స్టడీ టేబుల్‌... వీడియోలూ చూపిస్తే!

పిల్లల స్టడీ టేబులే... అవసరమైనప్పుడు పాఠాలూ చెబితే, కాసేపటికి స్నేహితులతో కలిసి ఆడుకునేలా ట్యాబ్‌లానూ మారిపోతే... అబ్బ ఎంత బాగుంటుందో కదూ...! చిన్నారుల ఆ ముచ్చట

Published : 07 Aug 2022 00:53 IST

స్టడీ టేబుల్‌... వీడియోలూ చూపిస్తే!

పిల్లల స్టడీ టేబులే... అవసరమైనప్పుడు పాఠాలూ చెబితే, కాసేపటికి స్నేహితులతో కలిసి ఆడుకునేలా ట్యాబ్‌లానూ మారిపోతే... అబ్బ ఎంత బాగుంటుందో కదూ...! చిన్నారుల ఆ ముచ్చట తీర్చడానికే ‘చిల్డ్రన్‌ టచ్‌స్క్రీన్‌ టేబుల్స్‌’ వచ్చేశాయి. వీటితో పిల్లల సరదా తీరడమే కాదు... చిన్నారుల విషయంలో అమ్మానాన్నల కంగారూ తగ్గుతుంది. అదెలాగో మీరే చూడండి మరి!

‘మావాడు స్కూల్‌ నుంచి రావడం ఆలస్యం... గబగబా హోంవర్క్‌ పూర్తి చేసేసి ట్యాబో, ఫోనో పట్టుకుని గేమ్స్‌ ఆడేస్తుంటాడు. గంటలు గంటలు వీడియోలు చూస్తుంటాడు... అస్తమానం వాడినే గమనిస్తూ ఉండలేం కదా’, ‘మా పిల్లలు ఇద్దరూ నాకంటే నాకూ అంటూ ఉన్న ఒక్క ట్యాబ్‌ కోసం ఎప్పుడూ గొడవ పడుతుంటారు... ఇద్దరూ కలిసి ఒకేదాంట్లో ఒకేసారి ఆడలేరు కదా’ ఇలాంటి మాటలు చాలామంది అమ్మానాన్నల దగ్గర వినిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే, ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా ట్యాబులతో, ఫోన్లతోనే గడిపేస్తున్నారు. అయితే అమ్మానాన్నల ఈ సందేహాలకు పరిష్కారం చూపిస్తూ ఇప్పుడు ‘చిల్డ్రన్‌ టచ్‌స్క్రీన్‌ టేబుల్స్‌, కిడ్స్‌ ఇంటరాక్టివ్‌ స్మార్ట్‌ టేబుల్స్‌’ పేర్లతో రకరకాల ఆండ్రాయిడ్‌ టేబుళ్లు వచ్చాయి.

ప్రత్యేకత ఏంటి...
పిల్లల కోసమే ప్రత్యేకంగా వచ్చిన ఈ చిల్డ్రన్‌ స్క్రీన్‌ టేబుల్‌ని మామూలుగా అయితే స్టడీ టేబుల్‌లా వాడుకోవచ్చు. కావాలంటే టేబుల్‌ మీదున్న బటన్‌ నొక్కి ఆన్‌ చేస్తే చాలు, దాని ఎల్‌ఈడీ తెరతో టేబుల్‌ కాస్తా పే...ద్ద ట్యాబ్‌లానో, ల్యాపీలానో మారిపోతుంది. ఆండ్రాయిడ్‌తో పనిచేసే ఈ టేబుల్‌ని వైఫై ద్వారా కనెక్ట్‌ చేసుకుని కావాల్సిన వీడియోలు చూడొచ్చు. డిజిటల్‌ పుస్తకాల్లాంటి వాటిని పెద్ద తెరమీద సులువుగా చదువుకోవచ్చు, బొమ్మలు గీయడం లాంటివీ నేర్చుకోవచ్చు. పైగా మల్టీటచ్‌ స్క్రీన్‌తో ఉంటుంది కాబట్టి ఒక్కరే కాకుండా నలుగురు స్నేహితులూ కలిసి ఎంచక్కా ఆటలు ఆడుకోవచ్చు. అందరూ కలిసి సరదాగా పోటీల్లాంటివీ పెట్టుకోవచ్చు. అందుకు తగ్గట్టుగా పిల్లల కోసం రకరకాల ఆటలూ, బోలెడన్ని ఎడ్యుకేషనల్‌ ఆప్స్‌ దీంట్లోనే వస్తాయి. నచ్చితే వాటినే వాడుకోవచ్చు. లేదంటే అవసరమైనవి డౌన్‌లోడ్‌ చేసుకునే వీలూ ఉంటుంది. అయితే అది అమ్మానాన్నల సాయంతో మాత్రమే కుదురుతుంది. ఎందుకంటే దీంట్లో పేరంట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఉంటుంది. దీనివల్ల పిల్లలు స్వయంగా ఏది పడితే అది డౌన్‌లోడ్‌ చేయడం, అన్ని వెబ్‌సైట్లూ ఓపెన్‌ చేయడంలాంటివి చేయలేరన్నమాట. పేరంటల్‌ పర్మిషన్‌ ఉన్న వాటినే పిల్లలు చూడగలరు. ఇదంతా బాగుంది కానీ అసలే పిల్లలూ... పైగా టేబుల్‌గానూ వాడుకోవచ్చు అంటున్నారు కదా మరి స్క్రీన్‌ మీద అనుకోకుండా నీళ్లలాంటివి ఒలికితే... అందుకే దీనిపైన ఉండే టచ్‌ స్క్రీన్‌- వాటర్‌ప్రూఫ్‌తో ఉంటుందట. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలు హాయిగా వాడేలా, వారికి చక్కగా ఉపయోగపడేలా ఉంటుందీ స్మార్ట్‌ టేబుల్‌. రకరకాల సైజుల్లో, ఎన్నో డిజైన్లల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇవి. అవసరమైతే మీ చిన్నారుల గదిలో ఈ స్మార్ట్‌ ఫర్నిచర్‌కీ కాస్త చోటు ఇచ్చేయండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..