గురుబ్రహ్మ

ఒక ఎస్‌ఐ, మరో ఏఎస్‌ఐ, ఓ హెడ్‌ కానిస్టేబుల్‌, అరడజను మంది కానిస్టేబుల్స్‌ విధులు నిర్వర్తించే పోలీస్‌ స్టేషన్‌ అది. చుట్టూ ప్రహరీగోడ కలిగిన ఓ పెద్ద ప్రాంగణంలో రెండొందల గజాల స్టేషన్‌.

Updated : 03 Mar 2024 00:21 IST

 కారంపూడి వెంకట రామదాస్‌

ఒక ఎస్‌ఐ, మరో ఏఎస్‌ఐ, ఓ హెడ్‌ కానిస్టేబుల్‌, అరడజను మంది కానిస్టేబుల్స్‌ విధులు నిర్వర్తించే పోలీస్‌ స్టేషన్‌ అది. చుట్టూ ప్రహరీగోడ కలిగిన ఓ పెద్ద ప్రాంగణంలో రెండొందల గజాల స్టేషన్‌.

వయోభారాన్ని లెక్కచేయక ఎండలో వచ్చిన రఘురాం ఆ స్టేషన్‌ వరండాలో ఉన్న బెంచీ పైన కూలబడి బడలిక తీర్చుకున్నాడు. అక్కడి పోలీసులెవరూ అతడు ఆ వయసులో అంత కష్టపడి ఎందుకొచ్చాడో అని ఆరాతీసే ప్రయత్నం కూడా చేయలేదు.

ఇంతలో ఏఎస్‌ఐ మురళి లోపలి నుండి బయట కొచ్చి బెంచీ మీద కూర్చుని ఉన్న రఘురాంని చూసి ‘ఊఁ... మళ్ళీ వచ్చాడూ’ అని మనసులో అనుకుని పట్టించుకోకుండా వెళ్ళబోయాడు.

‘‘సార్‌, ఒక్కసారి నా మాట వినండి, నాకు న్యాయం చెయ్యండి’’ అంటూ ఏఎస్‌ఐని బతిమాలుకున్నాడు రఘురాం.

‘‘పెద్దాయనా! ఎన్నిసార్లు చెప్పాను, ఇక్కడికి రావద్దనీ వచ్చినా ఏ ఫలితం ఉండదనీ.

అయినా వస్తూనే ఉన్నావు. నీది వృథా శ్రమ. వెళ్ళిపో. అసలే ఈ రోజు కొత్త ఎస్‌ఐ వస్తున్నారు. బయటకి నడువు’’ కటువుగా ఉన్నాయి మురళి మాటలు.

ఇంతలో లోపలి నుండి హెడ్‌ కానిస్టేబుల్‌ అక్కడికొచ్చి రఘురాం జబ్బపట్టుకుని- ‘‘ఇన్‌స్పెక్టరుగారు వెళ్ళిపొమ్మని చెప్పారుగా... అర్థంకాలే? ముందు ఇక్కడి నుండి కదులు. అంతగా ఓపికుంటే పోయి అగో... ఆ చెట్టుకింద కూర్చో లేదా ఇంటికి పో. అంతేగానీ, ఇక్కడ వరండాలో మాత్రం ఉండకు’’ అంటూ రఘురాంని అక్కడి నుండి ఆరుబయటకి నెట్టేశాడు.

సూర్యునికాంతి చుర్రున శిరస్సుని తాకేసరికి తాళలేక లేని ఓపికని తెచ్చుకుని అక్కడున్న వేప చెట్టుకేసి అడుగులేశాడు రఘురాం.

ఇంతలో ఓ రెండు పోలీస్‌ వాహనాలు వేగంగా వచ్చి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఆగాయి.

మడత నలగని ఖాకీ డ్రస్‌ ధరించిన ఓ మెరుపు తీగలాంటి అమ్మాయి జీపులోంచి కిందకి దిగింది.

అక్కడి పోలీస్‌ స్టాఫ్‌ మొత్తం అటెన్షన్‌లో నిలబడి ఆ కొత్త ఎస్‌ఐకి సెల్యూట్‌ చేస్తూ స్వాగతం పలికారు.

చిరునవ్వుతో థ్యాంక్స్‌ చెబుతూ స్టేషన్‌ లోనికి అడుగుపెట్టింది ఆమె.

‘ఈవిడే కొత్త ఎస్‌ఐ... పేరు గౌరి. చండశాసనురాలు’ అంటూ కానిస్టేబుల్స్‌ తమలో తాము గుసగుసలాడుకున్నారు.

ఎస్‌ఐ వెనుకే నడిచిన ఏఎస్‌ఐ, ఆమెకి పోలీస్‌ స్టేషన్‌ మొత్తం చూపిస్తూ, ‘ఇది మీ సీటు...’ అంటూ సెపరేట్‌ రూమ్‌లో ప్రత్యేకంగా ఉన్న టేబులూ కుర్చీ చూపించాడు. ఆమె కూర్చోగానే ఏఎస్‌ఐ స్టాఫ్‌ని ఒక్కొక్కరిగా అక్కడికి పిలిచి అందరినీ ఆమెకు పరిచయం చేశాడు. అలాగే స్టాఫ్‌కి ‘ఈమె గౌరి... ఎస్‌ఐగా ప్రమోషన్‌ మీద మన స్టేషన్‌కి వచ్చారు...’ అంటూ పరిచయం చేశాడు.

పోలీస్‌ స్టేషన్‌ మొత్తం నిశితంగా పరిశీలించిం దామె. కిళ్ళీ మరకలతో పెచ్చులూడిపోయిన గోడలూ, ఊడటానికి సిద్ధంగా ఉన్న పైకప్పు ఫ్యానులూ... రంగులూడిన ఊచలతో ఉన్న లాకప్‌ రూమ్‌... ఓ మూల స్టాండ్‌కి తుప్పు పట్టిన తుపాకీలూ దిష్టిబొమ్మల్లా దర్శనమిచ్చాయి. ఆ స్టేషన్‌ దుస్థితి ఆమెకి అరగంటలోనే అర్థమైపోయింది.

‘‘ఆఁ... చూడండి మురళిగారూ, మన అండర్లో ఉన్న పెండింగ్‌ కేసుల ఫైల్స్‌ని నా టేబుల్‌ మీద ఉంచండి. అలాగే ఈ పోలీస్‌ భవనాన్ని ఆధునీకరించడానికి అవసరమయ్యే ప్రపోజల్‌ సిద్ధం చెయ్యండి, ఎస్పీ గారితో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది. నెల తిరిగేసరికి ఈ స్టేషన్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోవాలి’’ అంది గౌరి.

వచ్చీ రావడమే విధులలో తలదూర్చిన ఆమె తీరు చూసి ‘ఈమె సామాన్యురాలు కాదు’ అనుకున్నారు అక్కడి స్టాఫ్‌.

కాసేపు పిచ్చాపాటీ మాట్లాడిన స్టాఫ్‌, గౌరి ఆజ్ఞపై వారివారి సీట్లకి వెళ్ళి ఎవరి పని వారు చూసుకోసాగారు.

చెట్టునీడలో నిలబడి కొత్త ఎస్‌ఐ కోసం పోలీసులు చేసిన హంగామా అంతా గమనించిన రఘురాం, వారంతా లోపలికి వెళ్ళిపోవడంతో మళ్ళీ స్టేషన్‌ కేసి కదిలి అక్కడున్న బెంచీపైన చతికిలపడ్డాడు.

కొత్త ఎస్‌ఐని కలిసే అవకాశం కోసం ఆశతో ఎదురుచూశాడు.

సుదీర్ఘంగా ఫైల్లో లీనమైన గౌరి ఓ కేస్‌ డీటైల్స్‌ని గంటలో స్టడీ చేసి రూమ్‌ నుండి బయటకొస్తూ-

‘‘చూడండి మురళిగారూ, నేను మన హెడ్‌ కానిస్టేబుల్‌ సైదుల్ని తీసుకుని ఓ అర్జంట్‌ కేసు విషయమై బయటకెళ్తున్నా... ఏదైనా అవసర మైతే నా మొబైల్‌కి కాల్‌ చెయ్యండి’’ అంటూ హెడ్‌ కానిస్టేబుల్ని వెంటబెట్టుకుని బయటకి నడిచింది.

సైదులు ముందు నడవగా, గౌరి ఫైల్‌ చేతిలో పట్టుకుని వరండా మీదుగా వడివడిగా నడుస్తూ తన వాహనం వైపు కదిలింది.

కొత్త ఇన్‌స్పెక్టర్‌ బయటకి రావడం చూసిన రఘురాం అదే అదనుగా- తన పక్కనుండి వెళ్తున్న గౌరిని ఉద్దేశించి ‘‘మేడమ్‌, అమ్మా...’’ అంటూ శక్తికొద్దీ గట్టిగా పిలిచే ప్రయత్నం చేశాడు. కానీ నీరసం చేత ఆ మాటలు అతడి నోటినుండి బలంగా బయటపడలేదు.

ఎవరో తనని పిలిచినట్టనిపించి ఒక్కసారి ఆగి వెనుతిరిగి చూసింది గౌరి. బెంచీ మీద పెద్దాయన తనకేసే చూస్తున్నాడు. అప్పుడు నిశితంగా గమనించింది ఆయనని. ఏదో అనుమానంతో వెనుతిరిగి ఆ పెద్దాయన కేసి పడ్డాయి గౌరి అడుగులు.

ఇది గమనించిన హెడ్‌ కానిస్టేబుల్‌, ‘‘మేడమ్‌, ఆయన మాటలు పట్టించుకోకండి... మనం వెళ్దాం పదండి’’ అని, ‘‘ఓ పెద్దాయనా... ఇక్కడికి రావద్దని నీకు చెప్పానా’’ అంటూ రఘురాం కేసి ఉరుముతూ చూశాడు.

‘‘ఊఁ... ఆగు సైదులూ’’ అంటూ హెడ్‌ కానిస్టేబుల్ని వారించింది గౌరి.

రఘురాంని సమీపించి ఎగాదిగా అతడికేసి చూసింది. క్రమేపీ ఆమె మొహంలో ఆనందాశ్చర్యాలు తొణికిసలాడాయి.

‘‘సార్‌... మీరూ... మీరు... రఘురాం మాస్టారు కదా..?’’ చాలా ఆనందంగా అంది గౌరి.

ఈ మాటలకి అయోమయంలో పడ్డాడు రఘురాం. ‘తనని పేరుపెట్టి పిలిచే ఈ అధికారిణి ఎవరు చెప్మా..?’ అనుకుంటూ కళ్ళు విప్పార్చి మరీ ఆమెని గుర్తుపట్టేందుకు ప్రయత్నించాడు.

‘‘నేను మాస్టారూ... గౌరిని. మీ స్టూడెంట్‌ గౌరిని. రాజమండ్రిలో ఉన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాను. మీ ఇంటికి వచ్చి ట్యూషన్‌ కూడా చెప్పించుకొనేదాన్ని. గుర్తుపట్టారా..?’’ అంటూ ఎగ్జయిట్‌మెంట్‌తో తనని పరిచయం చేసుకుంది గౌరి.

రెండు నిమిషాలు గౌరిని దీర్ఘంగా కిందనుండి పైకి పరిశీలించాడు రఘురాం. ఆమెని గుర్తుపట్టడా నికి ప్రయత్నించాడు. కాసేపటికి- ‘‘ఆఁ... గౌరీ... అదే... మిద్దే గౌరివి కదా’’ అంటూ ఇంటిపేరుతో సహా ఆమెని గుర్తుపట్టాడు.

‘‘ఆఁ... ఆఁ... మిద్దే గౌరినే మాస్టారూ.

ఇన్ని సంవత్సరాలు గడిచినా నన్ను గుర్తు పట్టగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది మాస్టారూ’’ అంటూ వంగి రఘురాం పాదాలకి నమస్కరించింది గౌరి.

గౌరి చర్యకి కంగారుపడుతూ, ‘‘లే... లే... తల్లీ’’ అంటూ ఆమెని భుజాలు పట్టుకుని పైకి లేపాడు.

‘‘మాస్టారూ, మీరు ఇలా పోలీస్‌ స్టేషన్‌కి రావడమేంటి..?’’ తన సందేహాన్ని వ్యక్తపరిచింది గౌరి.

‘‘అదీ... అదీ...’’ అంటూ సైదులుకేసి సందేహిస్తూ చూశాడు రఘురాం. ఇది గమనించిన గౌరి-

‘‘సైదులూ, నువ్వు నాతో రానవసరం లేదు. డ్రైవర్‌ కూడా అవసరం లేదు, నేనే వెళ్తా. నువ్వు ఇక్కడే వేరే పని చూసుకో’’ అని చెప్పి, ‘‘మాస్టారూ... మీరు నాతో రండి, మనం వెళ్తూ మాట్లాడుకుందాం’’ అంది. రఘురాం ఆమెని అనుసరించాడు. గౌరి స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ జీపును తిన్నగా ఓ పెద్ద హోటల్‌ ముందు ఆపింది.

లేడీ ఇన్‌స్పెక్టర్‌ తమ హోటల్‌కి రావడం చూసి కాస్త కంగారు పడ్డాడు అక్కడి మేనేజర్‌. స్వయంగా వచ్చి వారికి ఏం కావాలో అడిగాడు.

‘‘మంచి స్ట్రాంగ్‌ కాఫీ రెండు పంపు’’ అంది గౌరి. నిమిషాలలో పొగలు కక్కుతున్న రెండు కాఫీలు వారి టేబుల్‌పైకి చేరాయి.

రఘురాం కాఫీ అందుకుని ఊదుకుంటూ కొంచెం కొంచెం సిప్‌ చేశాడు. కాఫీ గొంతులో పడేసరికి అతడి మొహంలో కొంత రిలీఫ్‌ కనబడింది.

‘‘ఆఁ మాస్టారూ... ఇప్పుడు చెప్పండి పోలీస్‌ స్టేషన్‌తో మీకు ఏం పని?’’ అడిగింది గౌరి.

‘‘ఆఁ... అదీ... మా అమ్మాయి సంధ్య నీకు గుర్తుండే ఉంటుంది కదా..? ఆమె విషయం మాట్లాడదామని వచ్చాను.’’

‘‘సంధ్య గుర్తులేకపోవడమేమిటి మాస్టారూ..? నేనూ సంధ్యా ఒకే ఈడు వాళ్ళం. నాకంటే సంధ్య ఒక సంవత్సరం పెద్దనుకుంటా. ‘అక్కా’ అని పిలిచేదాన్ని. అందరూ మేమిద్దరం అక్కచెల్లె ళ్ళలా ఉంటామని అనేవారు. మా ఇద్దరికీ చాలా పోలికలున్నాయని మీరే స్వయంగా అనేవారు. ఆఁ... సంధ్యక్కకి ఏమైంది..? బాగుంది కదా?’’ ఆతృతగా అంది గౌరి.

‘‘అదీ... సంధ్యకి రెండేళ్ళక్రితమే పెళ్ళి చేసి పంపాను. కొన్నాళ్ళు వాళ్ళ కాపురం బాగానే సాగింది. కానీ గత కొన్నాళ్ళుగా అటు అత్తింటివారూ ఇటు భర్తా సంధ్యని ఏదో వంకతో వేధిస్తున్నారు. ఈ విషయం ఫోన్‌లో నాతో చెప్పుకుని బాధపడేది. వారి కాపురం సజావుగా సాగడానికి నేను చేయవలసిన ప్రయత్నమంతా చేశాను. అయినా ఫలితం లేదు. ఒకే ఊరులో ఉంటున్నా, ఏడాదిగా ఒక్క రోజు కూడా వాళ్ళు సంధ్యని పుట్టింటికి పంపిన పాపానపోలేదు. మేం వెళ్ళి కలుద్దామన్నా కలవనివ్వడం లేదు. అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడ్డమే తప్ప, కూతుర్ని కళ్ళారా చూసుకునే భాగ్యం లేకపోయింది. ఈమధ్య ఫోన్‌ కూడా రావడం లేదు. విసిగి ఇక పోలీసుల్ని ఆశ్రయించక తప్పలేదు. కానీ మీవాళ్ళు కంప్లైంట్‌ తీసుకోవడం లేదు. అందుకే పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నాను.’’

గౌరికి విషయం అర్థమై చాలా బాధపడింది. సంధ్యని అత్తింటివారు వేధిస్తున్నారా..? పాపం. అయినా తమ పోలీసులు కంప్లైంట్‌ ఎందుకు తీసుకోవడంలేదు? సంధ్య అత్తింటివారు పరపతి గలవారా..? చట్టాన్ని మేనేజ్‌ చేస్తున్నారా..? అదే నిజమైతే తానుండగా అలా జరగనివ్వదు. ఈ కేసుని పరిష్కరించి సంధ్యకి న్యాయం చేసి రఘురాం మాస్టారికి మనశ్శాంతి కలిగించాలని ధృఢంగా నిశ్చయించుకుంది.

‘‘మాస్టారూ, ఇప్పుడు నేనే ఈ ఊరి పోలీస్‌ స్టేషన్‌కి హెడ్‌. అక్క కేసు నేను చూసుకుంటా. రెండు మూడ్రోజుల్లో మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను. సంధ్య అడ్రస్‌ వివరాలు ఇవ్వండి. అలాగే మీ మొబైల్‌ నంబర్‌ కూడా ఇవ్వండి’’ అంది గౌరి.

రఘురాం సంధ్య ఉండే అడ్రస్‌ చెప్పగా నోట్‌ చేసుకుంది. అలాగే అతడు చెప్పిన మొబైల్‌ నంబర్‌ను తన ఫోన్లో ‘గురుబ్రహ్మ’ అంటూ సేవ్‌ చేసుకుంది. తన నంబరు కూడా మాస్టారికి ఇచ్చి ఏదైనా అవసరమైతే ఫోన్‌ చెయ్యమంది. ఆ తరవాత మాస్టార్ని తన వాహనంలో ఆయన ఇంటికి దగ్గర్లో విడిచిపెట్టి వెంటనే సంధ్య విషయం ఏంటో చూద్దామని ముందుకు కదిలింది.

*           *            *

సంధ్య ఉంటున్న ఇల్లు పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు గౌరికి. ఇల్లు చేరి కాలింగ్‌బెల్‌ నొక్కింది. కాసేపటికి తలుపు తెరుచుకుని ఓ వ్యక్తి బయటకొచ్చాడు. ఎదురుగా పోలీసుని చూసి కాస్త కంగారు పడ్డాడు.

‘‘సంధ్యని కలవడానికొచ్చా... కాస్త పిలవండి. ఆమె స్నేహితురాలినని చెప్పండి. ఆఁ... ఇంతకీ సంధ్యకి మీరు ఏమౌతారు?’’ అడిగింది గౌరి ఆ వ్యక్తిని.

సంధ్యని పిలవమనేసరికి గౌరి వైపు తొట్రుపాటుగా చూశాడా వ్యక్తి.

‘‘నాపేరు వినాయకరావు. నేను సంధ్యకి పినమామగారినౌతాను. అంటే, సంధ్య మామగారికి తమ్ముడ్ని. మీకు సంధ్య గురించి తెలిసినట్టు లేదు. పూర్తిగా చెప్తాను వినండి’’ అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు.

వినాయకరావు చెప్పింది విన్న గౌరికి షాక్‌ తగిలింది. అలాంటిలాంటి షాక్‌ కాదు... మెదడంతా మొద్దుబారిపోయి ఏదో శూన్యం ఆమెని ఆవరించింది. ఒక్కసారిగా సత్తువ కోల్పోయినట్టని పించింది. ఏం మాట్లాడాలో పాలుపోలేదు. శక్తిని కూడదీసుకుని లేచి నిశ్శబ్దంగా అక్కడి నుండి బయటపడింది. వెంటనే జీపుని పోలీస్‌ స్టేషన్‌కేసి పోనిచ్చింది.

*           *            *

‘‘మురళిగారూ, ఇక్కడికి రోజూ వస్తున్న రఘురాం మాస్టారు, అదే ఆ పెద్దాయన కేసు గురించి నేను విన్నది నిజమేనా?’’ పోలీస్‌ సేష్టన్‌లో అడుగుపెడుతూనే ఏఎస్‌ఐని పిలిచి తాను విన్నది వివరించి డైరెక్టుగా ప్రశ్నించింది.

‘‘అవును మేడమ్‌... మీరు విన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. ఒక్క నిమిషం’’ అంటూ షెల్ఫ్‌లో ఉన్న ఓ ఫైల్‌ని ఆమె టేబుల్‌పైన ఉంచి, ‘‘మేడమ్‌... ఈ ఫైల్‌ సంధ్య కేసుకి సంబంధించింది. చదివితే మీరు విన్నది నిజమేనని నిర్ధారణ చేసుకోవచ్చు’’ అన్నాడు మురళి.

మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఫైల్లో రిపోర్ట్‌ని చదివింది. అంతా గందరగోళంగా అనిపించింది. వెంటనే మాస్టారింటికి వెళ్ళాలని నిర్ధారించుకుంది.

*           *            *

రఘురాం ఇంటికి చేరుకుని గౌరి కాలింగ్‌బెల్‌ నొక్కింది. కాసేపటికి తలుపు తెరుచుకుంది. ఎదురుగా తలుపు తెరచిన ముత్తైదువును చూసి మాస్టారి భార్యగా గుర్తుపట్టింది.

‘‘అమ్మా, మీరు సంధ్య తల్లి కనకమహాలక్ష్మి గారు కదూ...’’ అంటూ లోనికి అడుగుపెట్టింది. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ని చూసి కాస్త కంగారు పడినా ఎక్కడో ఆమెని చూసినట్టు అనిపించింది ఆమెకి.

‘‘నేను గౌరిని. చిన్నప్పుడు రాజమండ్రిలో మాస్టారి దగ్గర చదువుకున్నాను. మీ ఇంట్లో, మీ సంధ్యతో ఎంతో చనువుగా మెలిగేదాన్ని. మీరు సంధ్యతోపాటూ నన్నూ మీ కూతురిలా చూసుకునేవారు’’ అంది గౌరి తనని తాను పరిచయం చేసుకుంటూ.

‘‘ఆఁ... గౌరివా..? ఇంతకుముందే నీతో పరిచయం ఉన్నట్టు- నిన్ను చూడగానే అనిపించింది. ఎలా ఉన్నావు? పోలీస్‌ ఉద్యోగం చేస్తున్నావా?’’ ఎన్నో ప్రశ్నలు వేసింది ఆమె.

‘‘ఆఁ... ఇక్కడే ఎస్‌ఐగా ఈరోజే చార్జి తీసుకున్నాను. మాస్టారి కోసం వచ్చాను.

ఆయన ఉదయమే మా పోలీస్‌ స్టేషన్‌కొస్తే గుర్తుపట్టి పరిచయం చేసుకున్నాను.

ఆఁ... మాస్టారు ఎక్కడ..?’’

‘‘మాస్టారు పెరట్లో మొక్కలకి నీళ్ళు పోస్తూ కాలక్షేపం చేస్తున్నారు. వస్తారు, కూర్చో’’ అంటూ గౌరిని సోఫాలో కూర్చోమంది.

‘‘ఫరవాలేదు, ముఖ్యంగా మీతో మాట్లడటానికే వచ్చా’’ అంది గౌరి.

ఆ తరువాత వారిద్దరిమధ్యా సంధ్య విషయంలో చాలా సీరియస్‌ డిస్కషన్‌ జరిగింది.

ఇంతలో- ‘‘గౌరీ నువ్వా? సంధ్య విషయం ఏమైనా తెలిసిందా? అది చెప్పడానికే వచ్చావా..?’’ ఆతృతగా అన్నాడు అప్పుడే అక్కడికొచ్చిన రఘురాం.

‘‘ఆఁ... ఆ పని మీదే ఉన్నాను మాస్టారూ. మిమ్మల్ని కలిశాగా... అమ్మని కూడా చూడాలని పించి ఇలా వచ్చా’’ సమాధానమిచ్చింది గౌరి.

ముగ్గురూ కాసేపు కబుర్లతో కాలక్షేపం చేశారు. తన రాక మాస్టారిలో ఎంతో ప్రశాంతతని తెచ్చినట్టు గమనించింది గౌరి.

*           *            *

మర్నాడు పోలీస్‌ స్టేషన్‌కి రాగానే గౌరి ముందుగా గమనించింది, వరండాలో బెంచీ మీద మాస్టారు కూర్చుని తనకోసం ఎదురు చూడటం.

‘‘మాస్టారూ, లోపల కూర్చోలేకపోయారా...’’ అంటూ పలకరించి, ‘‘మీ పనిమీదే ఉన్నాను. త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తాను. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి’’ అని నచ్చచెప్పి ఆయన్ని ఇంటికి పంపించింది.

ఇలా నాలుగైదు రోజులుగా గౌరి స్టేషన్‌కి రాకముందే రఘురాం వచ్చి వరండాలో అదే బెంచీ పైన కూర్చుని ఆమె కోసం ఎదురు చూడటం, గౌరి ఆయనకి నచ్చచెప్పి పంపడం పరిపాటి అయిపోయింది. ఒక విషయం గౌరికి స్పష్టంగా అర్థమైంది, మాస్టారి సమస్య పూర్తిగా సమసిపోయే వరకూ ఆయన స్టేషన్‌కి రాకమానరని.

కానీ ఆమెకి మాస్టారి సమస్యను ఎలా పరిష్కరించాలో పాలుపోలేదు. ఇక లాభం లేదనుకుని బాగా ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికొచ్చింది.

*           *            *

ఆ రోజు ఆదివారం.

లయబద్ధమైన సంగీతంతో కాలింగ్‌ బెల్‌ మోగేసరికి రఘురాం వెళ్ళి తలుపు తీశాడు.

ఎదురుగా నుంచున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకి లోనైనాడు రఘురాం.

ఎదురుగా ‘సంధ్య’!

నుదుట గుండ్రని ఎర్రటి బొట్టూ కళ్ళకి కాటుకా చేతినిండా మట్టిగాజులూ కాలికి మెట్టెలూ జడలో పూలతో పట్టుచీర ధరించి మహాలక్ష్మిలా కళకళలాడిపోతూ ఎదురుగా నిలుచున్న కూతుర్ని చూడటానికి అతడికి రెండు కళ్ళూ చాలలేదు.

‘‘అమ్మా... సంధ్యా! నువ్వా తల్లీ? ఎన్నాళ్టికి వచ్చావు. రా అమ్మా... రా...’’ అంటూ హడావిడి చేశాడు రఘురాం. తిరిగి- ‘‘కనకం, ఇలా రా. ఎవరొచ్చారో చూడూ’’ అంటూ వంటింటికేసి కేకేశాడు.

కనకమహాలక్ష్మి బయటకొస్తూ సంధ్యని చూసి ఆశ్చర్యపోయింది. ‘‘అమ్మా... సంధ్యా! నువ్వా..? ఇన్నాళ్టికి ఈ అమ్మ గుర్తుకొచ్చిందా..?’’ అంటూ ఆమెను గుండెలకు హత్తుకుంది.

ఇద్దరూ సంధ్యని లోనికి తోడుకొని వచ్చారు. కనకమహాలక్ష్మి వేడి వేడి ఫిల్టర్‌ కాఫీ తీసుకువచ్చి కూతురికిచ్చింది. సంధ్యకి చెరో వైపు కూర్చుని ముగ్గురూ ముచ్చట్లలో పడ్డారు. గలగలా నవ్వుతూ ఉత్సాహంగా కబుర్లు చెబుతున్న కూతుర్ని చూసి, అత్తింటివారి వేధింపుల గురించి అడిగి చక్కటి వాతావరణాన్ని పాడు చేయదలచుకోలేదు రఘురాం.

సంధ్యతో మాట్లాడుతూ చిన్నపిల్లాడైపోయాడు. తమ మధ్య జరిగిన ఎన్నో మధుర జ్ఞాపకాలని నెమరువేసుకున్నాడు.

కనకమహాలక్ష్మి కూతురు వచ్చిన సందర్భంగా రకరకాల వంటలు చేయడానికి ఉపక్రమించింది. తల్లికి సహాయంగా వంటగదిలోకి వెళ్ళింది సంధ్య. వారికి దగ్గర్లోనే కుర్చీ వేసుకుని కూర్చుని వారి ముచ్చట్లని ఆనందంగా వింటూ మధ్యమధ్యలో మాట కలుపుతున్నాడు రఘురాం.

చాలా రోజుల తరవాత తృప్తిగా భోజనం ముగించిన రఘురాం భార్య అందించిన తాంబూలం వేసుకుని వాలుకుర్చీలో సేదతీరాడు. ఇంతలో సంధ్య అక్కడికి వచ్చింది.

‘‘సంధ్యా, సాయంత్రమే వెళ్ళిపోవాలా..? ఓ రెండ్రోజులు ఉండకూడదూ’’ అన్నాడు.

‘‘లేదు నాన్నా... మావాళ్ళకి వచ్చేస్తానని మాటిచ్చాను. మళ్ళీ నేను మిమ్మల్ని చూడటానికి రావాలంటే, నా మాట నిలబెట్టుకోవాలి’’ సమాధానమిచ్చింది సంధ్య. పక్కనే కూర్చుని తండ్రికి ఎన్నో కబుర్లు చెప్పింది.

సాయంత్రం... ‘‘నాన్నా... నేను బయలుదేరు తున్నాను. క్యాబ్‌ బుక్‌ చేశాను. మరికొద్దిసేపట్లో వస్తుంది’’ అంది సంధ్య.

ఇంతలో కనకమహాలక్ష్మి ఓ పళ్ళెంలో పట్టు చీర, రవిక, పసుపుకుంకుమలతోపాటూ తాంబూలం తీసుకువచ్చి సంధ్యకి ఇచ్చింది.

అవి తీసుకుంటూ తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించింది సంధ్య. మనస్ఫూర్తిగా వాళ్ళు కూతుర్ని దీవించారు.

క్యాబ్‌ రావడంతో సంధ్య తిరుగు ప్రయాణమైంది. క్యాబ్‌ బ్యాక్‌ డోర్‌ తీసి సర్దుకుని కూర్చుని లోపలినుండి తల్లిదండ్రులకేసి చెయ్యి ఊపింది. మెల్లగా కారు ముందుకి కదిలింది.

రఘురాంకి అప్పటికప్పుడు ఏదో గుర్తుకొచ్చేసరికి వెంటనే చేతిలోని మొబైల్‌ తీసి ఫోన్‌ చేశాడు.

సంధ్య చేతిలోని ఫోన్‌ స్క్రీన్‌ మీద ‘గురుబ్రహ్మ’ అన్న పేరుతో ఇన్‌కమింగ్‌ కాల్‌ వచ్చేసరికి చిన్నగా నవ్వుకుంది.

*           *            *

సోమవారం ఉదయం.

పనివారం మొదటిరోజు కావడంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద జనం తాకిడి ఎక్కువగా ఉంది.

గౌరి ఆరోజు చాలా టెన్షన్‌తో స్టేషన్‌లో అడుగు పెట్టింది. ఆమె కళ్ళు అక్కడ మొట్టమొదటిగా వెతికింది వరండాలో ఉన్న బెంచీని. ఖాళీ బెంచీ దర్శనమిచ్చేసరికి ఒక్కసారిగా ఊపిరి తీసుకుంది. చాలా రిలీఫ్‌గా అనిపించింది. వెంటనే ఆమె మొహంలో చిన్న ఆనందం తొంగిచూసింది. మాస్టారి సమస్యని పరిష్కరించానన్న తృప్తి ఆమెలో నెలకొంది. అంతే, గౌరికి ఆ రోజు కనకమహాలక్ష్మితో సీరియస్‌గా డిస్కస్‌ చేసిన విషయం అనుకోకుండా గుర్తుకొచ్చింది.

*           *            *

‘‘ఆయన కంప్లైంట్‌ ఇవ్వడానికి మీ స్టేషన్‌కి ఇంకా వస్తున్నారన్న మాట..!’’ మెల్లగా అంది కనకమహాలక్ష్మి.

‘‘అంటే... మీకు అంతా తెలుసన్నమాట’’

అంది గౌరి.

‘‘కన్నకూతురు అత్తారింటి వేధింపులకి గురై చివరికి వారి చేతిలో ప్రాణం పోగొట్టుకుంది. ప్రస్తుతం తన భర్తతో సహా అత్తింటివారు మొత్తం జైలుశిక్ష అనుభవిస్తున్నారు. కానీ, అంతకన్నా ఎక్కువ శిక్ష మేం అనుభవిస్తున్నాం. అల్లారు
ముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకి వెళ్ళిపోయిందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు. మానసిక ఒత్తిడికి లోనై ఇంకా కూతురు బతికే ఉందనీ అత్తారింట్లో కష్టాలు అనుభవిస్తోందనీ ఆమెకి అత్తింటి చెరనుండి విముక్తి కల్పించాలనే భ్రమలో పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నారు. మతిస్థిమితం ఉండట్లే. అయితే, ఒక్క కూతురు విషయంలో తప్పా, మిగతా విషయాలలో మామూలుగానే ప్రవర్తిస్తారు. ఊర్లో ఒకరిద్దరు డాక్టర్లకి చూపించినా ఫలితం శూన్యం. ఏనాడో నేను చేసుకున్న పాపం... ఒకవైపు కన్నకూతురు పోయి, మరో వైపు భర్తని ఈ స్థితిలో చూస్తూ...’’ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది కనకమహాలక్ష్మి.

గౌరి ఇది విని చలించిపోయింది. ఉబికివస్తున్న కన్నీటిబొట్లకి ఆమె ధరించిన ఖాకీబట్టలు అడ్డుతగిలాయి.

‘‘లేదమ్మా, సంధ్యని తీసుకురాలేకపోయినా మాస్టార్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. మంచి సైకియాట్రిస్ట్‌ని సంప్రదిస్తా.

ఈ సమస్యకి పరిష్కారం దొరక్కపోదు. నన్ను నమ్మండి’’ అంటూ హామీ ఇచ్చి ఆమెని ఊరడించింది గౌరి.

*           *            *

‘‘గుడ్‌ మార్నింగ్‌ మేడమ్‌’’ అంటూ మురళి సెల్యూట్‌ చేసేసరికి ఆలోచనలనుండి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది గౌరి. మాస్టారు మామూలు మనిషి కావడానికి సైకియాట్రిస్ట్‌ చెప్పిన ప్రకారం చేయడంలో తన పాత్రేకాక కనకమహాలక్ష్మి సహకారం కూడా చాలా ఉందని మనసులో అనుకుంది. అంతలోనే మురళి పలకరింపు గుర్తుకొచ్చి-

‘‘గుడ్‌ మార్నింగ్‌’’ అంటూ మురళిని తిరిగి విష్‌ చేసి,

‘యస్‌... ఇవాళ నిజంగా నా జీవితంలో శుభోదయమే’ అని మనసులో సంతోషంగా అనుకుంది గౌరి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..