కుండ దోశ తింటారా... బాహుబలి దోశ కావాలా..!

టిఫిన్లలో ఎవరికైనా మొదటగా గుర్తొచ్చేది దోశనే... ఎక్కువ మందికి ఇష్టమైన అల్పాహారమూ అదే... పేరు వింటేనే నోట్లో నీళ్లూరిపోయే ఈ సౌత్‌ ఇండియన్‌ స్పెషల్‌ టిఫిన్‌కి అంత గిరాకీ ఉంది కాబట్టే దోశల్లో బోలెడన్ని రుచుల్ని జోడిస్తూ కొత్త వెరైటీల్ని తయారుచేస్తున్నారు షెఫ్‌లు.

Updated : 24 Mar 2024 14:53 IST

టిఫిన్లలో ఎవరికైనా మొదటగా గుర్తొచ్చేది దోశనే... ఎక్కువ మందికి ఇష్టమైన అల్పాహారమూ అదే... పేరు వింటేనే నోట్లో నీళ్లూరిపోయే ఈ సౌత్‌ ఇండియన్‌ స్పెషల్‌ టిఫిన్‌కి అంత గిరాకీ ఉంది కాబట్టే దోశల్లో బోలెడన్ని రుచుల్ని జోడిస్తూ కొత్త వెరైటీల్ని తయారుచేస్తున్నారు షెఫ్‌లు. ఇప్పుడైతే రుచులతో పాటూ రూపంలోనూ కొత్తదనాన్ని తీసుకొస్తూ ఎన్నెన్నో దోశల్ని ఆహార ప్రియుల ముందు ఉంచుతున్నారు!

ఎక్కడైనా హోటల్‌కి వెళితే మెనూలో దోశ, ఇడ్లీ, పూరీ, వడ... ఇలా వరసగా టిఫిన్ల పేర్లు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు- బుర్జ్‌ ఖలీఫా దోశ, మినీ దోశ, మట్కా దోశ, పిరమిడ్‌ దోశ... అంటూ ఒక్క దోశ జాబితాలోనే ఒకటి కాదు రెండు కాదు వందల రకాల పేర్లని చూడొచ్చు. ‘అదేంటీ ఆనియన్‌, మసాలా, రవ్వ, పనీర్‌... రుచుల్ని ఆస్వాదించాం కానీ ఈ పేర్లు మాత్రం వినలేదే’ అనుకుంటున్నారా... ఈమధ్య ప్రత్యేకంగా దోశల రుచుల్నే అందిస్తూ పుట్టుకొచ్చిన రెస్టరంట్లలో ఇలాంటి సరికొత్త దోశల్ని ఎంచక్కా లాగించేయొచ్చు.

వంట రుచి- ఎలా ఉందన్న విషయం నోట్లో వేసుకుంటే గానీ తెలియదు. కానీ రూపురేఖల్లో కంటికి ఇంపుగా ఉంటే మాత్రం ఆ ఆహారాన్ని చూడగానే లొట్టలేస్తారు ఎవరైనా సరే. ఆ మంత్రాన్ని పాటిస్తూనే హోటళ్లూ రెస్టరంట్లూ... కమ్మని రుచితోపాటూ ఆకట్టుకునే ఆకారాన్నీ తీసుకొస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ దోశలన్నీ కూడా కొత్తగా అలా మెనూలోకి చేరినవే మరి.    

అన్నీ దోశలే...

రెండు రకాల రుచులూ ఒకే దాంట్లోకి చేరిపోతూ వచ్చిన ఫ్యూజన్‌ ఫుడ్‌ ట్రెండ్‌ మొదలయ్యాక మామూలు దోశ కాస్తా... మటన్‌, చికెన్లతో నాన్‌వెజ్‌ రుచులతో వచ్చింది. రకరకాల ధాన్యాలతో మిల్లెట్‌ దోశలుగా మారింది. ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ఫుడ్‌ రుచులతోనూ జత కట్టేసింది. అన్ని రకాల రుచుల్లో మెప్పించిన దోశ... ఇప్పుడు కొత్త కొత్త ఆకారాల్లోనూతయారవుతోందన్నమాట. ఒకేసారి మొత్తంగా నోట్లో పెట్టుకునేంత చిన్న సైజు నుంచి ఇద్దరుముగ్గురు తింటేగానీ పూర్తవ్వని టేబులంత సైజు బాహుబలి దోశ వరకూ ఎన్నెన్నో వెరైటీ దోశల్ని వేస్తున్నారు. ఇంకా మూడు లేయర్లుగా రోల్స్‌లా చుట్టి ఉంచే బుర్జ్‌ ఖలీఫా దోశ, కోన్‌లా చుట్టి ఉంచిన పిరమిడ్‌ దోశ, వలలా వేసే నెట్‌ దోశ, బిస్కెట్‌ సైజు పార్టీ మినీ దోశ, కుండలో ఇచ్చే మట్కా, పాట్‌ దోశ, చిట్టి చిట్టి పారిజాత ఫ్లవర్‌ దోశల్లాంటివెన్నో ఉన్నాయి. ఇవేకాదు... ఫైర్‌, పిజ్జా, చాక్లెట్‌ పేర్లతోనూ బోలెడన్ని రకాలు పోస్తున్నారు. చూడ్డానికే కాదు, రుచిలోనూ దేనికదే నోరూరించేలా ఉంటాయివన్నీ కూడా.
ఈరోజుల్లో వెరైటీ ఫుడ్‌ కనిపిస్తే అది సోషల్‌ మీడియాలోకి చేరడం ఎంతసేపూ... దాని వివరాలు ప్రపంచమంతా పాకిపోవడం మరెంతసేపూ... అందుకే ఈ యమ్మీ యమ్మీ దోశలు కూడా బాగా వైరల్‌ అవుతున్నాయి. చేయి తిరిగిన షెఫ్‌ల చేతుల్లోకి చేరి అందరికీ సరికొత్త రుచిని పరిచయం చేస్తున్నాయి. టిఫిన్లన్నిటిల్లోనూ మీ ఓటు దోశకే అయితే గనక అందులోని ఈ వెరైటీల్ని తప్పకుండా ట్రై చేయాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..