ఇఫ్తార్‌ విందు... పసందుగా!

పవిత్రమైన రంజాన్‌ మాసంలో... రోజా పేరుతో కఠోర ఉపవాసం చేసే ముస్లిం సోదరులు సాయంత్రాలు ఆ దీక్షను విరమించడం తెలిసిందే. ఆ సమయంలో చేసుకునే వంటకాలు పోషకాలూ అందించేలా ఉండాలి గనుక... ఇలాంటివి ఎంచుకుంటే సరి.

Updated : 17 Mar 2024 05:04 IST

పవిత్రమైన రంజాన్‌ మాసంలో... రోజా పేరుతో కఠోర ఉపవాసం చేసే ముస్లిం సోదరులు సాయంత్రాలు ఆ దీక్షను విరమించడం తెలిసిందే. ఆ సమయంలో చేసుకునే వంటకాలు పోషకాలూ అందించేలా ఉండాలి గనుక... ఇలాంటివి ఎంచుకుంటే సరి.


డ్రైఫ్రూట్స్‌ మిల్క్‌షేక్‌

కావలసినవి: కాచిన పాలు: రెండున్నర కప్పులు, ఖర్జూరాలు: అరకప్పు, ఫూల్‌మఖానా: పావుకప్పు, బాదం: పావుకప్పు, జీడిపప్పు: పావుకప్పు, వాల్‌నట్లు: పావుకప్పు, కండెన్స్‌డ్‌మిల్క్‌: పావుకప్పు.

తయారీవిధానం: ఓ గిన్నెలో పాలు పోసి.. అందులో ఖర్జూరాలు, ఫూల్‌మఖానా, డ్రైఫ్రూట్స్‌ పలుకుల్ని వేసి నానబెట్టుకోవాలి. అరగంటయ్యాక వీటన్నింటినీ మిక్సీలో తీసుకుని, కండెన్స్‌ మిల్క్‌తోపాటు మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.


మూంగ్‌దాల్‌ మిఠాయి  

కావలసినవి: నెయ్యి: రెండు చెంచాలు, పెసరపప్పు: అరకప్పు, పాలు: కప్పు, బియ్యప్పిండి: కప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ముందుగా పాకం పట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి చక్కెర వేసి నీళ్లు పోయాలి. చక్కెర కరిగి.. తీగంపాకంలా మారుతున్నప్పుడు కుంకుమపువ్వు రేకలు, యాలకులపొడి వేసి దింపేయాలి. ఇప్పుడు స్టవ్‌మీద కుక్కర్‌ను పెట్టి చెంచా నెయ్యి వేసి పెసరపప్పును వేయించుకుని కప్పు నీళ్లు, పాలు పోసి మూత పెట్టి... నాలుగు కూతలు వచ్చాక స్టవ్‌ని కట్టేయాలి. ఆ తరువాత మూత తీసి.. ఈ పప్పును వీలైనంత మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి.. పెసరపప్పు ముద్దను వేసి.. మరో అరకప్పు నీళ్లు పోసి, బియ్యప్పిండి వేసి బాగా కలిపి.. ముద్దలా అవుతున్నప్పుడు మిగిలిన నెయ్యి వేసి దింపేయాలి. ఈ మిశ్రమంలోంచి కొద్దిగా తీసుకుని బిళ్లలా చేసి పైన... నాలుగుగాట్లు పెట్టుకోవాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకున్నాక రెండుమూడు చొప్పున కాగుతున్న నూనెలో వేస్తూ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇలా చేసుకున్నవాటిని పాకంలో వేస్తే సరిపోతుంది.

పాకం కోసం: చక్కెర: ఒకటిన్నర కప్పు, నీళ్లు: ఒకటిన్నర కప్పు, యాలకులపొడి: పావుచెంచా, కుంకుమపువ్వు రేకలు: చిటికెడు.  


చికెన్‌ కీమా పులావ్‌

కావలసినవి:  చికెన్‌ కీమా: పావుకేజీ, బాస్మతీ బియ్యం: కప్పు, పచ్చిబఠాణీ: పావుకప్పు, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు: టేబుల్‌స్పూను, కారం: టేబుల్‌స్పూను, పసుపు: అరచెంచా, పులావ్‌ మసాలా: చెంచా,  ఉప్పు: తగినంత, దాల్చినచెక్క: చిన్న ముక్క, బిర్యానీ ఆకు: ఒకటి, లవంగాలు: మూడు, అనాసపువ్వు: ఒకటి, షాజీరా: చెంచా, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీవిధానం: బియ్యాన్ని కడిగి ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి. స్టవ్‌మీద కుక్కర్‌ను పెట్టి నెయ్యి, నూనె వేసి..  బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, అనాసపువ్వు, షాజీరా, లవంగాలు వేయించుకోవాలి. తరువాత ఇందులో ఉల్లిపాయముక్కలు వేసి ఎర్రగా వేయించుకుని టొమాటో తరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. టొమాటో ముక్కలు మగ్గుతున్నప్పుడు కారం, పసుపు, మసాలా, తగినంత ఉప్పు, కీమా, పచ్చిబఠాణీ, కడిగిన బియ్యం, కొత్తిమీర తరుగు వేసి అన్నింటినీ వేయించాలి. తరువాత ఇందులో రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి... రెండు కూతలు వచ్చాక స్టవ్‌ని కట్టేయాలి.  


ఆలూ పాలక్‌ పకోడా

కావలసినవి: బంగాళాదుంపలు: రెండు, క్యాబేజీ తరుగు: అరకప్పు, పాలకూర తరుగు: కప్పు, సన్నగా పొడుగ్గా కోసిన ఉల్లిపాయ ముక్కలు: కప్పు, ఉప్పు: తగినంత, ఎండుమిర్చి: రెండు (బరకగా దంచుకోవాలి), కారం: చెంచా, దనియాలపొడి: టేబుల్‌స్పూను, అల్లంవెల్లుల్లి పేస్టు: టేబుల్‌స్పూను, వాము: అరచెంచా, సెనగపిండి: ముప్పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీవిధానం: బంగాళాదుంపల చెక్కుతీసి చిన్న ముక్కల్లా కోసుకోవాలి. ఇందులో క్యాబేజీ తరుగు, పాలకూర తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని... ఇవి మునిగేలా నీళ్లు పోసి కడిగి మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ముక్కలపైన నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకుని అన్నింటినీ కలుపుతూ... కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగుతున్న నూనెలో పకోడీల్లా వేసుకుంటూ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..