చారు... చవులూరు!

వేడివేడి చారు - బంగాళాదుంపల వేపుడు... భలే కాంబినేషన్‌ కదూ.. అలాగని ఎప్పుడూ ఒకే రకం చారు చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండీ...

Published : 26 Nov 2023 00:58 IST

వేడివేడి చారు - బంగాళాదుంపల వేపుడు... భలే కాంబినేషన్‌ కదూ.. అలాగని ఎప్పుడూ ఒకే రకం చారు చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండీ... పైగా ఈ చలికాలంలో చారు వినియోగమూ ఎక్కువే కాబట్టి... ఇలాంటి రుచుల్లో మార్చిమార్చి ట్రై చేద్దామా మరి...


క్యారెట్‌ చారు

కావలసినవి: ఉడికించిన క్యారెట్‌ ముక్కలు: కప్పు, జీలకర్ర: అరచెంచా, మిరియాలు: చెంచా, ఉడికించిన కందిపప్పు: అరకప్పు, రసంపొడి: చెంచా, ఉప్పు: తగినంత, పసుపు: అరచెంచా, బెల్లం తరుగు: చెంచా, చింతపండు గుజ్జు: రెండు టేబుల్‌స్పూన్లు, నూనె: చెంచా, ఆవాలు: చెంచా, ఇంగువ: చిటికెడు, కరివేపాకు రెబ్బలు: రెండు, ఎండుమిర్చి: ఒకటి.

తయారీ విధానం: క్యారెట్‌ ముక్కల్ని మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి జీలకర్ర, మిరియాలు వేయించుకుని తరువాత రెండింటినీ కలిపి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో క్యారెట్‌ గుజ్జు, మిరియాలపొడి, ఉడికించి పెట్టుకున్న పప్పు, రసంపొడి, తగినంత ఉప్పు, పసుపు, బెల్లం తరుగు, చింతపండు గుజ్జు వేసుకుని కలిపి ముప్పావుకప్పు నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టి... మరుగుతున్నప్పుడు దింపేయాలి.చివరగా కడాయిని పెట్టి నూనె వేసి... ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేయించుకుని రసంలో వేసి కలిపితే చాలు.


పెసరపప్పు- కొబ్బరిపాల రసం

కావలసినవి: పెసరపప్పు: పావుకప్పు, పచ్చిమిర్చి: రెండు, నెయ్యి: రెండు చెంచాలు, జీలకర్ర: చెంచా, అల్లం తరుగు: రెండు చెంచాలు, కరివేపాకు రెబ్బలు: అయిదు, ఎండుమిర్చి: రెండు, పసుపు: పావుచెంచా, కొబ్బరిపాలు: అరకప్పు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, ఉప్పు: తగినంత, నిమ్మరసం: చెంచా.

తయారీ విధానం: ముందుగా పెసరపప్పును కడిగి కుక్కర్‌లో తీసుకోవాలి. ఇందులో ముప్పావుకప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఒక కూత వచ్చేవరకూ ఉడికించుకోవాలి. ఆ తరువాత పప్పును మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నెయ్యి వేసి... జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకుని కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేసి కలపాలి. నిమిషం తరువాత ఉడికించి పెట్టుకున్న పప్పు, ముప్పావుకప్పు నీళ్లు పోసి, పసుపు వేసి కలిపి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. తరువాత ఇందులో కొబ్బరిపాలు, తగినంత ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి... మరుగుతున్నప్పుడు దింపేయాలి.


ఉసిరి కొబ్బరి రసం

కావలసినవి: ఉసిరికాయలు: మూడు, కొబ్బరితురుము: పావుకప్పు, కందిపప్పు: రెండు చెంచాలు, మినప్పప్పు: చెంచా, దనియాలు: రెండు చెంచాలు, జీలకర్ర: అరచెంచా, మిరియాలు: అరచెంచా, మెంతులు: నాలుగైదు గింజలు, ఆవాలు: చెంచా, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు రెబ్బలు: రెండు, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: టేబుల్‌స్పూను, నూనె: చెంచా, ఎండుమిర్చి: రెండు.

తయారీ విధానం: ముందుగా స్టవ్‌మీద కడాయిని పెట్టి కందిపప్పు,మినప్పప్పు, దనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతుల్ని వేయించుకుని సగం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి ఓసారి వేయించి స్టవ్‌ని కట్టేయాలి. ఇప్పుడు మిక్సీలో ఉసిరికాయముక్కలు, కొబ్బరితురుము, వేయించుకున్న దినుసులు తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో తీసుకుని ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, తగినంత ఉప్పు, పసుపు, కొత్తిమీర తరుగు వేసి స్టవ్‌మీద పెట్టి... మరుగుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి... ఆవాలు, మిగిలిన కరివేపాకు, ఎండుమిర్చి వేయించుకుని చారులో వేసి కలపాలి.


ఒబ్బట్టు చారు

కావలసినవి: సెనగపప్పు ఉడికించిన నీళ్లు: కప్పు, చింతపండు నీళ్లు: అరకప్పు, ఉడికించిన సెనగపప్పు: పావుకప్పు, బెల్లం తరుగు: పావుకప్పు, ఉడికించిన కందిపప్పు: పావుకప్పు, తాజా కొబ్బరితురుము: పావుకప్పు, నెయ్యి: టేబుల్‌స్పూను, నూనె: చెంచా, ఆవాలు: చెంచా, ఇంగువ: చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, రసంపొడి: ఒకటిన్నర చెంచా, ఉప్పు: తగినంత, కారం: అరచెంచా, పసుపు: పావుచెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి.. ఉల్లిపాయముక్కల్ని వేయించుకుని తీసుకోవాలి. అదే విధంగా టొమాటోను వేడినీటిలో అయిదు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేయించిన ఉల్లిపాయ ముక్కలు, చెక్కుతీసిన టొమాటో ముక్కలు, ఉడికించిన సెనగపప్పు, ఉడికించిన కందిపప్పు, కొబ్బరితురుము, రసంపొడి, కారం, పసుపు, బెల్లం తరుగు మిక్సీలో వేసుకుని పావుకప్పు నీళ్లు పోసి మెత్తగా చేసుకోవాలి. పప్పు ఉడికించిన నీటిని ఓ గిన్నెలో తీసుకుని అందులో చేసిపెట్టుకున్న మిశ్రమం వేసి కలిపి స్టవ్‌మీద పెట్టి కప్పు నీళ్లు పోయాలి. అయిదు నిమిషాలయ్యాక ఇందులో చింతపండు నీళ్లు పోసి, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు వేసి బాగా మరగనిచ్చి దింపేయాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నెయ్యి వేసి... ఆవాలు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు రెబ్బలు వేయించి చారులో వేసి కలిపితే చాలు.

 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు