చదువుని వదల్లేదు!

సినిమా రంగంలోకి అడుగు పెట్టి తమ ప్రతిభను ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకున్నారు ఈ నటీనటులు. మరోవైపు ఇంట్లో వాళ్లకు మాట ఇచ్చినట్టు చక్కగా చదువుకుని మంచి ర్యాంకులూ సాధించారు.

Updated : 17 Mar 2024 11:15 IST

సినిమా రంగంలోకి అడుగు పెట్టి తమ ప్రతిభను ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకున్నారు ఈ నటీనటులు. మరోవైపు ఇంట్లో వాళ్లకు మాట ఇచ్చినట్టు చక్కగా చదువుకుని మంచి ర్యాంకులూ సాధించారు. ఇంతకీ ఆ తారలు ఎవరంటే... 


మీడియాలో చేయాలి

- మృణాల్‌ ఠాకూర్‌

నాన్న బ్యాంకు ఉద్యోగి. మా కుటుంబంలోని వారంతా ఉన్నత విద్యావంతులే. నన్ను కూడా అలానే చదివించాలనుకున్నారు. నేను డెంటిస్ట్‌ అవ్వాలనుకున్నా. బీడీఎస్‌ చేద్దామనుకుని ఎంట్రన్స్‌ రాస్తే మంచి ర్యాంకు వచ్చింది. తీరా కోర్సులో చేరే సమయానికి మీడియాలోకి వెళదామని నిర్ణయం మార్చుకుని బ్యాచిలర్స్‌ ఇన్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌లో చేరా. అప్పుడే మోడలింగ్‌ చేసే అవకాశం వచ్చింది. చదువును వదిలిపెట్టకుండానే మోడలింగ్‌ చేశా. క్రమంగా సీరియళ్లలోనూ ఛాన్సులొచ్చాయి. ఎన్ని వ్యాపకాలున్నా... చదువును అశ్రద్ధ చేసేదాన్ని కాదు. సినిమాల్లో నటిస్తూనే ఓ సంస్థలో ఇంటర్న్‌షిప్‌ కూడా చేశా. ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నానేమోగానీ.. ఎప్పటికైనా ఓ పేరున్న మీడియా సంస్థలో పని చేయాలనుకుంటున్నా.


నటిస్తూనే మెడిసిన్‌ చేశా

- శ్రీలీల

మా అమ్మమ్మా తాతయ్యలకు చదువంటే చాలా ఇష్టం. అమ్మని బాగా చదివించి డాక్టర్‌ని చేశారు. వాళ్లందర్నీ చూస్తూ పెరిగిన నాకూ డాక్టర్‌ అవ్వాలనిపించింది. దానికి తాతయ్య ఎంతో సంబరపడిపోయారు. అనుకోకుండా నాకు సినిమాలపైన ఆసక్తి కలగడంతో ఇటు రావాలనుకున్నా. అలా చేస్తే చదువు పాడవుతుందనుకున్నారు అమ్మావాళ్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుని వదిలిపెట్టనని మాట ఇచ్చి మరీ సినిమాల్లోకి వచ్చా. అనుకున్నట్టుగానే మెడిసిన్‌ చదువుతూనే నటించా. అదెంతో కష్టమైనా సరే రిస్కు తీసుకున్నా. ఈ మధ్యనే పరీక్షలు పూర్తయ్యాయి. అలాగని అక్కడితో చదువును ఆపే ఉద్దేశం లేదు. ఏదో ఒక స్పెషలైజేషన్‌తో పీజీ పూర్తి చేయాలను కుంటున్నా.


