కాస్త నెయ్యి వేసుకోండి!

మామిడికాయ, దోసకాయ, గోంగూర... ఏ పప్పుకూరయినా కాస్త నెయ్యి వేసి పోపుపెడితే... ఆ ఘుమఘుమకి అమాంతంగా ఆకలి పుట్టుకొస్తుంది. తెలీకుండానే ఓ నాలుగైదు ముద్దలు ఎక్కువే వెళ్లిపోతాయి.

Updated : 14 May 2023 12:00 IST

మామిడికాయ, దోసకాయ, గోంగూర... ఏ పప్పుకూరయినా కాస్త నెయ్యి వేసి పోపుపెడితే... ఆ ఘుమఘుమకి అమాంతంగా ఆకలి పుట్టుకొస్తుంది. తెలీకుండానే ఓ నాలుగైదు ముద్దలు ఎక్కువే వెళ్లిపోతాయి. అంత కమ్మని వాసనా రుచీ ఏ నూనె తాలింపుకీ ఉండదు మరి. అలాంటి నెయ్యికి బరువు పెరిగిపోతుంది... అస్సలొద్దు’ అంటూ చేయడ్డం పెట్టేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అందుకే అసలు నెయ్యిలోని మంచీచెడులేమిటో సమీక్షిస్తే..!

‘అ య్యో... పిల్లకి అన్నం ఇంత పొడిపొడిగానా పెట్టేదీ... కాస్త నెయ్యి పొయ్యవే...’ అంది మునిమనవరాలికి అన్నం తినిపిద్దామని కూర్చున్న రుక్మిణమ్మ. ‘ఆ రోజులు వేరు బామ్మా... ఇప్పుడు అంతంత నెయ్యి తినకూడదు, కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది అంటున్నారు డాక్టర్లు’ అంటూ చెప్పింది మనవరాలు రమ్య. అవునుమరి, నేటితరం నెయ్యి పేరు చెబితేనే భయపడుతోంది. అది తినకూడని వస్తువా అని అడిగితే, కొంతవరకూ నిజమే అంటున్నారు కొందరు అల్లోపతీ వైద్యులు. అయితే నెయ్యి తినేవాళ్లలో చెడు కొలెస్ట్రాల్‌ తక్కువ, మంచి కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉంటుందనీ; క్యాన్సర్‌ కారకాల్నీ ఇది తగ్గిస్తుంద]నీ నేషనల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు.

ఓ ముప్ఫై ఏళ్లు వెనక్కి వెళితే...

పూర్ణం బూరె మొదలుకుని రసం అన్నం వరకూ కమ్మని ఆ నేతి వాసనా రుచీ లేందే ముద్ద దిగనివాళ్లే అప్పట్లో ఎక్కువ. కాలం మారింది. ఆహారపుటలవాట్లలో మార్పు వచ్చింది. ఫలితం... ఓ స్పూను నెయ్యి లేకుండానే భోజనం కానిచ్చేస్తోంది ఈతరం. అయితే ‘నెయ్యి పూర్తిగా మానేయడం సరికాదు... తగు మోతాదులో నెయ్యి తినడం ఆరోగ్యానికి మేలు’ అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అల్లోపతీనా ఆయుర్వేదమా అన్నది పక్కనపెడితే- నెయ్యి భారతీయుల సూపర్‌ఫుడ్‌. ఎన్నో వ్యాధులకు మందు. జంక్‌ఫుడ్డులోని అనారోగ్యకరమైన కార్బొహైడ్రేట్లను పట్టించుకోరు కానీ ఒంటికి మేలు చేసే నెయ్యిని మాత్రం కొవ్వు అంటూ పక్కకి నెట్టేస్తున్నారు. కానీ నూనెతో పోలిస్తే వంటకాలకి నెయ్యే మంచిదట.

అసలేమిటీ నెయ్యి?

వెన్నను మరిగిస్తే వచ్చేదే నెయ్యి.సంతృప్త కొవ్వులు ఉండటంతో గది ఉష్ణోగ్రత దగ్గర పూసలవంటి స్ఫటిక రూపంలోనూ, కరిగించినప్పుడు పారదర్శకంగానూ ఉంటుంది.

నెయ్యిని రెండు పద్ధతుల్లో తయారుచేస్తారు. పాలు కాచి తోడుపెట్టి పెరుగుమీద మీగడను చిలికి వెన్న తీసి, కాయడం సంప్రదాయ విధానం. భారీయెత్తున సేకరించిన పాల నుంచే వెన్నను వేరుచేసి యంత్రాల్లో కరిగించి చేయడం మరో పద్ధతి. రెండింటిలో సంప్రదాయ విధానంలో చేసే నెయ్యి కమ్మగా ఉంటుంది. నేతి రుచి ఉష్ణోగ్రత మీదా ఆధారపడి ఉంటుందట. పచ్చిపాల వెన్న నుంచీ మీగడ నుంచీ కూడా నెయ్యి తయారుచేస్తుంటారు. 

వేదకాలం నుంచే మనదేశంలో నెయ్యి వాడుకలో ఉంది. యజ్ఞాల్లో హోమాల్లో అగ్నిని ప్రజ్వలింపచేయడానికి నెయ్యి వేస్తారు. పూజల్లోనూ వంటల్లోనూ ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు. అన్నంలో నెయ్యి వేసుకునేవాళ్ల సంఖ్య తగ్గినప్పటికీ వంటకాల తయారీలో నేటికీ నెయ్యి వాడకం ఎక్కువే. మైసూర్‌పాక్‌, అరిసెలు, పూతరేకులు, సున్నుండలు... వంటి పిండివంటల తయారీలో నెయ్యి తప్పనిసరి. కేసరి, బొబ్బట్లు, చక్రపొంగలి... తదితర తీపి వంటకాలకి నెయ్యి ఎంత పడితే అంత రుచి. బిర్యానీ రోటీ కిచిడీల్లోని కమ్మదనం నేతి చలువే మరి.

భావప్రకాశిక గ్రంథం ప్రకారం- నెయ్యి శరీరంలో సప్తధాతు నిర్మాణానికి దోహదపడుతుంది. ఒంట్లోని వేడినీ వికారాన్నీ తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తినీ జీర్ణశక్తినీ పెంచుతుంది. నాడీవ్యవస్థను చురుకుగా మారుస్తుంది. కండరాలకు బలాన్నిస్తుంది. వాత, పిత్త, కఫ దోషాల్ని నివారిస్తుంది. ఇది శరీర కణజాలాల్లోకి వెళ్లి లోపలున్న దోషాల్ని పోగొడుతుందన్న కారణంతో పంచకర్మ వైద్యంలోనూ నెయ్యి వాడతారు. దృష్టి, శ్వాసకోశ సమస్యల నివారణకి కంట్లోనూ నాసికా రంధ్రాల్లోనూ నెయ్యి వేస్తుంటారు. బయటకు వెళ్లేముందు ముక్కులోపల నేతి చుక్కను రాసుకుంటే అలర్జీలు రావట. రోజుకి రెండుమూడు స్పూన్లు తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుందనీ, పిల్లలకీ వృద్ధులకీ నెయ్యి మంచిదనీ, నేతితో వండిన అన్నం పిల్లలకు మేలనీ అంటారు.

లాభాలెన్నో!

వంద మి.లీ. నెయ్యి నుంచి 883 క్యాలరీలు లభిస్తాయి. అధికశాతం శాచ్యురేటెడ్‌ కొవ్వులూ, కొలెస్ట్రాల్‌ ఉన్నప్పటికీ నెయ్యి ఆరోగ్యానికి మంచిదే. కొవ్వుల్ని కరిగించే ఎ, డి, ఇ విటమిన్లతోపాటు కె-విటమిన్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది. నెయ్యి తినడంవల్ల పొట్ట శుభ్రపడి అల్సర్లు వచ్చే ప్రమాదమూ తగ్గుతుంది. నెయ్యి జీవక్రియని పెంచి ఇతర కొవ్వులు కరగడానికి తోడ్పడుతుంది. దాంతో బరువు తగ్గుతారు. ఇందులోని క్యాంజుగేటెడ్‌ లినోలియాక్‌ ఆమ్లం, ఫినాలిక్‌ ఆమ్లాలు బరువు పెరగకుండా చేయడంతోపాటు హృద్రోగాల్నీ రానివ్వవట. అందుకే నెయ్యి తింటే ఒళ్లు గట్టిపడుతుందనీ అనేవారు పెద్దవాళ్లు. నెయ్యిలోని ప్రత్యేక గుణాలు సన్నగా ఉన్నవాళ్లు బరువు పెరిగేలానూ చేస్తాయట.

క్యాన్సర్ల నిరోధానికీ: గడ్డి తినే పశువుల నుంచి తీసిన నెయ్యిలో బ్యుటిరిక్‌ ఆమ్లం ఎక్కువ. ఇది ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించడం ద్వారా క్యాన్సర్లనీ నిరోధిస్తుంది. నూనె కన్నా నెయ్యి స్మోకింగ్‌ పాయింట్‌ ఎక్కువ. కాబట్టి నెయ్యిని మరిగించినప్పుడు- అందులోని ఫ్యాటీ ఆమ్లాలు విడిపోయి క్యాన్సర్‌ కారక ఫీ-రాడికల్స్‌ విడుదల కావు. అందుకే వేయించే కొన్ని రకాల వంటకాలకి నూనె కన్నా నెయ్యే మేలు.

నాడులకీ టానిక్కే: నాడీ సమస్యలకీ ఇది మందే. ఒత్తిడితో ఉన్నప్పుడు కాలేయం ఎక్కువ కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు నెయ్యి తింటే ఒత్తిడి తగ్గి, నిద్ర పడుతుందట. శరీరంలోని విషపదార్థాలను నెయ్యి గ్రహించి బయటకు పంపిస్తుంది.

కీళ్లసమస్యలకీ: కె-విటమిన్‌ కాల్షియం శోషణకు తోడ్పడుతుంది కాబట్టి దంతక్షయం, కీళ్లనొప్పులు... రాకుండా చేస్తుంది నెయ్యి. కాలేయ ఆరోగ్యానికీ మేలే. 

మధుమేహానికీ: నేతితో కాల్చిన రొట్టె త్వరగా జీర్ణమవుతుంది. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌నీ తగ్గిస్తుంది.

ప్రత్యుత్పత్తికీ: సంతానోత్పత్తికి సాయపడుతుంది నెయ్యి. గర్భిణులకి నెయ్యి పెట్టమని చరకసంహిత పేర్కొంటోంది. తమిళనాడులోని తిరుకరుకవూరులోని ‘గర్భరక్షాంబిగై అమ్మన్‌’ ఆలయంలో పిల్లలకోసం అమ్మవారిని ప్రార్థించినవాళ్లకి శ్లోకంతోపాటు 48 రోజులపాటు రోజూ కాస్త నెయ్యిని ప్రసాదంగా తినమంటారక్కడి పూజారులు.

ఎంత తినాలి?: నెయ్యిలో గుండె పనితీరుని మెరుగుపరిచే ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలూ ఉంటాయి. అయితే, మోతాదు మించితే ఇందులోని సంతృప్త కొవ్వులు హృద్రోగాల్నీ తెస్తాయి. కాబట్టి గుండెజబ్బులూ కాలేయ, మూత్రపిండ సమస్యలు ఉన్నవాళ్లు నెయ్యికి కాస్త దూరంగానే ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు రోజుకి ఒకటీరెండు టీస్పూన్ల నెయ్యి తింటే మంచిదే మరి!


ఏ నెయ్యి మంచిది?

ఆవు, గేదె, మేక పాల నుంచి నెయ్యి తీసినప్పటికీ ఆవు నెయ్యి శ్రేష్ఠమైనది అంటోంది ఆయుర్వేదం. ఆవునెయ్యిలో బీటా-కెరోటిన్‌ ఎక్కువగా ఉండటంతో పసుపు రంగులో ఉంటుంది. గేదె నెయ్యి తెల్లగా రుచిగా ఉంటుంది. కానీ ఆవునెయ్యిలో కొవ్వు శాతం తక్కువ కావడంతోపాటు, జీవక్రియను పెంచి బరువును తగ్గించే కాంజ్యుగేటెడ్‌ లినోలియాక్‌ ఆమ్ల శాతం ఎక్కువ. అయితే ఈ ఆమ్లం గడ్డి మేసే పశువుల పాలల్లోనే అధికంగా ఉంటుందట. అందుకే పశువులకు వేసే మేతను బట్టి గ్రాస్‌-ఫెడ్‌,  ఎ2 ఆర్గానిక్‌ గ్రాస్‌ ఫెడ్‌, గ్రెయిన్‌-ఫెడ్‌, గార్లిక్‌గ్రాస్‌-ఫెడ్‌.. ఇలా రకరకాల పేర్లతో సేంద్రియ మంత్రాన్ని చేర్చి మరీ నెయ్యిని విక్రయిస్తున్నాయి కంపెనీలు. గిర్‌, సాహివాల్‌, వేచూరు... వంటి దేశవాళీ ఆవుల్లో ఎ2 రకం బీటా కేసిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. అదే హైబ్రిడ్‌ జాతి ఆవుల్లో ఎ2 కన్నా ఎ1 రకం బీటా కేసిన్‌ ఎక్కువ. ఎ1తో పోలిస్తే ఎ2 మంచిదట. దీని ధర కూడా ఎక్కువే. కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల గేదె నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కానీ దానివల్ల బరువు పెరుగుతారు. ఆవునెయ్యిని అన్ని వయసులవాళ్లూ తినొచ్చు. కానీ గేదె నెయ్యి ఆరోగ్యంగా చురుకుగా ఉన్నవాళ్లకే మంచిదట. పిల్లలకు కూడా ఆవు నెయ్యి పెట్టడంవల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది అంటారు ఆయుర్వేద వైద్యులు.


నెయ్యి... సరికొత్త రుచితో..!

కాఫీని ఆ వాసనకోసమే తాగినట్లుగా చాలామంది నెయ్యిని కూడా ఆ వాసన కోసమే తింటారు. అయితే ఇటీవల నెయ్యి సైతం వెల్లుల్లి, రోజ్‌, కేసర్‌, రోజ్‌మేరీ, వెనీలా, మసాలా, పసుపు... ఇలా విభిన్న ఔషధమూలికల ఫ్లేవర్లను అద్దుకుని మరీ వస్తోందిప్పుడు. ఒకేదాంట్లో రెండుమూడు మూలికల్ని సైతం మేళవిస్తున్నారు. ఉదాహరణకు గోల్డెన్‌ టర్మరిక్‌ నెయ్యిలో పసుపు, అశ్వగంధ, అల్లం... వంటివి కలపడంతో అది మరింతగా జీర్ణశక్తిని పెంచుతుంది. బ్రెడ్‌మీద రాసుకుని తినేందుకు చాకొలేట్‌ ఘీ కూడా దొరుకుతోంది. కేకుల్లో పైనాపిల్‌ ఫ్లేవర్‌ కోసం ఆ ఎసెన్స్‌ వాడినట్లుగాకొన్ని వంటల్లో నెయ్యి వేయకుండానే దాని వాసన ఘుమఘుమలాడేలా ఇప్పడు నెయ్యి కూడా ఎసెన్స్‌ రూపంలో వస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..