మార్పు రావాలి

‘దీపూ, చైతూ, ఏమండీ... మీ ముగ్గురూ ఒక్కసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి’’ పిల్లల్నీ భర్తనీ పిలిచింది ఇందుమతి. టీవీ చూస్తున్న మోహన్‌, మొబైల్‌ ఫోనులో గేమ్స్‌ ఆడుకుంటున్న పిల్లలూ ‘‘మేము బిజీ, తర్వాత మాట్లాడుకుందాం’’ అనేశారు,

Updated : 31 Mar 2024 00:48 IST

- డాక్టర్‌ మజ్జి భారతి

‘‘దీపూ, చైతూ, ఏమండీ... మీ ముగ్గురూ ఒక్కసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి’’ పిల్లల్నీ భర్తనీ పిలిచింది ఇందుమతి. టీవీ చూస్తున్న మోహన్‌, మొబైల్‌ ఫోనులో గేమ్స్‌ ఆడుకుంటున్న పిల్లలూ ‘‘మేము బిజీ, తర్వాత మాట్లాడుకుందాం’’ అనేశారు, ఇందువైపు చూడకుండానే.
‘‘తర్వాత మాట్లాడటానికి రేపటి నుండి నేనిక్కడుండనేమో!’’ అన్న ఇందుమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురూ. ‘‘ఊరు వెళ్తావా, ఎక్కడికి? మాకు చెప్పనేలేదు’’ ప్రశ్నలు వరసగా వచ్చాయి. ‘‘నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు నేను పీజీ హాస్టలుకు వెళ్ళిపోతాను. ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూలుకి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను’’ అన్న ఇందు మాటలకు ముగ్గురూ అయోమయంగా చూశారు.
‘‘పీజీ హాస్టలేమిటీ... ఇల్లు చూడటమేమిటి? ఏమ్మాట్లాడుతున్నావు నువ్వు?’’ అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్‌.
‘‘నేనిదివరకులా పని చెయ్యలేకపోతున్నాను. తిరగలేకపోతున్నాను. అందుకని స్కూలుకి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను’’ అన్న ఇందుతో ‘‘నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా?’’ కోపంగా అన్నాడు మోహన్‌.
‘‘నాకీ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను. మీరైతే కనీసం నన్ను సంప్రదించనైనా సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు’’ అన్న ఇందుతో- ‘‘పిల్లల స్కూళ్ళకీ నా ఆఫీసుకీ దగ్గరని ఈ ఇల్లు తీసుకున్నాను. తప్పేముందిందులో?’’ సమర్ధించుకున్నాడు మోహన్‌.
‘‘నాకు పెళ్లై దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలవుతోంది. ఎప్పుడూ మీ కోసమనో, పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమీ చేసుకోలేదు. పోనీ మీ ముగ్గురిలో ఎవరైనా, నాకోసమేమైనా చేశారా అంటే... అది మీకే తెలియాలి. ఇప్పుడు నేను నా కోసం, స్కూలుకి దగ్గరలో ఇల్లు తీసుకుంటానంటున్నాను. అందులో కోపం తెచ్చుకోవలసిన విషయమేముంది?’’ సీరియస్‌గా అడిగింది ఇందు.
అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది, ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదని. ‘‘నేనేం చేసినా మనకోసమే కదా’’ సమర్ధించుకున్నాడు మోహన్‌.
‘‘ఆ మనలో నేనెక్కడున్నానా అన్నదే నా ప్రశ్న?’’ అంది ఇందు. ‘‘ఇదంతా నీ కోసం కాకపోతే ఇంకెవ్వరి కోసం?’’ అన్న మోహన్‌ మాటల్లో పసలేదని పిల్లలకు కూడా అర్థమైంది.
‘‘గతాన్ని తవ్వడం నా అభిమతం కాదు. మీరెలా తీసుకున్నా ఇన్నాళ్ళూ నేనందరి విషయంలో బాధ్యతగా ఉన్నాననే అనుకుంటున్నాను. నా శరీరంలో పటుత్వం తగ్గి నేను వెనకటిలా పని చెయ్యలేకపోతున్నాను.
నా గురించి నేను శ్రద్ధ తీసుకోవలసిన సమయమూ వచ్చింది. నా గురించి నేనైనా పట్టించుకోకపోతే, నా ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఆలోచించి, మా స్కూలుకి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను. నాతో ఉండాలనుకుంటే మీరూ రావచ్చు. కానీ ఒక్క షరతు... నా నుండి మీరేమాశిస్తారో అక్కడ మీరలా ఉండాలి’’ సింపుల్‌గా చెప్పింది ఇందు.
అర్థమయీ కానట్టున్నాయా మాటలు. ‘‘అంటే..?’’ ముగ్గురూ ఒకేసారడిగారు.
‘‘ఏముంది? తెల్లవారి లేవగానే మీకు కాఫీలో... టిఫిన్లో... క్యారేజ్‌ బాక్సులో... ఇంకేవేవో... మీ అవసరాలు నేనెలా తీర్చాలనుకుంటున్నారో, మీరూ అవన్నీ చెయ్యాల్సుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పనిచేసుకోవాలక్కడ’’ విడమర్చి చెప్పింది ఇందు.
‘‘అమ్మో, నీ అంత తొందరగా లేవడం నావల్ల కాదు. అయినా రాత్రంతా చదువుకుని లేటుగా లేస్తాం మరి’’ లేటుగా లేవడాన్ని సమర్ధించుకుంది దీపు.
‘‘నీకలవాటైన పనులు, మమ్మల్ని చెయ్యమంటే ఎలా?’’ కాస్త విసుగ్గా అన్నాడు మోహన్‌.
‘‘అదికాదమ్మా, మాకలవాటు లేని పనులు... అదీకాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు’’ ఆలోచనగా అన్నాడు చైతన్య.
‘‘చేస్తుంటే అదే అలవాటవుతుంది’’ బాధగా చిన్ననవ్వు నవ్వింది ఇందు.
‘‘నా సంగతి విడిచిపెట్టు. పిల్లలింకా చిన్నవాళ్ళు. వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు?’’
‘‘దీపూ థర్డ్‌ ఇయర్‌ ఇంజినీరింగ్‌ చేస్తోంది. చైతూ తొందర్లో ఇంజినీరింగ్‌ కాలేజీలో జాయినవుతాడు. ఇంకా వాళ్ళ వెనక ఉండి చదివించాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకొచ్చిన వయసు. అయినా నేను విడిచి వెళ్తాననలేదు కదా... మిమ్మల్నీ రావచ్చంటున్నాను.’’
‘‘పోనీ నీకంత చెయ్యడం కష్టంగా ఉంటే వంటమనిషిని పెట్టుకుందాం’’ అన్న తండ్రి మాటలకు అంతకుముందు జరిగిన విషయం గుర్తుకొచ్చింది చైతన్యకు. అమ్మకి ఒంట్లో బాగా లేనప్పుడు వంటమనిషిని పెడతానంటే ‘వంటమనిషి వెనక ఉండి పని చేయించడమే పెద్దపని. వాళ్ళు మనలాగా చేస్తారా ఏమిటి? అయినా వంటెంతసేపు... కుక్కర్‌ పెట్టేసి,
ఒక కూరచేస్తే సరిపోతుంది. మేమేమైనా అది కావాలీ ఇది కావాలీ అంటున్నామా? ఏది పెడితే అది తింటున్నాం కదా... డబ్బులు దండగ కాకపోతే’ అన్న నాన్నమ్మ ఒక్క రోజైనా కుక్కర్‌ పెట్టడం తను చూడలేదు.
