ఈ కాలం పిల్లలు

‘‘మీఅబ్బాయీ కోడలూ వేరు వెళ్తున్నారటగా? అంతేలేమ్మా, ఈ కాలం పిల్లలు. నాలుగు నెలలు అత్తామామలతో ఉండేటప్పటికి ఓర్పు అయిపోయింది’’ ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికెళ్ళేది గుమ్మం దగ్గర ఆగింది లహరి- అత్తగారి సమాధానం వినడానికి.

Published : 23 Mar 2024 23:30 IST

- శ్రీపతి లలిత

‘మీఅబ్బాయీ కోడలూ వేరు వెళ్తున్నారటగా? అంతేలేమ్మా, ఈ కాలం పిల్లలు. నాలుగు నెలలు అత్తామామలతో ఉండేటప్పటికి ఓర్పు అయిపోయింది’’ ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికెళ్ళేది గుమ్మం దగ్గర ఆగింది లహరి- అత్తగారి సమాధానం వినడానికి.

‘‘మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వడం ఇష్టంలేక వెళ్తున్నారు, రేపు ఏ పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు, నేనే కదా వాళ్ళని చూడాలి.’’
అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలిపడబోయింది లహరి.
‘ఇంట్లో ఏమాత్రం ఛాన్స్‌ దొరికినా, ఏదో ఒకటి అనే అత్తగారు పక్కింటి ఆవిడతో తన గురించి చెడ్డగా చెప్పలేదూ అంటే... అమ్మ అన్నట్టు ఆవిడ చెడ్డది కాదు. కోడలి ఎంపిక కొడుకే చేసుకోవడం తట్టుకోలేక, నేనయితే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తోంది కానీ, తనని చెడ్డ చేయడంలేదు మంచిదే’ అనుకుంటూ, లోపలికి అడుగుపెట్టింది. పక్కన ఆంటీని ‘‘బావున్నారా’’ అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి ‘‘మళ్ళీ వస్తాను ఉమగారూ’’ అంటూ వెళ్ళిపోయింది.
ఉమ, భాస్కర్‌లకు ఒక్కడే కొడుకు విక్రమ్‌.
ఈ కాలపు పిల్లలందరిలాగానే, అతను కూడా హైదరాబాద్‌లో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. పెళ్ళి విషయానికి వచ్చేసరికి, తనతో పని చేస్తున్న లహరిని చేసుకుంటాను అని చెప్పాడు. ఎక్కడా అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవడంవల్ల ఇరువైపులవాళ్ళూ ఒప్పుకున్నారు కానీ, తనకి సరిగ్గా పెళ్ళికి ముందు చెప్పాడని కొడుకు మీదా, తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందని లహరి మీదా చిన్న అలక ఉంది ఉమకి.
అది అప్పుడప్పుడూ, కొడుకు లేనప్పుడు బయటపెట్టేది. లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డుగోడ పెట్టింది ఇద్దరి మధ్యా.
ఉమ ఒక ఫక్తు మధ్యతరగతి గృహిణి. భర్తా కొడుకూ తన గుప్పిట్లో ఉండాలనే రకం, అలాగని చెడ్డది కాదు. అందరికీ ‘మా అబ్బాయి నా మాట జవదాటడు’ అని గొప్పగా చెప్పుకుందామనుకునే మహిళ.
లహరికి- అత్తగారు అలా ముభావంగా ఉండటం, కల్పించుకుని పని చేద్దామన్నా చెయ్యనియ్యకపోవడం, మళ్ళీ ఇంట్లో పని అంతా తాను ఒక్కతే చేస్తున్నాననడం, కొంచెం చికాకు తెప్పించాయి.
ఉమ తత్త్వం వేరు. ముందునుంచీ, తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారనీ ఇల్లు చక్కగా పెట్టుకుంటారనీ ఇంట్లోవాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది.
అందుకే లహరిని ఏమీ చెయ్యనిచ్చేది కాదు. మళ్ళీ అందరిముందూ ‘ఆఫీసులో అలసిపోయి వస్తుంది, ఇంట్లో ఏమి పని చెప్తాం పాపం’ అనేది- చూసేవాళ్ళకి ఎంత మంచిదో ఈవిడ అనిపించేటట్లు.
ఈ సంగతి లహరి తల్లి విజయకి బాగా అర్థమైంది, ఎంతైనా ఆవిడా ఒక తల్లేగా.
లహరి కోసం వాళ్ళు కొన్న ఫ్లాట్‌ సరిగ్గా అప్పుడే రెడీ అవడం, అది వీళ్ళ ఆఫీస్‌కి దగ్గరగా ఉండడం ఇంకా కలిసి వచ్చింది. ‘కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్‌లో ఉండి, అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది’ అని సలహా చెప్పింది.
ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి, విక్రమ్‌ కొత్త ఫ్లాట్‌ గృహప్రవేశం చేసుకున్నారు. ఆ రోజు కొడుకూ కోడలూ కొన్న పదివేల పట్టుచీర కట్టుకుని మురిసిపోతూ, అందరికీ ఒకటికి రెండుసార్లు చెప్పుకుని తిరిగింది ఉమ.
ఉమా, భాస్కర్‌ల ఇంటికీ విక్రమ్‌ ఉండే ఫ్లాట్‌కీ ఒక గంట దూరం.
అందుకని ఫ్లాట్‌కి మారినా, శని ఆదివారాలూ పండగ రోజుల్లో పిల్లలు ఇటు ఉమ దగ్గరికో అటు లహరి పుట్టింటికో వెళ్ళడం, తమకు కావాల్సినవి చేయించుకుని తినడం, వాళ్ళతో గడపడంతో పెద్ద దూరంగా ఉంటున్న భావం ఎవరికీ రాలేదు.
ఉమ చదువుకున్నది కానీ, కొన్ని విషయాలు తెలుసుకోవడంలో అలసత్వం ఉండేది.
ముఖ్యంగా బ్యాంకుకి వెళ్ళడం, గూగుల్‌పే చెయ్యడం, ఏటీఎం వాడటం నేర్చుకోలేదు.
తనకి క్రెడిట్‌ కార్డు ఇప్పించినా ఎప్పుడూ వాడేది కాదు. ‘పిన్‌ మర్చిపోతే ఎలా? ఎవరైనా చూసి వాడేస్తే ఎలా?’ లాంటి అనుమానాలు చాలా ఎక్కువ ఉమకి.
విక్రమ్‌ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు, ‘మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనక, మీ హెల్త్‌ కార్డ్స్‌ గురించీ ఎమర్జెన్సీ నంబర్ల గురించీ తెలుసుకుని ఉండటం మంచిది’ అని.
‘నాకెందుకురా ఇవన్నీ, మీరు ఉన్నారు కదా’ అని పట్టించుకునేది కాదు.
గృహప్రవేశం తరవాత విక్రమ్‌ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని భాస్కర్‌ సరదాపడ్డా, ‘పనికీ వంటకీ మనిషిని పెట్టాం, మీరు వస్తే అంతా రెస్టే’ అని లహరి, విక్రమ్‌ చెప్పినా ఒక్కసారి మాత్రం వెళ్ళారు.
‘అక్కడ నాకు తోచదు, వాళ్ళు ఆఫీస్‌కి వెళ్తే మనం ఏమి చెయ్యాలి, అక్కడ ఆ వంటమనిషి చేసింది నాకు నచ్చదు’ అంటూ వెళ్ళేది కాదు ఉమ.
‘ఇద్దరు మనుషులకి వంటమనిషేమిటీ... పాలు లేని కాఫీలూ ఉప్పూ కారం నూనే లేకుండా వంటలూ... రొట్టెలూ సలాడ్లూ మొలకలూ... వీటితో కడుపు నిండుతుందా? లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్సో చీరో కాకుండా ఏమిటా ప్యాంటూ షర్టూ? ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్ళలా పైజామాలు ఏమిటి?’ అని భాస్కర్‌ దగ్గర సణుగుతూనే ఉండేది.
ఫ్లాట్‌కి వెళ్ళిన నాలుగు నెలల్లో లహరి కారు కొనుక్కుని ఆఫీస్‌కి కారులో వెళ్ళేది.
చక్కగా బంగారం, వజ్రాలూ కొనకుండా డబ్బులన్నీ వృథా చేస్తున్నారని ఉమ బాధ.
అప్పటికీ ఊరుకోక లహరి తల్లితో అంటే- ఆవిడ కూడా ‘ఏం చెప్పమంటారు వదినగారూ, ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు, వాళ్ళు అనుకున్నది చెయ్యడమే’ అనేసరికి ఊరుకుంది.
భాస్కర్‌ మాత్రం ‘వాళ్ళు చిన్న పిల్లలు కారు, మనకంటే లోకం బాగా తెలుసు. వాళ్ళ సంపాదన వాళ్ళిష్టం, నువ్వు అనవసరంగా కల్పించుకుని ఏదైనా అంటే నువ్వు చెడ్డ అవడం తప్ప వేరే ఉండదు’ అంటుండేవాడు.
రోజులు బానే గడుస్తున్నాయి అందరూ ఎవరి పనులలో వాళ్ళు మునిగిపోయారు.
సంక్రాంతి దగ్గరకొస్తోంది. ఆ రోజు- కొడుకూ కోడలూ పండక్కి వస్తారని ఉమ ఏవో పిండివంటలు చెయ్యడంలో మునిగిపోయింది. హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్‌. ఉన్నట్టుండి దభాలున శబ్దం వినిపించి ఉమ హాల్లోకి చూసింది ‘‘ఏమైందండీ!’’ అంటూ.
భాస్కర్‌ గుడ్లు తేలేసి, నోరు తెరుచుకుని కింద పడిపోయి ఉన్నాడు.
అతన్ని అలా చూసిన ఉమకి గుండె ఆగినంత పని అయ్యింది.
‘‘ఏమండీ!’’ అంటూ కుదిపినా కదలిక లేదు. అతను రెండు రోజుల నుంచీ తలనొప్పిగా ఉందనడం, అన్నం తినబుద్ధి కావడంలేదనడం... గుర్తు వచ్చింది. పక్కవాళ్ళూ ఎదురువాళ్ళూ పండక్కి ఊరు వెళ్ళారు. గబగబా విక్రమ్‌కి ఫోన్‌ చేసింది, అది అవుట్‌ ఆఫ్‌ కవరేజ్‌ అని వచ్చింది.
వెంటనే లహరికి చేసింది. లహరి ఫోన్‌ ఎత్తి ‘హలో’ అనగానే ‘‘ఆయన పడిపోయారు’’ అంటూ ఏడ్చేసింది.
ఒక నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే తేరుకుని ‘‘కంగారు పడకండి అత్తయ్యా, కదిపి చూడండి’’ అన్న లహరితో-
‘‘లేదమ్మా, కదలటంలేదు, నాకు భయంగా ఉంది, ఏమి చెయ్యను విక్రమ్‌ ఫోన్‌ కలవట్లేదు’’ ఏడుస్తూనే అంది.
‘‘అత్తయ్యా, విక్రమ్‌ ఆఫీస్‌ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు. ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు. నేను అంబులెన్సుకి ఫోన్‌ చేస్తాను. మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళండి’’ అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది.
‘‘నేను ఒక్కదాన్నే వెళ్ళలేను’’ అంటున్న ఉమతో ‘‘నేను మళ్ళీ ఫోన్‌ చేస్తాను. ఈలోగా మీకు మెడికల్‌ కార్డ్స్‌ ఎక్కడున్నాయో తెలిస్తే తీసి పెట్టుకోండి’’ అని ఫోన్‌ పెట్టింది.
అవసరం వస్తుంది అనుకున్నాడో ఏమో, ముందురోజే భాస్కర్‌ కార్డ్‌ తీసి చూపించాడు. అవి తీసుకుని, పొయ్యి ఆపి, బ్యాగూ కొంత డబ్బూ తీసుకుని వచ్చేలోగా ఎవరో పిలిచారు.
చూస్తే తన ఇంట్లో పనిచేసే లక్ష్మి భర్త రాజు. అతను ఆటో నడుపుతాడు. ‘‘చిన్నమ్మ ఫోన్‌ చేశారు, సారుకి బాలేదట కదా!’’ అనేలోగా అంబులెన్సు వచ్చింది. ఇంతలో రాజు ఫోన్‌ మోగడం ‘‘అమ్మా, సరేనమ్మా’’ అనడం చూసి- లహరి ఫోన్‌ అనుకుంది ఉమ.
యాంత్రికంగా భాస్కర్‌ని అంబులెన్సులో ఎక్కించాక తను కూడా ఎక్కింది.
రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు.
అంబులెన్సులోనే వాళ్ళు వైద్యం మొదలుపెట్టారు. బీపీ చూడడం, ఆక్సిజన్‌ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు.
ఆసుపత్రికి వెళ్ళి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకి ఏదో చెప్పాడు, వెంటనే ఒక డాక్టర్‌ పరిగెత్తుకు వచ్చి పరుగు పరుగున లోపలికి తీసుకెళ్ళి వైద్యం మొదలుపెట్టారు. ఉమని బయట ఉండమన్నారు.
సమయం ఎంత గడిచిందో తెలీదు కానీ, లహరి రావడం చూసి తనూ లేచి ‘‘అమ్మా, మామయ్య!’’ అంటూ లహరి చెయ్యి గట్టిగా పట్టుకుంది.
‘‘ఏమీ కాదు అత్తయ్యా, భయపడకండి. విక్రమ్‌ కూడా వస్తున్నాడు. ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టరుగారి అబ్బాయి, నా స్నేహితుడు. తను ఇప్పటికే ఫోన్‌ చేసి ఆయనతో మాట్లాడాడు’’ అంటుండగానే ఆ డాక్టర్‌ గారు బయటికి వచ్చారు. ‘‘లహరీ’’ అనేసరికి ‘‘అంకుల్‌, ఎలా ఉంది మామయ్యకి?’’ అడిగింది.
‘‘బీపీ సడన్‌గా ఎక్కువై మైల్డ్‌ స్ట్రోక్‌ వచ్చింది. అదృష్టంకొద్దీ మీరు వెంటనే వచ్చారు, నువ్వు ఫోన్లో చెప్పినదానికి తగ్గట్టుగా నేను ఇంజక్షన్‌ కూడా వెంటనే ఇప్పించాను. దానితో ఆయన అవయవాలకి ఇబ్బంది ఉండదు. కొంతకాలం మందులూ పూర్తి విశ్రాంతీ కావాలి.
ఇక్కడ నాలుగు రోజులు ఉంచి పంపుతాం. ఇప్పుడు ఐసీయూకి పంపి రేపో ఎల్లుండో రూమ్‌కి మారుస్తాం’’ చెప్తుంటే పక్కన ఉమ కూడా వింటోంది.
‘‘మా అత్తయ్య’’ అని లహరి చెప్తే ఆయన ఉమని చూసి ‘‘ఏమీ పర్వాలేదమ్మా, గండం గడిచింది. మీరు కంగారుపడి బీపీ పెంచుకోకండి. ఒకసారి చూశాక ఇంటికి వెళ్ళి రెస్ట్‌ తీసుకుని రేపు రండి’’ అనునయంగా అంటే ఉమ కళ్ళనీళ్ళతో నమస్కారం చేసింది.
ఇంతలో విక్రమ్‌ కూడా వచ్చాడు. కొడుకుని చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమ. ‘‘విక్కీ’’ అంటూ కొడుకుని పట్టుకుని ఏడ్చేసింది.
