నోరూరించే నాన్‌వెజ్‌ స్నాక్స్‌!

కూర, పులుసు, వేపుడు... ఇలా మాంసాహారంతో చేసుకునే వంటకాలు బోర్‌ కొట్టాయనిపిస్తే... ఈసారి స్నాక్స్‌ ప్రయత్నిస్తే సరి. కొత్తగా ఉంటాయి, మళ్లీమళ్లీ తినాలనిపిస్తాయి.

Published : 22 Jan 2023 00:13 IST

నోరూరించే నాన్‌వెజ్‌ స్నాక్స్‌!

కూర, పులుసు, వేపుడు... ఇలా మాంసాహారంతో చేసుకునే వంటకాలు బోర్‌ కొట్టాయనిపిస్తే... ఈసారి స్నాక్స్‌ ప్రయత్నిస్తే సరి. కొత్తగా ఉంటాయి, మళ్లీమళ్లీ తినాలనిపిస్తాయి.


హరియాలీ ఫిష్‌ టిక్కా

కావలసినవి: నూనె: వేయించేందుకు సరిపడా, ముళ్లులేని ఏదయినా ఒకరకం చేప ముక్కలు: రెండు కప్పులు, కొత్తిమీర: కప్పు, పుదీనా ఆకుల తరుగు: ముప్పావు కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, నిమ్మరసం: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి ముద్ద: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, దనియాలపొడి: టేబుల్‌స్పూను, జీలకర్ర: చెంచా, పసుపు: పావు చెంచా, సెనగపిండి: పావు కప్పు.

తయారీ విధానం: ముందుగా కొత్తిమీర - పుదీనా తరుగును మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకుని ఓ గిన్నెలో తీసుకోవాలి. ఇందులో నూనె, సెనగపిండి, చేపముక్కలు తప్ప మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. ఇప్పుడు చేపముక్కలు కూడా వేసి వాటికి ఈ మసాలాను పట్టించి ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగంట అయ్యాక ఆ ముక్కల్ని బయటకు తీసి వాటిని సెనగపిండిలో ముంచి తీయాలి. ఈ ముక్కల్ని కడాయిలో రెండు మూడు చొప్పున ఉంచి... నూనె వేస్తూ ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.


క్రిస్పీ బటర్‌ చికెన్‌

కావలసినవి: చికెన్‌ ముక్కలు: కేజీ, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: చెంచా, మైదా: ఒకటింబావు కప్పు, మొక్కజొన్నపిండి: ముప్పావు కప్పు, కారం: రెండు చెంచాలు, ఒరెగానో: చెంచా, గుడ్లు: మూడు, వెన్న: మూడు టేబుల్‌స్పూన్లు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో నూనె, చికెన్‌ ముక్కలు తప్ప మిగిలినవి వేసుకుని కలపాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలు వేసి వాటికి మసాలాను పట్టించి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత బయటకు తీసి రెండుమూడు ముక్కలు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


ఫిష్‌ పొటాటో బాల్స్‌

కావలసినవి: ముళ్లులేని ఏదయినా ఒక రకం చేప: అరకేజీ, వెన్న: టేబుల్‌స్పూను, ఉల్లిపాయ: ఒకటి, అల్లంముద్ద: అరచెంచా, వెల్లుల్లి ముద్ద: అరచెంచా, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తరుగు: నాలుగు టేబుల్‌స్పూన్లు, గుడ్డు: ఒకటి, ఉడికించిన బంగాళాదుంప: ఒకటి పెద్దది, బ్రెడ్‌పొడి: అరకప్పు, దనియాలపొడి: చెంచా, జీలకర్రపొడి: చెంచా, ఉప్పు: తగినంత, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, నిమ్మరసం: రెండు చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా.  

తయారీ విధానం: స్టౌమీద కడాయిని పెట్టి రెండుకప్పుల నీళ్లు పోసి అందులో పసుపు, కొద్దిగా ఉప్పు, చేపముక్కలు వేయాలి. ఆ ముక్కలు మెత్తగా అవుతున్నప్పుడు దింపేసి నీటిని పూర్తిగా వంపేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి వెన్న వేయాలి. అది కరిగాక ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేయించి అల్లంవెల్లుల్లి ముద్ద, దనియాలపొడి, జీలకర్రపొడి, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలిపి దింపేయాలి. చేపముక్కలపైన ఈ మిశ్రమంతోపాటు నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసి ముద్దలా అయ్యేవరకూ కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగంట అయ్యాక బయటకు తీసి ఉండల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


కీమా మాకరోనీ కేక్‌

కావలసినవి: మటన్‌కీమా: అరకేజీ, నూనె: నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు: మూడు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, పచ్చిమిర్చి: రెండు, టొమాటో గుజ్జు: అరకప్పు, ఉప్పు: తగినంత, కారం: చెంచా, పసుపు: అరచెంచా, దనియాలపొడి: రెండు చెంచాలు, మిరియాలపొడి: అరచెంచా, గరంమసాలా: చెంచా, మీట్‌ మసాలా: చెంచా, ఉడికించిన మాకరోనీ: అరకప్పు, గుడ్లు: రెండు.

తయారీ విధానం: స్టౌమీద కడాయిని పెట్టి... సగం నూనె వేసి ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు వేయించుకోవాలి. ఇందులో టొమాటో గుజ్జు, తగినంత ఉప్పు, కారం పసుపు, దనియాలపొడి, మిరియాలపొడి, గరంమసాలా, మీట్‌మసాలా వేసి బాగా కలిపి... రెండు నిమిషాలయ్యాక కీమా వేయాలి. కీమా బాగా మగ్గిందనుకున్నాక ఉడికించిన పాస్తా వేసి కలిపి దింపేయాలి. ఇప్పుడు మరో పాన్‌ని స్టౌమీద పెట్టి... అందులో మిగిలిన నూనె వేయాలి. అది వేడెక్కాక కీమా మిశ్రమాన్ని కేక్‌ ఆకారంలో వచ్చేలా మందంగా పరుచుకుని పైన గుడ్డు సొన రాయాలి. రెండుమూడు నిమిషాలయ్యాక దింపేసి ముక్కల్లా కోసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..