కేకు చిత్రం ఎంత అందం..!

విజయ్‌ పుట్టినరోజుకు కేకు తెప్పించారు స్నేహితులు. దానిపైన పచ్చని చెట్లూ, పూలూ, మంచుకొండలూ... ఇలా ప్రకృతి సోయగాన్నంతా ఫొటో తీసినట్లుగా 3డీలో డిజైను చేసిన తీరు చూశాక ‘ఇది కేకా... లేక ఆర్ట్‌పీసా’ అంటూ చెయ్యలేక కట్‌చేశాడు.

Published : 26 May 2024 00:09 IST

విజయ్‌ పుట్టినరోజుకు కేకు తెప్పించారు స్నేహితులు. దానిపైన పచ్చని చెట్లూ, పూలూ, మంచుకొండలూ... ఇలా ప్రకృతి సోయగాన్నంతా ఫొటో తీసినట్లుగా 3డీలో డిజైను చేసిన తీరు చూశాక ‘ఇది కేకా... లేక ఆర్ట్‌పీసా’ అంటూ చెయ్యలేక కట్‌చేశాడు. నేచర్‌థీమ్‌ కేకుల ప్రత్యేకత అదే మరి. ప్రకృతి అందాల్ని 3డీలో కళ్లకు కడుతూ ఆకట్టుకుంటాయివి. కేకుల వెరైటీల్లో తాజాగా వచ్చేసిన ఈ థీమ్‌ చేస్తున్న మ్యాజిక్‌ ఏంటో చూసేద్దాం రండి...

పిల్లల పుట్టినరోజు రాబోతున్నా, పెళ్లి రోజును సరదాగా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నా... ‘కేకుదేముంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు. ముందు మిగతా ఏర్పాట్లను చూసుకోవాలి గానీ’... అని ఎవరూ అనుకోవడంలేదిప్పుడు. మిగిలిన ఏర్పాట్లూ, వేడుకకి తగినట్లుగా ఎంచుకునే దుస్తులూ ఎంత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారో కేకును కూడా అంత కొత్తగా, ట్రెండీగా, మనసుకు నచ్చినట్లుగా డిజైను చేయించుకుంటున్నారు.  ఇందులోనూ కస్టమైజేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఒకప్పటితో పోలిస్తే షెఫ్‌లూ, కేకు తయారీ నిపుణులూ ఎప్పటికప్పుడు కేకులపైన చిత్ర విచిత్రాలను ఆవిష్కరించేస్తూ కొత్తకొత్త థీమ్‌లనూ సృష్టించేస్తున్నారు. వాటిల్లో ప్రస్తుతం ‘3డీ నేచర్‌థీమ్‌ కేకులు’ చేరిపోయి ప్రకృతిప్రేమికులకు ఆనందాన్ని పంచుతూనే కేకు ప్రియుల్ని ఆనందాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి.  

ఎంతో సహజంగా...

కేకుపైన ఐసింగ్‌షుగర్‌తో రంగురంగుల గులాబీలూ, ఆకులూ డిజైను చేయడంతో పోలిస్తే... ఈ నేచర్‌థీమ్‌ కేకుల తయారీ కాస్త భిన్నమనే చెప్పొచ్చు. ముందుగా ఓ థీమ్‌ను అనుకుని దానికి తగినట్లుగా కేక్‌ బేస్‌ను గుండ్రంగానో, దీర్ఘచతురస్రంలోనో, టూటైర్‌ లేదా త్రీ టైర్‌ రూపంలోనో తయారు చేసుకుంటారు. అదయ్యాక ఆ థీమ్‌ను కేకుపైన అవుట్‌లైన్‌ రూపంలో వేసుకుని ఎడిబుల్‌ పెయింట్లతో రంగుల్ని నింపుతూ, ఫాండంట్‌తో, చాక్లెట్‌తో చేసిన బొమ్మల్ని అమర్చుతూ అనుకున్న రూపాన్ని తీసుకొస్తారు. అంతా పూర్తయ్యాక - కొమ్మల్నీ, ఆకుల్నీ, పువ్వుల్నీ నిజమైనవి తెచ్చిగానీ పెట్టారా అని సందేహించేంత సహజత్వంతో కనికట్టు చేస్తాయివి. పచ్చగడ్డి మధ్య సేదతీరుతున్న గుర్రాలూ, ఆకాశంలో ఎగురుతున్న పక్షులూ, కొండలమధ్య నుంచి ప్రవహిస్తున్న నీరూ... రంగురంగుల పూలూ, ప్రకృతిని ఆస్వాదిస్తున్న జంట... ఇలా కేకులపైన సమస్త ప్రకృతినీ కనిపించేలా చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు కేకు తయారీ నిపుణులు.

ఈ కేకులన్నీ అలా డిజైను చేసినవే మరి. ప్రకృతిని అమితంగా ఇష్టపడేవారి పుట్టినరోజుకు తీసుకెళ్లేందుకూ లేదా ఏదయినా కొత్తరకం థీమ్‌తో కేక్‌ను డిజైను చేయించుకోవాలనుకున్నప్పుడూ వీటిని ఎంచుకుంటే... వేడుకకి వచ్చినవాళ్లంతా ‘వావ్‌... కేకు కేక!’ అంటూ మెచ్చుకోకుండా ఉంటారా...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..