కొమ్మల్లో కుహూలూ... కొండల్లో ‘ఎకో’లు!

హైదరాబాద్‌ అనగానే ట్రాఫిక్‌ రణగొణలూ, ఎండవేడీ మరింతగా గుర్తుకొచ్చే సీజన్‌ ఇది. వాటితో విసిగి వేసారి- ‘కాస్త చల్లగా సేదదీరడానికీ ప్రకృతి మధ్య గడపడానికీ¨ దగ్గర్లో ఏమున్నాయి?’ అని యోచించే వారిని రారమ్మంటున్నాయి ఈ అడవులు.

Updated : 31 Mar 2024 11:51 IST

హైదరాబాద్‌ అనగానే ట్రాఫిక్‌ రణగొణలూ, ఎండవేడీ మరింతగా గుర్తుకొచ్చే సీజన్‌ ఇది. వాటితో విసిగి వేసారి- ‘కాస్త చల్లగా సేదదీరడానికీ ప్రకృతి మధ్య గడపడానికీ¨ దగ్గర్లో ఏమున్నాయి?’ అని యోచించే వారిని రారమ్మంటున్నాయి ఈ అడవులు. ఒకటీ రెండూ కాదు... చుట్టూ విభిన్న రకాల అడవులున్న నగరం హైదరాబాద్‌. దక్షిణాన- నల్లమల, పశ్చిమాన- కర్ణాటక అడవులు, ఉత్తరాన- దండకారణ్యం, తూర్పున- ఏటూరునాగారం...ఇలా ఎటు వెళ్ళినా వైవిధ్య వనాలు తారసపడతాయి. హైదరాబాద్‌ నివాసులైనా లేక పర్యటకులుగా వచ్చినా సరే- కేవలం నాలుగైదుగంటల్లోనే ఈ దట్టమైన అడవుల్లోకి వెళ్ళొచ్చు. వేసవి వేళ చల్లగా సేదతీరొచ్చు. కొమ్మల్లోని కుహుకుహూరవాలు వింటూ... కొండల్లో ‘ఎకో’ టూరిజాన్ని ఆనందించొచ్చు!


హొన్నికేరి- కృష్ణజింకలతో భేటీ¨!

హైదరాబాద్‌కి పశ్చిమాన ఉన్న- కర్ణాటక రాష్ట్ర అటవీ ప్రాంతమైన ‘హొన్నికేరి అభయారణ్యం’ కృష్ణజింకలకు ప్రత్యేకం. ఈ అభయారణ్యంలో భాగంగా ఉన్న- విలాస్‌పూర్‌ చెరువు ఒడ్డున యాత్రికుల కోసం ప్రత్యేకంగా ‘బ్లాక్‌బక్‌ రిసార్ట్‌’ అని ఏర్పాటుచేశారు. నగర రణగొణలకి దూరంగా పక్షుల కిలకిలలు తప్ప మరేమీ వినిపించని స్వచ్ఛమైన నిశ్శబ్దాన్ని ఆస్వాదించొచ్చు ఇక్కడ. కర్ణాటకలో ప్రసిద్ధమైన గంధపుచెట్ల సువాసనల మధ్య రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవచ్చు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 24 గంటలపాటు సాగే ప్యాకేజీ ఇది. మధ్యాహ్న భోజనం తర్వాత- మనకోసం ఏర్పాటుచేసిన ఓ గైడ్‌  కృష్ణజింకల అభయారణ్యంలోకి తీసుకెళతారు. చెరువులో బోటింగ్‌ చేయిస్తారు. రాత్రివేళ వన్యమృగాలకి సంబంధించిన సినిమా ప్రదర్శన కూడా ఉంటుంది. అదయ్యాక- దట్టమైన అడవుల్లో సాహసయాత్రలు చేసిన సిబ్బందితో ఇష్టాగోష్టి ఏర్పాటు చేస్తారు. ఉదయం లేవగానే మళ్ళీ అభయారణ్యంలోకి తీసుకెళ్ళి- ఈసారి అక్కడి అరుదైన పక్షుల్ని చూపిస్తారు. కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న బ్లాక్‌బక్‌ రిసార్టులో బస ఛార్జీలు 3,500 నుంచి 4000 వేల రూపాయల దాకా ఉంటున్నాయి. హైదరాబాద్‌ నుంచి సుమారు 155 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హొన్నికేరి అభయారణ్యం. సొంత వాహనాలు లేనివాళ్ళు హైదరాబాద్‌ నుంచి బస్సులో బీదర్‌ పట్టణానికి రావొచ్చు. అక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ అభయారణ్యం.


