ఎందుకింత ఒంటరితనం..?

అన్నిటికన్నా భయంకరమైన పేదరికం... ఒంటరితనమే. మనసుకు దగ్గరైన వారెవరూ లేని పరిస్థితిని మించిన కష్టం ఏముంటుంది... అన్నారు మదర్‌ థెరిసా.

Updated : 17 Mar 2024 08:22 IST

అన్నిటికన్నా భయంకరమైన పేదరికం... ఒంటరితనమే. మనసుకు దగ్గరైన వారెవరూ లేని పరిస్థితిని మించిన కష్టం ఏముంటుంది... అన్నారు మదర్‌ థెరిసా. అది అక్షరాలా నిజమేనంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య ఒంటరితనమేననీ ఇది నిశ్శబ్దంగా ప్రజల ఆరోగ్యాలను కబళిస్తోందనీ చెబుతోంది. ఈ ఏడాది నుంచి మూడేళ్లపాటు దేశాలన్నీ ఈ విషయంపై దృష్టిపెట్టి జనజీవితం నుంచి ఒంటరితనాన్ని తరిమేసేందుకు కృషిచేయాలని సూచిస్తోంది. సామాజిక అనుబంధాలను పెంచుకోమని ప్రజలకు సలహా ఇస్తోంది.

అంజలికి పదిహేనేళ్లు. ఏడాది క్రితం తల్లి క్యాన్సర్‌తో మరణించింది. కొన్నాళ్లకే తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అంజలిని అమ్మమ్మా తాతయ్య తీసుకెళ్లి వేరే స్కూల్లో చేర్పించారు. ఆర్నెల్లలో ఆ అమ్మాయి మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిని కోల్పోయిన దుఃఖంలో అలా చేస్తోందనే అందరూ అనుకున్నారు. టీచరు సలహాతో సైకియాట్రిస్టుకి చూపిస్తే- అసలు విషయం తెలిసింది. ఎంత ఏడ్చినా తల్లి తిరిగి రాదని అంజలికి తెలుసు. కానీ నాన్న తనని ఓదార్చాలనీ, నాన్నని తాను ఓదార్చాలనీ ఆమె ఆశించింది. ఆ అవకాశం ఇవ్వకుండా తండ్రి వెంటనే పెళ్లి చేసుకుని తనకు దూరంగా ఉండడాన్ని భరించలేకపోయింది. కొత్త స్కూల్లో చేరేసరికి పాత స్నేహితులు కూడా లేరు. మనసు నిండా గూడుకట్టుకున్న దుఃఖంతో తీవ్రమైన ‘ఎమోషనల్‌ లోన్లీనెస్‌’కి గురైనందువల్లే ఆమె ఆత్మహత్యాయత్నాలు చేసింది.

పవన్‌కి బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. పల్లెటూళ్లో పేద కుటుంబానికి చెందిన అతడు కష్టపడి చదువుకుని తొలిసారి అంత పెద్ద నగరంలో అడుగుపెట్టాడు. మొదటి రోజే తన యాసనీ దుస్తుల్నీ సహోద్యోగులు సరదాగా ఆటపట్టిస్తే చిన్నబుచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్లు పడిపోయి ఆ విషయాన్ని మర్చిపోయినా అతడు మాత్రం వాళ్లతో కలవలేకపోయేవాడు. తాను వారిమధ్య ఇమడలేనని భావించి దూరంగా మసలేవాడు. క్రమంగా ఆ ఒంటరితనం డిప్రెషన్‌లోకి దింపింది. అమ్మానాన్నల్ని చూడడానికి కూడా ఊరెళ్లేవాడు కాదు. ఉన్నట్టుండి ఓరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి డైరీ చూశాక కానీ ఒంటరితనంతో అతడెంత బాధపడ్డాడో అర్థం కాలేదు సహోద్యోగులకు. పల్లెటూళ్లో పనులు చేసుకునే తల్లిదండ్రులు కొడుక్కి ఉద్యోగంతో తీరిక లేదనుకున్నారు కానీ అతని మనసులోని ఘర్షణను తెలుసుకోలేకపోయారు.

