ఆ సినిమా ఎందుకు ఇష్టమంటే!

నేను ఆ హీరోకి పెద్ద ఫ్యాన్‌ని. ఫలానా సినిమాను ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టదు... అంటూ సినీ అభిమానులు చెప్పడం చూస్తుంటాం.

Updated : 05 May 2024 14:19 IST

నేను ఆ హీరోకి పెద్ద ఫ్యాన్‌ని. ఫలానా సినిమాను ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టదు... అంటూ సినీ అభిమానులు చెప్పడం చూస్తుంటాం. మరి తారల సంగతి... వాళ్లకు బాగా గుర్తుండిపోయిన లేదా ఇష్టపడిన సినిమా ఏంటో కూడా చూసేద్దామా...  


అంత ధైర్యం లేదు - మహేశ్‌బాబు

నా దృష్టిలో చాలా గొప్ప సినిమా అంటే..మా నాన్న నటించిన ‘అల్లూరి సీతారామరాజు’. నాకు అది ఆల్‌టైం ఫేవరెట్‌ మూవీ. నాన్న నటించిన సినిమా కావడం... దాన్ని ఆరోజుల్లోనే చాలా అద్భుతంగా చిత్రీకరించడమే అందుకు కారణం. అందుకే ఆ సినిమాను ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టదు నాకు. చాలామంది నన్ను ఆ పాత్రను చేయొచ్చు కదా, సినిమానే మళ్లీ తీయొచ్చు కదా అని అడుగుతుంటారు కానీ... నేను ఇష్టపడను. ఎందుకంటే నాన్నలా ఆ పాత్రకు న్యాయం చేయలేనని నా నమ్మకం. ప్రయోగాలు చేసి ఓ మంచి సినిమాను చెడగొట్టడం కన్నా తీరిక దొరికినప్పుడల్లా దాన్ని చూసి ఆనందించడం ఉత్తమం కదా.


ప్రేమకథలు బాగుంటాయి - ప్రభాస్‌

నేను తెరమీద ఎక్కువగా యాక్షన్‌ చిత్రాలు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చినా... నాకు మాత్రం ప్రేమకథలంటేనే ఇష్టం. అందుకే షూటింగ్‌లు లేనప్పుడు లవ్‌స్టోరీస్‌ను చూస్తుంటా. అయితే... అన్నింట్లోకీ నాకు మణిరత్నం తీసిన ‘గీతాంజలి’ అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఆ సినిమాలో ప్రకాశ్‌ - గీతాంజలి... పాత్రలు, వాటిని చిత్రీకరించిన వైనం వావ్‌ అనిపిస్తుంటుంది. ఇక, గీతాంజలితోపాటు నేను ఎక్కువసార్లు చూసిన సినిమా ‘షోలే’.


అలాంటి చిత్రంలో నటించాలి - కీర్తిసురేష్‌

నాకు చిన్నప్పటినుంచీ బాగా ఇష్టమైన నేను ఎక్కువసార్లు చూసిన సినిమా ‘టైటానిక్‌’. నా దృష్టిలో అదో అద్భుతమైన ప్రేమకావ్యం. అందులో హీరోహీరోయిన్లు షిప్‌ అంచున నిల్చుని చేతులు చాచే సీను ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. చిన్నప్పుడు ఆ సినిమాను చూసి... కాస్త ఎమోషనల్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ మధ్య స్పెయిన్‌కు వెళ్లినప్పుడు... నేను ఆ హీరో-హీరోయిన్లలా ఓ కారు ముందు చేతులు చాచి నిల్చుని ఫొటో తీయించుకున్నా. ఎప్పటికైనా అలాంటి అద్భుతమైన సినిమాలో నటించాలని నా కోరిక. చూడాలి...ఆ అవకాశం వస్తుందో రాదో మరి.


వందసార్లు చూసి ఉంటా - త్రిష

న్నేళ్లలో  నేను ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఏదయినా ఉందంటే అది ‘వర్షం’. ఎందుకంటే...  దాదాపు వందరోజులకు పైగా నేను వర్షంలో తడుస్తూనే ఆ సినిమాను చేయాల్సి వచ్చింది. దాంతో వర్షమన్నా, నీళ్లు అన్నా ఒకలాంటి ఫోబియా మొదలైంది. అయితే ఆ సినిమా తరువాత నా కష్టం వృథాపోలేదు. ‘వర్షం’ నాకు మంచి పేరును తెచ్చిపెట్టడంతోపాటూ తెలుగు ఇండస్ట్రీలో ఎర్రతివాచీని పరిచింది. నన్నో స్టార్‌ హీరోయిన్‌ని చేసింది. అందుకే ఆ సినిమా నాకు ఇప్పటికీ నచ్చుతుంది. తీరిక దొరికినప్పుడల్లా చూడాలనీ అనిపిస్తుంది. దాంతోపాటు నేను ఎక్కువగా ఇష్టపడే సినిమా ‘ది ఇంగ్లిష్‌ పేషెంట్‌’. దీన్ని వందసార్లకు పైగా చూసి ఉంటా.


ఆ సీను చెయ్యాలనుంది - విజయ్‌ దేవరకొండ

నేను హాస్టల్‌ నుంచి వచ్చాక చూసిన సినిమాల్లో నాకు బాగా గుర్తుండిపోయినవి... ‘గ్లాడియేటర్‌’ ‘పోకిరి’. ‘గ్లాడియేటర్‌’ని సీడీ తెప్పించుకుని మరీ చూశా. అయితే ఆ సినిమా, అందులోని పాత్రలూ పెద్దగా అర్థంకాలేదు కానీ చిత్రీకరణ మాత్రం చాలా గొప్పగా అనిపించింది. ఆ తరువాత థియేటర్‌లో ‘పోకిరి’ని చూడటం నాకు ఇప్పటికీ గుర్తుంది. అందులో మహేశ్‌బాబు పరుగెత్తుతూ ఎండుమిర్చి, కూరగాయల మధ్య ఎగురుతున్న సీను ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ సీను చూశాక హీరో అంటే ఇలాగే ఉండాలని అనిపించింది. అంతేనా.. నేను సినిమాల్లోకి వచ్చాక ఆ సీన్‌ ఒక్కసారైనా చేయాలనే కోరిక కలిగింది. అందుకే నా దర్శకుల్ని అప్పుడప్పుడూ ఆ సీన్‌ను పెట్టే ఛాన్స్‌ ఉంటే చూడండని ఇప్పటికీ అడుగుతుంటా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు