నీ కోసమే ‘బంగారం’!

‘నా బంగారు కొండా, వజ్రాల మూటా’ అంటూ పసిపాపాయిల్ని ముద్దాడటమేనా... బోసినవ్వులు చిందించే చిన్నారులకు ఇచ్చే బహుమతులూ అంతే గొప్పగా ఉండాలనుకునేవారెందరో. అందుకే పాపాయిల పాలసీసాల దగ్గర్నుంచి బొమ్మల వరకూ అన్నింట్లోనూ బంగారు మెరుపుల్ని చొప్పిస్తున్నారు.

Published : 05 May 2024 00:37 IST

‘నా బంగారు కొండా, వజ్రాల మూటా’ అంటూ పసిపాపాయిల్ని ముద్దాడటమేనా... బోసినవ్వులు చిందించే చిన్నారులకు ఇచ్చే బహుమతులూ అంతే గొప్పగా ఉండాలనుకునేవారెందరో. అందుకే పాపాయిల పాలసీసాల దగ్గర్నుంచి బొమ్మల వరకూ అన్నింట్లోనూ బంగారు మెరుపుల్ని చొప్పిస్తున్నారు. ఎన్నెన్నో గోల్డ్‌ కానుకల్ని అందిస్తున్నారు!

అప్పుడే పుట్టిన బుజ్జాయిని చూసి ఆనందంతో ‘నా మనవరాలికి బంగారు ఉగ్గు గిన్నెను కొనిస్తా’ అంది నానమ్మ. ‘అయితే నా వంతుగా గోల్డ్‌ ప్లేట్‌ కొంటా’ అన్నాడు తాతయ్య. అంతలోనే ‘నేనైతే పాపాయికి కావాల్సిన గిలక, పాలసీసా అన్నీ పసిడివే తీసుకొస్తా’ మురిపెంగా చెప్పింది మేనత్త. ‘గిన్నెలూ, కంచాలూ సరే కానీ మిగతావి కూడా బంగారంతోనా’ అనుకుంటున్నారా... అవును మరి, ఇప్పుడు పసిపిల్లల కోసం ప్రతిదీ బంగారు అందాలతో వస్తున్నాయి.

ఎన్ని రకాలో...

చిన్నారులకు తొలిముద్ద తినిపించే అన్నప్రాశన కార్యక్రమంలో వెండి గిన్నెల్ని ఉంచుతుంటారు. సన్నిహితులు బహుమతులుగానూ చిన్న వెండి గిన్నెలాంటివి ఇస్తుంటారు కూడా. ఒకప్పటి ఆ పద్ధతే- ఇప్పుడు ఇంకాస్త మార్పులతో కొనసాగుతోంది. వెండి వెలుగులతో పాటు బంగారు మెరుపుల వస్తువుల్నీ తెచ్చుకుంటున్నారు. స్పూనూ, గిన్నే, గ్లాసే కాదు... బుజ్జాయిలు నోట్లో పెట్టుకునే పాలసీసా, అద్దం, దువ్వెనా... ఇలా అన్నీ బంగారంతో తయారుచేస్తున్నారు. ఇంకా రకరకాల గిలకలూ, ఆట బొమ్మలూ, ఫొటో ఫ్రేములూ... బంగారు చమక్కులతో వచ్చాయి. అందమైన బొమ్మల రూపాలతో కిడ్డీబ్యాంకులూ, ఉయ్యాలా లాంటివి కూడా పుత్తడితో దొరుకుతున్నాయి. వీటిని అచ్చంగా బంగారంతో చేయించుకోవచ్చు లేదంటే వెండి మీద బంగారు పూతా వేయించుకోవచ్చు.  

నిజానికి మన ప్రపంచంలోకి అడుగుపెట్టిన బుజ్జాయిలకు స్వాగతం చెబుతూ సన్నిహితులూ రకరకాల కానుకలు అందిస్తుంటారు. మాయ చేసే పసిపాపాయిల నవ్వుల్ని దేనితో కొలవగలం... మురిపించే బుజ్జాయిల చేష్టలకు ఏ కానుక సరిపోతుంది!. ఎంత వెతికినా వాటికి సరితూగే బహుమతేదీ దొరకదు కదా. కానీ ఆ మురిపాలన్నింటినీ మూట కడుతూ పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే మాత్రం- ఈ బంగారు వస్తువుల్ని ఇవ్వొచ్చు. ఇవి చూడ్డానికి అందంగా, వినడానికి ఎంతో గొప్పగా ఉంటూనే... ఇతర వాటితో పోల్చితే వీటిని వాడటమూ మంచిదంటూ చెబుతూ పిల్లల అన్ని వస్తువులకీ పసిడి కాంతుల్ని జత చేస్తున్నారు.
వెండి మొలతాడూ, పట్టీలూ లాంటి వాటికి బదులు కాస్త కొత్తగా కానుక ఇవ్వాలనుకుంటే మాత్రం... బుజ్జాయి ఆడుకునే మువ్వల బంగారు మెరుపుల గిలకనో, కాస్త పెద్దయ్యాక కూడా పిల్లలకు ఉపయోగపడే గోల్డ్‌ పూత కిడ్డీ బ్యాంకునో ఇచ్చేయండి. పది మందిలో మీ అభిరుచి ప్రత్యేకంగా కనిపిస్తుంది, ఆ బహుమతి ఎప్పటికీ ఉండిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు