భరిణె తెరిస్తే కుంకుమ... తలుపు తెరిస్తే దేవుడు!

కుంకుమ భరిణెను చూడగానే చాలామందికి మనసులో ఓ ఆధ్యాత్మిక భావన కదలాడుతుంది. కానీ ఇప్పుడా భావన సాకారమవుతుంది కూడా. ఎందుకంటే ఎందరో దేవుళ్ల రూపాలతో కొలువుదీరిన సరికొత్త కుంకుమ భరిణెలు వచ్చేశాయి.

Published : 29 Oct 2022 23:16 IST

భరిణె తెరిస్తే కుంకుమ... తలుపు తెరిస్తే దేవుడు!

కుంకుమ భరిణెను చూడగానే చాలామందికి మనసులో ఓ ఆధ్యాత్మిక భావన కదలాడుతుంది. కానీ ఇప్పుడా భావన సాకారమవుతుంది కూడా. ఎందుకంటే ఎందరో దేవుళ్ల రూపాలతో కొలువుదీరిన సరికొత్త కుంకుమ భరిణెలు వచ్చేశాయి. మూసి ఉన్న తలుపులను తెరిచి చూస్తే- కోరిన స్వామి కొలువై ఉండే ఆ భరిణెలు ఇప్పుడు పూజ సామగ్రిలో భాగం అవుతున్నాయి. మీరూ ఓసారి చూసేయండి మరి!

ఒకప్పుడు సిందూర భరిణె దేవుడి గదిలో ఒక వస్తువు మాత్రమే. అందుకే అప్పట్లో చిన్న సైజు డబ్బాలానే ఉండేది. చెక్క, స్టీలు, ఇత్తడి, వెండితో చేసిన ఆ కుంకుమ డబ్బాలు తర్వాత్తర్వాత కాస్త సింగారించుకుని రావడం మొదలుపెట్టాయి. అంతేనా... రోజుకో రకం మార్పులతో వచ్చిన పూజగది అలంకరణల్లో అన్నింటితో పాటూ కుంకుమ భరిణె ఆకృతీ ఎంతో కొత్తగా మెరిసిపోతూ వచ్చింది. బంగారు వన్నెలూ, పచ్చలూకెంపుల సోయగాలూ, చక్కని చెక్కుళ్లతో మొత్తానికి ఓ అందాల ఆభరణంలా తయారైంది. ఇదంతా నిన్నమొన్నటి మాట. ఇప్పుడైతే దానికి అదనంగా ముచ్చటైన నగిషీలతో, ఆశీనులైన దేవుడి రూపాలతో మినీ ఆలయాన్ని తలపించేలా కొత్తగా వచ్చేసింది.

ఇంట్లో పూజలూ, పెళ్లీపేరంటాలూ... ఇలా వేడుక ఏదైనా మన నిత్యజీవితంలో భాగమైన కుంకుమ ఉండాల్సిందేగా. అందుకే శుభసూచకంగా భావించే ఆ కుంకుమను ఉంచే భరిణెకూ అదే విలువనిస్తూ అన్ని అలంకరణల్లో ఒక మెట్టు పైనే ఉండేలా ఎంతో ముచ్చటగా ముస్తాబు చేశారు. ఒకేదాంట్లో అటు సంప్రదాయ లుక్కునూ, ఇటు ఆధ్యాత్మిక శోభనూ తెప్పించేశారు.

వీటిల్లో కొన్ని కుంకుమ భరిణెలు- కనువిందు చేసే గోపురాలూ, దేవుళ్ల శిల్పాలతోనే చూడగానే ఆకట్టుకుంటే... ఇంకొన్ని- ఇంకాస్త ప్రత్యేకంగా అచ్చంగా ఆలయ రూపంతోనే కనువిందుచేస్తున్నాయి. పూజ గదిలో ఉంచిన ఈ కుంకుమ భరిణెను అదాటున చూస్తే అందాల భరిణెలా మాత్రమే కనిపించినా... దానికి జతగా ఉన్న గోపురం తలుపులుతీసి చూశామంటే... అందులో దేవదేవుడి రూపం మన కన్నుల ముందు ప్రత్యక్షమవుతుంది. లక్ష్మీ, గణపతి, శివపార్వతులు, విష్ణుమూర్తి, వేంకటేశ్వరస్వామి, రాధాకృష్ణులు...

ఇలా ఒక్కో భరిణెలో ఒక్కో దేవతల చిత్రం కొలువై ఉంటుంది. వెండి మీద బంగారు మెరుపులతో తయారుచేస్తున్న ఈ భరిణెలు రెడీమేడ్‌గానూ దొరుకుతున్నాయి. కావాలంటే మనకు నచ్చిన దేవుళ్ల రూపాలతోనూ ప్రత్యేకంగా చేయించుకోవచ్చు కూడా. ఏ నోమో నోచుకున్నప్పుడూ, వ్రతం చేసినప్పుడూ... పేరంటాలకు పిలుపుల దగ్గర్నుంచి పూజ ముగిసే వరకూ అణువణువూ ఆధ్యాత్మికత కనిపించాలనుకునే ఆడపడుచులకు- ఈ కుంకుమ భరిణె కచ్చితంగా నచ్చేస్తుంది. ప్రత్యేక ఆకర్షణతో అతిథుల్ని ఆకట్టుకుంటూ... దేవుడి విగ్రహాల్లో ఒకటిగా చేరిపోయి చూసినవారందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి మీకూ నచ్చిందా ఈ సింగారాల భరిణె!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..