‘‘ఏమీ భయం లేదమ్మా’’ అంటూ తల్లిని ఓదార్చాడు కానీ అతని కళ్ళలో కూడా నీళ్ళు వచ్చాయి. లహరి ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేసింది.
ఇంతలో నర్స్‌ వచ్చి ‘‘ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి ఆయనని చూడండి. మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం’’ అని చెప్తే ఉమ లోపలికి వెళ్ళింది.
ముక్కుకీ నోటికీ పైపులు పెట్టి, బలహీనంగా ఉన్న భర్తని చూసి ఏడుపు వచ్చినా ‘నువ్వు నాన్నని చూసి ఏడవద్దు, అంతా బావుంది అని చెప్పు’- అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా ఆయన చెయ్యి నొక్కి ‘‘ఇంకో రెండు రోజులు అంతే, మనం ఇంటికెళ్ళిపోతాం. అంతా బావుందన్నారు డాక్టర్‌’’ అని చెప్పింది.
బయటికి వచ్చేసరికి లహరి తల్లీ తండ్రీ వచ్చారు. ఐసీయూ దగ్గర ఎవరినీ ఉండనియ్యడం లేదు, అయినా విక్రమ్‌, వాళ్ళ మామగారూ కొంచెంసేపు ఉంటామంటే... లహరీ, ఉమా, లహరి తల్లీ- లహరి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరారు.
ఇంటికి వెళ్ళేసరికి లహరివాళ్ళ పనమ్మాయి స్వరూప ఇంట్లో ఉంది. వెళ్ళగానే వీళ్ళకి వేడిగా టీ పెట్టి ఇచ్చింది. గీజర్‌ వేశాను అంటే- ఉమ, లహరి స్నానం చేసి వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి డైనింగ్‌ టేబుల్‌ మీద పళ్ళాలూ గ్లాసులూ అన్నీ అమర్చింది భోజనానికి.
అన్నం, కూర, పచ్చడి, సాంబార్‌, పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తాను అంటే, లహరి ‘‘వెళ్ళిపో స్వరూపా, రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్ళేలోగా టిఫిన్‌ తిని వెళ్తారు’’ అంది.
‘‘సరేనమ్మా. పెద్ద సార్‌ ఎలా ఉన్నారు?’’ అడిగింది స్వరూప.
‘‘బావున్నారు, నువ్వు ఆటోలో వెళ్ళు, డబ్బులు ఉన్నాయా ఇవ్వనా?’’ అని లహరి అడిగితే-
‘‘వద్దమ్మా, ఉన్నాయి. అయినా ఫోన్‌ చేస్తే మా ఆయన పది నిమిషాల్లో వస్తాడు’’ అని వెళ్ళిపోయింది.
‘‘మనం ఆసుపత్రిలో ఉన్నాం
కదా, ఈ అమ్మాయి వంట ఎలా చేసింది?’’ అడిగింది ఉమ.
‘‘ఒక తాళంచెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులూ చేస్తుంది’’ అన్న లహరితో- ‘‘ఫర్వాలేదా, ఇంట్లో డబ్బులూ అవీ ఉంటాయి’’ అంది ఉమ.
‘‘లేదు అత్తయ్యా, మేము క్యాష్‌ ఎక్కువ పెట్టం, అన్నీ ‘ఫోన్‌ పే’లోనే. ఇంట్లో బంగారం ఉంచను, ఇంకేమి తీసుకుంటుంది, హాల్లోనూ మెయిన్‌ డోర్‌ దగ్గరా కెమెరాలు ఉన్నాయి. అయినా వాళ్ళకీ పనులు దొరకాలంటే నిజాయతీగా ఉండాలి’’ అంది లహరి.
‘‘విక్రమ్‌, నాన్నా వచ్చి భోంచేస్తారు, మీరు మళ్ళీ పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళాలి, ఇప్పుడు పడుకోండి’’ అని లహరి చెప్తే రూమ్‌లోకి వచ్చి పడుకున్న ఉమ మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి...
