పూర్ణాహుతి!

ఆ రెండతస్తుల ఆకుపచ్చ డాబా రంగు ఇల్లు, ఆ వీధి అంతటికీ ప్రముఖంగా కనిపిస్తోంది. ఆ ఇల్లు అందరికీ చిరపరిచితం. ఆ ఇంటి ఎదురుగా నిలబడి ‘బాబూ, ధర్మం’ అన్న యాచకుడికి బిచ్చం దొరక్కుండా పోదు. ఇంటి ముందు ఆగిన కూరలబండివాళ్ళ దగ్గర బేరం చేయకుండా కూరలు కొనేది ఆ ఇంట్లోవాళ్ళే.

Updated : 17 Mar 2024 00:38 IST

డాక్టర్‌ ఎమ్‌.సుగుణరావు

రెండతస్తుల ఆకుపచ్చ డాబా రంగు ఇల్లు, ఆ వీధి అంతటికీ ప్రముఖంగా కనిపిస్తోంది. ఆ ఇల్లు అందరికీ చిరపరిచితం. ఆ ఇంటి ఎదురుగా నిలబడి ‘బాబూ, ధర్మం’ అన్న యాచకుడికి బిచ్చం దొరక్కుండా పోదు. ఇంటి ముందు ఆగిన కూరలబండివాళ్ళ దగ్గర బేరం చేయకుండా కూరలు కొనేది ఆ ఇంట్లోవాళ్ళే.

వినాయకచవితికీ దసరాకూ చందాలకు వచ్చేవారికి కూడా ఆ ఇంట్లోవారు సంతృప్తిగా ఎంతోకొంత ఇచ్చి పంపుతారు. ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. ఆ ఇంటి ముందుకొచ్చిన వాళ్ళకి, మంచి జరగడానికీ ఆ వీధిలో ఎవరికి ఏ అత్యవసర పని వచ్చినా ఆ ఇంట్లోని ఏ సభ్యులైనా వచ్చి వాలిపోవడానికీ కారణం- ఆ ఇంటి పెద్దాయన... ఎనభైఒక్క సంవత్సరాల పూర్ణయ్య.

ఆయన ఒక ప్రభుత్వరంగ సంస్థలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశారు. రిటైరైనా ఉత్సాహంగా యువకుడి మాదిరిగానే ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేస్తారు.

ఆ సమయంలో ఆ చుట్టుపక్కల కనపడినవారిని పలకరిస్తూ, ఎవరైనా ఏదైనా అవసరం కోసం అర్ధిస్తే సాయం చేయడానికి ముందు ఉంటారు. అలాంటి ఆ ఇంట్లో వారం రోజులుగా మౌనం రాజ్యమేలుతోంది. ఆ ఇంటి సభ్యులు ఎవరూ ఆయనతో మాట్లాడటం లేదు. ఎప్పుడూ భోజనాల బల్ల దగ్గర కలిసి భోంచేసి కబుర్లు చెప్పుకునే ఆ ఇంటి సభ్యులు అంతా మూగనోము పట్టారు.
ఆ ఇంట్లో పూర్ణయ్య గారితోపాటు ఆయన భార్య శారదాంబ, యాభై సంవత్సరాల కొడుకు శివరాం, కోడలు భాగ్యలక్ష్మి, ఇంజినీరింగ్‌ చదివే మనవడు సత్యప్రకాష్‌ ఉంటారు.

పైనున్న పోర్షన్‌ అద్దెకు ఇచ్చారు. కింద వీళ్ళు ఉంటారు. వారం రోజులుగా ఆ ఇంట్లో కోల్డ్‌ వార్‌. కుటుంబ సభ్యులంతా ఒకవైపూ ఆయనొక్కడే ఒకవైపూ అయిపోయారు. ఇంటి సభ్యులు ఆయనతో మాట్లాడడం మానేశారు. సరిగ్గా ఉదయం పదకొండు దాటింది.

ఆ వీధి మొదట్లో ఒక వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనం నుంచి కిందకు దిగిన ముప్ఫై ఏళ్ళ యువకుడు ఆ సందు మొదట్లో ఉన్న కిళ్ళీ బడ్డీ దగ్గర ఆగాడు. కిళ్ళీషాపు అతనితో ‘‘పూర్ణయ్య గారి ఇల్లు ఎక్కడ?’’ అన్నాడు.

‘‘వారి ఇల్లు దగ్గరే బాబూ, ఈ వీధి చివర శివాలయం పక్కన’’ అని చెప్పి, ‘‘ఆ బాబుగారు చాలా మంచాయన... దేవుడు అన్నా కూడా తక్కువే. అంత మంచాయనకి ఏమిటో ఈ వయసులో కష్టం...’’ అన్నాడు ఆ కిళ్ళీ షాపతను. కారులోంచి దిగిన అతను ‘‘అయితే అతను చాలా పెద్దమనిషి అంటావు’’ అన్నాడు ఆరా తీస్తున్నట్లుగా.

‘‘అవును బాబూ... ముప్ఫై ఏళ్ళుగా ఆయన తెలుసు. ఎవరిదీ ఒక పైసా ఆశించి ఎరగడు. అలాగే ఉద్యోగంలో కూడా ఎవరిచేతా ఏమీ అనిపించుకోకుండానే నెగ్గుకొచ్చాడంట. ఈ కాలనీలో
అయ్యగార్లంతా చెప్పుకుంటుంటే విన్నాను’’ అన్నాడు.

‘‘సరే, థ్యాంక్స్‌... మంచి సమాచారం ఇచ్చావు’’ అంటూ అతను కారు ఎక్కబోతుంటే ఆ కిళ్ళీ షాపు యజమాని అడిగాడు- ‘‘ఇంతకీ తమరు ఎవరు బాబూ?’’ అని.

‘‘నేను పత్రికాఫీసు నుంచి వచ్చాను. వారిని ఇంటర్వ్యూ చేయడం కోసం వెళ్తున్నాను’’ అన్నాడు.

‘‘మంచిగా రాయండి బాబూ ఆయన గురించి’’ అన్నాడతను.

అంతలో ఆ కిళ్ళీషాపు దగ్గర సోడా తాగుతున్న ఒక ఆగంతకుడు ‘ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేయదు కదా’ అన్నాడు ఆ యువకుడి వంక చూస్తూ. అతను కారు ఎక్కబోతూ ‘‘ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారు?’’ అంటూ ప్రశ్నార్థకంగా ఆ మాటలన్న వ్యక్తి వైపు చూశాడు.

‘‘ఆ పెద్దాయన దగ్గరకు వెళ్తున్నారు కదా, మీకే తెలుస్తుంది’’ అంటూ ఆ వ్యక్తి సోడా తాగి అక్కడి నుంచి కదిలాడు. కారులో కూర్చున్న అతను ఆలోచనలో పడ్డాడు. ఆ కొత్త వ్యక్తి చెప్పిన మాటలు మరింత ఆలోచనలకు గురిచేశాయి. ఇప్పుడు తను ఎనభై ఒక్క సంవత్సరాల ఒక పెద్దాయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు. ఆయన గురించి వారం రోజులుగా న్యూస్‌ పేపర్లలో వార్తలు వస్తున్నాయి. కారణం- ముప్ఫై రెండు సంవత్సరాల క్రితం ఆయన లంచం తీసుకున్నాడు, తన దగ్గర పనిచేసే గుమాస్తా దగ్గర. ఆ కేసు ఇన్ని సంవత్సరాలుగా నడుస్తూ, ఇప్పటికి ఆయన చేసిన ఆ నేరానికి శిక్ష పడింది.
1991 సంవత్సరంలో ఆయన మీద ప్రభుత్వాధికారులు కేసు పెట్టారు...

తన ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగికి ఇంక్రిమెంట్‌ శాంక్షన్‌ చేసే నిమిత్తం ఆయన లంచం తీసుకున్నాడని. ఆ సమయంలో దొరికిపోయిన అతన్ని పోలీసులు అరెస్టు చేసి ఒకరోజు జైల్లో ఉంచారు. ఆ కేసు
ఆ తర్వాత ఏమైందో మరి... మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు వెలుగులోకి వచ్చింది.

ఆ కేసును పరిష్కరించే దిశగా అడుగులు పడ్డాయి. ఎనభైఒక్క ఏళ్ళ పూర్ణయ్య గారికి ఒక సంవత్సరం జైలుశిక్షా పదిహేను వేల రూపాయల ఫైనూ చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కేసు వివరాల కోసమే ఇప్పుడు తను ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు.

