రక్త సంబంధం.. ఆ విషయం అజయ్‌కు పదకొండేళ్ళ క్రితమే తెలుసన్నమాట!

మా ఆయన ఇక లేరన్నది మనసు అంగీకరించడం లేదు. కానీ, అది నిజం. బుద్ధికి తెలుస్తోంది. పెద్దబ్బాయికి ఫోన్‌ చేశాను. వెంటనే బయలుదేరుతానన్నాడు. ఎంత వెంటనే బయలుదేరినా వాడు వచ్చేటప్పటికి రెండు రోజులు పడుతుంది. 

Updated : 11 Feb 2024 08:16 IST

- తోట సుబ్రహ్మణ్యం

మా ఆయన ఇక లేరన్నది మనసు అంగీకరించడం లేదు. కానీ, అది నిజం. బుద్ధికి తెలుస్తోంది. పెద్దబ్బాయికి ఫోన్‌ చేశాను. వెంటనే బయలుదేరుతానన్నాడు. ఎంత వెంటనే బయలుదేరినా వాడు వచ్చేటప్పటికి రెండు రోజులు పడుతుంది. వాడు అమెరికా వెళ్ళనన్నాడు. నేనూ మా ఆయనా బలవంతంగా పంపాం. ‘చాలామంది వెళ్ళి సంపాదించుకుంటున్నారు. నీకూ అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలి కదా’ అన్నారాయన.
‘అవును, మామీద నీకున్న ప్రేమ నీ అభివృద్ధికి ఆటంకం కాకూడదు’ అని నేనన్నాను. వాడికీ వెళ్ళాలని ఉంది. కానీ, మాకు తెలిసిన వారిలో కొందరు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి రాలేదు. ‘పున్నామ నరకం తప్పించని కొడుకు ఉన్నా, లేకపోయినా ఒకటే’ అని వాళ్ళ బంధువులు అనడం వీడు ఒకటి రెండుచోట్ల విన్నాడు. వాటిని గుర్తుచేస్తూ తాను వెళ్ళనన్నాడు.
‘మాకు ఆ నరకం తప్పించడానికి- స్వర్గం కాబోతున్న నీ భవిష్యత్తునూ నీ భార్యాపిల్లల భవిష్యత్తునూ త్యాగం చేయకూడదు. నీ త్యాగాన్ని మేము అంగీకరించడం మా స్వార్థం అవుతుంది. పిల్లల సుఖసంతోషాలకన్నా తల్లిదండ్రులకు గొప్ప స్వర్గం ఏముంటుంది? కష్టసుఖాలు పక్కపక్కనే ఉండటం సహజం కాబట్టి, భూలోకంలో ఈ స్వర్గం అనుభవించి, తర్వాత ఆ నరకానికి వెళతాంలే’ అని నవ్వారాయన. నేనూ శృతి కలిపాను.
‘మీకు ఏ కాస్త నలతగా ఉన్నా నాకు ఫోన్‌ చేయాలి. ఎంత పనున్నా వదిలేసి వచ్చి, చూసి వెళతాను. అందుకు మీరు ఒప్పుకుంటేనే వెళతాను.’
మేము ‘సరే’ అన్నాం. వాడు వెళ్ళాడు. ప్రతీ సంవత్సరమూ వచ్చి, చూసి వెళుతున్నాడు.
చిన్నోడు బెంగుళూరులోనే ఉంటాడు. వాడు ఆ ఒక్కసారి రావడానికీ ఇబ్బంది పడుతుంటాడు. ‘అమెరికా నుంచి అన్నయ్య వస్తుంటే, పక్క రాష్ట్రంలో ఉండి నేను రాకపోతే, మీరు ఫీలవుతారని పనులన్నీ మానుకుని రావలసి వస్తోంది’ అంటాడు. వాడేమన్నా మాకు ముద్దే. చిన్నపిల్లాడనే ఆలోచనలోనే ఉండేవాళ్ళం.
‘అంతేనా, ఇంకేమన్నా ఉందా?’ అని ఆటపట్టించేవారు ఆయన. అందుకో కారణం ఉంది. మాకు పెళ్ళై నాలుగేళ్ళైనా పిల్లలు కలగక ఓ లేడీ డాక్టర్‌ని కలిశాం. నాకు గర్భసంచి సరిగా అమరిలేదని చెప్పింది. అండం విడుదలవడం, పిండం ఏర్పడటం బాగానే జరిగినా, అది గర్భసంచిలోకి ప్రవేశించడం జరగక నేను గర్భం దాల్చడంలేదని చెప్పింది.
మేమిద్దరమూ చాలా బాధపడ్డాం.
అప్పుడామె సరొగసీ గురించి చెప్పింది. మేము కొన్ని రోజులు ఆలోచించుకున్నాం. ‘ఎవరినైనా పెంచుకుందాం’ అన్నారాయన.
నేనూ అంగీకరించాను కానీ, నాలో ఏదో అసంతృప్తి ఉండిపోవడం ఆయన గమనించారు. ‘ఎంత ఖర్చయినా ఎలాగో ఏర్పాటు చేస్తాను, సరొగసీకే వెళదాం’ అన్నారు. నేను ‘వద్దులెండి’ అనాలనుకున్నా కానీ అనలేకపోయాను. అందుకు- నా స్వార్థంకన్నా, ఆయన మీద ప్రేమే ఎక్కువ కారణం. ఆయన వారసత్వానికి నాలోని లోపం ఆటంకం కాకూడదు అనిపించింది.
డాక్టర్‌- ఓ స్త్రీని అందుకోసం ఒప్పించింది. ఆమె మా బిడ్డకు సరొగేట్‌ మదర్‌ కాబోతోంది. ఆమెకు మేమిద్దరమూ అడ్వాన్స్‌గా కృతజ్ఞతలు చెప్పాం. నా నుంచి అండాలనూ ఆయన శుక్రకణాలనూ డాక్టర్‌ తీసుకుంది. మాకు పాపనో బాబునో కచ్చితంగా అందజేస్తానని చెప్పింది. పదికి పైగా పిండాలు- అదే, ఇంగ్లిషులో ఎంబ్రియోస్‌- టెస్ట్‌ట్యూబ్‌లో తయారుచేసి, ఒకటి సరొగేట్‌లో ప్రవేశపెడతారు. అది సక్సెస్‌ కాకపోతే మరొకటీ మరొకటీ- సక్సెస్‌ అయ్యేవరకూ ఇంప్లాంట్‌ చేస్తారు.
చెప్పినట్లుగానే పది నెలల తర్వాత అజయ్‌ని ఇచ్చింది డాక్టర్‌. మా బిడ్డను తన గర్భాన మోసిన స్త్రీమూర్తికి అగ్రిమెంట్‌లో ఉన్నదానికన్నా ఎక్కువ ఇచ్చి, మనసా వాచా కృతజ్ఞతలు తెలిపి పంపాం. ఆమెను గర్భాన్ని అద్దెకిచ్చిన స్త్రీలా కాకుండా, మా పాలిట దేవతలా భావించాం.
డాక్టర్‌ అసాధ్యమని చెప్పింది- అజయ్‌ ఇంటికి వచ్చిన సంవత్సరం తర్వాత సాధ్యమైంది. ‘ఆమె తప్పు చెప్పింది’ అన్న దానిమీదకన్నా, అజయ్‌ ఇంటికి వచ్చిన వేళా విశేషం మీదే
నా దృష్టి ఎక్కువ పడింది. గర్భం దాల్చి, సంపూర్ణ స్త్రీత్వాన్ని పొందగలిగిన నాకు మా బంగారుకొండ మా ఇంటి ఇలవేల్పుగా అనిపించాడు. ఆయనకు వ్యాపారంలో ఊహించని అభివృద్ధి కనిపించింది. వజ్రాల మూట లాంటి మా బాబు మా ఇంటి అదృష్టంగా భావించారాయన. నా శరీర భాగాలు బాగానే ఉండటానికిగానీ ఆయన కృషికి ప్రతిఫలం లభించడానికిగానీ అజయ్‌ మా జీవితంలోకి రావడం కారణం కాకపోవచ్చు. కానీ, వాడే అందుకు కారణం అనుకోవడం మాకు ఆనందంగా ఉంది.