‘తను వీళ్ళని... ఈకాలం పిల్లలు, బాధ్యత తెలీదు, డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది కానీ, ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలూ తీసుకుని భాస్కర్‌ని ఆసుపత్రిలో చేర్చింది... అందుకే అతను బతికి బయటపడ్డాడు.
ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చెయ్యాలంటే ఎవరికైనా ఇబ్బందే. వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబట్టేకదా, ఆ స్వరూప ఇంత రాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది.
తన ఇంట్లో ఇన్ని రోజులనుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా తాళం ఇవ్వగలదా? ఎందుకంటే తనకి మనుషుల మీద నమ్మకం తక్కువ. లహరి అన్నట్టు ఇంట్లో డబ్బూ బంగారం లేకపోతే పోయేందుకు ఏం ఉంటాయి? భాస్కర్‌ ఎన్నిసార్లు చెప్పినా- లక్ష్మితో ఎప్పుడూ విసుగ్గా మాట్లాడటం తప్ప సవ్యంగా మాట్లాడలేదు- పనివాళ్ళకి అలుసు ఇవ్వకూడదు అని.
భాస్కర్‌ చిన్న చిన్న సాయాలు చెయ్యబట్టీ, లహరి వాళ్ళతో చక్కగా మాట్లాడబట్టీ ఇవాళ ఒక్క ఫోన్‌ చెయ్యగానే రాజు పరిగెట్టుకు వచ్చాడు. లక్ష్మి లహరికి ఫోన్‌ చేసి భాస్కర్‌ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంది.
లహరికి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులూ అవుతున్నాయి. అదే తను చెప్పినట్టు బంగారం, వజ్రాలూ కొంటే ఏం లాభం... లాకర్‌లో పెట్టడం తప్ప.
భాస్కర్‌ అన్నట్టు ఈ కాలం పిల్లలకి తమకంటే ఎక్కువే తెలుసు. వాళ్ళ సంపాదనను- ఎలా సుఖంగా ఉంటామూ- అని చూసుకుని ఖర్చు పెడుతున్నారు. తమ కాలంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. మేము ఉన్నట్టు మీరు ఉండండి అనడం, వాళ్ళకి అభిమానాలు లేవు బాధ్యతలు లేవు అనడం ఎంత తప్పు. ఇవాళ లహరి చేసినంత పద్ధతిగా బాధ్యతగా తను చెయ్యగలదా?
ఊరికే పిల్లలు చేసే ప్రతి పనినీ విమర్శించేకన్నా, ఈ వయసులో వాళ్ళు చెప్పినట్టు వినడం మంచిది’ అనుకుంటూ నిద్రకి ఉపక్రమించింది.


లహరి ఫోన్‌ ఎత్తి ‘హలో’ అనగానే ‘‘ఆయన పడిపోయారు’’ అంటూ ఏడ్చేసింది. ఒక నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే తేరుకుని ‘‘కంగారు పడకండి అత్తయ్యా, కదిపి చూడండి’’ అన్న లహరితో-‘‘లేదమ్మా, కదలటంలేదు, నాకు భయంగా ఉంది, ఏమి చెయ్యను విక్రమ్‌ ఫోన్‌ కలవట్లేదు’’ ఏడుస్తూనే అంది.


 

 

 

ముక్కుకీ నోటికీ పైపులు పెట్టి, బలహీనంగా ఉన్న భర్తని చూసి ఏడుపు వచ్చినా ‘నువ్వు నాన్నని చూసి ఏడవద్దు, అంతా బావుంది అని చెప్పు’- అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా ఆయన చెయ్యి నొక్కి ‘‘ఇంకో రెండు రోజులు అంతే, మనం ఇంటికెళ్ళిపోతాం. అంతా బావుందన్నారు డాక్టర్‌’’ అని చెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..