అరుణ్‌కి పద్దెనిమిదేళ్లు. మెడిసిన్‌ చదివించాలని కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించారు తల్లిదండ్రులు. హాస్టల్లో అంతా క్రమశిక్షణ. చదువు తప్ప రెండో మాటే వినిపించేది కాదు. సెలవుల్లో ఇంటికొస్తే- నాన్న ఉద్యోగంలో, అమ్మ కిట్టీ పార్టీలతో బిజీగా ఉండేవారు. చదువుకోమని చెప్పి తమ దారిన తాము వెళ్లిపోయేవారు. చదువు అన్నమాట లేకుండా ఒక రోజంతా అమ్మానాన్నలతో కబుర్లు చెప్పుకోవాలని ఆశతో వచ్చిన అతడికి ఇల్లు మరో హాస్టల్‌లాగే అనిపించింది. ఓరోజు డాబామీద తిరుగుతూ తిరుగుతూ గబుక్కున కిందికి దూకేశాడు.

అంజలి, పవన్‌, అరుణ్‌... వీరంతా ఒంటరితనం బాధితులే. కానీ అందరూ అనుకునేది మాత్రం చదువులూ ఉద్యోగాల్లో ఒత్తిడో మానసికవేదనో కారణమని. అంజలిది భావోద్వేగాలను పంచుకోలేని ఒంటరితనమైతే, సంస్కృతిలో తేడా వల్ల వచ్చిన ఒంటరితనం పవన్‌ది. తల్లిదండ్రులు రెండురోజులు అరుణ్‌తో సరదాగా గడిపితే పూర్తిగా రిలాక్సై తిరిగి హాస్టల్‌కి వెళ్లిపోయేవాడు. అతడు తాత్కాలికంగా ఒంటరితనానికి గురై విపరీతమైన నిర్ణయం తీసుకున్నాడు.

అవును... ఒంటరితనం పైకి కనిపించినంత అమాయకంగా ఉండదు. ఇన్నాళ్లూ అందరూ అనుకుంటున్నట్లు వృద్ధులకే పరిమితం కాదు, అది అందరి సమస్యా... అంటున్నాయి వివిధ దేశాల్లో జరుగుతున్న అధ్యయనాలు. పైగా అందులోనూ రకాలున్నాయి. ఒంటరితనం కేవలం వ్యక్తిగతం కాదు, చుట్టుపక్కలవారి పాత్రా ఉంటుంది కాబట్టి అది సామాజికమనీ చెబుతున్నారు. అనారోగ్యాలలాగే ఇదీ తాత్కాలికం, దీర్ఘకాలికం... అని రెండు రకాలుగా ఉంటుంది. కొందరు జీవితమంతా ఒంటరితనంతో బాధపడితే మరికొందరు జీవితంలోని ఏదో ఒక దశలో దాన్ని అనుభవించి తీరతారని నిర్ధారించారు మనస్తత్వ నిపుణులు.

తోడెవరూ లేక ఒంటరిగా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చినా... కొత్త చోటికి వెళ్లినప్పుడు పలకరించేవారు కన్పించకపోయినా... ఎప్పుడో ఒకసారి అయినా సరే, ఎంతో ఇబ్బందిపడతాం కదా... మరి జీవితమంతా అలా గడిపేవారి సంగతో..? గత కొన్ని దశాబ్దాలుగా అలా ఒంటరిగా బతుకుతున్న వారి సంఖ్య ఊహకందని రీతిలో పెరిగిపోతోంది. ఒంటరిగా అంటే- భౌతికంగా ఒంటరితనం కాదు.