అలా ఆలోచిస్తూనే అతను డ్రైవర్‌కు ఆ ఇంటి గుర్తులు చెప్పి, కారు అక్కడ ఆపమన్నాడు. కారు ఆ డాబా ముందు ఆగింది. కారులోంచి ఆ యువకుడు దిగి తలుపు దగ్గర ఉన్న కాలింగ్‌బెల్‌ మోగించాడు.
ఓ యాభై ఏళ్ళ మహిళ తలుపు తీసి, ‘‘ఎవరు కావాలి బాబూ?’’ అని అడిగింది.

‘‘నా పేరు భగీరథ. పూర్ణయ్యగారి కోసం వచ్చాను. వారి ఇంటర్వ్యూ కోసం నన్ను రమ్మన్నారు’’ అన్నాడు.

‘‘ఇంట్లో పూజ జరుగుతోంది బాబూ. హోమం వేశారు. మీరు కాసేపు కూర్చోండి’’ అంటూ లోపలికి తీసుకెళ్ళిందామె. బహుశా పనమ్మాయి కాబోలు అనుకున్నాడు ఆమెను చూసి. ఇంటి లోపల పూజ జరుగుతున్నట్టుంది. మంత్రాలు వినిపిస్తున్నాయి. అతను ఆ గదిలో కూర్చుంటూ చుట్టూ చూశాడు. విశాలమైన ఆ డ్రాయింగ్‌ రూములో గోడకు అమర్చిన టీవీ అలమరల నిండా పుస్తకాలూ, టీపాయ్‌ మీద ఆరోజు వచ్చిన వార్తా పత్రికలూ. ఇంతలో లోపలి నుంచి- ‘ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదశ్చ్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని వినిపించింది.

ఆ శ్లోకం వినగానే ‘పూజ పూర్తికావచ్చింది, పూర్ణాహుతి మంత్రం చదివారు కదా’ అనుకున్నాడు భగీరథ. పావుగంట తర్వాత ఆ గదిలోకి తను ఎదురుచూస్తున్న ఆ పెద్దాయన వచ్చారు.
‘‘నమస్కారం సార్‌...’’ అన్నాడు భగీరథ.

‘‘కూర్చోండి’’ అంటూ నవ్వుతూ చూసి, ‘‘శారదా, వీరికి ప్రసాదం పట్టుకురా...’’ అన్నారు. లోపలి నుంచి ఒక పెద్దావిడ అరిటాకులో ప్రసాదం తీసుకొచ్చి అతనికి అందించింది.

‘‘ధన్యవాదాలు’’ అంటూ ప్రసాదం తీసుకుని తినడం మొదలుపెట్టాడు భగీరథ. తింటూనే ఆ పెద్దాయన వంక పరిశీలనగా చూశాడు. పొడుగ్గా, సన్నగా ఉన్నాడు, తెల్లగా పండిన జుట్టు. అంతకంటే పండులా ఉన్న శరీరపు ఛాయ.

ప్రసాదం తినడం పూర్తిచేసి ఆ పక్కనే ఉన్న వాష్‌బేషిన్‌లో చేతులు కడుక్కుని ‘‘మిమ్మల్ని డిస్టర్బ్‌ చేసినట్టున్నాను’’ అన్నాడు.

‘‘లేదు. మీరు ఇంటర్వ్యూ చేయడం మీ బాధ్యత. దానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు’’ అన్నారాయన.

‘‘మొదలుపెడదామా సార్‌’’ అడిగాడు భగీరథ.

‘‘ఉండండి. మా ఇంట్లోవాళ్ళని కూడా పిలుస్తాను’’ అని, ‘‘అందరూ ఒకసారి రండమ్మా’’ అంటూ గట్టిగా పిలిచాడు. ఆ హాల్లోకి- అతనికి ప్రసాదం అందించిన పెద్దావిడా యాభైఏళ్ళు ఉన్న కొడుకూ కోడలూ పద్దెనిమిదేళ్ళు ఉన్న మనవడూ వచ్చి కూర్చున్నారు.

‘‘వీరంతా దేనికి? మీరు ఒక్కరే ఉంటే సరిపోతుంది కదా’’ అన్నాడు భగీరథ.

‘‘నా జీవితం తెరిచిన పుస్తకం. అందరికీ తెలియాలి. నేను ఒక్కడినే కాదు, నాతో నా కుటుంబం’’ అన్నారు పూర్ణయ్య.  ఆయన ఆ మాటలు చెప్పగానే భగీరథ ఏదో చెప్పడానికి ఉపక్రమించేంతలో

‘‘సార్‌, నేను మాట్లాడవచ్చా?’’ అన్నాడు, ఆ గదిలో కూర్చున్న పద్దెనిమిదేళ్ళ ఆయన మనవడు.

‘‘ఒరేయ్‌... ఆగు, నువ్వేంటి...

పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం’’ అంటూ కసిరాడు అతడి తండ్రి.

‘‘లేదు. వాడిని మాట్లాడనీ’’ అంటూ మనవడి వైపు తిరిగి ‘‘నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు నాన్నా’’ అన్నారు పూర్ణయ్య.

ఆ పద్దెనిమిదేళ్ల కుర్రవాడు చెప్పడం మొదలుపెట్టాడు... ‘‘తాతయ్య నాకు హీరో. ఆయన ఎప్పుడూ చిన్న తప్పు కూడా చేయడం నాకు తెలియదు. అందరికీ మంచిగా ఉండమనే చెబుతాడు. ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు మర్చిపోయి ఎప్పుడో చేసిన చిన్న తప్పు కోసం ఆయన్ని ఈ వయసులో శిక్షించడం న్యాయమా? అదే మాకు బాధగా ఉంది’’ అన్నాడు.

ఆ మాటలకు పక్కనే ఉన్న అతని తండ్రి, ‘‘అవును. ఆయనకు ఈ వయసులో ఈ శిక్ష వేయడం అన్యాయం. ఆ ఒక్క తప్పు తప్ప ఆయన తన ఉద్యోగ జీవితమంతా నిజాయతీగానే గడిపారు. నీతిగా బతికారు. అందుకోసం ఆయన్ని తిరిగి అప్పీల్‌ చేసుకోమంటున్నాం. సంవత్సరం జైలుశిక్ష అంటే ఈ వయసులో కష్టం.

బలమైన లాయర్లు ఉన్నారు. వారి ద్వారా వారి వయసును దృష్టిలో ఉంచుకుని శిక్ష పూర్తిగా రద్దు చేయమనీ జరిమానా విధించమనీ కోరదామనుకుంటున్నాం. అందుకు ఈయన ఒప్పుకోవడం లేదు’’ అన్నాడు.

ఆ మాటలకు వెంటనే పూర్ణయ్య గారి భార్య, ‘‘ఈ వయసులో ఈయనకు జైలుశిక్ష ఏమిటి? వారం రోజులుగా ఇంట్లోవాళ్ళం అందరం పదే పదే చెబుతున్నా ఈయన వినడం లేదు’’ అని చెప్తూ బోరున ఏడ్చింది.

‘‘అయ్యో, ఏడవకు... ఏడవకు...’’ అంటూ పూర్ణయ్య గారు లేచి వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుని ఆమె చేతుల మీద చెయ్యి వేసి ఓదార్చారు.

అక్కడే కూర్చున్న ఆయన కోడలు కూడా ‘‘ఈయనకు చాలా గొప్ప పేరు ఉంది. మంచితనం మూర్తీభవించిన మనిషి. కోర్టువారు వేసిన శిక్షకు తల వంచి వెళ్ళిపోతే ఇంతవరకూ ఉన్న ఈయన పేరు
ప్రఖ్యాతులు ఏమౌతాయి? అందుకే కోర్టులో పోరాడమని చెపుతున్నాం’’ అంది.

ఆ మాటలకు అంతక్రితం మాట్లాడిన ఆయన మనవడు, ‘‘ఔను... తాతయ్యకు చెడ్డపేరు వస్తుంది. ఆయన ఎప్పుడూ హీరోలానే ఉండాలి’’ అన్నాడు.

మనవడు మాట్లాడిన మాటలకు నవ్వుతూ, ‘‘ఈ పెద్దాయన నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు. నన్ను కాస్త మాట్లాడనివ్వండి’’ అంటూ చెప్పడం మొదలుపెట్టారు.

‘‘నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న తప్పు చేశాను. వంద రూపాయల లంచానికి కక్కుర్తి పడ్డాను. వంద అయినా, వెయ్యి అయినా తప్పు తప్పే! అది అవినీతి. ఆ తర్వాత నేను ఏ తప్పూ చేయలేదు. మళ్ళీ ఇన్నేళ్ళకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక్కోసారి- నేను ఈ కేసులో తీర్పు వినకుండానే, చేసిన తప్పుకు శిక్ష అనుభవించకుండానే చనిపోతానేమోనని
భయపడేవాణ్ణి. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ కేసులో చాలా సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చినా న్యాయం గెలిచిందని భావిస్తున్నాను. మన చట్టాన్ని గౌరవిస్తూ, శిక్షను ఆనందంగా భరించడానికి నిశ్చయించాను. అందువలన నాకు ఉన్న కీర్తీ పోదు, అపకీర్తీ రాదు.’’

ఆ మాటలకు కొడుకు వెంటనే అన్నాడు, ‘‘మీరు పొరబడుతున్నారు నాన్నా, నేరం చేసి జైలుకు వెళ్ళేవారిని నేరస్తుడు అనే అంటారు... అతడు ఎన్ని మంచి పనులు చేసినా, అతడికి ఎంత మంచి చరిత్ర ఉన్నా’’ అన్నాడు.

ఆ మాటలకు భగీరథ, ‘‘క్షమించండి! నా మనసులోని మాట చెబుతాను. ముందుగా- మీరు ఇందాక ఇంట్లో హోమం చేశారు. పూర్ణాహుతి చదివారు. ఆ పూర్ణాహుతి మంత్రం అర్థం తెలుసా?’’ అని అడిగాడు. ఆ గదిలో ఆ శ్లోకానికి ఎవరూ అర్థం చెప్పలేకపోయారు.

‘‘నేను చెబుతాను బాబూ’’ అన్నారు పూర్ణయ్య.

‘‘చెప్పండి సార్‌. నాకు ఎప్పుడూ ఆ శ్లోకం అర్థం కాస్త తికమకగానే ఉంటుంది’’ అన్నాడు భగీరథ. ఆయన చెప్పడం ప్రారంభించారు.

‘‘పూర్ణానికి పూర్ణం కలిపినా, పూర్ణం లోంచి పూర్ణం తీసేసినా మిగిలేది పూర్ణమే! ఈ శ్లోకార్థాన్ని మనం అవగతం చేసుకుంటే- జీవితసారమంతా ఇందులోనే దాగి ఉంది’’ అన్నారు పూర్ణయ్య.
‘‘బాగా చెప్పారు సార్‌’’ అన్నాడు భగీరథ.

‘‘నాకు అర్థం కాలేదు తాతయ్యా’’ అన్నాడు ఆయన మనవడు. ఆయన మనవడి వంక నవ్వుతూ చూసి, చెప్పడం మొదలుపెట్టారు.

‘‘మహా సముద్రం ఒడ్డు కనపడదు.

ఆ మహా సముద్రంలోంచి మోటారు పంపుతో రోజంతా నీళ్ళు తోడి, ఆ నీటిని ఓ కుంటలోకి పంపినా ఆ సముద్రాన్ని సముద్రమే అంటాం కానీ సముద్రం మైనస్‌ కుంట అనం కదా! అలాగే మన ఇంటి వాటర్‌ ట్యాంక్‌లోని నీళ్ళు తీసుకెళ్ళి సముద్రంలో పోసినా దాన్ని సముద్రం అనే అంటాం. అంటే మహాసముద్రంలోంచి నీళ్ళు తీసివేసినా, మళ్ళీ కలిపినా దాన్ని మహాసముద్రమే అంటాం. అలాగే, జీవితం కూడా- కలిపినా తీసివేసినా నిండుగా ఉండాలి. వెలితిగా ఉండకూడదు. వెలితిగా ఉండేవాడు ఆ వెలితిని పూడ్చుకోవడానికి చూస్తే, నిండుగా ఉండేవాడు దాన్ని పంచడానికి ఇస్తాడు. మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలంటే మన దగ్గర నిండుగా ఉండాలి. మన కుటుంబాలు ఆనందంగా లేకపోవడానికి కారణం మనం యాచకులం అయిపోవడం. ప్రేమను యాచిస్తున్నామే తప్ప మన ప్రేమను పంచడం లేదు. అలా పంచాలంటే మన హృదయం నిండుగా ఉండాలి. అదే ఈ పూర్ణాహుతి శ్లోకానికి అర్థం.’’

ఆ మాటలకు భగీరథ చప్పట్లు కొట్టాడు. వెంటనే ఆ పెద్దాయన కాళ్ళకు నమస్కారం చేసి, ‘‘ఇప్పుడు నాకు అర్థమైంది. ఎప్పుడో చేసిన తప్పుకు ఈ వృద్ధాప్యంలో శిక్ష భరించడానికి వెళ్ళడానికి కారణం మీ నిండైన మనస్సు. అవును. మీరు సముద్రమే. ఈ శిక్ష అనుభవించినంత మాత్రాన మీకు ఉన్న కీర్తీ పోదూ అపకీర్తీ రాదు. నా ఇంటర్వ్యూ అయిపోయింది’’ అంటూ లేచి నిలబడ్డాడు.
ఆ కుటుంబ సభ్యులంతా భగీరథ వంక ప్రశంసాపూర్వకంగా చూశారు. వారు మాటల్లో చెప్పకపోయినా ‘ఈయన వచ్చి మా కళ్ళు తెరిపించారు’ అనుకున్నారు.

ఆ కుటుంబ సభ్యులంతా ఆ పెద్దాయన్ని చుట్టేశారు. భగీరథ మరోసారి నమస్కారం చేసి ఆ ఇంట్లోంచి బైటికి వచ్చాడు.

కారు ఎక్కుతూంటే పూర్ణయ్య గారు మెల్లగా వచ్చి భగీరథతో- ‘‘ఈ విషయం మన మధ్యనే ఉండాలి. మన జీవితకాలంలో కొందరు వ్యక్తుల్ని కాలం నీడలో క్రమంగా మర్చిపోతాం. అయితే కొందరి నీడ కాలాన్నే మర్చిపోయేలా చేస్తుంది.

ఆ నీడ కుటుంబ పెద్దది కావాలి అనేదే నా లక్ష్యం. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?’’ అన్నారు.

ఆ మాటలు చెప్పడం పూర్తి కాకుండానే భగీరథ ఆయన వంక ఆశ్చర్యంగా చూసి ‘‘ఈ మాటే ఆ కిళ్ళీ షాపు దగ్గర ఎవరో అంటూంటే విన్నాను. అర్థం కాలేదు’’ అన్నాడు పూర్ణయ్యగారి మొహంలోకి సూటిగా చూసి.

‘‘అవును. లోకం కోడై కూస్తోంది. మనం ఎవరికీ తెలియకుండా తప్పులు చేస్తున్నామనుకుంటాం గానీ వాటిని గమనించేది ఎందరో! నేనెప్పుడో నా ఉద్యోగ జీవితంలో చిన్న తప్పు చేశాను. ఇప్పుడు అదే తప్పు ఒక ఉన్నతోద్యోగిగా ఉన్న నా కొడుకూ చేస్తున్నాడు. ఒక్క తప్పు కాదు, విలాసవంతమైన జీవితం కోసం తప్పు మీద తప్పు చేస్తున్నాడు. అయితే అతను వాటిని తప్పుగా భావించడం లేదు. ఆ తప్పులకు ఎప్పుడైనా శిక్ష పడుతుందనే విషయాన్ని గుర్తించడం లేదు. అందుకే గడిచిపోయిన కాలంలో నేను చేసిన తప్పును తిరిగి తవ్వి తోడింది నేనే. ఆ కేసు ద్వారా నాకు శిక్ష పడితే- తప్పులు చేస్తున్న నా కొడుకు బాగుపడతాడనే ఉద్దేశ్యంతోనే ఇదంతా చేశాను.’’

అలా అంటున్న ఆ పెద్దాయన కళ్ళ నుంచి కారిన కన్నీటిబొట్లు భగీరథ కాళ్ళ మీద పడ్డాయి.

‘ఈ పూర్ణయ్య గారు జీవితప్రస్థానం ముగించి మహాప్రస్థానానికి అడుగులు వేసే క్రమంలో తన పుత్రుడి కోసం యజ్ఞం చేస్తున్నాడు. తనే పూర్ణాహుతి కాబోతున్నాడు. తన కుటుంబానికే కాకుండా ఈ సమాజానికి కూడా ఒక నీడలా తోడులా ఉండబోతున్నాడు...’ అనుకుంటూ ఆయనకు మరోసారి రెండు చేతులూ జోడించి కారు ఎక్కాడు భగీరథ.

కారు కదిలింది. అయినా, శిఖరంగా ఎదిగిన పూర్ణయ్య గారి విరాటస్వరూపం అతని వెన్నంటే వస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..