బెల్టు తీశారు

 నవీన్‌ పోలిశెట్టి

దిల్లీ యూనివర్సిటీలో మా నాన్న ప్రొఫెసర్‌. విద్యారంగంలో ఉండటంవల్లనో లేదా పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడం వల్లనో- నేను సినిమాల్లోకి వస్తానంటే నాన్న ఒప్పుకోలేదు. అందుకే ఏఐఈఈఈ ఎంట్రన్స్‌ రాసి ఎన్‌ఐటీ భోపాల్‌లో సీటు సంపాదించా. అప్పుడైనా అర్థం చేసుకుంటారనుకుంటే నాన్న బెల్టు తీశారు. ఏడ్చిగోల చేసినా సరే ఇంజినీరింగ్‌లో జాయిన్‌ చేశారు. నాకు సినిమాల మీద ఆసక్తి ఉన్నా... క్లాస్‌లు మాత్రం శ్రద్ధగా వినేవాడిని. టీచర్లు చెప్పింది బాగా గుర్తు పెట్టుకునేవాడిని. నెల ముందు చదివి పరీక్షలు రాసినా క్లాస్‌లో ఫస్ట్‌ వచ్చేవాడిని. మరోవైపు స్టేజీషోలూ, నాటకాలూ వేసేవాడిని. చదువు పూర్తయ్యేసరికి లండన్‌లో ఉద్యోగం కూడా వచ్చింది. అమ్మానాన్నల కోసం కొంత కాలం ఉద్యోగం చేసి, తరువాత మానేసి నాకు ఇష్టమైన సినీ రంగంలోకి వచ్చా.


క్లాస్‌ ఫస్ట్‌ వచ్చా

 కార్తికేయ

మాకు విద్యా సంస్థలు ఉండటం, అమ్మానాన్నలు చదువుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాళ్ల ఆశలన్నీ నా మీదే పెట్టుకున్నారు. నాకేమో సినిమాలంటే ఆసక్తి. అమ్మావాళ్లను ఒప్పించాలంటే వాళ్లకి నచ్చింది చేయాలి. కాబట్టి ఇంటర్‌ అయ్యాక లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని వరంగల్‌ నిట్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో సీటు సంపాదించుకున్నా. అప్పటికి కూడా అమ్మానాన్నలకు నామీద నమ్మకం కుదర లేదు. అందుకే చదువుకుంటూనే షార్ట్‌ఫిల్మ్స్‌ తీయడం, కాలేజీ ఫంక్షన్స్‌లో డాన్స్‌లు చేయడం, జిమ్‌లో చేరి ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెట్టడం వంటివన్నీ చేశా. అలా నాలుగేళ్లు ఎంతో కష్టపడి కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యా. ‘ఇష్టంలేని చదువుకోసమే అంత తపనతో కష్టపడ్డ నువ్వు నీ లక్ష్యం కోసం ఎంతైనా శ్రమిస్తావని అర్థమైంద’న్న అమ్మానాన్నలు అప్పట్నుంచి సినిమాల్లో  ప్రోత్సహించారు.


ట్రిపుల్‌ డిగ్రీ చేశా

పరిణీతి చోప్రా

నాన్న ఆర్మీలో పనిచేసేవారు. నేను బాగా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడాలని అనుకున్నారు. పెరిగిన వాతావరణం వల్ల చదువే నా ప్రధాన వ్యాపకమైంది. లండన్‌ వెళ్లి మాంచెెస్టర్‌ బిజినెస్‌ స్కూల్లో(ఫైనాన్స్‌, ఎకనమిక్స్‌, బిజినెస్‌) ట్రిపుల్‌ డిగ్రీ పూర్తి చేశా. కాలేజీ రోజుల్లోనే సినిమాల్లో నటించాలనే ఆసక్తి కలిగింది కానీ, దాని కోసం లక్ష్యాన్ని పక్కన పెట్టాలనిపించలేదు. అమ్మానాన్నలకు చెబితే ‘సినిమాల్లో ఎప్పుడైనా నటించొచ్చు. చదువుమీద ఆసక్తి పోతే మళ్లీ తిరిగి రావడం కష్టమ’న్నారు. నాకూ అదే అనిపించింది. అందుకే బుద్ధిగా లండన్‌ వెళ్లి చదువుకున్నా. చదువుకుంటూనే అక్కడ నటనలో శిక్షణ తీసుకున్నా. చదువు పూర్తయ్యాక ఓ మార్కెటింగ్‌ సంస్థలోనూ పనిచేశా. కొంతకాలానికి సినిమాల్లోకి వచ్చా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..