మానసికంగా ఒంటరితనం. ఇంగ్లండ్‌లో 35 ఏళ్లలోపు యువతలోనే నూటికి అరవై మంది, అమెరికాలో మొత్తం జనాభాలో 46 శాతం ‘ఒంటరితనానికి కేరాఫ్‌ అడ్రస్‌ మేమే’ అంటున్నారట. బీబీసీ చేసిన మరో అధ్యయనంలో 24 ఏళ్లలోపు వారిలో నలభై శాతమూ, 75 పైబడినవారిలో 27 శాతమూ ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తేలింది. గత దశాబ్దంలో మనదేశంలోనూ ఈ విషయంమీద కొన్ని అధ్యయనాలు జరిగాయి. అయితే అవి పెద్ద వయసువారికే ప్రాధాన్యమిచ్చాయి. అమెరికాకి చెందిన ఒక సంస్థ చేసిన ‘ద గ్లోబల్‌ స్టేట్‌ ఆఫ్‌ సోషల్‌ కనెక్షన్స్‌’ అనే అధ్యయనంలో మన దేశంలో నూటికి ముప్ఫై మంది ఒంటరితనంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది.    

నిజానికి మానవాళి చరిత్రలోనే అత్యధికంగా ఒకరితో ఒకరు సాంకేతికంగా అనుసంధానమై ఉన్న (కనెక్టెడ్‌) సమయంలో ఉన్నాం మనం. కానీ విచిత్రంగా ఒంటరితనం సమస్య కూడా ఇదే సమయంలో తీవ్రమవడం... మానవ సంబంధాల్లోని డొల్లతనాన్ని చాటుతోంది. అందుకే మనస్తత్వవేత్తలు దీన్ని 21వ శతాబ్దపు అంటువ్యాధిగా పరిగణిస్తున్నారు.

ఏకాంతం మంచిదేనంటారుగా?

ఏకాంతం వేరు... ఒంటరితనం వేరు. చుట్టూ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండాలని కోరుకోవడం ఏకాంతం. అది ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో అవసరమే. దాన్ని ఆస్వాదిస్తారు, ఆ సమయంలో తమకు నచ్చిన పనిచేసి సాంత్వన పొందుతారు. ఒకప్పటి సమష్టి కుటుంబాల్లో ఏకాంతం దొరక్క ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఇప్పుడా సమస్యే లేదు. చిన్న చిన్న కుటుంబాలూ... మనిషికో గదీ... ఎవరికి వాళ్లు గిరి గీసుకుని ఉంటున్నారు. దాంతో ఏకాంతం ఎక్కువైపోయి ఒంటరితనానికి దారితీస్తోంది. ఒంటరితనం అంటే- ఒంటరిగా జీవించడం కాదు, అనుబంధాల్లో చోటుచేసుకుంటున్న వెలితి వల్ల పదిమంది మధ్య ఉన్నా తనకంటూ ఎవరూ లేనితనాన్ని అనుభూతి చెందడం.

నలుగురితో కలవలేని, మాట్లాడడం రానివారే ఒంటరితనంతో బాధపడుతుంటారన్నది సాధారణ అభిప్రాయం. కానీ అది నిజం కాదంటున్నాయి అధ్యయనాలు. ఎంత మంచి సామాజిక నైపుణ్యాలున్నా సామాజిక అనుబంధాల్ని(సోషల్‌ కనెక్షన్స్‌) అభివృద్ధి పరిచే విషయంలో అవి తోడ్పడడం లేదంటున్నాయి. ఒంటరితనం ఎవరినైనా బాధిస్తుందట. డబ్బూ కీర్తీ అందమూ అధికారమూ సామాజిక నైపుణ్యాలూ గొప్ప వ్యక్తిత్వమూ... ఏవీ కూడా ఈ ఒంటరితనం కబంధ హస్తాలనుంచి కాపాడలేకపోతున్నాయట.

ఎందుకలా?

చాలాకాలంపాటు శాస్త్రవేత్తలు కూడా ఒంటరితనం వ్యక్తిగతమనే అనుకునేవారు. కానీ పరిశోధనలు కాదని తేల్చాయి. కాబట్టే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిమీద దృష్టి పెట్టింది. సామాజిక అనుబంధాలను (సోషల్‌ కనెక్షన్స్‌) పెంచుకోమని సూచిస్తోంది. ఈ విషయంపై అధ్యయనం చేయడానికి ‘కమిషన్‌ ఆన్‌ సోషల్‌ కనెక్షన్‌’ పేరుతో ప్రత్యేకంగా ఒక కమిషన్‌ని కూడా నియమించింది. ఈ ఏడాదినుంచి మూడేళ్ల పాటు పనిచేసే ఈ కమిషన్‌ సమస్య తీవ్రతపై చర్చించి పరిష్కారమార్గాలను సూచించనుంది.

ఇక, ఒంటరితనాన్ని సామాజిక సమస్యగా ఎందుకు భావించాల్సి వస్తోందంటే- కలిసి బతకడం అనేది స్వతహాగా మనిషి స్వభావం. అందుకే మనిషిని సంఘజీవి అన్నారు. తోటి మనుషులతో కనెక్ట్‌ అవడం అన్నది మనిషి డీఎన్‌ఏలోనే ఉంది. లక్షల ఏళ్ల క్రితం జంతువుల నుంచి తనని తాను కాపాడుకోవడానికి మనిషి బృందంగా కలిసి బతికేవాడు. బృందంతో కలిసి నడవడంలో ఎవరైనా వెనకబడితే వాళ్లు జంతువులకు ఆహారం అయ్యేవారు. వేలాది సంవత్సరాల పాటు సాగిన ఈ పరిణామక్రమం మనిషి మెదడుని అలా బృందజీవితానికి అనుగుణంగా మార్చింది. వంద నుంచి 150 మందిని మెదడు సన్నిహితులుగా గుర్తుపెట్టుకుంటుంది. జీవితకాలం ఆ బృందంతోనే ఉండాలనుకుంటుంది. ఇల్లూ వాకిలీ లాంటివి ఏర్పరచుకోవడం తెలియని ఆ రోజుల్లో ఆహారం సేకరించుకోవడం, ఎండావానల నుంచి కాపాడుకోవడం, పిల్లల్ని పెంచడం... లాంటి పనులన్నీ సాటివారి సహకారం లేకపోతే సాధ్యమయ్యేవి కాదు. అందుకే అందరితో కలిసిమెలిసి ఉండడం అవసరంగా ఉండేది. దాంతో నాటి ప్రజలకు- ఏ సింహమో తినేస్తుందన్న భయంకన్నా, ఎక్కడ బృందం తమని వెలివేస్తుందోనన్న భయం ఎక్కువగా ఉండేది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడానికి శరీరం ఒక కొత్త పద్ధతిని రూపొందించుకుంది. దాని పేరే ‘సోషల్‌ పెయిన్‌’. ఇతరుల కారణంగా వచ్చే బాధ ఇది. తిరస్కరణకు గురైనపుడు, తోటివారు నిర్లక్ష్యం చేసినప్పుడు, అవమానించినప్పుడు... మనసు ఈ తరహా బాధకు గురవుతుంది. బృంద సభ్యులకి దూరమయ్యే ప్రమాదం ఉందని ముందస్తుగా హెచ్చరిస్తూ ప్రవర్తన మార్చుకోమన్న సూచన అన్నమాట. దాంతో వాళ్లు తాము చేసిన తప్పేమిటో తెలుసుకుని దిద్దుకునేవారు. పదిమందితో కలిసి ఉండడానికి శరీరం చేసుకున్న ఈ ఏర్పాటు చరిత్రలో బాగా పనిచేసింది.

రోజులు మారాయి కదా..!

అవును... మనిషీ మారాడు. సమాజమూ వ్యక్తి కేంద్రంగా మారిపోయింది. తానూ తన ఇల్లూ, తన వాళ్లూ అంటూ ఒక పరిధిలో బతకడానికి అలవాటు పడ్డాడు మనిషి. ఏళ్ల తరబడి కొనసాగిన సంఘజీవితం మాయమైంది. చదువులూ ఉద్యోగాలూ వృత్తులూ
మనుషుల్ని కుటుంబాలకు దూరంగా తీసుకెళ్లి ఊరికీ, అక్కడున్న బలగానికీ దూరం చేశాయి. ఒకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడం గొప్ప అనుకున్న మనిషి దాన్ని సాధన చేస్తున్నాడు. దాంతో సామాజిక అనుబంధాలు సన్నగిల్లుతున్నాయి. అలాగని కుటుంబమూ మిత్రులూ అయినా సన్నిహితంగా ఉంటున్నారా అంటే- అదీ లేదంటున్నాయి అధ్యయనాలు. కుటుంబంలో హింస, అభద్రత, ఆధిక్య భావజాలం లాంటివి సభ్యుల మధ్య అగాధాలను సృష్టిస్తున్నాయి. ఇక స్నేహితుల విషయానికి వస్తే- అమెరికాలో చేసిన సర్వేలో 1985లో చాలామంది తమకు ముగ్గురు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారని చెబితే, 2011లో ఇద్దరే అయ్యారు. ఇప్పుడు ఒక్కరైనా ఉంటారా అన్నదీ సందేహమే అంటున్నారు ఈ అధ్యయనకారులు. ఇంటర్నెట్టూ స్మార్ట్‌ఫోనులతో ప్రపంచాన్ని గ్లోబల్‌ విలేజ్‌గా మార్చేసుకున్నాం. రకరకాల యంత్రాలూ, ఆప్‌లతో ఒకరి మీద ఆధారపడకుండా జీవించడం తేలికైపోయింది. కానీ, మన మనసూ శరీరాల నిర్మాణాల్లో మాత్రం యాభైవేల ఏళ్ల క్రితానికీ ఇప్పటికీ ఏమీ తేడా లేదు. ఇప్పటికీ అవి గుంపుతో కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటున్నాయి. 150 మందితో ఉండడానికి అలవాటుపడిన వాటిని మనం పట్టుమని పదిమందికి పరిమితం చేయడం వల్ల వస్తోంది సమస్య అంతా. ఒకప్పటిలా పూర్తి స్థాయి సంఘజీవితం ఇప్పుడు సాధ్యం కాకపోయినా ఒంటరితనం సమస్య నుంచి బయటపడాలంటే కొంతవరకూ అయినా మార్పు చేసుకోవడం తప్పదు.

ఎలా..?

ఒంటరితనానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొందరికి సంస్కృతీ సంప్రదాయాలు సంఘజీవితానికి అడ్డురావచ్చు. కొందరికి అర్థవంతమైన అనుబంధాలు లోపించవచ్చు. మరికొందరిని సన్నిహితులకు దూరమైన బాధ ఒంటరితనంలోకి నెట్టేస్తుండవచ్చు. మనిషిని క్రియాశూన్యుడిగా మారుస్తున్న ఆధునిక సాంకేతికత కూడా ఇందుకు ఒక కారణమేనట.

సామాజిక మాధ్యమాలలోని వేలాది వర్చువల్‌ స్నేహాలతోనే సరిపుచ్చుకుంటూ నిజమైన, గాఢమైన అనుబంధాలకు దూరమవడం... ఈ రోజుల్లో ప్రధాన కారణంగా మారిందనీ ఒక అధ్యయనం రుజువు చేసింది. నగరీకరణా... దానికి తోడైన ఆధునిక సాంకేతికతా కూడా నగరాల్లో ఈ సమస్య ఎక్కువవడానికి మరో కారణం. పనులన్నీ ఆన్‌లైన్‌లోకి మారిపోయాయి. మనిషి ప్రపంచం రాను రాను కుంచించుకుపోతోంది. కొవిడ్‌ అనంతరం ఇంటి నుంచి పని వల్ల చాలామంది ఉద్యోగస్తులు తోటి ఉద్యోగుల్ని కలిసే అవకాశాన్ని కూడా కోల్పోయారు. ఎంతసేపూ కుటుంబమూ, దగ్గరి బంధువులూ... ఇలా కొందరికే పరిమితమవుతున్నారు. పైకి ఇదంతా మామూలుగానే ఉన్నట్లు కన్పిస్తుంది కానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా సమస్య బయటపడుతుంది. అప్పుడు చేయగలిగింది ఏమీ ఉండదు. అందుకే ‘సోషల్‌పెయిన్‌’ మొదలైన వెంటనే అప్రమత్తమవ్వాలి.

ఒంటరితనం సమస్య ప్రారంభమైన కొత్తలో ఆందోళనగా విచారంగా ఉంటుంది. నెగెటివ్‌ విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంటారు. నలుగురితో కలవడం మానుకుంటారు. స్నేహితుల పిలుపుకి స్పందించరు. ఎవరి ఆహ్వానాలనూ స్వీకరించరు. దాంతో క్రమంగా వాళ్లూ పిలవడం మానేస్తారు. ఇదంతా ఒక్కరోజులోనో ఒక్క నెలలోనో జరగదు... కొన్నాళ్లు పడుతుంది. అందుకే తమకు తెలియకుండానే ఒక్కో అడుగూ ఒంటరితనం అనే విషవలయం లోపలికి వేసేస్తూ చివరికి బయటకు రాలేని రీతిలో ఇరుక్కుపోతారు. కుంగుబాటుకు లోనవుతారు. ఎప్పుడన్నా ఆ పరిస్థితి నచ్చక బయటకు వద్దామని ప్రయత్నించినా మనసే ఎదురు తిరుగుతుంది. అందుకే పూర్తిగా ఇరుక్కోకముందే లక్షణాలను గమనించి బయటపడే ప్రయత్నం చేయాలి.

అది సహజమేననీ, సిగ్గుపడాల్సింది ఏమీ లేదనీ గుర్తించి కుటుంబసభ్యుల, స్నేహితుల సహకారం తీసుకోవాలి. పరిచయాలను పెంచుకోవాలి. పాత స్నేహాలను పునరుద్ధరించుకోవాలి. చుట్టుపక్కల వారిని పలకరించడం, తరచూ పార్కులకి వెళ్లడం, సాంస్కృతిక సమావేశాలకు హాజరవడం, హాబీ క్లబ్‌లోనో, క్రీడా సంఘాల్లోనో చేరడం, స్వచ్ఛందసేవలో పాల్గొనడం... ఇలా, మనసుకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకోవాలి. పదిమంది కలిసే చోటికి వెళ్లడం వల్ల మనసులో చోటుచేసుకునే వెలితి పూడుతుంది. ఎక్కడో ఓచోట నచ్చిన ఆత్మీయ మిత్రులు తారసపడతారు. అప్పుడిక ఏకాంతం కోసం వెతుక్కోవాల్సి వస్తుందేమో కానీ ఒంటరితనం మాత్రం దరిదాపుల్లోకి రాదు!.


ఎంత ప్రమాదం అంటే...

ఒంటరితనం ఆరోగ్యం మీద చూపే ప్రభావం గురించి చేసిన పలు అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే...

ప్రవర్తనాపరంగా: ఒంటరితనంతో బాధపడే వారి శరీరం ఒత్తిడికి తీవ్రంగా స్పందిస్తుంది. దాంతో లోపల ఇన్‌ఫ్లమేషన్‌ ఎక్కువవుతుంది. దాని ఫలితం ప్రవర్తన మీద పడుతుంది. ఆహారపుటలవాట్లలో మార్పు వస్తుంది. వేళకు సరిగా భోజనం చేయరు. లేదా అతిగా తీపి పదార్థాలో జంక్‌ఫుడ్‌ లాంటివో తీసుకుంటారు.

ఏ పనినీ ఇష్టంగా చేయరు. చురుకుదనం తగ్గుతుంది. పొగతాగడం, మద్యం తాగడం ఎక్కువవుతుంది. మాదకద్రవ్యాలకీ అలవాటు పడే అవకాశం ఎక్కువ.

మానసికంగా: ఇతరత్రా కారణాల కన్నా ఒంటరితనం వల్ల కుంగుబాటు సమస్య 14 రెట్లు, యాంగ్జయిటీ 11 రెట్లు, డిమెన్షియా 50 శాతం, ఆత్మహత్య గురించిన ఆలోచనలు 27.2శాతం పెరుగుతాయట.

