వల విసిరి స్టార్లయ్యారు...

యూట్యూబ్‌ పుణ్యమాని... ఒకప్పుడు మనకు పెద్దగా పరిచయంలేని జీవితాలన్నీ తెరమీదకొస్తున్నాయి. ‘ఈ వృత్తుల గురించి మనకెందుకు?’ అన్న ప్రశ్నే లేదిప్పుడు. ఆకట్టుకునేలా చూపాలేకానీ... జీవనవృత్తులు ఏవైనా వాటికి లక్షల వ్యూస్‌ అందిస్తున్నారు నెటిజన్లు. వాళ్ల దన్నుతోనే తమ జీవితాన్ని నెట్‌లో చూపిస్తూ... యూట్యూబ్‌ స్టార్‌లుగా మారారు ఈ జాలరి యువకులు.

Updated : 07 Dec 2022 09:49 IST

వల విసిరి స్టార్లయ్యారు...

యూట్యూబ్‌ పుణ్యమాని... ఒకప్పుడు మనకు పెద్దగా పరిచయంలేని జీవితాలన్నీ తెరమీదకొస్తున్నాయి. ‘ఈ వృత్తుల గురించి మనకెందుకు?’ అన్న ప్రశ్నే లేదిప్పుడు. ఆకట్టుకునేలా చూపాలేకానీ... జీవనవృత్తులు ఏవైనా వాటికి లక్షల వ్యూస్‌ అందిస్తున్నారు నెటిజన్లు. వాళ్ల దన్నుతోనే తమ జీవితాన్ని నెట్‌లో చూపిస్తూ... యూట్యూబ్‌ స్టార్‌లుగా మారారు ఈ జాలరి యువకులు.


ఆ వీడియోలు చూసి... కనిమొళి వచ్చారు!

ఛానల్‌ పేరు ‘తూత్తుకుడి మీనవన్‌’, తమిళనాడు తూత్తుకుడి రేవు పట్టణానికి చెందిన శక్తివేల్‌ దీని నిర్వాహకుడు. డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడంతో తండ్రితో కలిసి తానూ జాలరి వృత్తికి పరిమితమయ్యాడు. ఇతను ఉంటున్న తూత్తుకుడి ప్రాంతంలో సముద్రం అడుగుకి వెళ్ళి శంఖాలని తీస్తుంటారు. ఎంతో సాహసంతో కూడిన ఆ శంఖాల వేటని... శక్తివేల్‌ ఓ రోజు వీడియో తీసి పెడితే దాన్ని లక్షన్నరమంది చూశారట. ఆ ఉత్సాహంతో ప్రతి చేపల వేటనీ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయసాగాడు. పనిలోపనిగా సముద్రంలో తరిగిపోతున్న పగడపు దిబ్బలూ, ఇతర జలచరాల గురించీ చెప్పసాగాడు. అతనిలోని ఈ పర్యావరణ స్పృహే సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్యని లక్షల్లోకి చేర్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయ, లోక్‌సభ సభ్యురాలు కనిమొళి కూడా ఈ ఛానల్‌కి పెద్ద అభిమాని. ఓ రోజు ఆమె శక్తివేల్‌ ఇంటికొచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. అతని కుటుంబంతో కలిసి సముద్రంలో సుదూరం ప్రయాణించి... తనకిష్టమైన చేపల వంటతో భోజనాన్ని రుచి చూశారు. అన్నట్టు, శక్తివేల్‌ యూట్యూబ్‌ ద్వారా తనకొచ్చిన ఆదాయంతో కరెంటు వసతి బొత్తిగా లేని తమ పొరుగు గ్రామానికి సోలార్‌ విద్యుత్తుని ఏర్పాటుచేశాడు. తమ జాలరి గ్రామంలో ఉచిత ట్యూషన్‌ సెంటర్లూ ఏర్పాటు చేశాడు.


కోట్ల రూపాయల వ్యాపారిగా!

మిళంలో ‘మీనవన్‌’ అంటే జాలరి అని. అందుకే ఈ ఛానల్‌ పేరు ‘ఉంగల్‌ మీనవన్‌’(మీ జాలరి). మొత్తం 11.7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు దీనికి. కింగ్స్‌టన్‌ దీని సృష్టికర్త. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని మూక్కయూర్‌ అన్న చిన్న జాలరి గ్రామం అతనిది. ఇతనూ టిక్‌టాక్‌ నుంచి యూట్యూబ్‌ వైపు వచ్చినవాడే. ‘అసలు బంగాళాఖాతంలో ఇలాంటి చేపలు కూడా ఉంటాయా?’ అనిపించేలా డాల్ఫిన్స్‌, సొర, తిమింగలం, ఆక్టోపస్‌, జెల్లీఫిష్‌ వీడియోలు పెడుతుంటాడు కింగ్స్‌టన్‌. తాను పడుతున్న చేపల్ని రుచిగా శుచిగా ఎలా వండాలో కూడా చెబుతుంటాడు. వాటిని చూసిన సబ్‌స్క్రైబర్స్‌ కొందరు ‘ఈ వంట రుచి మాకూ చూపరా?’ అని అడగడం మొదలుపెట్టారట. అలాంటివాళ్ళ కోసమే రామనాథపురం టౌన్‌లో ‘ఉంగల్‌ ఉనవగం’(మీ భోజనశాల) పేరుతో హోటల్‌ పెట్టాడు. అది క్లిక్‌ కావడంతో... చెన్నై సహా తమిళనాడులోని ఎనిమిది ప్రధాన నగరాల్లో చెయిన్‌ రెస్టరంట్‌లు ఏర్పాటుచేశాడు. చేపల మసాలా వగైరాలనీ అమ్ముతున్నాడు.వీటన్నింటి ద్వారా రెండొందల మందికి ఉపాధి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఏడాదికి 15 కోట్ల రూపాయల ఆదాయం కళ్ళజూస్తున్న కింగ్స్‌టన్‌ చదువుకుంది పదో తరగతే!


టిక్‌టాక్‌ నుంచి టీవీ దాకా!

లోకల్‌ బాయ్‌ నాని... తెలుగు యూట్యూబ్‌ అభిమానులకి కొత్తగా పరిచయం అక్కర్లేని ఛానల్‌. విశాఖపట్నం రేవు కేంద్రంగా చేపలు పట్టే నాని... కడలిపైన తమ బతుకు పోరాటాన్ని కళ్ళకు కడుతుంటాడు. తీరం నుంచి దాదాపు 200 మైళ్ళ దాకా తనతోపాటూ వీక్షకుల్ని సముద్రంపైకీ/లోపలికీ తీసుకెళ్ళి ఓ అడ్వెంచర్‌ సినిమా చూసినంత అనుభూతిని కలిగిస్తాడు. అనుకోని తుపానులు, ఆకస్మిక వర్షాలు, పడవ చుట్టూ చక్కర్లు కొట్టే సొరచేపలూ, అదాటున తేలిపోతూ కనిపించే శవాల గురించి చెబుతూ ఉత్కంఠ రేపుతాడు. నాని చదువుకుంది రెండో తరగతే. ఓ రోజు అతను బోటుపైన నిల్చుని ప్రభాస్‌ సినిమా డైలాగ్‌ ఒకటి చెబుతుంటే... అతని ఫ్రెండ్‌ దాన్ని వీడియోతీసి టిక్‌టాక్‌లో పెట్టాడట. అది వైరల్‌ కావడంతో... మరిన్ని వీడియోలతో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సాధించాడు నాని. టిక్‌టాక్‌పైన నిషేధం పడ్డాక... యూట్యూబ్‌ వైపు దృష్టిసారించాడు. వాటితో రెండేళ్ళలోనే ఎనిమిదిలక్షల మంది సబ్‌స్క్రైబర్‌లని  సాధించాడు. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా వివిధ బ్రాండ్లకి ప్రచారకర్తగా మారాడు. ఈటీవీ ‘రెచ్చిపోదాం బ్రదర్‌’ కార్యక్రమంలోనూ పాల్గొన్నాడు. ఆ మధ్య ఒడిశా తుపానుకి ఓ జాలరి బోటు ఛిన్నాభిన్నమైంది. ఆ బాధితుణ్ణి ఆదుకోవాలంటూ నాని చేసిన ఒక్క వీడియోకి... నాలుగురోజుల్లోనే నాలుగు లక్షల రూపాయలు విరాళంగా పంపించారు అతని సబ్‌స్క్రైబర్లు. అంతుంటుంది అతనిపైన అభిమానం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..