‘నీ వంటరుచి ఎవరికీ రాదు. అయినా నీకంత కష్టంగా ఉంటే మేమూ సాయం చేస్తాంలే’ అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవడం కూడా తను చూడలేదు. తన క్యారేజే కాక తామందరికీ బాక్సులు కట్టి, నాన్నమ్మకి టేబుల్‌ మీద అన్నీ సర్ది, మళ్ళీ స్కూలునుండి వస్తూనే వంటగదిలో దూరి అందరి అవసరాలూ నోరెత్తకుండా తీర్చే అమ్మ, ఎంత బాధపడకపోతే ఇప్పుడిలా అని ఉంటుందోనన్న ఆలోచనల్లో ఉన్న చైతన్య- ‘‘ఇలాంటాలోచన నీకెలా వచ్చింది. అయినా నువ్వెళ్ళిపోతే ఇంట్లో ఎలా? అమ్మ పెద్దది, పిల్లలింకా చిన్నవాళ్లు’’ అన్న తండ్రి మాటలకు నమ్మలేనట్టు చూశాడు.
మరి అమ్మ గురించెవరు పట్టించుకుంటారు? ఒక్క రోజైనా అమ్మకెవరైనా చేశారా అంటే లేదనే సమాధానమే కనిపిస్తుంది. తనకే ఇలా అనిపిస్తే అమ్మ ఆలోచనలు... తల్లివైపు చూశాడు. కోపాన్నీ బాధనీ అణుచుకుంటూ అమ్మ. అది చూసిన వెంటనే ‘‘నేను కూడా నీతో వస్తాను. నువ్వు రెస్ట్‌ తీసుకో అమ్మా’’ అని గదిలోకి తీసుకెళ్ళిపోయాడు చైతన్య.
తండ్రీ కూతురూ మిగిలారు హాల్లో. ‘‘నేనేం చేశానని మీ అమ్మంత బాధపడాలి? బాగానే చూసుకుంటున్నాను కదా’’ అన్న తండ్రి మాటలకు- రాత్రి తాను విన్న మాటలు గుర్తుకొచ్చాయి దీపూకి. ‘సుశీలకు ఒంట్లో బాగాలేదట. ఇక్కడికొచ్చి రెస్ట్‌ తీసుకోమన్నాను’ అన్న నాన్న మాటలు, అమ్మ ఈ నిర్ణయం తీసుకోడానికి ప్రేరేపించాయా? నాన్నెప్పుడూ అందరినీ రెస్ట్‌ తీసుకో, రెస్ట్‌ తీసుకో అంటుంటారు... కానీ పనెవరు చేస్తున్నారు, అమ్మ తప్పించి? ‘నువ్వు రెస్ట్‌ తీసుకో. మేము చూసుకుంటాం’ అని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనడం తానెప్పుడూ వినలేదు. ఎప్పుడూ నాన్నకా విషయం గ్రహింపుకు రాలేదా? మరి అమ్మకు రెస్ట్‌ అక్కర్లేదా?
సుశీలత్తకు గర్భసంచి ఆపరేషనయ్యాక ‘ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటావు? ఇక్కడే రెస్ట్‌ తీసుకో’ అని, మూడు నెలలు దాటాక వాళ్ళింటికి పంపించారు. పోనీ అత్తేమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే. అటువంటి అత్తకే మూడు నెలలు రెస్ట్‌ కావాల్సివస్తే, అమ్మకు అదే ఆపరేషనై ఇంకా రెండు నెలలు దాటలేదు. పెట్టిన సెలవైపోయి, వారంరోజుల క్రితమే స్కూల్లో జాయినయింది. ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది. అటువంటిది ఇప్పుడు సుశీలత్తను రెస్ట్‌ తీసుకోవడానికి రమ్మన్నానని నాన్నంటే, అమ్మకి కోపం రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. పోనీ నాన్నమ్మగానీ అత్తగానీ ఏమైనా సాయం చేస్తారా అంటే, చెయ్యకపోగా... అదేదో హాస్యంలా వంకరమాటలు అంటూనే ఉంటారు.
వాళ్ళ సంగతి పక్కన పెడితే, తానెప్పుడైనా అమ్మకి సాయం చేసిందా? చదువుకుంటున్నాం కాబట్టి, అదే పెద్ద పనని తామనుకుంటున్నారు. ‘లేటుగా పడుకున్నాం, కాబట్టి లేటుగా లేస్తున్నామని’ అమ్మతో అంది తాను. కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా, ఉదయం అయిదు గంటలయ్యేటప్పటికి లేచి, పని మొదలు పెడుతుంది. మరి అమ్మకు నిద్రా విశ్రాంతీ అవసరం లేదా? అమ్మ పనిచేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి, ఫ్రెండ్స్‌తో కాలక్షేపం కబుర్లూ వీడియో గేములూ... నాన్నా నానమ్మా టీవీ ముందు...