సంజయ్‌ కూడా పుట్టిన తర్వాత మా ఆనందం రెట్టింపైంది. ఇద్దరినీ అపురూపంగా పెంచుకున్నాం. అయినా, మేమిద్దరమే ఉన్నప్పుడూ ఏదైనా సందర్భం వచ్చినప్పుడూ ఆయన నన్ను ఆటపట్టించడానికి- నా గర్భాన మోసిన సంజయ్‌ అంటే నాకు ఎక్కువ ఇష్టమని అంటుండేవారు.
తెల్లవారుతున్నట్లు చిహ్నంగా తెల్లని కాంతి కిరణాలు కిటికీ అద్దాల్లోంచి మా బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించాయి.
అప్పటికి కూడా సంజయ్‌ నిద్ర లేవడు. కానీ, వాడికి నిద్రాభంగం కలగకూడదని- ఫోన్‌ చేయకుండా ఉండటం ఇంక నా వల్ల కాలేదు. చేశాను.
‘‘రాత్రి... అన్నయ్యా నేనూ కాన్ఫరెన్స్‌ కాల్‌లో మీ ఇద్దరితో మాట్లాడాం కదా. అప్పుడు బాగానే ఉన్నారు. ఇంతలో ఏమైంది?’’ అంటూ భోరుమన్నాడు.
‘‘ఏడవకు, నేను ధైర్యంగా ఉండలేను. తెల్లవారుజామున మూడున్నరకు నేను వాష్‌రూమ్‌కి వెళ్ళబోతూ డాడీ కాలూ చేయీ మంచం మీద నుంచి కిందికి వేలాడుతుండటం చూసి, పైకి సర్దాను. ఆయనలో చలనం లేదని తెలిసింది.


అంతకుముందు ఎప్పుడు ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయారో తెలీదు. అప్పటినుంచీ ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తున్నాను. అన్నయ్యకు వెంటనే ఫోన్‌ చేశాను, అప్పుడు అమెరికాలో పగలే కదా!’’ పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపట్టి అన్నాను.
‘‘ఏంటమ్మా, నా నిద్ర పాడవకూడదని ఇలా చేస్తావా? డాడీకన్నా నాకు నిద్ర ఎక్కువా?’’
‘‘వెంటనే బయలుదేరు. ఏం చేయాలో నాకు అర్థం కావడంలేదు. అప్పుడు ఏడిస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఇబ్బందిపడతారని ఏడుపును బలవంతంగా ఆపుకున్నాను. ఇప్పుడు ఏడుపు రావడం లేదు. ఆయనకు సునాయాస ముగింపునిచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు తెలపాలనిపిస్తోంది’’ అన్నాను.
‘‘అందరికీ నేను ఫోన్లు చేస్తాన్లే అమ్మా’’ అన్నాడు.
కొన్ని నిమిషాల తర్వాత కాలింగ్‌ బెల్‌ మోగింది. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. సంజయ్‌ ఫోన్‌ చేశాడని మా కుడిపక్క ఇంటాయన చెప్పాడు.
వాళ్ళ ఓదార్పు చూపులు నాలోని దుఃఖాన్ని పొంగించాయి. సుమారు మూడు గంటల నుంచీ నాలో దాగి ఉన్న ఒంటరితనపు భయమూ, నా శరీరాన్నీ హృదయాన్నీ ఎవరో సగానికి కోసి
తీసుకుపోతున్నట్లు కలుగుతున్న బాధా ఒక్కసారిగా పెల్లుబికాయి. భోరున ఏడ్చేశాను. నాతో ఎక్కువ స్నేహంగా ఉండేవారు కూడా ఏడ్చారు. అందరూ నన్ను ఓదార్చడం మొదలుపెట్టారు. తర్వాత బంధువులూ స్నేహితులూ పరిచయస్తులూ రావడంతో ఇంటిలోనూ కాంపౌండులోనూ జనం బాగా పెరిగారు. ఆయన స్నేహితులు కాంపౌండులో
టెంట్‌ వేయించి, అందులో కుర్చీలు వేయించారు.
సంజయ్‌ భార్యాపిల్లలతో కార్లో బయలుదేరినట్లు చెప్పాడు. అజయ్‌ తనకు మాత్రమే ఫ్లైట్‌ టికెట్‌ దొరికిందనీ తన భార్యాపిల్లలకు తర్వాత దొరుకుతాయనీ తెలిపాడు.
అంతవరకూ జరగవలసింది జరుగుతున్నట్లు అనిపించింది. కానీ, అజయ్‌ అన్న ఒక మాటకు నా తల తిరిగినట్లనిపించింది... ‘‘సంజయ్‌ను తలకొరివి పెట్టమని చెప్పమ్మా’’ అన్నాడు.
‘‘అన్నయ్య ఏంటమ్మా, నన్ను తలకొరివి పెట్టమంటున్నాడు?’’ కొన్ని నిమిషాల తర్వాత సంజయ్‌ కాల్‌ చేసి అడిగాడు.
‘‘ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడదాం’’ అని మాత్రమే ఇద్దరితో అనగలిగాను.
‘రెండేళ్ళక్రితం ఆ లేడీ డాక్టర్‌ చెప్పింది ఆయన అజయ్‌తో చెప్పుంటారా?’ అనిపించింది. కచ్చితంగా చెప్పుండరని నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను.
ఆయన పార్థివ శరీరం పాడవకూడదని ఫ్రీజర్‌ బాక్స్‌ తెప్పించి, అందులో పెట్టించారు.
సంజయ్‌కి ఫోన్‌ చేసి, ‘‘అన్నయ్య రావడానికి సమయం పడుతుంది కాబట్టి, కాస్త నెమ్మదిగా డ్రైవ్‌ చేస్తూ, జాగ్రత్తగా రండి’’ అని చెప్పాను. ‘తలకొరివి పెట్టేది అజయ్యే’ అనే అర్థం ధ్వనించేలా పలికాను.
పిల్లలిద్దరితో ఆయన స్నేహితులు మాట్లాడుతూనే ఉన్నారని వాడి మాటల ద్వారా తెలిసింది. ఇక్కడ జరుగుతున్నవన్నీ వాళ్ళకు తెలుస్తున్నాయి. వాళ్ళు చెప్పేవి వీళ్ళు చేస్తున్నారు.
‘కొడుకులిద్దరూ మంచివాళ్ళే కాబట్టి ఆయనకు పున్నామ నరకముండదు’ అనిపించింది. వస్తున్న నవ్వును ఆపుకున్నాను. ‘ఎంత చదువుకున్నా మన సంప్రదాయపు ఆలోచనలు పోవు’ అనుకున్నాను.
ఆయనకు ఏదైనా నరకం తప్పిందంటే అది ఏ అనారోగ్యంతోనో నెలలూ సంవత్సరాలూ మంచంలో గడపకపోవడమే. మంచి కొడుకులను కలిగి ఉండటమే అందుకు కారణమేమో. ‘పుం’ అనే పేరుగల నరకాన్ని ‘పున్నామ నరకం’ అంటారని ఎవరో ప్రవచనకర్త చెప్పగా విన్నట్లు గుర్తు. దాని అర్థం కూడా జ్ఞాపకమొస్తోంది- మరలా జన్మించి, మళ్ళీ మరణించడమే ఆ నరకమట. పుత్రుడు పుడితేనే సరిపోదట, ఆ కొడుకు సత్కర్మలను ఆచరించేవాడైతేనే ఆ నరకం తప్పుతుందట. అటువంటి పుత్రుడు తమ దహన సంస్కారాలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అటువంటి పుత్రికైనా ఫర్వాలేదు. స్త్రీకి నెలకొకసారి కలిగే ఇబ్బంది వల్ల ఆ సమయంలో ఇటువంటివి చేయలేక ఇబ్బందిపడతారని అప్పటి పండితులు పుత్రికల
ప్రస్తావన తేలేదు. టెక్నాలజీ ఇంత డెవలప్‌ అయిన తర్వాత స్త్రీలకు అది అంత ఇబ్బంది కావడం లేదు. ఉత్తమ పుత్రికను కలిగినవారు కూడా ఆ నరకాన్ని తప్పించుకోగలరు. ఉత్తమ దత్తత బిడ్డలున్నా సరిపోతుందని శాస్త్రం చెబుతోంది. సంతానం లేనివారు అనాథాశ్రమం నుంచి పాపనో బాబునో దత్తత తీసుకుంటే, వాళ్ళకు తల్లిదండ్రుల ప్రేమ దక్కుతుంది, వీరికి పున్నామ నరకం తప్పుతుంది. అందుకే ఆయన దత్తత తీసుకుందామన్నారని నాకిప్ప్పుడు అర్థమవుతోంది. నాక్కూడా ఆ నరకం ఉండదు.
ఎందుకంటే- వాళ్ళు నాక్కూడా కొడుకులే కదా. పుడితే మేము ఇద్దరమూ మళ్ళీ పుట్టాలి, లేకపోతే ఇద్దరమూ పుట్టకూడదు. మరో జన్మలోనైనా వేరొకరితో నా జీవితం అనే భావన కూడా నేను భరించలేను. ఇద్దరమూ అలా జీవించాం. కుటుంబాన్ని అలా నడుపుకొచ్చాం.
సంజయ్‌ వచ్చిన తర్వాత ఏవో జాగ్రత్తలు చెప్పి, ఆయన స్నేహితులు వెళ్ళారు. దూరపు బంధువులు కూడా ‘రేపు వస్తాం’ అని బయలుదేరారు. దగ్గర బంధువులు రాత్రి ఇక్కడే బస చేశారు.
మర్నాడు సాయంత్రానికి అజయ్‌ వచ్చాడు. సంజయ్‌నీ నన్నూ ఓ గదిలోకి తీసుకెళ్ళాడు. ‘‘నేను మొదటిసారి అమెరికా వెళుతున్నప్పుడు- నన్ను తన గర్భాన మోసిన అమ్మ- దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో కలిసింది. అక్కడ పనిచేస్తోందట. కొన్ని రోజులు కుటుంబంతో గడిపి వెళ్ళడానికి ఇండియాకి వస్తోందట. అనుకోకుండా నా పర్సులో నీ ఫొటో చూసి నన్ను గుర్తుపట్టింది. సరొగసీ నిర్వహించిన డాక్టర్‌ చేసిన తప్పు నాకు చెప్పింది.
ఆ డాక్టర్‌ వేరే డాక్టర్‌తో మాట్లాడుతుంటే విన్నదట. ఆమెకు డబ్బు అవసరం చాలా ఉండటంతో ఆ తప్పు తనకు తెలిసినా డాడీకీ నీకూ చెప్పలేదట’’ అన్నాడు.


షాక్‌ నుంచి తేరుకోవడానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. రెండేళ్ళ క్రితమే ఆయనకూ నాకూ ఈ విషయం తెలిసింది. అజయ్‌కు పదకొండేళ్ళ క్రితమే తెలుసన్నమాట! ప్రతీ సంవత్సరమూ ఇండియాకు వస్తూ కూడా ఎప్పుడూ బయటపడలేదు, ప్రవర్తనలో మార్పు రాలేదు. సొంత కొడుకులానే ప్రేమగా ఉన్నాడు. సొంత తమ్ముడిని చూసుకున్నట్లే సంజయ్‌ని చూసుకున్నాడు.
ఆ డాక్టర్‌ని- ఆమె కూతురూ అల్లుడూ ఒక యాక్సిడెంట్‌లో చనిపోయినప్పుడు ఆయనా నేనూ వెళ్ళి పరామర్శించాం. ‘మిమ్మల్ని మోసం చేశాను. మీ ఎంబ్రియోస్‌లో ఏదీ
సరొగేట్‌లో సర్వైవ్‌ కాకపోవడంతో వేరే వారి ఎంబ్రియోస్‌లో ఒకటి మీ సరొగేట్‌లో ఇంప్లాంట్‌ చేశాను.
మీ దగ్గర తీసుకున్న అడ్వాన్స్‌ అమౌంట్‌ తిరిగివ్వడానికి మనసంగీకరించక, మీరింకా ఇవ్వబోయే డబ్బును వదలుకోలేక తప్పు చేశాను. ఇంకా ఎవరెవరికి ఏమేమి చేశానోగానీ, అందులో ఏ పాపమో నా కూతుర్నీ అల్లుణ్ణీ బలి తీసుకుంది’ అని చెప్పింది.
ముందు మేమిద్దరమూ నిర్ఘాంతపోయినా, తర్వాత అజయ్‌లాంటి అబ్బాయి మా కొడుకుగా పెరిగినందుకు సంతోషించాం. వాడు మా అబ్బాయి కాదనే భావనను మా మనసులు అంగీకరించలేదు. భవిష్యత్తులో కూడా ఆ భావన మా మనసుల్లోకి రానివ్వకూడదని ఒట్టు పెట్టుకున్నాం. ఆ డాక్టర్‌ చెప్పింది అక్కడే వదిలేశాం. తర్వాత అజయ్‌ రెండుసార్లు ఇండియాకు వచ్చినప్పుడూ ‘మా పెద్ద కొడుకు, మా వరాల మూట’ అనే భావనలోనే ప్రేమగా చూసుకున్నాం. డాక్టర్‌ మాటలు మాకు అస్సలు గుర్తురాలేదు.
ఈ విషయమంతా నేను చెప్పిన తర్వాత సంజయ్‌ ‘‘పదకొండేళ్ళుగా అన్నయ్యకు తెలుసు, రెండేళ్ళుగా మీ ఇద్దరికీ తెలుసు. ఎవరూ నాకు చెప్పలేదు. నా అన్నయ్యను నేను దూరం పెడతాననుకున్నారా మీరంతా?’’ అంటూ అజయ్‌ని కౌగిలించుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. మా ముగ్గురి మనసులూ ఆత్మీయతతో నిండిపోయి, ఆరు కళ్ళూ తడిసి ముద్దయ్యాయి.
అజయ్‌ మారుమాట్లాడకుండా తలకొరివి పెట్టడానికి సిద్ధమయ్యాడు. వాడు పెడితేనే ఆయన ఆత్మ సంతోషిస్తుందని సంజయ్‌ కళ్ళూ నా కళ్ళూ చెప్పుకున్నాయి. ఎప్పుడూ వాడ్ని కొడుకనే ప్రేమించాం. అంతకన్నా ఎక్కువ ప్రేమనే వాడూ మా మీద చూపించాడు. అంతకన్నా అర్హత ఏం కావాలి? సైన్స్‌, లాజిక్‌ లాంటి మాటల్ని మనసులోకి రానివ్వలేదు.
ఇద్దరు ఉత్తమ కుమారులున్న మాకు పున్నామ నరకం ఉండదనే భావన నా మనసులో బలంగా పడింది. దాన్ని గట్టిగా నమ్మాలనిపించింది.
నన్ను అమెరికా తీసుకెళ్ళిపోయి తన దగ్గరే ఉంచుకోవాలనీ పాస్‌పోర్ట్‌కి అప్లై చేయడానికి సంతకాలు పెట్టమనీ అజయ్‌ చాలా పట్టుపట్టాడు. ఆయనా నేనూ కలలుగని కట్టుకున్న ఇంటిని వదిలి ఎక్కడకూ రానని చెప్పేశాను. పెద్ద దినం అయిపోయాక వాడు బయలుదేరుతున్నప్పుడు ‘‘నాక్కూడా ఇలాగే జరుగుతుందని మాటివ్వు’’ అని చేయి చాపాను.
అన్నదమ్ములిద్దరూ ఆ చేతిని గట్టిగా పట్టుకుని గొల్లున ఏడ్చారు. మమ్మల్ని చూసినవారు- రెండేళ్ళ క్రితం డాక్టర్‌ చెప్పిందీ దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో సరొగేట్‌ మదర్‌ చెప్పిందీ నమ్మరు.
మమతలకు రక్త సంబంధం అవసరం లేదని తెలిసినవాళ్ళు మాత్రమే మా ప్రేమానుబంధాన్ని నమ్ముతారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..