జీడి... కొత్త రుచులు జోడీ!

వాల్‌నట్స్‌ కాస్త చేదుగా అనిపిస్తాయి, బాదంపప్పును నానబెట్టుకునే తినాలి, కిస్మిస్‌ తీపి అందరికీ నచ్చకపోవచ్చు... ఇలా ఎండుఫలాల్లో ఒక్కో దానికి ఒక్కో కారణం చెప్పి తినకుండా పక్కనపెడతారేమో కానీ కమ్మని రుచితో నోరూరించే జీడిపప్పును మాత్రం ఎవరూ కాదనలేరు,

Published : 05 May 2024 00:05 IST

వాల్‌నట్స్‌ కాస్త చేదుగా అనిపిస్తాయి, బాదంపప్పును నానబెట్టుకునే తినాలి, కిస్మిస్‌ తీపి అందరికీ నచ్చకపోవచ్చు... ఇలా ఎండుఫలాల్లో ఒక్కో దానికి ఒక్కో కారణం చెప్పి తినకుండా పక్కనపెడతారేమో కానీ కమ్మని రుచితో నోరూరించే జీడిపప్పును మాత్రం ఎవరూ కాదనలేరు, కళ్ల ముందు కనిపిస్తే నోట్లో వేసుకోకుండా ఉండలేరు. తియ్యతియ్యని తెల్లని ఆ సాదాజీడిపప్పు రుచే అంతగా మైమరిపిస్తే- ఇప్పుడు రంగు రంగుల్లో అటు కంటికీ, రకరకాల ఫ్లేవర్లలో ఇటు పంటికీ పసందుగా మారిపోయి ‘ఫ్లేవర్డ్‌ క్యాషూ నట్స్‌’గా దొరుకుతోంది!

 సుధ ఎప్పటిలాగే డ్రైఫ్రూట్స్‌ దుకాణానికి వెళ్లింది. ఇదివరకు మామూలు జీడిపప్పు పక్కన మహా అయితే వేయించినవీ, బెల్లం-చక్కెర కలిపినవీ, కారంతో రోస్ట్‌ చేసినవీ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆకుపచ్చ రంగులో మింట్‌ క్యాషూ, గులాబీ రంగులో స్ట్రాబెర్రీ, పసుపు రంగులో మ్యాంగో క్యాషూ, నీలం రంగులో బ్లూబెర్రీ క్యాషూ... ఇలా రకరకాల వెరైటీల్లో జీడిపప్పు రకాలు కనిపించాయి. కాస్త ఆశ్చర్యపోతూనే ఆరా తీసిన సుధకు వీటిల్లో ఇవే కాదు, ఇంకా చాలానే రుచులు వచ్చాయని తెలిసింది. ఇంతకీ ఏమా కొత్త రుచులంటే...

ఎన్ని వెరైటీలో...

నిజానికి నట్స్‌ అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కానీ మంచి చేస్తూనే అన్నిట్లో రుచిగానూ ఉండేవి జీడిపప్పే. జీడిపప్పులేని పాయసం, క్యాషూ పేస్టులేని మసాలా కూరలూ, ఈ నట్స్‌ వేయని బిర్యానీలూ ఊహించడమే కష్టం. అంతలా వంటల్లోనూ, మిఠాయిల్లోనూ వాడే ఈ పప్పుల్ని ఎక్కువగా స్నాక్స్‌లానూ తినేస్తారు. అందుకే మామూలు జీడిపప్పుల్నే అభిరుచికి తగ్గట్టు అందించేలా ఇప్పటి వరకూ కారం, తీపి రుచుల్ని జత చేస్తూ మూడు, నాలుగు ఫ్లేవర్లవి తీసుకొచ్చారు. ఇప్పుడు కమ్మని ఆ రుచిని మరింత పెంచాలనుకున్నారేమో తయారీదారులు- స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, దానిమ్మ, మామిడి, జామ, నిమ్మ... ఇలా రకరకాల పండ్ల రుచుల్నీ కలిపారు. తేనె, చీజ్‌, కుల్ఫీ, పెరుగు, కాఫీ, చాక్లెట్‌ వెరైటీ ఫ్లేవర్లతోనూ జీడిపప్పు రకాల్ని తెచ్చారు. అంతేనా గులాబీ పూల రోజ్‌ పెటల్‌ క్యాషూ... మిరియాలూ, దాల్చినచెక్కల్ని జత చేసి మసాలా... ఉల్లిపాయ, క్రీమ్‌లతో ఆనియన్‌- క్రీమ్‌ క్యాషూల్నీ తయారుచేస్తున్నారు. ఇంకా పచ్చిమిర్చీ, నువ్వులూ, కొబ్బరీ... ఇలా తినదగిన పదార్థాలన్నింటితో జీడిపప్పుకు పూతపూస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... ఉప్పఉప్పగా, కారంకారంగా, తీయతీయగా, పుల్లపుల్లగా అన్ని రుచులతోనూ జీడిపప్పు కమ్మదనం కలిసిపోయి వెరైటీ రుచుల్లో అలరిస్తోంది.

ఎలా తయారుచేస్తారు...

మామూలుగా జీడిపప్పుల్ని నూనె, నెయ్యిల్లో వేయించి ఉప్పూ, కారం, చక్కెరల్లాంటివి చల్లడం మనకు తెలిసిందే. అదే ఈ ఫ్లేవర్డ్‌ క్యాషూల విషయంలో అయితే కావాలనుకున్న పండ్ల గుజ్జూ, పదార్థాల్నీ తీసుకుని వాటిల్లో జీడిపప్పుల్ని ముంచుతూ, అదనపు రుచుల కోసం ఇతర పదార్థాలూ కలపడం లాంటివి చేస్తారు. మారినేట్‌ చేసిన వాటన్నింటినీ ఫ్లేవర్‌ పోకుండా ప్రత్యేక పద్ధతిలో ఎండబెడతారు. అందుకే మరి, అచ్చంగా ఆ పండ్లూ, ఆయా పదార్థాల రుచులూ, రంగులతో ఆకట్టుకుంటున్నాయివి.

పండే కొసరు, గింజే అసలు!

ఎర్రటి జీడి పండ్లకు అడుగున చిన్న గింజలు అతుక్కుని ఉంటాయి. వాటినే జీడి పిక్కలు అని పిలుస్తారు. ఇదిగో వాటినుంచే జీడిపప్పును వేరు చేస్తారు. జీడి పిక్కలే అసలు పండు అయినప్పటికీ విత్తనం చుట్టూ ఉండే గట్టి కవచం వల్ల ఇది నట్‌గా వాడుకలోకి వచ్చిందన్నమాట. ఈ జీడిపప్పునిచ్చే జీడిమామిడి చెట్లు ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతాయి. ప్రస్తుతం ఇవి ప్రపంచంలో చాలా దేశాల్లోనే ఉన్నా జీడిపప్పు స్వస్థలం బ్రెజిల్‌ అని చెబుతారు. పోర్చుగీసువాళ్లు 16వ శతాబ్దంలో మన దేశానికి మొదటిసారిగా పరిచయం చేశారట. అలా వచ్చిన జీడిపప్పు ఇప్పుడు మన దగ్గర పూర్తిగా నాటుకుపోయింది. ప్రపంచంలో అత్యధికంగా జీడిపప్పును సాగు చేసే దేశాల్లో ఒకటిగా నిలిపింది.

జీడిపప్పు మంచిదేనా...

  • జీడిపప్పు అంటే ఎంతో ఇష్టమున్నా... చాలామంది కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని భయపడుతుంటారు. కానీ గుండెకు ఇవి చేసే మేలు మరే నట్స్‌ కూడా చేయవట. వీటిల్లో ఉండే పాలీఅన్‌శాచ్యురేటెడ్‌, మోనోఅన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ట్రైగ్లిజరైడ్స్‌ పెరగకుండా, ఇతర దుష్ఫలితాలు తలెత్తకుండా చేస్తాయట, ఇంకా గుండె జబ్బులు రాకుండానూ కాపాడతాయి. వీటిల్లో ఎక్కువగా ఉండే మెగ్నీషియం కూడా గుండెకు ఎంతో మంచిది.
  • జీడిపప్పులో ఉండే అధిక కాపర్‌ రక్తహీనత నుంచి కాపాడుతుంది. ఇంకా జుట్టు నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
  • సెలీనియం, జింక్‌, మెగ్నీషియం, పాస్ఫరస్‌, ఐరన్‌లతో ఉండే క్యాషూ ఆయిల్‌ చర్మానికి ఎంతో మేలు చేస్తుందట. పైగా ఇది కొన్ని రకాల క్యాన్సర్లనూ అడ్డుకుంటుంది.
  • కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే జీడిపప్పును తగిన మోతాదులో తీసుకోవచ్చు. దీంట్లో ఉండే ‘జియాజాంతిన్‌’ అనే యాంటీఆక్సిడెంట్‌ కళ్లకు ఎంతో మేలు చేస్తూ, అతినీలలోహిత కిరణాల ప్రభావం కళ్లమీద పడకుండా కాపాడుతుంది.
  • జీడిపప్పులోని జింక్‌, కాపర్‌, విటమిన్‌-ఇ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇంకా క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, ఎముకలు దృఢంగా అవుతాయి. ఇలా ఈ సూపర్‌ నట్‌తో బోలెడన్ని లాభాలున్నాయి.
  • ఎంతో మేలు చేసే పదార్థమైనా సరే, రోజూ ఎంత తింటున్నామన్నదే ముఖ్యం. బాదం, కిస్మిస్‌లతో పోలిస్తే జీడిపప్పు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది.
  • అలాగని మితిమీరి తింటే ఆరోగ్యానికి ఇబ్బంది. జీడిపప్పును ఇతర నట్స్‌తో కలిపి స్నాక్స్‌ రూపంలో తీసుకుంటున్నట్లయితే... 28 నుంచి 30 గ్రాములకు మించకుండా చూసుకోవాలి. ఒకవేళ కేవలం జీడిపప్పునే తింటుంటే... నాలుగైదు పప్పుల వరకూ తినొచ్చు. ఇవన్నీ గమనించుకుంటూనే పుల్లగా, తీయగా, ఘాటుగా... ఇలా మీకు నచ్చిన ఫ్లేవర్డ్‌ జీడిపప్పును తిన్నారంటే... రుచికి రుచీ ఉంటుంది, అదనపు పోషకాలూ అందుతాయి..ఏమంటారు?!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..