాడ్జెట్లు వచ్చాయి. మైక్రో సెన్సర్లతో ఉండే ఈ డివైజ్‌ స్క్రీన్‌ డిస్టెన్స్‌ రిమైండర్‌గా పనిచేస్తుంది. దీన్ని ఫోన్‌కి పెట్టామంటే... చిన్నారులు ఫోన్‌కు తగినంత దూరం లేకపోతే అలారం వస్తుంది. ఏఐతో పనిచేసే ఈ గ్యాడ్జెట్‌- పిల్లల స్క్రీన్‌ దూరాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ కంటికి రక్షణని ఇస్తుంది. ఎక్కువసేపు తెర ముందుండే పిల్లలకు ఇది బాగా అవసరమవుతుంది!


ఫ్యాన్లూ ప్లగ్‌లకీ కవర్లూ!

ప్పుడప్పుడే నడుస్తున్న పిల్లల్ని పట్టడం మామూలు విషయం కాదు. ప్రతీ వస్తువూ కొత్తగా, అన్నీ వింతగా అనిపిస్తూ బుజ్జాయిల్ని తెగ ఆకట్టుకుంటాయి. సోఫాలూ, మంచాలపైన కాస్త అందేలా ఉండే స్విచ్‌ బోర్డులు, గిర్రున తిరిగే టేబుల్‌ ఫ్యాన్ల దగ్గరకూ వెళ్లిపోతుంటారు. ప్రమాదమని తెలియదు కాబట్టి వాటిల్లో చేతులు పెట్టడం లాంటివి చేస్తుంటారు. ఎంతసేపని మనం కనిపెట్టుకుని ఉంటాం. అందుకే మనం వేరే పనులు చేసుకుంటున్నా ‘పిల్లలు ఏం చేస్తున్నారు’ అన్న భయాలు ఉండకూడదనుకుంటే రక్షణగా కొన్ని వస్తువుల్ని వాడుకోవచ్చు. ‘ఫ్యాన్‌ సేఫ్టీ మెష్‌, ఎలక్ట్రికల్‌ ప్రొటెక్టర్‌ సేఫ్టీ ప్లగ్‌ కవర్‌’ పేర్లతో దొరుకుతున్నాయివి. ముచ్చటైన బొమ్మలతో వచ్చే ఈ నెట్‌ కవర్లను టేబుల్‌ ఫ్యాన్లకూ, క్లిప్పుల్లాంటి బోర్డు కవర్లను ప్లగ్‌లకూ సులువుగా పెట్టేయొచ్చు. మామూలుగా ఉపయోగపడుతూనే పిల్లలకు రక్షణనీ ఇస్తాయివి. ఇంకా చిన్నారులు ఫోన్‌ ఛార్జర్‌, ఎలక్ట్రిక్‌ వైర్లలాంటివి నోట్లో పెట్టుకున్నా ఏమీకాకుండా వైర్‌ ప్రొటెక్టర్లూ ఉన్నాయి!      


ఎక్కడికీ వెళ్లలేరు!

ప్రయాణాల్లో ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఏదైనా బ్యాగు తీసుకుంటూనో, మరేదైనా పని చేస్తూనో ఒక్క క్షణం పిల్లల చేయి వదిలితే చాలు... చటుక్కున ముందుకు వెళ్లిపోతారు. జనాలూ, వాహనాల మధ్య ఎటు వెళ్లిపోతారోనని కంగారొచ్చేస్తుంది. అలాంటప్పుడు ‘ఛైల్డ్‌ కిడ్‌ వాకింగ్‌ అసిస్టెంట్‌ స్ట్రాప్‌ బెల్ట్‌, హ్యాండ్‌ బెల్ట్‌’ల్ని వాడొచ్చు. పిల్లల వీపూ లేదా చేయికీ మన చేయికీ కలిపి దీన్ని పెట్టుకున్నామంటే పిల్లలు గబగబా పరుగులు తీయకుండా మన దగ్గరే ఉంటారు. విహారాల్లో, రద్దీ ఉన్న ప్రదేశాల్లో బాగా ఉపయోగపడతాయి. ఇంకా బైక్‌ మీద ఎక్కడికైనా పిల్లల్ని తీసుకుని వెళ్లినప్పుడు మామూలుగా కూర్చోపెట్టుకునే బదులు ‘సేఫ్టీ వెహికిల్‌ బెల్ట్‌’ పెట్టుకోవచ్చు. పిల్లలు నిద్రపోయినా, ఎంతలా కదిలినా పడిపోతారన్న భయమే ఉండదు మరి.


ఆటల్లో దెబ్బ తగలకుండా!

మయం దొరికితే చాలు... కొందరు పిల్లలు క్రికెట్‌, ఫుట్‌బాల్‌, స్కేటింగ్‌ అంటూ రకరకాల ఆటలకు బయలుదేరుతారు. ఆడుకోవడం మంచిదే కానీ మైదానాల్లో పరుగులు తీసి దెబ్బలూ తగిలించుకుంటారు. ఆట మజా ఉంటూనే, గాయమూ కాకూడదంటే మాత్రం చిన్నారుల దగ్గర కచ్చితంగా ‘సేఫ్టీ ప్రొటెక్షన్‌’ ఉండాల్సిందే. మోచేయీ, మోకాలుకీ రక్షణగా ‘నీ ప్యాడ్‌, ఎల్బో ప్యాడ్‌లతో ఉండే ప్రొటెక్టివ్‌ గార్డ్స్‌’ ఆన్‌లైన్లో దొరుకుతున్నాయి. పిల్లల వయసును బట్టి రకరకాల సైజుల్లో, నచ్చిన రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. సులువుగా వేసుకునేలా ఉండే వీటితో పాటు రోజూ సాధన చేసేవారి కోసం ప్యాడ్‌లతో వచ్చే చొక్కాలూ, నిక్కర్లూ వచ్చాయండోయ్‌. ఆటల కోసమే కాదు, కొత్తగా సైకిల్‌లాంటివి నేర్చుకోవాలనుకునేవాళ్లూ ఈ సేఫ్టీ దుస్తుల్ని ధరించొచ్చు.


ఇవేకాదు... ఇంకా, బుజ్జాయిలు మంచం మీద నుంచి దొర్లుతూ పడిపోకుండా ‘అడ్జస్టబుల్‌ బెడ్‌ సైడ్‌ గార్డ్‌’... రిఫ్రిజిరేటర్లు, అల్మారాల్లాంటివి తీయకుండా ‘బేబీ సేఫ్టీ లాక్స్‌’ ఉన్నాయి.
వీటితో పాటు ‘డోర్‌ స్టాపర్స్‌, నాబ్‌ సేఫ్టీ కవర్స్‌, కార్నర్‌ ప్రొటెక్టర్స్‌, హెడ్‌ సేఫ్టీ హెల్మెట్స్‌...’ ఇలా ఇంట్లో అడుగడుగునా పిల్లలకు రక్షణగా ఉంటూ పెద్దవాళ్లకు భరోసానిచ్చే వస్తువులు ఉన్నాయెన్నో!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..