అమృత హృదయం

అప్పటికి కమల మౌనవ్రతం పట్టి వారం అయింది. మా పాతికేళ్ళ దాంపత్య జీవితంలో నేను ఎప్పుడూ అంత అశాంతికి గురి కాలేదు- ముఖ్యంగా కమల విషయంలో.

Published : 11 Sep 2022 00:15 IST

అమృత హృదయం

- యర్రంశెట్టి మధు

ప్పటికి కమల మౌనవ్రతం పట్టి వారం అయింది. మా పాతికేళ్ళ దాంపత్య జీవితంలో నేను ఎప్పుడూ అంత అశాంతికి గురి కాలేదు- ముఖ్యంగా కమల విషయంలో.

కావటానికి మాది మధ్య తరగతి కుటుంబమే అయినా, సౌకర్యాలకూ సౌలభ్యాలకూ కొదవలేదు. కమల ముందుజాగ్రత్త కావచ్చూ, ఆర్థికశాస్త్రం చదివిన తన ప్రణాళికాబద్ధమైన నేర్పు కావచ్చూ... బాధలూ కష్టాలూ అనేవి కనీసం మా దరిదాపుకి కూడా రాలేదు.

ఉన్నంతలోనే మంచి టీవీ, ఫ్రిజ్‌, డబుల్‌ కాట్‌ లాంటి వస్తువులన్నీ తన తెలివితోనే సాధించింది. అందుకు నేను గర్వపడతాను.

అయితే ఆర్థిక పరిపుష్టి మాత్రమే ఒక కుటుంబానికి సుఖసంతోషాలని తీసుకుని వస్తుందంటే మాత్రం నేను నమ్మను. దంపతుల మధ్య అవగాహన, సహనం, రాజీతత్వం... ఇవన్నీ కలగలిస్తేనే అది సాధ్యమవుతుంది. అందులో కమలది మొదటి మెట్టు. కాబట్టే ఇప్పటివరకూ మా జీవితాలు ఆదర్శప్రాయంగా నడిచాయి.

మా మధ్య ఉన్న మరో ముఖ్యమైన మంచి గుణం ఏమిటంటే... పరస్పర సహకారం, అలాగే పరస్పరం గౌరవించుకోవడం.

అందువల్లనే మాది అన్యోన్య దాంపత్యమైంది. అలాగని మాలో చిన్నపాటి అలకలు లేవని కాదు... అయినా కాపురం అన్నాక అలాంటి గిల్లికజ్జాలు తప్పనిసరి.

కాకపోతే ఒక వారం రోజుల నుంచి, ఎలాంటి కారణం లేకుండానే, కమల మౌనవ్రతం పట్టటమే నాకు అంతుపట్టకుండా ఉంది. గత ఏడు దినాలుగా జరుగుతున్న ఈ తతంగం అంతా నేను గమనిస్తూనే మిన్నకుండిపోయాను. ఎందుకంటే నా వలన ఏదైనా తప్పు జరిగితే మనసులో దాచుకోదు. మొహమాటం లేకుండా నన్ను నిలదీస్తుంది. అంతేకాకుండా, తను ఎందుకు బాధపడిందో కూడా చెబుతుంది. అలాగే ఈసారి కూడా ఎదురుచూశాను- తన మనసులోని బాధేమిటో చెబుతుందని- కానీ లాభం లేకపోయింది.

అన్నం సరిగా తినదు, నాతో మాట్లాడదు. ఏదో యంత్రం చేసినట్లు పనులన్నీ పూర్తిచేసి, మా ఇంటి వరండా మెట్లమీద కూర్చుని, ఎదురుగా ఉన్న రామనాథం మాస్టారు గారి ఇంటికేసి చూస్తూ, తనలో తనే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది.

అప్పటికీ- ఒకటికి రెండుసార్లు నేను కారణం అడిగినప్పటికీ, తను దాటేస్తూ ‘‘ఏమీ లేదు లెండి, నేను బాగానే ఉన్నాను’’ అంది.

పోనీ గట్టిగా నిలేద్దామంటే తను ఎక్కడ బాధపడుతుందోనని అడగటం మానేశాను. అసలు విషయం తెలియక నేనేదో వాగటం... దానికి తను వేరే అర్థాలు వెతికితే లేనిపోని రభస. అందుకే మిన్నకుండి, వీలైనప్పుడల్లా తనని గమనిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా రామనాథం గారి ఇంటికేసి పదే పదే వీక్షించడమే నాకు బోధపడలేదు. ఒక పొద్దు చిన్న అనుమానం కూడా నాలో బయలుదేరింది.

అసలు రామనాథం గారిది ఈ ఊరు కాదు. చిన్నగంజాం దగ్గర ఏదో చిన్న పల్లెటూరు. కొత్తగా ట్రాన్స్‌ఫర్‌ మీద ఇక్కడికి వచ్చారట. అందుకే ఆయన గురించిన వివరాలేవీ పెద్దగా తెలియవు. ఆయన వయసు యాభై-అరవై మధ్యలో ఉంటుంది. భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు. ఆమె వయసు కూడా ఇంచుమించు ఒక ఐదు అటు ఇటుగా ఉంటుంది. సంతానం గురించి తెలియదు. కనీసం చుట్టపు చూపుగానైనా ఆ ఇంటికి ఎవరూ వచ్చినట్టు నేను చూడలేదు. ఈ మధ్యన మాత్రం ఎవరో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నట్టు విన్నాను కానీ, నా చూపునైతే పడలేదు.

కమల చపలత్వానికి, నేను వక్రభాష్యం వెదక్కపోయినా, ఏదో ఒక తెలియని వెలితి నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. ముందు చెప్పినట్టు తనని అడగాలంటే నాకు ధైర్యం చాల్లేదు. అలాగని ఉదాసీనంగా ఉండలేక ఒక మధ్యాహ్నం, భోజనాల తర్వాత తన పక్కన కూర్చుని ‘‘కమలా ఇలా చూడు’’ అన్నాను.

‘‘ఏమిటండీ?’’ చూసింది.

‘‘ఈ మధ్యన నువ్వు అదోలా ఉండటానికి కారణం ఏమిటి? నాక్కూడా చెప్పకూడనంతటి పెద్ద సమస్యనా అది.’’

తను నవ్వేసి ‘‘అయ్యో, నాకు సమస్యలు ఏమున్నాయండీ. పైగా మీ దగ్గర దాచే అంత పెద్దవి ఏముంటాయి?’’ అంది.

తనకి నా మీదున్న నమ్మకానికి నేను, లోలోన సంతోషించాను. అయితే తను ప్రవర్తిస్తున్న తీరుకీ చెప్పే మాటలకీ ఎక్కడా పొంతన లేదు. దాంతో ఒక టైమ్‌లో ‘నేనేమన్నా భ్రమపడుతున్నానా?’ అని కూడా అనుకున్నాను. అయినా మనసు ఆగక ‘‘లేదు కమలా, నువ్వేదో నా ముందు దాస్తున్నావు. అదేమిటో చెప్పు. అది ఎంత పెద్ద సమస్య అయినా, నేను పరిష్కరిస్తాను. నన్ను నమ్ము’’ అని, తన చేతిని నొక్కి చెప్పాను. చివరిగా మరో మాట కూడా అన్నాను. ‘‘నా వలన ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు సరిదిద్దుకుంటాను.’’

ఆ మాటతో తను చప్పున లేచి కూర్చుంది. ‘‘అయ్యో ఎందుకండీ అంత పెద్ద మాటలు. మీ వలన పొరపాటా... కలలో కూడా అనుకోకండి మీరు తప్పు చేస్తారని’’ అంది.

‘‘అయితే ఎందుకు ఆ మౌనం? నువ్వు నోరు విప్పి చెప్పకపోతే, నన్ను నేను అపరాధిలాగే భావించాల్సి ఉంటుంది.

ఆ తర్వాత నీ ఇష్టం.’’