భౌతికంగా: చిన్న వయసులో మరణాల ప్రమాదం 26 శాతం, గుండెపోటు ప్రమాదం 32 శాతం, కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌ ప్రమాదం 29 శాతం, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ 26, డయబెటిస్‌ 98 శాతం, పురుషుల్లో క్యాన్సర్‌ 10శాతం ఒంటరితనంతో పెరిగే అవకాశాలున్నాయి. సాంక్రామికేతర వ్యాధులెన్నిటికో కారణమయ్యే స్థూలకాయం కన్నా ఇది రెట్టింపు ప్రమాదకరం. రోజుకు ప్యాకెట్‌ సిగరెట్లు తాగితే ఆరోగ్యం ఎంత చెడిపోతుందో ఒంటరితనం వల్ల కూడా అంత చెడిపోతుంది.

ఆర్థికంగా: శారీరక, మానసిక అనారోగ్యాల వల్ల వైద్య ఖర్చులు పెరిగి ఆర్థికంగా భారమవుతాయి.


ఇంగ్లండ్‌... హ్యాపీ క్యాబ్‌!

ఒంటరితనం సమస్య నుంచి ప్రజల్ని బయటపడేసేందుకు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నాయి రెండు దేశాలు. ఇంగ్లండ్‌ మొట్టమొదట లోన్లీనెస్‌ పేరుతో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయగా కొవిడ్‌ అనంతరం జపాను కూడా మొదలుపెట్టింది. ప్రజల్లో ఒంటరితనం పట్ల ఉన్న అపోహల్నీ ఒంటరిగా ఉన్నామన్న భావననీ తగ్గించడం, వాళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవడం ఈ మంత్రిత్వ శాఖల ఉద్దేశం. ఇంగ్లండ్‌ ఈ దిశగా పలు పథకాలను అమలుచేస్తోంది. ఒంటరితనంతో బాధపడుతున్నవారిని గుర్తించేలా ఆస్పత్రుల్లో రిసెప్షనిస్టులకు శిక్షణ ఇస్తున్నారు. అక్కడి లీడ్స్‌ కౌంటీలో ‘హ్యాపీ క్యాబ్‌ సర్వీస్‌’ పేరుతో కారు సేవల్ని ఏర్పాటుచేశారు.

ఎవరైనా సరే ఈ క్యాబ్‌ని పిలుచుకుని లాంగ్‌ రైడ్‌కి వెళ్లిరావచ్చు. కౌన్సెలింగ్‌లో శిక్షణ పొందిన డ్రైవరే వారితో మాట కలిపి సాంత్వన కలిగిస్తారు. మధ్యలో ఇతరులనూ ఎక్కించుకుని ఒకరినొకరికి పరిచయం చేస్తారు. అలా కొత్త స్నేహాలు అవుతాయి. జపానులో నూటికి 41 మంది ఒంటరితనం బాధితులేనట. అక్కడ ప్రభుత్వం ఎక్కడికక్కడ బృందాలను ఏర్పాటుచేసి ఒంటరితనంతో బాధపడుతున్నవారికి కౌన్సెలింగ్‌ ఇస్తోంది. అమెరికా, డెన్మార్క్‌ కూడా ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి.


చేయూత

ఒంటరితనంతో బాధపడుతున్నవారికి మనదేశంలో అందుబాటులో ఉన్న కొన్ని హెల్ప్‌లైన్‌ నంబర్లివి.

లైఫ్‌లైన్‌ ఫౌండేషన్‌- 9088030303
సమరిటన్స్‌ ముంబయి- 8422984528
ముక్త హెల్ప్‌లైన్‌- 7887889882
ఎన్‌డి ప్రాణ లైఫ్‌లైన్‌- 8489512307
జీవన్‌ ఆస్థా హెల్ప్‌లైన్‌- 1800 233 3330
కిరణ్‌- 1800 599 0019
మన్‌ టాక్స్‌- 8686139139
సుఖ్‌దుఖ్‌ హెల్ప్‌లైన్‌- 7594052605
ఆసరా- 9820466726
టెలిమానస్‌- 14416
ఐకాల్‌ సైకో సోషల్‌ హెల్ప్‌లైన్‌- 9152987821
వాయిస్‌ దట్‌ కేర్స్‌- 8448844845


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు