కాలక్షేపం కాదు... కాసులు కురిపిస్తున్నాయి!

‘ఎంతసేపూ ఆ ఫోన్‌ పట్టుకుని యూట్యూబ్‌ చూడడమో గేమ్స్‌ ఆడడమో తప్ప చదువుకునేదేమైనా ఉందా...’ ఈ రోజుల్లో పిల్లలున్న ఇంట్లో ఏదో ఒక సమయంలో వినిపించే మాటే ఇది. కానీ అలా కోప్పడకుండా, వాళ్లు ఫోనుతో ఏం చేస్తున్నారో గమనించండి... ఏమో, రేపటి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మీ ఇంట్లోనే ఉన్నారేమో..!

Updated : 27 Nov 2022 03:02 IST

కాలక్షేపం కాదు... కాసులు కురిపిస్తున్నాయి!

‘ఎంతసేపూ ఆ ఫోన్‌ పట్టుకుని యూట్యూబ్‌ చూడడమో గేమ్స్‌ ఆడడమో తప్ప చదువుకునేదేమైనా ఉందా...’ ఈ రోజుల్లో పిల్లలున్న ఇంట్లో ఏదో ఒక సమయంలో వినిపించే మాటే ఇది. కానీ అలా కోప్పడకుండా, వాళ్లు ఫోనుతో ఏం చేస్తున్నారో గమనించండి... ఏమో, రేపటి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మీ ఇంట్లోనే ఉన్నారేమో..! మీరు కాలక్షేపం చేస్తున్నారని భావిస్తున్న పనితోనే వాళ్లు కోట్లు సంపాదించగలరేమో! యూట్యూబ్‌లో వీడియోలు పెట్టినవారి వల్ల 2020లో మన దేశ జీడీపీకి రూ.6800 కోట్లు జమ అయ్యాయట. అది 6.83 లక్షల పూర్తిస్థాయి ఉద్యోగాలకు సమానమట. ఉపయోగించుకోవాలే కానీ సామాజిక మాధ్యమాల్లోనూ చక్కటి ఉపాధి మార్గాలున్నాయంటున్నారు నిపుణులు.

‘యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టాను, లైక్‌ చేసి సబ్‌స్క్రైబ్‌ చేయండి ప్లీజ్‌..!’

‘ట్రావెల్‌ వ్లాగ్‌ స్టార్ట్‌ చేశా. ప్రతి వీకెండ్‌ టూర్‌కి వెళ్లి వీడియోలు తీసి అప్‌లోడ్‌ చేస్తున్నా. తప్పకుండా చూడు’ ‘జ్యువెలరీ డిజైనింగ్‌ ఇష్టం. నేను తయారుచేసినవి సరదాగా ఇన్‌స్టాలో పెడితే మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. ప్రముఖ బ్రాండ్‌ నన్ను అంబాసడర్‌గా ఎంచుకుంది’ ‘సరదాగా నేను బ్లాగులో రాసుకున్న చిన్న కథలు బాగున్నాయని ఒక పబ్లిషర్‌ పుస్తకంగా వేశారు. ఆదివారమే పుస్తకావిష్కరణ, నువ్వు తప్పకుండా రావాలి’ ‘నేను ఫేస్‌బుక్‌లో రాస్తున్న కవితలు నచ్చాయట. ప్రముఖ డైరెక్టర్‌ ఒకరు తన సినిమాకి పాటలు రాయమన్నారు’

సన్నిహితుల్లోనో, పరిచయస్తుల్లోనో ఎవరో ఒకరి నుంచి ఇటువంటి మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలను అందరూ వాడతారు. ఎవరు ఎందుకు వాడుతున్నారన్నదాని మీదే వాటి ప్రయోజనం ఆధారపడి ఉంటుంది. కొందరు కాలక్షేపానికి చూస్తారు. పరిచయాల్నీ, స్నేహబృందాన్నీ విస్తరించుకోవడం కొందరికి ఇష్టం. మరికొందరు తమకు ఆసక్తి ఉన్న అంశాలమీద సిద్ధాంతపరమైన చర్చలు జరిపి కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. మరికొందరు తమ వ్యాపారాలకు పబ్లిసిటీ మాధ్యమంగా వాడుకుంటారు. ఇవేవీ కాకుండా... తమ తమ ప్రతిభా, నైపుణ్యాల ప్రదర్శనకు వాటిని
వేదికలుగా మలచుకుంటున్నారు కొందరు. ఎవరో ఒకరు కార్యక్రమాలు రూపొందించి పెడితేనే కదా ఆయా మాధ్యమాలు ఇతరులకు కాలక్షేపాన్ని ఇస్తాయి. ఈ అంశాన్నే ఆధారంగా తీసుకుని తమ అభిరుచి మేరకు ‘కంటెంట్‌’ క్రియేషన్‌లో తలా ఒకచేయీ వేస్తున్నారు ప్రతిభావంతులు. నవ్వించే ఆట, అలరించే పాట, ఆలోచింప చేసే మాట, స్ఫూర్తినిచ్చే పాఠం, మురిపించే చిత్రం, నోరూరించే వంట... ఏదైనా సరే- సొంతంగా చేయగలిగే సృజనకారులకు అవకాశాలెన్నో.
సహజంగానే అలాంటి కార్యక్రమాలకు ప్రేక్షకులూ ఎక్కువగా ఉంటారు.

ఒక్క మన దేశంలోనే ఐదు కోట్లమందికి పైగా సామాజిక మాధ్యమాల ద్వారా ఆదాయం పొందుతున్నారట. వారిలో నెలకు పాతిక వేల నుంచి కోటి రూపాయల వరకూ సంపాదిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ!

పల్లెలకూ పాకింది!

ప్రేమించడం, అది విఫలమైతే గుండెకోతను అనుభవించడం గురించి అందంగా చెబుతూ ‘మోజ్‌’లో దాదాపు కోటిమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న దివ్యా ఉపాధ్యాయ్‌ ఉండేది దిల్లీలోనో ముంబయిలోనో కాదు- ఇందౌర్‌లో. డాన్స్‌ వీడియోలు పెట్టే హిమాంశు శ్రీవాస్తవది గైరత్‌గంజ్‌ అనే చిన్న ఊరు. కామెడీ వీడియోలు చేసే అమిత్‌ సొబ్తి అంబాలాలో ఉంటాడు. అంతెందుకు... కోటిమంది సబ్‌స్క్రైబర్లతో చరిత్ర సృష్టించిన తమిళనాడు విలేజ్‌ కుకింగ్‌ చానల్‌- ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిందే. ‘మై విలేజ్‌ షో’తో ఆకట్టుకున్న గంగవ్వది తెలంగాణలో లంబాడిపల్లి అనే ఊరు. ‘అరకు ట్రైబల్‌ కల్చర్‌’ పేరుతో గిరిజనుల జీవనశైలిని వివరిస్తున్న ఛానెల్‌ ఒక గిరిజనుడు ప్రారంభించింది.

సామాజిక మాధ్యమాలను వాడేదీ, అందులో పోస్టులు పెట్టేదీ నగరాలకు చెందినవారేనన్నది అపోహేనని రుజువు చేస్తున్నారు వీరంతా. నిజంగానే ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ క్రేజ్‌ ఇప్పుడు పట్టణాలకూ పల్లెలకూ పాకింది. కంటెంట్‌ని వినియోగించుకునేవారిలోనూ, రూపొందించేవారిలోనూ వీరిదే పైచేయి. యూట్యూబ్‌, ఇన్‌స్టా లాంటి గ్లోబల్‌ వేదికలే కాదు, దేశీయంగా జోష్‌, మోజ్‌, చింగారీ లాంటి ఆప్‌లకీ ఆదరణ నానాటికీ పెరుగుతోంది.

భారతీయ వీడియో ఆప్స్‌ని వినియోగించేవారిలో 60-65 శాతం టైర్‌-2 పట్టణాలకు చెందినవారేనట. దేశంలో దాదాపు 45 కోట్లమంది సోషల్‌ మీడియాను వాడుతుండగా వారిలో 16 కోట్లమంది జోష్‌, మోజ్‌, చింగారీ లాంటి స్థానిక ఆప్‌ ఏదో ఒకటి వాడుతున్నట్లు సమాచారం. రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ సంస్థ అంచనాల ప్రకారం ఈ ఆప్‌లన్నిటిలో కలిపితే టిక్‌టాక్‌ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ క్రియేటర్లు ఉన్నారట.

ఆర్థిక వ్యవస్థకు దన్ను

సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులను ‘కంటెంట్‌’ అంటారు. అవి రాత రూపంలో, వీడియోలూ ఆడియోల రూపంలో ఉండవచ్చు. వీటిని తయారుచేసేవారిని ‘కంటెంట్‌ క్రియేటర్స్‌’ అంటారు. బిజినెస్‌ రీసెర్చ్‌ సంస్థ పీజీఏ ల్యాబ్స్‌ అంచనాల ప్రకారం దేశంలో కంటెంట్‌ క్రియేటర్స్‌ వ్యవస్థ విలువ రూ. 3,265 కోట్ల దాకా ఉంది.
ఇది మరో నాలుగేళ్లకల్లా 33 వేల కోట్లు కాగలదని అంచనా.

అంతగా పెరిగే అవకాశం ఉంది కాబట్టే ఇలా సామాజిక మాధ్యమాల్లో కంటెంట్‌ క్రియేట్‌ చేసే అంకుర సంస్థలకు 16 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయట. ఈ తరహా ఫండింగ్‌ 2021లోనే 75 శాతం పెరిగిందని కలారి క్యాపిటల్‌ లెక్కలు చెబుతున్నాయి. అన్ని రంగాలనీ దెబ్బతీసిన కరోనా ఈ రంగానికి మేలు చేసింది. పెను ఆర్థిక సంక్షోభం ముందుంది- అన్న హెచ్చరికల్ని కూడా తోసిరాజని ఈ ఏడాది మొదట్లో ‘జోష్‌’ పేరెంట్‌ కంపెనీ వర్‌సె ఇన్నొవేషన్‌కి ఆరున్నర వేల కోట్లు ఇచ్చారు
పెట్టుబడిదారులు. ఈ ఏడాది స్టార్టప్‌ ఫండింగ్‌లో చెప్పుకోదగ్గ పెద్ద మొత్తం ఇదే. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ అనే ఒక కన్సల్టింగ్‌ సంస్థ నివేదిక ప్రకారం 2020లో మనదేశ జీడీపీకి యూట్యూబ్‌ వారి క్రియేటర్‌ వ్యవస్థ రూ.6800 కోట్లు జతచేసిందట. అది 6.83లక్షల పూర్తి స్థాయి ఉద్యోగాలకు సమానమట.

వినియోగదారుల అభిరుచుల్లో మార్పులే ఈ క్రియేటర్‌ వ్యవస్థ పెరుగుదలకు కారణం అంటుంది కలారి క్యాపిటల్‌.

వినియోగదారులు ఏది పడితే అది చూడడం లేదు. తమకు నచ్చిన, తమను తాము అందులో చూసుకోగల కంటెంట్‌ కోసం వెదుకుతున్నారు. అలాంటి ఒరిజినాలిటీ ఉన్న కంటెంట్‌నే సబ్‌స్క్రైబ్‌ చేసి మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ ట్రెండ్‌ గమనించిన కంపెనీలు మంచి కంటెంట్‌ రూపొందించగల వారి వెంట పడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లేని ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని జనరేషన్‌ జడ్‌ తరం ఇది. ఆప్‌లను విస్తృతంగా వాడే ఈ యువతరాన్ని  చేరాలంటే డిజిటల్‌
వీడియోలే ఉత్తమ మాధ్యమాలని వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి.

