పడకగదిలో ఫెయిరీటేల్‌ మెరుపులు!

కలల్లో కనిపించే అద్భుతమైన ప్రపంచాన్ని... నిద్రలోకి జారకముందే చూస్తే... కల్పిత కథల్లోని సన్నివేశాల్ని... మన పడకగదిలోకీ పట్టుకొస్తే... ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది... మరెంత సంతోషంగా అనిపిస్తుంది కదా... ఇదిగో, ఆ అనుభూతిని పొందడానికే చాలామంది బెడ్‌రూమ్‌ని కొత్తగా ముస్తాబు చేసుకుంటున్నారు... ఫెయిరీ టేల్‌ థీమ్స్‌తో ఎంతో అందంగా అలంకరించుకుంటున్నారు...

Published : 17 Mar 2024 01:01 IST

కలల్లో కనిపించే అద్భుతమైన ప్రపంచాన్ని... నిద్రలోకి జారకముందే చూస్తే... కల్పిత కథల్లోని సన్నివేశాల్ని... మన పడకగదిలోకీ పట్టుకొస్తే... ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది... మరెంత సంతోషంగా అనిపిస్తుంది కదా... ఇదిగో, ఆ అనుభూతిని పొందడానికే చాలామంది బెడ్‌రూమ్‌ని కొత్తగా ముస్తాబు చేసుకుంటున్నారు... ఫెయిరీ టేల్‌ థీమ్స్‌తో ఎంతో అందంగా అలంకరించుకుంటున్నారు...

రమ్య తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఇల్లంతా చూస్తూ వాళ్ల అమ్మాయి గదిలోకీ అడుగు పెట్టింది. మంచం చుట్టూ పలుచని గులాబీ రంగు పరదా, దానిపైన మిణుకుమిణుకుమంటూ నక్షత్రాలు రాలుతున్నట్టు అనిపించే చిన్న చిన్న లైట్లూ, అక్కడక్కడా రంగు రంగుల పూలూ... ఆ గది అలంకరణ అంతా అద్భుతంగా అనిపించిందామెకు. ‘కాసేపు కూర్చునే లివింగ్‌ రూమ్‌ లాంటిదాన్నే ఉన్నంతసేపు ప్రశాంతంగా అనిపించేలా అందంగా తీర్చిదిద్దుకుంటే... ఎక్కువ సమయం గడుపుతూ పడుకునే గది ఇంకెంత హాయిగా ఉండాలి’ అనుకుంటూ ఈమధ్య చాలామంది ఇలా పడకగదులకూ సరికొత్త మెరుపులు తెస్తున్నారు.  

ఒకప్పటిలా కాదు, ఇప్పుడు చాలావరకూ ఇంట్లో పిల్లలకూ పెద్దలకూ ప్రత్యేకంగా పడక గదులు ఉండటంతో ఎవరికి వారు తమ తమ అభిరుచికి తగ్గట్టు గదుల్లో బుల్లి ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నారు.
ఆ రంగుల ప్రపంచంలో ప్రతిదీ తమ ఒక్కరి దగ్గర మాత్రమే ఉండాలనుకుంటూ డ్రెసింగ్‌ టేబుల్‌ నుంచి మంచం వరకూ ప్రతిదానిపైనా దృష్టి పెడుతున్నారు. ఇదంతా ఒకెత్తయితే, మరికొందరు ఇంకాస్త సృజనను జోడించి ఇదిగో ఇలా ఫెయిరీటేల్‌ డెకరేషన్‌ చేసుకుంటున్నారు.

పిల్లలే కాదండోయ్‌, పెద్దవాళ్లూ ఎంతో ఇష్టంగా ఈ అలంకరణల్ని తమ పడకగదులకు ప్రయత్నిస్తున్నారు. కథల్లో రాజూరాణిల గురించి విని సరదా పడటమే కాదు, ఆ కల్పిత పాత్రల్లోని ఊహా సన్నివేశాల్ని ఈ లైట్ల డెకరేషన్‌తో కళ్లముందుకు తెచ్చుకుంటున్నారు. ఉన్న మామూలు మంచాన్నే చిన్న చిన్న అలంకరణలతో ముచ్చటైన పందిరి పడకలా తీర్చిదిద్దుతున్నారు, చిన్న గదికే రంగుల మెరుపులతో రాజసాన్ని తీసుకొస్తున్నారు.

మన గది ఎలా ఉండాలీ అన్న అవగాహన ఉంటే చాలు, దాన్ని నిజం చేసి చూపొచ్చు. అందుకు తగ్గట్టు మార్కెట్లో బోలెడన్ని రకాల లైట్లూ, పందిరి తెరలూ, ప్లాస్టిక్‌ పువ్వులూ, ఆకులూ, తీగలూ, చెట్లూ, కొమ్మలూ.... ఇలా ఒక్కటేంటీ, కోరుకున్న థీమ్‌కు సంబంధించినవన్నీ దొరుకుతున్నాయి. కావాలంటే ఉన్న ఇంటీరియర్‌కు తగిన వాటినీ ట్రై చేసి చూడొచ్చు. మెరిసే నక్షత్రాల దగ్గర్నుంచి తెల్లతెల్లని మేఘాల వరకూ అన్నింటినీ ఈ అలంకరణలో భాగం చేయొచ్చు.

మరి ఆలస్యం దేనికీ... మీరూ మీ సృజనకు పని చెప్పి మీ పడక గదికి ఇలా ఫెయిరీ టేల్‌ లుక్కును అద్దారంటే... ‘మబ్బులతో పరుపును కుట్టి, పాల నురుగు దుప్పటి చుట్టి, పరిచి ఉంచిన పానుపు చూస్తే, మేలుకోవా కలలన్నీ’ అని పాడుకుంటూ పడుకోవచ్చు హాయిహాయిగా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..