ఉపవాస వేళ... ఉపాహారంగా!

మహాశివరాత్రి నాడు... పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించడంతోపాటూ ఉపవాసం ఉండేందుకూ ప్రయత్నిస్తారు చాలామంది. ఆ రోజున స్వామికి నివేదించేందుకూ, టిఫిన్‌ రూపంలో ఏదో ఒకటి తీసుకునేందుకూ వంటకాలు కూడా కాస్త ప్రత్యేకంగానే ఉండాలి కాబట్టి వీటిని చూసేయండొకసారి.

Published : 03 Mar 2024 00:48 IST

మహాశివరాత్రి నాడు... పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించడంతోపాటూ ఉపవాసం ఉండేందుకూ ప్రయత్నిస్తారు చాలామంది. ఆ రోజున స్వామికి నివేదించేందుకూ, టిఫిన్‌ రూపంలో ఏదో ఒకటి తీసుకునేందుకూ వంటకాలు కూడా కాస్త ప్రత్యేకంగానే ఉండాలి కాబట్టి వీటిని చూసేయండొకసారి.


క్యారెట్‌ పాయసం

కావలసినవి: క్యారెట్లు: రెండు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, పాలు: ఒకటిన్నర కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌: పావుకప్పు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, కిస్‌మిస్‌: పావుకప్పు, చక్కెర: టేబుల్‌స్పూను, యాలకులపొడి: పావుచెంచా.

తయారీ విధానం: క్యారెట్ల చెక్కు తీసి తురిమి, కడిగి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి చెంచా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ను వేయించుకుని విడిగా తీసుకోవాలి.
అదే కడాయిలో మిగిలిన నెయ్యి వేసి క్యారెట్‌ తురుమును వేయించుకుని అయిదు నిమిషాలయ్యాక పాలుపోసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. పాలు మరుగుతున్నప్పుడు చక్కెర,
కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి కలపాలి. తరవాత యాలకులపొడి, వేయించుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకుల్ని వేసి మరోసారి కలిపి చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి.


బియ్యం-పుట్నాల లడ్డు

కావలసినవి: బియ్యం: కప్పు, పుట్నాలపప్పు: అరకప్పు, బెల్లం పొడి: కప్పు, నువ్వులు: టేబుల్‌స్పూను, కొబ్బరిపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, నీళ్లు: అరకప్పు, నెయ్యి: రెండు చెంచాలు, వేయించిన పల్లీలు: అరకప్పు, యాలకులపొడి: అరచెంచా.  

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి బియ్యం వేసి ఎరుపురంగులోకి వచ్చేవరకూ వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో పుట్నాలపప్పు, నువ్వుల్ని విడివిడిగా వేయించుకుని తీసుకోవాలి. బియ్యం, పుట్నాలపప్పును మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే పల్లీలు, నువ్వుల్ని కూడా విడివిడిగా గ్రైండ్‌ చేసుకుని... తరువాత అన్నింటినీ జల్లించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నీళ్లు పోసి బెల్లం పొడి వేయాలి. బెల్లం కరిగి  పాకంలా మారుతున్నప్పుడు జల్లించుకున్న పొడులూ, కొబ్బరిపొడి, యాలకులపొడి వేసి కలిపి.. చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. ఈ మిశ్రమం వేడి కాస్త చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి.


అటుకుల దద్ధ్యోదనం

కావలసినవి: మందంగా ఉండే అటుకులు: కప్పు, చిక్కని పెరుగు: రెండు కప్పులు, తాజా కొబ్బరితురుము: పావుకప్పు, ఉప్పు: తగినంత, ఆవాలు: అరచెంచా, మినప్పప్పు: చెంచా, సెనగపప్పు: చెంచా, జీడిపప్పు పలుకులు: రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: రెండు, పచ్చిమిర్చి: రెండు, నెయ్యి: టేబుల్‌స్పూను, కరివేపాకు రెబ్బలు: రెండు, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: అటుకులు మునిగేలా నీళ్లు పోసి పెట్టుకోవాలి. అయిదునిమిషా లయ్యాక అటుకుల్ని గట్టిగా పిండి ఓ గిన్నెలో వేసుకోవాలి. పెరుగును గిలకొట్టుకుని అందులో ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నెయ్యి వేసి... ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, జీడిపప్పు వేయించుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించి ఈ తాలింపును పెరుగుపైన వేయాలి. చివరగా అటుకులు, కొబ్బరితురుము వేసి అన్నింటినీ కలిపితే చాలు.


చిలగడదుంప చాట్‌

కావలసినవి: చిలగడ దుంపలు: అరకేజీ, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాలపొడి: అరచెంచా, జీలకర్రపొడి: అరచెంచా, ఉప్పు: తగినంత, వేయించిన నువ్వులు: టేబుల్‌స్పూను, వేయించి పొట్టుతీసిన పల్లీలు: పావుకప్పు, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం: టేబుల్‌స్పూను, దానిమ్మ గింజలు: కొన్ని  

తయారీ విధానం: చిలగడదుంపల్ని ఉడికించుకుని చెక్కు తీసి ముక్కల్లా కోయాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి... ఈ ముక్కల్ని దోరగా వేయించుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఈ ముక్కలపైన మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని అన్నింటినీ కలిపితే చిలగడదుంపల చాట్‌ సిద్ధం.


ఫ్రూట్‌ శ్రీఖండ్‌

కావలసినవి: ఆపిల్‌: ఒకటి, అరటిపండు: ఒకటి, నీళ్లు పూర్తిగా వడకట్టిన తాజా గడ్డ పెరుగు: రెండు కప్పులు, చక్కెరపొడి: నాలుగుటేబుల్‌స్పూన్లు, మామిడిపండు గుజ్జు: అరకప్పు (బజార్లో దొరుకు తుంది), యాలకులపొడి: పావుచెంచా, జాజికాయ పొడి: చిటికెడు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు: పావుకప్పు.

తయారీ విధానం: పెరుగులో చక్కెరపొడి, మామిడిపండు గుజ్జు వేసి గిలకొట్టినట్లుగా కలుపుకోవాలి. తరువాత ఇందులో సన్నగా తరిగిన ఆపిల్‌, అరటిపండు ముక్కలు, యాలకులపొడి, జాజికాయ పొడి వేసి కలిపి రెండు గంటల సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తినేముందు డ్రైఫ్రూట్స్‌ పలుకులు అలంకరించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..