తను అప్పటికీ నోరు విప్పలేదు. జీవంలేని ఒక నవ్వు నవ్వి ‘‘మీరు అపోహ పడకండి అలాంటిదేమీ లేదు. ఉంటే గింటే, ఇన్ని సంవత్సరాలు దాచనిది ఇప్పుడు దాస్తానా?’’ అంది.

కమల చెప్పింది నిజమే. తను ఎప్పుడూ నా దగ్గర చిన్న విషయం కూడా దాచింది లేదు. నేనూ అలాగే అరమరికలు లేకుండా ప్రవర్తించేవాడిని. ఆ అవగాహనతోనే మా ఇద్దరి జీవితం, మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. అలాంటిది ఎప్పుడూ లేని అసంతృప్తి కమలలో ఇప్పుడు ఎందుకు కలిగిందో నాకు అర్థం కాలేదు. తనలో ఎలాంటి అసంతృప్తీ లేదని తను ఎంత నమ్మబలికినా, అది నన్ను  అసహనానికి గురి చేస్తూనే ఉంది.

ఆ రోజు కూడా తను ఎప్పటిలాగే వరండా మెట్ల మీదకి చేరి, ఎదురింటి రామనాథం మాస్టారు గారి ఇంటికేసి, పక్కన నేను ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా చూస్తూనే ఉంది.

నాకు చివుక్కుమంది. ఎంత తప్పనిపించినా, కమల ప్రవర్తన పట్ల నా ఆలోచనలు వక్రమార్గాన్నే పయనించాయి. అరవై ఏళ్ళ రామనాథాన్ని చూడటానికి తను ఎందుకు ఉవ్విళ్ళూరుతోందో నాకైతే అర్థం కాలేదు. అలా అనుకోవటానికి కూడా నాకు బాధేసింది. అలా ఆలోచించడం తప్పని తెలిసినా, నేనేమీ చేయలేకపోయాను. ఎందుకంటే తన ప్రవర్తన అలాగే ఉంది మరి.

ఒకానొక సమయంలో తనని అడిగేద్దామా అనిపించింది. కానీ మనసు రాలేదు. తన విషయంలో నా ఆలోచనా స్థాయి, అంత అథమంగా ఉందని తనకి తెలిసిందంటే... పాతికేళ్ళపాటు భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన కాపురమనే గాజుబొమ్మ భళ్ళున బద్దలైపోతుంది.

అలాగే తన కూతురి వయసున్న రామనాథం పక్కన కమలని ఊహించటానికి సిగ్గేసింది. కానీ కమల ప్రవర్తన నా ఆలోచనలను మళ్ళీ మళ్ళీ అటువైపే నెడుతూ ఉంది. ‘దీనికి పరిష్కారం ఏమిటా’ అని ఆలోచిస్తూ ఉండగా, ఒకరోజు దానికి సమాధానం దొరికింది.

కమల యధావిధిగా గుమ్మం ముంగిట కూర్చుని, రామనాథం ఇంటికేసి చూస్తూ ఉంది. ఆరోజు చిత్రంగా తన మొహం ఎప్పుడూ లేనంత కాంతితో వెలిగిపోతోంది. నేను కూడా ఎప్పటిలాగే, తన సంతోషానికి కారణం ఏమిటా అని తనమీద ఒక కన్నేసి ఉంచాను. అప్పుడు బోధపడింది కారణం ఏమిటో!

రామనాథం ఇంటి ముంగిట, చేద బావిలోంచి ఒక యువకుడు నీళ్ళు తోడి పెరట్లో ఉన్న మొక్కలకి పోస్తున్నాడు. ఇరవై-ఇరవైమూడు, మధ్య వయసు ఉంటుంది అతనికి. మంచి ఎత్తుతో పాటు స్ఫురద్రూపి.

నిత్య కసరత్తు వల్ల కాబోలు కండలు తిరిగిన శరీరం. ఏ ఆచ్ఛాదనా లేని ఒంటిమీద చెమటపట్టి ఎండకి నిగనిగా మెరుస్తోంది. మొత్తానికి చిన్న వయసే అయినా సినిమా హీరోలాగా ఉన్నాడు.

అది చూశాక, ఇన్నాళ్ళూ మా వైవాహిక జీవితం పట్ల నేను పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా తలకిందులైపోయింది. అయినా ఎక్కడో కమల పట్ల నాలో ఉన్న నమ్మకం నన్ను ఆలోచనలో పడేసింది. మనసు భలే చిత్రమైనది- నిన్నటిదాకా రంగనాథం గారిని అనుమానించింది. అతడి స్థానంలో, మరొక చిన్న వయసు వ్యక్తి కనిపించగానే మొదటివాడిని లూప్‌లైన్‌లోకి నెట్టింది. అయినా మనసుదేముంది, మనం సమర్థించుకోవాలేగానీ ఎలా చెబితే అలా పడుంటుంది.

ఇన్ని ఆలోచించాక నాలో మళ్ళీ మథనం మొదలైంది. అసలు నేను కమలని అనుమానించడం ఏమిటి? ఇన్నేళ్ళ కాపురంలో తన మనసు- అణువణువూ నాకు తెలుసు. నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అభిమానిస్తుందో నాకు తెలుసు. అలాంటి తనని అనుమానించడం అంటే పాపం మూటకట్టుకోవటమే! అలా అనుకున్నాక మనసుకి కాస్త ఊరట దొరికింది.

మనసు కోతి!

ఇంత ఆలోచించినా ఎక్కడో ఏదో వెలితి!

ఉన్నట్టుండి కమలలో వచ్చిన మార్పునకు కారణం ఏమిటి?

ఒక అందమైన అబ్బాయిని పనిగట్టుకుని చూడటం ఎలా అభిలషణీయం? అసలు ఇదంతా ఎందుకు చేస్తోంది? పోనీ అలాంటి ఉద్దేశం తనకి లేనప్పుడు, నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలి కదా? ఎందుకు చెప్పలేకపోతోంది? ఎడతెగని ఆలోచనలతో తల దిమ్మెక్కి పోయింది.

ఒకపక్క కమలని అనుమానిస్తున్నందుకు బాధ. మరోపక్క జరిగేవి చూస్తూ- ఉండలేని వ్యధ! ఇన్ని ఆలోచనలతో సతమతమవుతూనే, ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలి అనుకుంటూ, కమల వైపు అడుగులు వేశాను.

ఈలోపు తన స్వరాన్ని ఉద్విగ్నం చేసి, ‘‘ఏమండీ, ఇలా రండి... ఒక మంచి మాట చెబుతాను’’ అంది కమలే ఆదుర్దాగా.

కమల చూపు ఎదురింటి మీదనే ఉండటం గమనించి, నేను ఉదాసీనంగా ‘‘చెప్పు, ఏమిటి?’’ అన్నాను.

‘‘అటు చూడండి.’’

‘‘ఎవరిని?’’

‘‘అక్కడున్న అబ్బాయిని.’’

నేను చివుక్కుమన్న నా మనసుని అదుపులో ఉంచుకుంటూ, ‘‘అవును ఉన్నాడు, అయితే ఏమిటి?’’ అన్నాను కాస్త కోపంగా.

‘‘ఎంత బాగున్నాడో కదూ!?’’

అప్పటికీ నేను బయటపడలేదు. కమల మీదున్న నమ్మకం ఇంకా పూర్తిగా సడలిపోలేదు ‘‘ఉన్నాడు, అయితే ఏంటి?’’ ఈసారి నిష్టూరంగా పలికాను.

తను- నా గొంతులో వచ్చిన మార్పుని గమనించిందో లేదో కానీ, చాలాసేపు మాట్లాడలేదు. ఏదో అర్థంకాని పదాలని తనలో తనే వల్లించుకుంటూ- కాసేపు నవ్వుకుంటూ- మరికొద్దిసేపు బాధపడుతూ గడిపింది. ఆ తర్వాత ఎప్పటికో తేరుకుని ‘‘ఏమండీ, నాకోసం ఒక పని చేస్తారా?’’ అని దీనంగా అడిగింది.

