టీపాయ్‌... తీరు మారిందోయ్‌!

ఎవరింట్లో అయినా లోపలికి వెళ్లగానే మనల్ని ఆకట్టుకునేది హాల్లోని ఫర్నిచరే కదా. మెత్తని సోఫాల్లో ఆసీనులయ్యాక ఆటోమేటిగ్గా దృష్టి- మధ్యలో అందంగా ఒదిగి ఉన్న టీపాయ్‌ మీదికి మళ్లుతుంది

Updated : 24 Mar 2024 04:52 IST

ఎవరింట్లో అయినా లోపలికి వెళ్లగానే మనల్ని ఆకట్టుకునేది హాల్లోని ఫర్నిచరే కదా. మెత్తని సోఫాల్లో ఆసీనులయ్యాక ఆటోమేటిగ్గా దృష్టి- మధ్యలో అందంగా ఒదిగి ఉన్న టీపాయ్‌ మీదికి మళ్లుతుంది. ఇక, అది ఏ కాస్త ప్రత్యేకంగా ఉన్నా పరిశీలనగా చూస్తుంటారు వచ్చిన అతిథులందరూ. ఈ అలవాటుని బాగా గమనించిన తయారీదారులు కాఫీటేబుల్‌నే కళాఖండంగా మార్చేశారు. రకరకాల ఆకృతులతో మనసు దోచేస్తున్నారు!

కాఫీటేబుల్‌ అనగానే నాలుగు కాళ్లతో ఉన్న చిన్న బల్ల మాత్రమేగా అన్నది పాత మాట. అతిథులకు ఆహ్వానం పలికే ఆ టేబుల్‌కీ ఎంతో సీన్‌ ఉందన్నది కొత్త మాట. అందుకేగా అందమైన ఇల్లే కాదు, అందులోని ఇంటీరియరూ అదిరిపోవాలి అనుకుంటున్న ఈతరం పిల్లలు... ఆ అందాల్లో ఈ టీపాయ్‌నీ భాగం చేస్తున్నారు. సాదా సీదా టీపాయ్‌ కాకుండా ఇంటికీ ఇంటి అలంకరణకీ తగ్గట్టుగా ఎంచుకుంటున్నారు. చెక్క దగ్గర్నుంచి గాజు వరకూ రకరకాల టీపాయ్‌ల్లోనే సరికొత్త డిజైన్లను ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. అందమైన భామల బొమ్మల దగ్గర్నుంచి ప్రకృతి అందాల వరకూ ఎన్నెన్నో ఆకృతులతో అలరిస్తున్న ఆ నయా టీపాయ్‌ల మీద మనమూ ఓ లుక్కేద్దామా! 

చాలావరకూ ఇల్లు చిన్నగా ఉన్నా సరే అతిథులొస్తే కూర్చోడానికి ఒక హాలు... అందులో కాఫీ, టీ, పత్రికల్లాంటివి పెట్టుకోవడానికి ఓ మాదిరి టేబుల్లాంటిదీ తప్పనిసరిగా ఉంటాయి. అందుకే పాతరోజుల్లోనూ కుర్చీలతోపాటు చెక్కతో చేసిన చిన్న కాఫీ టేబులూ ఎక్కువమంది ఇళ్లల్లో కనిపించేది. తర్వాత్తర్వాత ఇంటి అలంకరణలోనూ ఫర్నిచర్‌లోనూ ఎన్నెన్నో మార్పులు వచ్చాక చెక్క టీపాయ్‌ల స్థానంలో గాజు, మార్బుల్‌ లాంటి వాటితో తయారు చేసినవెన్నో ప్రత్యక్షమయ్యాయి. అటు అందాన్నీ ఇటు సౌకర్యాన్నీ కలగలుపుతూ వచ్చిన ఇవన్నీ- ఇప్పుడు మరింత వెరైటీగా మార్కెట్లో కనిపిస్తున్నాయి. కాఫీటేబుల్‌, సెంట్రల్‌ టేబుల్‌, టీపాయ్‌... ఇలా ఏ పేరుతో పిలిచినా దీని ఉపయోగం కాఫీ టీల్లాంటివి పెట్టుకునేలానే ఉండటమే కదా అన్నమాటను పక్కకునెడుతూ దాంతో పాటూ నట్టింట్లోకి ప్రకృతి అందాల్నీ, మనకు నచ్చిన ఆకృతుల్నీ తీసుకొస్తూ తనే ఓ కళాఖండంగా మారిపోయింది.

ఎన్ని రకాలో...

కొత్త కాఫీ టేబుల్‌ కొనాలనుకున్నారంటే అందుబాటులో ఉన్నవాటిల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరమే లేదిప్పుడు. మన అభిరుచి కూడా అందులో కనిపించేలా చేయొచ్చు. మీరు ప్రకృతి ప్రేమికులైతే గనక వాటర్‌ఫాల్‌, వాల్కెనో, రాస్టోన్‌ కాఫీ టేబుళ్లని ప్రయత్నించొచ్చు. వీటిల్లో- మెరిసే జిగురులాంటి ఎపోక్సీ రెజిన్‌నీ, చెక్కనీ ఉపయోగించి తయారుచేసిన వాటర్‌ఫాల్‌ కాఫీ టేబుళ్లు... ప్రకృతి దృశ్యాలతో ఎంతో అందంగా ఉంటాయి. టేబుల్‌ మీదే అక్కడక్కడా పచ్చని చెట్లు, పారుతున్న నదులు, కిందకు దూకుతున్న జలపాతాల దృశ్యాలన్నీ కనిపిస్తూ ‘అరె నిజంగానే ఇక్కడేమైనా వాటర్‌ ఫాల్‌ సెటప్‌ని ఏర్పాటు చేశారా’ అన్నట్టుగా ఉంటుంది. ఇక లైట్‌తో పాటు ఉండే వాల్కెనో టేబుల్‌ కూడా అంతే. చెక్క, మెటల్‌, ఎపోక్సీ లాంటి వాటితో తయారయ్యే ఇదీ- లైట్‌ని కనెక్ట్‌ చేయగానే నిప్పుకణికలా ధగధగ మెరుస్తూ హాల్‌ మధ్యలో అగ్నిపర్వతం ఉన్న అనుభూతినిస్తుంది. కొందరు డిజైనర్లు ప్రకృతిలో దొరికే అరుదైన రాళ్లకే, ఎపోక్సీలాంటిదాన్ని కూడా జత చేస్తూ వెరైటీ కాఫీ టేబుళ్లనీ రూపొందిస్తున్నారు. చూడ్డానికి ఆభరణాల్లో మెరిసే రంగుల రత్నపు రాళ్లే... కాఫీ టేబుల్‌గా మారినట్టుగా అందంగా ఉంటాయివి. అంతేకాదు... చాలామంది ఇంటి అలంకరణలో భాగంగా అక్వేరియాల్నీ, టెరేరియాల్నీ ఏర్పాటుచేసుకుంటారు. కొంతమంది వాటిమీద ఇష్టం ఉన్నా సరైన చోటు లేక ఆ ఆలోచనను అక్కడే వదిలేస్తారు. కానీ ఇప్పుడైతే వాటికి ప్రత్యేకంగా చోటు అంటూ లేకపోయినా పర్వాలేదు ఆ సరదా మాత్రం తీర్చుకోవచ్చు. ఎందుకంటే... రకరకాల మొక్కలతో ఉండే టెరేరియం, చిట్టిపొట్టి చేపల అక్వేరియాన్ని జత చేస్తూ కాఫీ టేబుళ్లు వస్తున్నాయి. అయితే మొక్కల, చేపల బాగోగులు చూసుకోవడానికి టేబుల్‌ కిందో, పైనో, పక్కనో వీటికి ప్రత్యేకమైన ఏర్పాట్లూ ఉంటాయండోయ్‌. పొద్దుపొద్దున్నే... అటూఇటూ తిరుగాడుతున్న చేపల్నీ, పచ్చని మొక్కల్నీ చూస్తూ హాయిగా కమ్మని కాఫీని ఆస్వాదించొచ్చు.

