నట ప్రపంచానికో నీరాజనం!

తెలుగు సినిమాకి పాట తెలుసు, పద్యం తెలుసు. మంచి కవిత కనిపిస్తే దాన్ని రాగాల పల్లకిలో ఎక్కించి శ్రోతలకి చేర్చడమో లేదా సంభాషణల్లో బిగించడమో వచ్చు.

Updated : 22 Feb 2024 16:38 IST

తెలుగు సినిమాకి పాట తెలుసు, పద్యం తెలుసు. మంచి కవిత కనిపిస్తే దాన్ని రాగాల పల్లకిలో ఎక్కించి శ్రోతలకి చేర్చడమో లేదా సంభాషణల్లో బిగించడమో వచ్చు. ఆ రెండు పద్ధతుల్లో కాకుండా ఏకంగా ఒక నటుడి వృత్తి జీవితానికి అక్షర రూపమిచ్చిన కవిత ‘రంగమార్తాండ’ చిత్రం ప్రారంభంలో వస్తుంది. నటుడు చిరంజీవి గళంలో ఉద్వేగభరితంగా వినిపించే ఆ కవిత... పుట్టుకని ఇలా పంచుకుంటున్నారు రచయిత లక్ష్మీ భూపాల...

టుల గురించీ నటన గురించీ నిత్యం ఏదోరకంగా మాట్లాడుకోని ప్రేక్షకుడు ఉండడు! ‘బయటి నుంచి చూసేవాళ్ళు సరే... ఓ నటుడు తన గురించి తాను ఏమనుకుంటాడు?’ ఈ లైన్‌లో ఓ కవితలాంటి పాట కావాలన్నారు కృష్ణవంశీ. ఆయన ఆలోచన నాకు అర్థమైనా దానిపైన ఏం చేయాలో మొదట పాలుపోలేదు. నాకు నేనే ఓ బాణీని అనుకుని రాయాలా? లేదా తేటగీతిలాంటి ఛందస్సేదో తీసుకుని పద్యంగా కూర్చాలా? అన్న ప్రశ్న మొదలైంది. రెండూ సరికాదు అనిపించింది. అప్పుడే శ్రీశ్రీ, శేషేంద్రశర్మల తరహాలో లయాత్మకంగా మలచాలను కున్నాను. ప్రతి చరణంలోనూ నటుల జీవన వైరుధ్యం చూపాలనుకున్నాను. శైలిని నిర్ణయించుకున్నాక... కాగితంపైన కలాన్ని పెట్టడమే ఆలస్యం... అదివరకు లేని శక్తి ఏదో ఆవహించినట్టయింది. మూడుగంటల్లో ‘నేనొక నటుడ్ని’ అన్న పల్లవితో 12 చరణాలొచ్చాయి. మర్నాడే వాటిని కృష్ణవంశీగారికి వినిపిద్దామని వెళితే ‘ఇప్పుడే షూటింగ్‌ మొదలైంది. మళ్ళీ వింటాలే’ అన్నారు. నెల గడిచాక ఓ రోజు మామూలుగా మాట్లాడుతూ ‘అప్పుడేదో రాశానన్నావు కదా... ఏదీ?’ అన్నారు. వినిపించాను. అందులో ‘నేను కాని పాత్రల కోసం వెతికే విటుణ్ణి’ అన్న వాక్యాన్ని చూసి తిడతారనుకున్నాను కానీ అలా చేయలేదు. ‘ఏమిటిది?’ అన్నారు. ‘ఒక పాత్ర కోసం అంతే కాంక్షతో వెతుకుతారు వాళ్ళు’ అనగానే ‘నిజమే’ అన్నారు. మొత్తం చదివాక ‘అద్భుతంగా రాశావురా’ అన్నారు. ఓ పాట ఎంత బాగా ఉన్నా... ముక్తసరిగానే అభినందించే ఆయన అలా అనడం నమ్మలేకపోయా. 12 చరణాల్లో మూడు తీసేయా లనుకున్నాం.. వాటిని నిర్ణయించడానికే 10 నెలలు పట్టింది! ఈ కవితపైన ఇష్టంతోనే చిరంజీవిగారి నోట చెప్పించారు. నేనప్పుడు ‘గాడ్‌ఫాదర్‌’కి డైలాగులు రాస్తున్నా. ఆ షూటింగ్‌లో చిరంజీవి తనని చూడటానికి వచ్చే దర్శకనిర్మాతలకి నా కవితని వినిపించి ‘మన భూపాల ఎంత గొప్పగా రాశాడో’ అని మెచ్చుకోవడాన్ని జీవితంలో మరచిపోలేను.  ‘నటుల గురించి తెలుగులో 360 డిగ్రీల్లో చెప్పిన కవి నువ్వొక్కడివే’ అని జూనియర్‌ ఆర్టిస్టులూ అంటున్నారు. ఓ రచయితగా అంతకన్నా ఏం కావాలి?


నేనొక నటుడ్ని..!
చమ్కీల బట్టలేసుకుని,
అట్టకిరీటం పెట్టుకుని
చెక్కకత్తి పట్టుకుని,
కాగితాల పూల వర్షంలో
కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను
కాలాన్ని బంధించి... శాసించే నియంతని నేను!

నేనొక నటుడ్ని..!
నాది కాని జీవితాలకు ప్రాణంపోసే నటుడ్ని
నేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్ని
వేషం కడితే అన్నిమతాల దేవుడ్ని
వేషం తీస్తే ఎవ్వరికీ కాని జీవుడ్ని

నేనొక నటుడ్ని..!
నవ్విస్తాను, ఏడిపిస్తాను
ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను
హరివిల్లుకు ఇంకో రెండు రంగులు వేసి
నవరసాలు మీకిస్తాను
నేను మాత్రం, నలుపు తెలుపుల
గందరగోళంలో బ్రతుకుతుంటాను.

నేనొక నటుడ్ని..!
జగానికి జన్మిస్తాను సగానికి జీవిస్తాను
యుగాలకి మరణిస్తాను
పోయినా బ్రతికుంటాను...

నేనొక నటుడ్ని..!
లేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాడ్ని
ఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోడ్ని
ఉన్నదంతా నేను అనుకునే అహం బ్రహ్మస్మిని
అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని

నేనొక నటుడ్ని..!
గతానికి వారధి నేను వర్తమాన సారధి నేను
రాబోయే కాలంలో రాయబోయే చరిత్రను నేను
పూటపూటకి రూపం మార్చుకునే
అరుదైన జీవిని నేను

నేనొక నటుడ్ని..!
పిడుగుల కంఠాన్ని నేను
అడుగుల సింహాన్ని నేను
నరంనరం నాట్యమాడే...
నటరాజ రూపాన్ని నేను
ప్రపంచ రంగస్థలంలో... పిడికెడు మట్టిని నేను
ప్రచండంగా ప్రకాశించు రంగమార్తాండున్ని నేను

నేనొక నటుడ్ని..!
అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుడ్ని
కానీ, తొమ్మిది తలలు ఉన్న నటరావణుడ్ని
నింగీనేల రెండడుగులైతే మూడోపాదం
మీ మనసులపై మోపే వామనుడ్ని
మీ అంచనాలు దాటే ఆజానుబాహుడ్ని
సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని...

నేనొక నటుడ్ని..!
అప్సరసల ఇంద్రుడ్ని అందుబాటు చంద్రుడ్ని
అభిమానుల దాసుడ్ని అందరికీ ఆప్తుడ్ని
చప్పట్లను భోంచేస్తూ ఈలలను శ్వాసిస్తూ
అనుక్షణం జీవించే అల్పసంతోషిని నేను

మహా అదృష్టవంతుడిని నేను
తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే
సగటు కళాకారుడ్ని నేను
ఆఖరిశ్వాస వరకు నటనే ఆశ నాకు
నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు
శతకోటి నమస్సులు మీకు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..