అమ్రాబాద్‌- అదిగో పులి!

పులుల్ని జూలో కాకుండా వాటి సహజ వాతావరణంలో మనం చూడటమన్నది చాలా అరుదుగా దొరికే అనుభవమని చెబుతారు! అలాంటి అవకాశాలు పుష్కలంగా ఉన్న నల్లమల అభయారణ్యం ఇది. పులుల సంరక్షణలో దేశంలోనే ‘ది బెస్ట్‌’ అనిపించుకుంటోంది. ఒక్క నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అమ్రాబాద్‌ అభయారణ్యం పరిధిలోనే సుమారు 30 పెద్ద పులులు ఉన్నాయి. అందుకే ఇక్కడి ఎకో టూరిజం ప్యాకేజీకి కూడా ‘టైగర్‌ స్టే’ అని పేరుపెట్టారు. ప్యాకేజీలో భాగంగా ఈ అడవిలో 24 గంటలపాటు ఉండటానికి కావాల్సిన కాటేజీలని ఏర్పాటుచేశారు. గదుల రకాల్ని బట్టి రూ.4600 నుంచి రూ.8000 వరకూ తీసుకుంటారు. www,amrabadtigerreserve.com అన్న వెబ్‌సైట్‌లో కాటేజీలు ముందుగానే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం దాకా ఉండొచ్చు. కేవలం కాటేజీల్నీ, భోజన వసతుల్నీ మాత్రమే కల్పించి ఊరుకునే ప్యాకేజీ కాదిది. మనం 12 గంటలకి ఇక్కడికి చేరుకుంటే- 2.45 నుంచి గంటపాటు పర్యటకులకి ‘ఓరియంటేషన్‌’ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తారు. అనంతరం- పులుల సందర్శన కోసం దట్టమైన నల్లమల అడవుల్లో ఉన్న ఫర్హాబాద్‌కి సఫారీగా తీసుకెళతారు. పర్యటన నుంచి రాత్రి వచ్చాక అక్కడే బస చేసి మళ్ళీ ఉదయం ఆరు గంటలకి ట్రెకింగ్‌కి వెళ్ళాలి. అడవిలో ఏడుకిలోమీటర్ల దాకా సాగే నడక అది. అమ్రాబాద్‌ అభయారణ్యం హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్ళేదారిలో 162 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆర్టీసీ బస్సులో కూడా వచ్చి అభయారణ్యంలోనే ఉన్న
మన్ననూరు గ్రామంలో దిగొచ్చు.

నీల శ్రీనివాసులు, న్యూస్‌టుడే, అమ్రాబాద్‌


జన్నారం- పదండి దండకారణ్యం!

గోదావరి తీరాన సహ్యాద్రి శ్రేణుల నడుమ ఉన్న దట్టమైన దండకారణ్యం ఇది. 2012లోనే దీన్ని కవ్వాల్‌ పులుల అభయారణ్యంగా గుర్తించినా పదేళ్ళపాటు ఇక్కడ వాటి జాడలేదు. కానీ - 2020 తర్వాత పరిస్థితి మారింది. మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యంలో- పులుల సంఖ్య పెరిగి కొన్ని ఇక్కడికి రావడం మొదలుపెట్టాయి. అప్పటి నుంచి జన్నారానికి పర్యటకుల తాకిడి పెరిగి వారాంతాల్లో కిటకిటలాడిపోతోంది. పులులు కనిపించినా కనిపించకపోయినా కాకులు దూరని కారడవిలాంటి ఈ ప్రాంతంలో 20 కిలోమీటర్ల సఫారీ అద్భుతంగా ఉంటుంది. చిరుతలు, అడవి దున్నలు, మొసళ్ళు, ఉడుములు, జింకల్ని చూసేయొచ్చు. బైసన్‌కుంట, గోండుగూడ బేస్‌క్యాంపు మీదుగా మల్యాల్‌ వాచ్‌టవర్‌, కడెం ప్రధాన కాలువ దారిలో అడవి అందాలను తనివితీరా చూడొచ్చు. ఇందుకోసం మూడున్నర నుంచి నాలుగువేల రూపాయలదాకా వసూలు చేస్తున్నారు. అడవిలోనే రాత్రుళ్ళు బస చేయాలంటే రూ.1600 నుంచీ 1800 వరకూ తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఈ అభయారణ్యానికి హైదరాబాద్‌ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లోనూ ఇక్కడికి చేరుకోవచ్చు.  