కళలంటే ఇష్టమున్న వాళ్ల కోసమూ చాలారకాల టీపాయ్‌లు వచ్చాయి. వీటిల్లో ఒంపుసొంపుల అమ్మాయిలు రకరకాల హావభావాలతో ఉన్న రాజస్థానీ వుమెన్‌ సెంట్రల్‌ గ్లాస్‌ టేబుళ్లు భలేగా ఉంటాయి. పాలీరెజిన్‌తో తయారుచేసే ఈ బొమ్మల టేబుళ్లు అచ్చంగా షోకేస్‌లోని బొమ్మల్లానే కనువిందు చేస్తాయంటే నమ్మండి. ఇంకా చూసేవారికి ‘అది నిజమైన పులిలానే ఉందే’, ‘ఏనుగులు ఎంత ముద్దుగా ఉన్నాయబ్బా’ అనిపించేలా రియలిస్టిక్‌ యానిమల్‌ టేబుళ్లూ చాలానే దొరుకుతున్నాయి. రకరకాల జంతువుల బొమ్మలూ వాటిపైన గ్లాస్‌తో ఉండే ఈ టేబుళ్లు చూడముచ్చటగా ఉంటాయి మరి. వీటితో పాటు పాతతరం బైకులూ కార్లూ ఇష్టపడే వాళ్ల మనసును దోచేలా బైక్‌ కాఫీ టేబుళ్లలాంటివీ, త్రీడీ లుక్కుతో టేబుల్‌ మీద సుడిగుండంలా మాయ చేసే దృశ్యాలతో ఉన్నవీ చాలానే ఉన్నాయి.

కోరుకున్నట్టుగా...

సొంతంగా ఆలోచించి కొంతమంది ఇంటికి తగ్గట్టు అలంకరణ చేసుకుంటారు. మరికొందరు నడుస్తున్న ట్రెండును బట్టి ఫాలో అయిపోతుంటారు. ఏది ఏమైనా, మన ఇంటికి ఏది సరిపోతుందన్నదే అందరూ మొదటగా చూసుకునే అంశం. అదే విషయం ఈ కాఫీ టేబుల్‌ ఎంపికలోనూ పాటిస్తూ ఇక్కడున్న వాటిల్లో మన ఇంటి హాల్‌కి సరిపోయేవాటిని ఎంచుకోవచ్చు. లేదంటే ఈరోజుల్లో మోడల్‌ చెబితే చాలు... తయారుచేసి ఇచ్చేలా బోలెడన్ని కంపెనీలొచ్చాయి. వాటి సాయంతో మన ఇంటికి సరిపోయేదాన్ని నచ్చిన థీమ్‌తో ఆర్డర్‌ ఇచ్చి చేయించుకోవచ్చు. చెక్క, గాజు, మార్బుల్‌, మెటల్‌, ఎపోక్సీ రెజిన్‌ లాంటి రకరకాల పదార్థాల్ని వాడుతూ త్రీడీ లుక్కులో కోరుకున్న కాఫీ టేబుల్‌ రూపం ఇస్తున్నారు.
కాఫీ కప్పుతో స్వాగతం పలికే ప్రకృతి దృశ్యమున్న టేబుల్‌నో, సొగసైన సుందరి బొమ్మ టేబుల్‌నో నట్టింట్లో ఉంచారంటే... లివింగ్‌ రూమ్‌కి మరే ఇతర ప్రత్యేక అలంకరణా అక్కర్లేదు. అంతేనా...
హాల్‌ మధ్యలోని ఆ టేబుళ్లని చూసిన అతిథులెవరైనా మీ అభిరుచిని మెచ్చుకోకుండా ఉంటారా... ‘అరె భలే ఉందే ఎక్కడ కొన్నారంటూ’ ఆ అందాల టీపాయ్‌ సంగతుల గురించి ఆరా తీయకుండా ఉంటారా!(ఫొటోలు: ఇన్‌స్పైరింగ్‌డిజైన్స్‌డాట్‌నెట్‌)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..