చింతచిగురు...నోరూరు!

చింతచెట్టు చిగురు చూడు... చిన్న దాని పొగరు చూడు... చింతచిగురు పుల్లగున్నాదోయి... నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్‌... అంటూ అందాల చిన్నదాన్ని చింత చిగురుతో పోల్చి వర్ణించాడో సినీ కవి.

Published : 05 May 2024 00:16 IST

చింతచెట్టు చిగురు చూడు... చిన్న దాని పొగరు చూడు... చింతచిగురు పుల్లగున్నాదోయి... నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్‌... అంటూ అందాల చిన్నదాన్ని చింత చిగురుతో పోల్చి వర్ణించాడో సినీ కవి. వర్ణనకే కాదు... వండినా అద్భుతంగా ఉండే చింతచిగురు రుచికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. పచ్చబంగారంలా చిటారు కొమ్మన మిలమిల మెరిసే ఈ చిగురును తింటే ఆరోగ్యం గురించి చింత కూడా అవసరం లేదట.

ఉండీలేనట్టుగా పులుపూ కాస్త వగరూ కలబోసుకుని భలే రుచిగా ఉంటుంది చింతచిగురు. ఎర్రెర్రని లేలేత చిగురు అయితే కాస్త తియ్యగానూ ఉంటుంది. ఈ చింతచిగురును పప్పులో వేసినా... తాలింపు పెట్టి పులిహోర చేసినా...మాంసాహారంతో ముడి పెట్టి మసాలాలు దట్టించి కూర వండినా అదుర్స్‌ అనాల్సిందే. పాకశాస్త్రంలో దీంతో ఎన్ని ప్రయోగాలు చేసినా ఫస్ట్‌ క్లాస్‌లో పాసైపోవడం ఖాయం. ధరతోపాటు రుచిలోనూ పోటీపడగల ఈ చిగురును- అలానే తినేసినా కాస్త ఉప్పు అద్దుకుని నోట్లో వేసుకున్నా వహ్వా అనకమానరు ఎవరైనా. అందుకే ఏ దేశంలో ఉన్నా... వేసవిలో మాత్రం చింతచిగురును ఓ పట్టుపట్టాల్సిందేనంటారు చాలామంది. లేలేత ఎరుపూ, ఆకుపచ్చ వర్ణాలూ కలగలిపిన తాజా చిగురుతో కూరలూ, వేపుళ్లూ, రోటిపచ్చడీ, కారంపొడులతోపాటు- చికెన్‌, మటన్‌, రొయ్యలూ, ఎండుచేపలతో కలిపి మాంసాహార కూరలూ వండుకుంటారు.

వేసవికి వీడ్కోలు పలికి... వర్షాలకు స్వాగతం పలికే సమయానికి చింత చిగురు సీజన్‌ అయిపోయి... ఆకు ముదిరిపోతుంది. కాబట్టి ఏడాదంతా చింతచిగురు రుచిని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఉప్పూ, పసుపూ పట్టించి నిల్వ చేసుకుంటారు కొందరు. మరికొందరేమో కూరల్లోకీ, అన్నంలోకీ పొడి కూడా చేసి పెట్టుకుంటారు. చింతచిగురు అంత మొత్తంలో మాకు దొరకదు కదా అనుకునేవారికోసం ఆన్‌లైన్‌లోనే పలు రూపాల్లో అందుబాటులో ఉంది. పచ్చడీ, కూరల్లోకి పొడీ, చిగురు కారంపొడే కాక, డ్రైడ్‌ చింతచిగురు కూడా దొరికేస్తోంది. ఎప్పుడంటే అప్పుడు తెప్పించుకుని రుచి చూసేయొచ్చు.

కుండీల్లోనే చిగురు...

పోషకాలభరితమైన చింతచిగురు వందగ్రాముల ధర రూ.100పైనే పలుకుతోంది. అమ్మో అంత ఖరీదుపెట్టి కొనుక్కోవాలా అనుకునేవాళ్లూ, ఏడాదంతా తాజాగా రుచి చూడాలనుకునేవాళ్లూ... మేడ మీదనో, బాల్కనీల్లోనో ఈ చిగుళ్లను పూయిస్తున్నారు. కుండీల్లో చింత గింజల్ని నాటుకోగా వచ్చిన మైక్రోగ్రీన్స్‌తోనూ నచ్చినట్టుగా గరిట తిప్పుతిన్నారు. అందుకోసం కొన్ని చింత గింజలు తెచ్చి పెట్టుకుంటే.... చింత ఇంట్లోనే చిగుళ్లు వేస్తుంది. కృష్ణాజిల్లా ఈడ్పుగల్లుకు చెందిన రైతు శ్రీనివాసరావు ఎకరం జామతోటలో చిగురుకోసమే చింతను అంతర పంటగా సాగు చేసి... వేసవిలో లక్షలు సంపాదిస్తున్నాడు. మరి అంత డిమాండ్‌ ఉన్న చింతచిగురు
ఆరోగ్యానికి ఎన్నోరకాలుగానూ మేలు చేస్తుంది. చింతపండులో కంటే చిగురాకులోనే పోషకాలు అధికం. ప్రొటీన్లు ఎక్కువగానూ కొవ్వు పదార్థాలు తక్కువగానూ లభించే చింతచిగురు(వందగ్రాములు)లో దాదాపు 115 క్యాలరీలు, రెండు గ్రాముల కొవ్వు, ఆరు గ్రాముల ప్రొటీన్‌, పద్దెనిమిది గ్రాముల కార్బోహైడ్రేట్లు, 140 గ్రాముల ఫాస్పరస్‌, గ్రాము మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలుంటాయి. తరచూ తీసుకోవడం వల్ల డైటరీ ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఈ ఆకులు మంచి ఔషధంలా పని చేస్తాయి. విటమిన్‌ సి, టార్టారిక్‌
యాసిడ్‌లు రోగనిరోధకశక్తిని వృద్ధిచేస్తాయి. చింతచిగురును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎర్రరక్తకణాల సంఖ్య పెరిగి రక్తం శుద్ధి అవుతుంది. పిల్లలకు తినిపిస్తే
నులిపురుగులూ, జీర్ణసంబంధ సమస్యలూ దూరమవుతాయి. చింతచిగురు ఉడికించిన నీళ్లను పుక్కిలిస్తే గొంతు నొప్పీ, మంటా, వాపూ తగ్గుతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాల వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. ఇది కాలేయాన్ని రక్షించడంతోపాటు జీర్ణక్రియల్ని మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారు చింతచిగురును తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ చిగురు రసంలో కాస్త పటికబెల్లం కలిపి తీసుకుంటే ఒంట్లో వేడీ, వాతం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఎన్నో సుగుణాలున్న చింతచిగురును ఈ ఒక్క సీజన్‌లో తిన్నా చాలు... ఆరోగ్యపరంగా చింతలెన్నో దూరమవుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..