వీళ్ల హోలీ ఎంతో ప్రత్యేకం!

హోలీ అనగానే రంగులే గుర్తొస్తాయి. కానీ వాటి వల్ల ఆరోగ్యానికీ, పర్యావరణానికీ ఎంతో హాని జరుగుతుంది. అందుకే ఈ గ్రామాల ప్రజలు హోలీని ఎంతో విభిన్నంగానూ పర్యావరణహితంగానూ జరుపుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Updated : 24 Mar 2024 04:58 IST

హోలీ అనగానే రంగులే గుర్తొస్తాయి. కానీ వాటి వల్ల ఆరోగ్యానికీ, పర్యావరణానికీ ఎంతో హాని జరుగుతుంది. అందుకే ఈ గ్రామాల ప్రజలు హోలీని ఎంతో విభిన్నంగానూ పర్యావరణహితంగానూ జరుపుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.


సహజ రంగులు

హోలీకి ఎవరైనా రంగులు కొనుక్కోవడం సహజం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా బదర్క గ్రామ ప్రజలు మాత్రం బయట కొనకుండా ఎవరింట్లో వాళ్లు సేంద్రియ రంగుల్ని తయారు చేసుకుని హోలీ నాడు చల్లుకుంటారు. అందుకే హోలీకి ఐదారు నెలల ముందే ఆ గ్రామం రంగులమయం అవుతుంది. మహిళలంతా బృందాలుగా చేరి ఆకులూ పూలూ పళ్లూ ఉపయోగించి రంగుల్ని తయారు చేస్తుంటారు. ఆరబెట్టిన రంగులతో ప్రతి వీధీ ఒక హరివిల్లులా కనిపిస్తుంటుంది. దాదాపు పదేళ్లుగా బదర్కలో ఇదే పద్ధతి కొనసాగుతోంది. రసాయనాలు కలిపిన రంగుల వల్ల చాలామంది కంటి సంబంధిత సమస్యల్ని ఎదుర్కోవడం గమనించింది ఆ గ్రామ పెద్దగా వ్యవహరించే ఆర్తీ దేవి. అందుకే మార్కెట్‌లో దొరికే రంగుల్ని నిషేధించడంతోపాటు గ్రామంలోనే సేంద్రియ పద్ధతిలోనే తయారు చేసుకోవాలని తీర్మానించింది. ఆర్తీ దేవి మాటకు కట్టుబడిన ప్రజలు సహజ వర్ణాలతోనే సంబరం చేసుకుంటున్నారు. అంతేకాదు, ఈ రంగుల్ని మార్కెట్‌లో అమ్మి మంచి లాభాలు కూడా గడిస్తున్నారు.


అడవి తల్లి సాక్షిగా...

బాగా చదువుకున్నవాళ్లు కూడా చాలామంది రసాయనాలు కలిసిన రంగులు చల్లుకుంటూ జబ్బుల పాలవుతున్నారు. పర్యావరణానికీ ఎంతో హాని చేస్తున్నారు. గోవాలోని సత్తారీ, కరంజోల్‌, పోండాతోపాటు మరో ఐదు పల్లెల్లో నివసించే నిరక్షరాస్య గిరిజనులు మాత్రం ఆ రోజున పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రమాణాలు చేసుకుంటారు. వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి జీవించే ఈ గ్రామాల ప్రజలు ప్రకృతిని ధైవంగా భావించి ఆరాధిస్తారు. హోలీ నాడు పర్యావరణానికి హాని చేసే రంగులకు దూరంగా ఉండటంతోపాటు... మేళతాళాలతో అడవుల్లోకి వెళ్లి చెట్లను పూజిస్తారు. అమ్మగా భావించే వృక్షాలను నరకబోమనీ, ఎవరూ ఆ పని చేయకుండా చూస్తామనీ ప్రమాణం చేసుకుంటారు. తరవాత అడవిలోని చిన్న చిన్న మొక్కల్ని పీకి- మంగళ వాయిద్యాలతో గ్రామంలోకి తీసుకొచ్చి నాటతారు. వాటిని సంరక్షిస్తూనే వారంరోజుల పాటు పూజలు చేస్తారు. జానపద పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుకుంటారు. తరవాతి తరం వారికి మొక్కల్ని ఎందుకు నాటాలో బుర్రకథల రూపంలో తెలియజెబుతారు. వందల ఏళ్లుగా అడవిని కాపాడుకుంటూనే ముందు తరాలనూ ఆ దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్న గిరిజనుల ప్రయత్నం బాగుంది కదూ!


మజ్జిగ చల్లుకుంటారు

వేసవిలో మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మంచిది. గ్లాసులు గ్లాసులు తాగుతుంటారు కొందరు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ జిల్లా రైతల్‌ వాసులు మాత్రం హోలీ రోజున ఆ మజ్జిగ నీళ్లనే చల్లుకుంటారు. అందుకోసం బకెట్ల కొద్దీ మజ్జిగను సిద్ధం చేసుకుని వాటర్‌గన్స్‌తో స్ప్రే చేసుకుంటారు. వ్యవసాయమే జీవనాధారమైన ఆ ప్రాంతంలో పండుగల వేళ పశువుల్ని ఆరాధిస్తుంటారు. కృత్రిమ రంగులు పంటలకీ, పశువులకీ హాని చేస్తాయని భావించే రైతల్‌ ప్రజలు... హోలీ వేడుకల్ని బీడుభూముల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పశువుల్ని అలంకరించి... వాటికి పూజలు చేస్తారు. రెండురోజుల ముందు నుంచే పాలను అమ్మకుండా పెద్ద మొత్తంలో తోడు పెడతారు. ఆ పెరుగును చిలికి మజ్జిగనూ వెన్ననూ వేరు చేస్తారు. హోలీ రోజున బంధువులకూ, ఆత్మీయులకూ వెన్నను ఇచ్చి పుచ్చుకుంటే పాల దిగుబడి పెరుగుతుందని వారు నమ్ముతారు. మిగిలిన మజ్జిగను ఒకరి మీద ఒకరు చల్లుకుని పండుగకు కొత్తకళను తీసుకొస్తారు. పండుగ వేళ వైవిధ్యమైన ఈ ప్రకృతి ఆరాధనను చూడ్డానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జనాలు వస్తుండటం విశేషం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..