 పూదరి సత్యనారాయణ, న్యూస్‌టుడే, జన్నారం


సంద్రంలాంటి చెరువు- పాకాల!

కాకతీయ గణపతి దేవ చక్రవర్తి నిర్మించిన చెరువు ఇది. ఎనిమిది వందలయేళ్ళుగా గండిపడని గట్టుతో- చుట్టుపక్కల గ్రామాలకే కాదు ఎన్నో వన్యజీవాలకీ జీవధారగా నిలుస్తోంది. కృష్ణానది ఉపనదుల్లో ఒకటైన మున్నేరుకి జన్మస్థానం కూడా ఇదే. అంతేకాదు... మనదేశంలోని అరుదైన ‘మంచినీటి అభయారణ్యా’ల్లో పాకాల ఒకటి. ఇంతకీ దేనికి అభయమిస్తుందిదీ అంటారా... మంచినీటి మొసళ్ళకి! ప్రపంచం నలుమూలల నుంచి అరుదైన పక్షులూ ఇక్కడకి వస్తుంటాయి. అందుకే- 816 ఎకరాల అటవీ ప్రాంతాన్ని కలిపి ‘పాకాల అభయారణ్యం’ అంటున్నారు. పర్యటకులు సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలూ చూడటానికి వస్తున్నారు. వరంగల్‌ జిల్లాలోని ఈ చెరువు చుట్టుపక్కల ప్రాంతాన్ని పార్క్‌గా అభివృద్ధిచేసిన పర్యటక శాఖ- అక్కడ హరిత కాటేజీలని నిర్మించింది. బస కోసం రోజుకి రూ.1500 వసూలు చేస్తోంది. దీనికి దగ్గర్లోని భీముని పాదం జలపాతం మరో ఆకర్షణ. వరంగల్‌ నుంచి 50కి.మీ. దూరంలో ఉంటుందీ చెరువు.


తాడ్వాయి- చేద్దామా సైకిల్‌ సఫారీ?

టూరు నాగారం... తెలంగాణలోని అతి పాత అభయారణ్యం. ములుగు జిల్లాలోని ఈ అభయారణ్యంలో ఎకో టూరిజం పర్యటనలకి కేంద్రబిందువు తాడ్వాయి. తెలంగాణ అటవీశాఖ ఇక్కడ వనజీవని పేరుతో కుటీరాలని నిర్వహిస్తోంది. మామూలు డబుల్‌ బెడ్రూమ్‌లతోపాటూ ఇదే ప్రాంగణంలో గుడారం(టెంట్‌) కూడా వేసుకునే అవకాశమూ ఉంది. రూ.4 వేలకి బస వసతినీ అందిస్తున్నారు. తెలంగాణలో మరే అటవీ ప్రాంతంలోనూ లేనివిధంగా ఇక్కడ ప్రత్యేక స్పీడ్‌ సైకిల్‌తో సఫారీ చేయొచ్చు. ఐదు కిలోమీటర్లపాటు సాగే ఈ అడవి సైక్లింగ్‌ మరపురాని అనుభూతినిస్తుంది. దాంతోపాటూ కారు సఫారీ కూడా ఉంది. అభయారణ్యంలోని కొండేటి వాగు వ్యూ పాయింట్‌ దాకా ట్రెకింగ్‌కి వెళితే అచ్చం పచ్చలు పొదిగినట్టుండే అడవి అందాలని- తనివితీరా ఆస్వాదించొచ్చు. ఈ మధ్యే లక్నవరం చెరువులో రాత్రిపూట గుడారాల బసనీ(నైట్‌ క్యాంపు)నీ పరిచయం చేశారు. తాడ్వాయికి సమీపంలోనే బొగత జలపాతమూ ఉంది. పులులు కనిపించకున్నా- చిరుతలూ, కృష్ణజింకల్ని చూడొచ్చు. జంతువులకన్నా దీన్ని పక్షుల వైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంగా చెప్పొచ్చు. పాలపిట్టలూ వివిధ రకాల చిలుకలూ పెలికాన్‌లూ అడుగడుగునా కనిపిస్తుంటాయి. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కి వస్తే- అక్కడి నుంచి 93 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తాడ్వాయి. కారులో సఫారీకి రూ.1500, సైకిల్‌కి రూ.100, రాత్రిపూట టెంట్‌కి రూ. 3,500... ఇలా ఉన్నాయి రుసుములు ఇక్కడ.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..