ఈ కంటెంట్‌ క్రియేటర్ల వ్యవస్థ ఇంతగా పెరగడానికి క్రెడిట్‌ మాత్రం టిక్‌టాక్‌కే ఇవ్వాలంటారు పరిశీలకులు. షార్ట్‌ వీడియోలను పల్లెల్లోకి తీసుకెళ్లిన ఘనత దానిదే. ఇప్పుడు దాని స్థానాన్ని పలు దేశీయ ఆప్స్‌ భర్తీ చేస్తున్నాయి.

ఆదాయం ఇలా...

టిక్‌టాక్‌ని బ్యాన్‌ చేశారన్న వార్త ముంబయిలోని ధారావికి చెందిన అద్నాన్‌ షేక్‌కి పిడుగుపాటులా తగిలింది. బైక్‌ స్టంట్స్‌ అంటే ఇష్టపడే అద్నాన్‌ అయిదేళ్లుగా ఆ వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్‌చేస్తూ కోటిన్నర మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అంతో ఇంతో ఆదాయమూ పొందేవాడు. అలాంటిది ఒక్కసారిగా టిక్‌టాక్‌ ఆగిపోయేసరికి చాలా నిరుత్సాహపడ్డాడు. తర్వాత దేశీయ ఆప్‌ ‘జోష్‌’లో చేరి స్టంట్స్‌తో పాటు ఫిట్‌నెస్‌, డాన్స్‌ లాంటి పలురకాల వీడియోలూ చేయడం మొదలెట్టాడు. కొద్దికాలంలోనే రెండు కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. దాంతో జోష్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి వచ్చే ఆదాయమే కాక అమెజాన్‌, టీవీఎస్‌ మోటార్‌ లాంటి బ్రాండ్స్‌ నుంచి కూడా ఆదాయం వస్తోంది. దీంట్లో వచ్చిన పేరుతో అతడికి మ్యూజిక్‌ వీడియోల్లో నటించే అవకాశమూ వచ్చింది. ‘ఇప్పుడు నేను లక్షల్లో సంపాదిస్తున్నాను, అందుకే మంచి ఫ్లాట్‌ తీసుకుని మా కుటుంబాన్ని మురికివాడ నుంచి బయటకు తీసుకొచ్చాను...’ అంటాడు అద్నాన్‌. అతడే కాదు, డిగ్రీ అవగానే యూట్యూబర్‌గా మారి గేమింగ్‌ కంటెంట్‌ రూపొందిస్తున్న పాయల్‌ ధరే, మాస్‌ కమ్యూనికేషన్స్‌లో పట్టా పుచ్చుకుని నటనా, మోడలింగ్‌ చేపట్టిన సనా సుల్తాన్‌ ఖాన్‌ ఇలా ఎందరో కెరీర్‌లో కన్నా ఎక్కువగా సామాజిక మాధ్యమాల నుంచి ఆదాయం పొందుతున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఆదాయం ఎలా వస్తుందో చాలామందికి అర్థం కాదు. మనం పెట్టిన పోస్టు అయినా వీడియో అయినా ఎంతమందిని చేరిందన్నది ఇక్కడ లెక్క. ఎంత ఎక్కువ మంది దాన్ని చూస్తే అంతగా దాంట్లో ప్రకటనలూ వస్తాయి.

ఆ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని సదరు వేదికా, కంటెంట్‌ క్రియేటర్‌ పంచుకుంటారు. అది మొదటి మార్గం. ఆ తర్వాత ఎక్కువ ఫాలోవర్లు ఉన్న క్రియేటర్లను ప్రముఖ బ్రాండ్స్‌ భాగస్వాములుగా తీసుకుంటాయి. మేకప్‌, దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు, గ్యాడ్జెట్స్‌... ఇలా రకరకాల ఉత్పత్తుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని ఆయా వ్యక్తుల వీడియోలో కనిపించేలా చేయడమో, వారి నోటితో ఒక మాట చెప్పించడమో చేస్తాయి. అలా చేసినందుకు క్రియేటర్‌కి ఆ బ్రాండ్స్‌ అదనంగా డబ్బులు చెల్లిస్తాయి. ఇన్‌ఫ్లుయెన్సర్లు ‘ఫలానా బ్రాండ్‌ మంచిది నేను అదే వాడుతున్నాను’ అని ఒక్కమాట చెబితే చాలు, దాన్ని వారి అభిమానులందరూ చూస్తారు. చాలామంది అదే బ్రాండ్‌ని వాడతారు. ప్రకటనల ద్వారా కన్నా ఇలా ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌’ విధానం ద్వారా బ్రాండ్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మంచిదని ఎక్కువ సంస్థలు నమ్ముతున్నాయి. ఫాలోవర్లూ వీక్షణలూ పెరిగేకొద్దీ క్రియేటర్లకు డిమాండ్‌ పెరుగుతుంది. ఇంతని ఫీజు డిమాండ్‌ చేయగలుగుతారు. ఇప్పుడు- మంచి ఆదరణ పొందుతున్న కంటెంట్‌ క్రియేట్‌ చేస్తున్నవారికి- ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ఆదాయ మార్గాలున్నాయి. లైవ్‌ కామర్స్‌(వీడియోని లైవ్‌స్ట్రీమ్‌ చేస్తూ ఒక వస్తువు గురించి చెప్పడం), షాపబుల్‌ కామర్స్‌(ఇక్కడ బ్రాండ్స్‌ తమ ఉత్పత్తుల గురించి ఇన్‌ఫ్లుయెన్సర్ల పోస్టుల దగ్గర ట్యాగ్‌ చేస్తాయి, డైరెక్టుగా లింక్‌ ఇస్తాయి), పెయిడ్‌ పార్టనర్‌షిప్స్‌ (ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏదైనా బ్రాండ్‌తో ఒప్పందం చేసుకుని దాని గురించి పోస్టులు పెట్టడం), పర్సనల్‌ మర్చండైజ్‌(తానే స్వయంగా ఒక బ్రాండ్‌గా ప్రమోట్‌ చేసుకోవడం), వర్చువల్‌ గిఫ్టింగ్‌ (ఫాలోవర్లకు రకరకాల ఆన్‌లైన్‌ క్లాసుల సబ్‌స్క్రిప్షన్‌ ఇవ్వడం, బహుమతులు పంపించడం ద్వారా వారిని తమ కంటెంట్‌ని ఎక్కువగా చూసేలా చేయడం) ... లాంటివి క్రియేటర్స్‌ని సంపాదనాపరుల్ని చేస్తున్నాయి. భువన్‌, ఆశిష్‌ లాంటి టాప్‌ క్రియేటర్స్‌గా పేరొందిన వాళ్లు ఒకో నెలలో కోటి రూపాయలు సంపాదించిన దాఖలాలూ ఉన్నాయి.

అంత తేలికా?

కంటెంట్‌ తయారీ అంత తేలికైన విషయమా అంటే- ఓ రకంగా తేలికా ఓ రకంగా కష్టమూ కూడా. ఇక్కడ ప్రధాన పెట్టుబడి సృజనాత్మకత. కంటెంట్‌ ఎంత కొత్తగా, ఒరిజినల్‌గా ఉంటే అంత ఆదరణ లభిస్తుంది. అలాంటి కంటెంట్‌ సృష్టించడం కాస్త కష్టమే. అది చేతనైతే ఇతరత్రా మౌలిక వసతుల కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇంటి నాలుగు గోడలమధ్యే తమకి నచ్చిన పని చేస్తూ దాన్ని ఫోన్‌లోనే చిత్రీకరిస్తున్నారు చాలా మంది. ఫోనులో ఉండే టూల్స్‌, ఫిల్టర్స్‌ సాయంతోనే ఎడిటింగ్‌ కూడా చేస్తున్నారు. ఈ వెసులుబాటు ఉండబట్టే ఎవరైనా తేలిగ్గా యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించగలుగుతున్నారు. అయితే, ఏ రంగంలో ప్రతిభను చూపాలనుకుంటున్నారు, ప్రేక్షకులు ఎవరు, తగిన వేదిక ఏది... అన్నవి సరిగ్గా నిర్ణయించుకోవడం ముఖ్యం. కంటెంట్‌ తయారుచేసే సృజనాత్మకత లేదు... అంతమాత్రాన సోషల్‌ మీడియాకి దూరంగా ఉండాలా అంటే- అక్కర్లేదంటారు నిపుణులు. సోషల్‌ మీడియా ప్రయోజనాలు బాగా తెలిసినవారు సోషల్‌ మీడియా మేనేజర్లుగా, డేటా విశ్లేషకులుగా వ్యాపారసంస్థలకు సేవలు అందించవచ్చు.  సాంకేతిక రంగంలో నైపుణ్యం ఉంటే సైబర్‌ సెక్యూరిటీ నిపుణులో ఈ-కామర్స్‌ కోఆర్డినేటర్లో కావచ్చు. కొత్త కొత్త ఆప్‌లు తయారుచేయవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉపాధి అవకాశాలు సామాజిక మాధ్యమాల ద్వారా లభించనున్నాయి.

అందుకే... సామాజిక మాధ్యమాలు కాలక్షేపం కాదిప్పుడు... సత్తా ఉన్నవాళ్లకు కాసులు కురిపించే మార్గాలు కూడా!


‘నానో’ నుంచి ‘మెగా’ వరకు...

ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, జోష్‌... అన్నీ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సందడిగా ఉన్నాయి. ఇలాంటి వేదికల మీద ఒక్కో ఖాతానూ ఎంత ఎక్కువ మంది అనుసరిస్తే అంత గొప్ప. సినిమా తారలకూ క్రీడాకారులకూ కోట్లలో అభిమానులు ఉండడం సహజం. కానీ మామూలు యువతీ యువకులకు కేవలం వాళ్లు ఈ వేదికల మీద సృష్టించే కంటెంట్‌ కారణంగా పెద్ద ఎత్తున అభిమానులు ఏర్పడడం విశేషం. ఫాలోవర్స్‌ సంఖ్యను బట్టి సామాజిక మాధ్యమాల్లో కంటెంట్‌ క్రియేటర్స్‌ని నాలుగు గ్రూపులుగా విభజించారు. వారి సంపాదన వివరాలు...

నానో: వెయ్యినుంచి పదివేల లోపు ఫాలోవర్స్‌. వీళ్లకి పోస్టుకి రూ.4000 వరకూ ఆదాయం రావచ్చు.

మైక్రో: ఫాలోవర్లు పదివేల నుంచి లక్షలోపు. ఆదాయం రూ.40 నుంచి 60 వేలు.  

మ్యాక్రో: లక్ష నుంచి పది లక్షల వరకూ ఫాలోవర్లు. బ్రాండుని బట్టి పోస్టుకి లక్షన్నర నుంచి మూడున్నర లక్షల దాకా వస్తుంది.

మెగా: ఫాలోవర్ల సంఖ్య పదిలక్షల పైన ఎంతైనా. వీళ్లకి పోస్టుకి నాలుగు లక్షల దాకా వస్తుంది.

ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ మార్కెటింగ్‌ రిపోర్టు ప్రకారం మనదేశంలో ఏటా 25శాతం చొప్పున పెరుగుతున్న ఈ రంగం విలువ 2025 నాటికి రూ.2200 కోట్లకు చేరుతుందట.


లక్షల్లో సంపాదన..!

ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఫేస్‌బుక్‌లోనో ఓ ఫొటో పెట్టుకోవడం... లైకులూ కామెంట్లూ చూసి మురిసిపోవడం అందరూ చేసేదే. దానివల్ల కాసేపు ఆనందం తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. అదే సోషల్‌ మీడియా స్టార్లు లేదా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక పోస్టు పెట్టారంటే వేలూ లక్షలూ వచ్చి ఒళ్లో వాలతాయి. పైగా వీళ్లు ఒక్క మాధ్యమంతో ఆగిపోరు. ఒకచోట పేరు వస్తే సహజంగానే ఇతర మాధ్యమాల్లోనూ ఆదరణ పెరుగుతుంది. మనదేశంలో అలా వివిధ మాధ్యమాల ద్వారా ఎక్కువ మొత్తం సంపాదిస్తున్న కొందరు...