అమ్మెప్పుడైనా తనకి పని చెప్పబోతే, ‘ఇప్పటినుండీ దానికి పనులెందుకు చెప్తావు? రేపు పెళ్ళయ్యాక వాళ్ళింట్లో అదే చెయ్యాలి కదా’ అంటుంది నాన్నమ్మ. తమ్ముడికి పని
చెప్పబోతే ‘మగ పిల్లవాడికి పనులు చెప్తావా? నేనెప్పుడూ నా పిల్లలకి పనులు చెప్పలేద’ని నాన్నమ్మ వెనకేసుకొస్తే, అదేదో గొప్పగా అనిపించేది. కానీ నాన్నమ్మ ఉద్యోగం
చెయ్యలేదు కదా. అటువంటప్పుడు నాన్నమ్మకీ అమ్మకీ పోలికేమిటి? తనకెందుకీ విషయం తోచలేదిన్నాళ్ళూ? అమ్మకి తమ మీద ఉన్న ప్రేమనీ బాధ్యతనీ ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్‌ తీసుకున్నారా అంటే అవుననే సమాధానమే వచ్చింది దీపూకి.
ఒక్క మనిషి పని చేస్తుంటే, తామందరూ బాధ్యతారహితంగా ఉన్నారన్న భావనే దీపూకి సహించలేదు. అదే సమయంలో ‘‘ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పని చేస్తున్నట్టు బాధపడుతుందెందుకని? ఆడవాళ్లు ఇంట్లో పనులు చెయ్యడం ఎప్పుడూ ఉన్నదే కదా’’ అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపమొచ్చింది దీపూకి.
‘‘ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్నా మీరు? ఒకప్పుడు మగవాళ్ళే ఉద్యోగాలు చేసేవారు. ఆడవాళ్ళు ఇంట్లో పని చేసేవారు. ఇప్పుడు ఆడవాళ్ళూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, ఇంటిపనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకోవాలి కదా! గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి, మీరెప్పుడైనా అమ్మకి సాయం చేశారా? మిమ్మల్ని అంటున్నాననే కాదు... ఇందులో మా తప్పు కూడా ఉంది. మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అమ్మ చెప్పాకైనా తన మనసును అర్థం చేసుకోలేకపోతే, నన్ను నేను క్షమించుకోలేను. నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ- అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే, ఒక్కదాన్నే పంటి బిగువున భరిస్తూ ఇంట్లో పనులు చెయ్యాలంటే నావల్ల కాదు. అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను’’ అనేసి గదిలోకెళ్ళిపోయింది.
హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్‌. ఇందు కుటుంబానికి ఏమీ చెయ్యలేదని తాననలేడు. అలాగని ఆమెతోపాటు బాధ్యతలను పంచుకోవాలంటే... అలవాటు లేని పని.
కూతురు కూడా అంత మాటన్నాక... నిజమే అనిపిస్తుంది. ఇంట్లో పనంతా ఇందూయే చేసుకుంటుంది. పిల్లల్నీ తానే చదివిస్తుంది. అమ్మనీ తనింటికి వచ్చిన చెల్లెళ్ళనీ చూసుకుంటుంది. తాను సాయం చెయ్యకపోగా, కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు.
కానీ, ఇంట్లో భార్యలకు సాయంచేసే మగవాళ్ళను గురించి ఆడంగివాళ్ళు అని- తన తల్లీ చెల్లెళ్ళూ అనుకోవడమూ... కొన్ని పనులు ఆడవాళ్ళే చెయ్యాలన్న స్నేహితుల మాటలూ... ఇంటిని ఇందూయే బాగా చూసుకోగలదన్న తన నమ్మకమూ... ఎటువైపు వెళ్ళాలో తెలియడం లేదు. ఇందుని వదిలి ఉండలేడూ, అలాగని ఇందుతో సమానంగా వంటగదిలో పని చెయ్యనూ లేడు. చిన్నచెల్లి దగ్గరకు వెళ్ళిన అమ్మ వస్తే ఏం చెప్పాలి? ‘భార్య నీ మాట వినేట్టు చేసుకోలేవా?’ అని అడుగుతుంది. సమస్యకు పరిష్కారమేమిటో తెలియడం లేదు.
తరతరాలుగా జీర్ణించుకుపోయిన మగబుద్ధి, వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఊగిసలాడుతూనే ఉంది మోహన్‌ మనసు. ఇంతలో సుశీల దగ్గరనుండి ఫోను...
‘అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావు? నేనొచ్చి దింపుతానన్నారాయన. అందుకే రెండు రోజులు పోయాక వస్తా’నని.
ఏమి చెయ్యాలో పాలుపోక, చిన్నప్పటి తన క్లాస్‌మేట్‌, ఇందు కొలీగ్‌ అయిన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు.
                          

ఫోన్‌ చెయ్యడమే కానీ తాను ఇంటినుండి వచ్చి నాలుగు రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్‌. అతని మనసులో తన విలువ ఇంతేనా!? కోపం, బాధల మధ్య మనసు
కొట్టుకుంటోంది. అప్పుడొచ్చాడు మోహన్‌... ‘‘మీ స్కూలుకి దగ్గర్లో కొత్త అపార్ట్‌మెంట్లు వేశారు. నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం’’ అంటూ నాలుగు బ్రోచర్లు పట్టుకుని. నమ్మలేకపోయింది ఇందు. అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో ‘‘సారీరా, నీ గురించెప్పుడూ ఆలోచించలేదు. ఇకనుండి ఈ పొరపాటు జరగదు’’ అంటూ అది హాస్టలని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు. తనలో ఈ మార్పుకి కారణం- శ్రావణి ఇంట్లో జరిగిన విషయం. సుశీలను రెస్ట్‌ తీసుకోవడానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ‘ఆపరేషనై ఆరు నెలలయింది,
సుశీలకు రెస్ట్‌ కావాలా..? అదే ఆపరేషను రెండు నెలల కిందటే చేయించుకుని ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకిరీ చెయ్యాలా? బుద్ధుండే మాట్లాడుతున్నావా?
నా క్లాస్‌మేట్‌వని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నీతోపాటు ఇందు ఉద్యోగం చేస్తున్నప్పుడు, తనతోపాటు ఇంటి బాధ్యతలను పంచుకోవాలని తెలియదా?
నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా... ఆమెకు విశ్రాంతి అక్కరలేదా? ఇందు కాబట్టి ఇన్నాళ్ళు భరించింది. అదే నేనైతే ఎప్పుడో విడాకులిచ్చేద్దును’ మనసులో శ్రావణి మాటలు గింగురుమంటున్నాయి. నిజమే కదా!
అలవాటైన పుట్టింటికి రావడానికే ‘ఒక్కదానివీ ఎలా వెళ్తావని సుశీల వాళ్ళాయన ఆలోచిస్తుంటే... ఇంటా బయటా అన్ని పనులూ చేసుకుంటున్న తన భార్యను తానెంత బాగా చూసుకోవాలి?’ తానేమి చెయ్యాలో తెలిసి వచ్చింది. మార్పు రావాలి. ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి. పనుల్లో ఆడా మగా తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పని చేసుకోవాలి. ఇన్నాళ్ళూ తాను చేసిన తప్పేమిటో అర్థమైంది. ఇందు బాధపడకుండా చూసుకోవాలి. తనకి పనుల్లో సాయం చెయ్యాలి. ముందొక వంటమనిషిని పెట్టుకోవాలి. ఇందుకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి... అంతే! ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూలుకి దగ్గర్లో కొనుక్కోవడానికి ఇళ్ళేమున్నాయో కనుక్కుని, ఇందు ముందు వాలిపోయాడు మోహన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..