‘‘చెప్పు, ఏం చేయాలి?’’

‘‘ఆ అబ్బాయిని మన ఇంటికి భోజనానికి పిలవండి.’’

ఆ మాటలు విన్నాక కూడా నేను ఉద్వేగానికి లోను కాలేదు. నన్ను నేను సంబాళించుకున్నాను.

అయినా ‘ఈ ఫ్లోలోనే, తన మనసేమిటో బయటపెట్టాలి’ అనుకుంటూ, స్వరం కఠినం చేసి ‘‘వాడెవడో అనామకుడికి మన ఇంట్లో భోజనం పెట్టడమేమిటి... అసలు పరిచయమే లేకుండా’’ అన్నాను.

తను నిష్టూరంగా మొహం పెట్టుకుని ‘‘ఆ మాత్రం దానికి పరిచయమే కావాలటండీ! ఏ పుట్టినరోజో, పెళ్ళిరోజో అని చెప్పి భోజనానికి ఆహ్వానించండి’’ అంది.

‘‘మరి- ఆ అబ్బాయి తల్లిదండ్రులని పిలవద్దా?’’ తనని ఓరగా చూస్తూ అడిగాను.

‘‘అయ్యో, వాళ్ళను కూడా పిలవండి.

వస్తే సరి, లేదంటే ఆ అబ్బాయిని మాత్రం కచ్చితంగా ఆహ్వానించండి.’’

నేనిక కాదనలేదు. కమల మనసేమిటో పూర్తిగా ఈరోజు తెలిసిపోతుంది కాబట్టి ‘‘సరే అలాగే పిలుస్తాను’’ అని చెప్పి కదిలాను.

కమల రకరకాల కూరలతోపాటు మంచి మంచి ఫలహారాలని తయారు చేసింది. రెండు రకాల స్వీట్స్‌ కూడా చేసింది.

అంత పని చేసినా తను ఏమాత్రం అలసట లేకుండా ఉత్సాహంగా ఉండటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది.

ఈలోపు అతడు వచ్చాడు. మేమిద్దరం భోజనానికి కూర్చున్నాక, కమల ముందుగా నాకు వడ్డించి, ఆ తర్వాత అతడి ముందు కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తూ మాటలు కలిపింది. నేను తింటూ గమనించసాగాను.

కమల ‘నీ పేరేమిటి’ నుండి మొదలుపెట్టి... అతడి పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆరా తీసింది. అతడు చెప్పే జవాబుల్ని శ్రద్ధగా వింటూ మళ్ళీమళ్ళీ అడిగి, కొసరి కొసరి వడ్డిస్తూ చాలా సమయం అతడితోనే గడిపింది.

భోజనాలు పూర్తయ్యాక, ఒక టవలు భుజాన వేసుకుని అతని వెనకే వెళ్ళి, అతడు చేతులు శుభ్రం చేసుకునే వరకూ ఉండి, అదయ్యాక అతడిని గుమ్మం వరకూ సాగనంపి వచ్చి, నా ముందు కూర్చుంది కమల.

’’ఏమండీ?’’ అంది తన్మయత్వంతో.

‘‘ఏమిటో చెప్పు’’ అన్నాను పొడిగా.

‘‘మన అబ్బాయి, పురిట్లోనే చనిపోకుండా ఉండి ఉంటే- ఇదే వయసులో, ఇంతే అందంగా ఉండేవాడు కదండీ.’’

నా నోట మాట రాలేదు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా తను అన్న మాటలు విని, నా చేతిలోని ముద్ద నాకు తెలియకుండానే జారి పళ్ళెంలో పడింది. ‘‘క..మ..లా..’’ అన్నాను.

‘‘అవును కదండీ?’’

నా తల ఎటు ఊగిందో నాకే తెలియదు. నీరు నిండిన కళ్ళకి ఆ అమృత హృదయం మసగ్గా అయినా, స్పష్టంగా కనిపించింది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..