కుశా కపిల: నిఫ్ట్‌ గ్రాడ్యుయేట్‌ అయిన ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తూ కాసేపు రిలాక్సవడానికి అర నిమిషం నిడివి ఉండే కామెడీ వీడియోలు చేసేది. అవి ఎంతగా ఆదరణ పొందాయంటే ఉద్యోగం మానేసి అవే చేసుకోవాలనిపించేంత. మన దేశంలో కంటెంట్‌ క్రియేషన్‌ని కొత్త దారి పట్టించిన తొలి ఇన్‌ఫ్లుయెన్సర్‌ కుశానే అంటారు. యువతను ఆకట్టుకునే కామెడీ వీడియోలతో ఇప్పటివరకూ ఆమె 20 కోట్లదాకా సంపాదించిందట.


వరుణ్‌ ఆదిత్య: ఈ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌కి ఇన్‌స్టాలో ఇరవై లక్షల మంది ఫాలోవర్లున్నారు. ఇతరులతో పోలిస్తే అదేమంత పెద్ద సంఖ్య కాదు, కానీ ఇన్‌స్టాలో ఒక పోస్టుకి అతడు తీసుకునే మొత్తం చూస్తే (8.6లక్షలు) అతడి చిత్రాలకు ఎంత పాపులారిటీ ఉందో తెలుస్తుంది.


కృత్తికా ఖురానా: ‘దట్‌ బోహో గర్ల్‌’గా, ప్యాషన్‌ బ్లాగర్‌గా టీనేజర్లలో విపరీతమైన క్రేజ్‌ సంపాదించి, సోషల్‌ మీడియా ఆదాయంతోనే కోటీశ్వరురాలైన కృత్తికా
ఒక పోస్టుకి నాలుగు లక్షలు, ఒక వీడియోకి 3 లక్షలు తీసుకుంటుందట.


ఆష్నా ష్రాఫ్‌: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాషన్‌, బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరొందిన ఈ అమ్మాయి ఒక్కో పోస్టుకీ దాదాపు మూడు లక్షలు తీసుకుంటుంది. ఆమె
ఇప్పటివరకూ 37 కోట్లు సంపాదించిందట. బ్లాగర్‌గా, మోడల్‌గా పేరు తెచ్చుకుంది.


అజేయ్‌ నాగర్‌: యువతలో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుని ఆసియాస్‌ లీడింగ్‌ యూట్యూబర్‌గా పేరొందిన అజేయ్‌నాగర్‌ అందులో వచ్చే వీక్షణలూ ప్రకటనల ద్వారా నెలకు పది లక్షలు, స్పాన్సరర్ల ద్వారా మరో పాతిక లక్షలూ సంపాదిస్తున్నాడు.


భువన్‌ బమ్‌: ఇరవై ఎనిమిదేళ్ల భువన్‌ యూట్యూబ్‌లో వ్యంగ్య, హాస్య వీడియోల ద్వారా నెలకు పాతిక లక్షలపైనే సంపాదిస్తూ ఏడాదికి 3-4 కోట్ల ఆదాయం పొందుతున్న వారి కేటగిరిలో చేరాడు. దేశంలో కోటిమంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్న మొదటి యూట్యూబర్‌ భువన్‌. ఒక షార్ట్‌ఫిల్మ్‌లో నటించి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఎన్నో పెద్ద కంపెనీలకు బ్రాండ్‌ అంబాసడర్‌గా ఉన్నాడు.


ప్రజక్తా కోలి: రేడియో జాకీగా కెరీర్‌ మొదలెట్టి ఇంటర్న్‌షిప్‌తోనే ఆపేసి యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టిన ప్రజక్తా పక్కింటి అమ్మాయిలా రోజువారీ కబుర్లకు హాస్యం జతచేసి చెబుతుంటే యువత చెవులప్పగించి వింటారు. దాంతో ‘క్వీన్‌ ఆఫ్‌ యూట్యూబ్‌’ అనిపించుకుని ఏడాదికి నాలుగు కోట్లు సంపాదిస్తోంది ప్రజక్తా.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..