రామకథలో... రాజకీయాలు!

నిలువెత్తు ధర్మం.. రామచంద్రుడు. రాక్షసేశ్వరుడు.. రావణ బ్రహ్మ. ఇద్దరూ తిరుగులేని నాయకులే. కానీ, ఎవరి యుద్ధనీతి వారిది. ఎవరి ఆలోచనా రీతి వారిది. రావణుడు.. పదితలల పురుగు.

Updated : 14 Apr 2024 06:55 IST

నిలువెత్తు ధర్మం.. రామచంద్రుడు. రాక్షసేశ్వరుడు.. రావణ బ్రహ్మ. ఇద్దరూ తిరుగులేని నాయకులే. కానీ, ఎవరి యుద్ధనీతి వారిది. ఎవరి ఆలోచనా రీతి వారిది. రావణుడు.. పదితలల పురుగు. అరిషడ్వర్గాలకు బానిస. రాముడు విలువల బాటసారి. ధర్మ దీక్షాపరుడు. దశకంఠుడి ప్రతి కుతంత్రాన్నీ సమర్థంగా తిప్పికొట్టాడు. కష్టాలు ఎదురైనా.. నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదు. అంతిమంగా మంచే గెలిచింది. రామతత్వమే నిలబడింది. అయినా.. ఎన్నికల్ని యుద్ధంతో పోల్చినప్పుడు.. యుద్ధాన్ని మాత్రం ఎన్నికలతో ఎందుకు పోల్చకూడదు? వ్యూహాలు-ప్రతివ్యూహాలు, దాడులు-ప్రతిదాడులు, ఫిరాయింపులు-వెన్నుపోట్లు, అసత్య ప్రచారాలు- ఆపద్ధర్మ అబద్ధాలు. అక్కడా ఉన్నాయి, ఇక్కడా ఉంటాయి. అందులోనూ రామరావణ సంగ్రామంలో ఎన్నికల పోరును తలపించేంత ఉత్కంఠ. రామాయణానికి మరో ప్రత్యేకతా ఉంది. ఈ మహాకావ్యం, ఎలా గెలవాలో చెబుతుంది. ఎలా గెలవకూడదో కూడా హెచ్చరిస్తుంది. అది యుద్ధం కావచ్చు. ఎన్నికలు కావచ్చు. జీవితమూ కావచ్చు.

‘రామరాజ్యం’ అంటాం. నాయకుడంటే పాలన. ‘శ్రీరామ రక్ష’ అనుకుంటాం.నాయకుడంటే భరోసా. ‘రామబాణం’ అని వ్యవహరిస్తాం. నాయకుడంటే గురి.

రాముడెప్పుడూ తాను పరమాత్మనని ప్రకటించుకోలేదు. పదహారణాల మనిషిననే చెప్పుకున్నాడు. రాముడికి పదవీకాంక్ష లేదు. ‘ఇంద్రపదవి అయినా సరే. అయాచితంగా వస్తే  నాకొద్దు’ అంటాడు. రావణ సంహారం తర్వాత.. లంకాధిపతి హోదాలో విభీషణుడు అపార సంపదల్ని సమర్పించినా, రాముడు తిరస్కరించాడు. వాటిని వానర, భల్లూకాలకు పంచేయమని చెప్పాడు. ఉత్తమ నాయకుడు ఏకపక్షంగా వ్యవహరించడు. యుద్ధ సమయంలో విభీషణుడు ఆశ్రయం అడిగినప్పుడు కూడా, అనుచరుల అభిప్రాయం తీసుకున్నాకే  ఆమోదం తెలిపాడు రామచంద్రుడు. ఏ దశలోనూ తను ‘రివెంజ్‌ పాలిటిక్స్‌’ను ప్రోత్సహించలేదు. ‘యుద్ధం యోధులతోనే. సామాన్య ప్రజలు మనకు శత్రువులు కాదు’ అని స్పష్టం చేశాడు. కాబట్టే, శ్రీరాముడిని ‘విచక్షణుడు’ అని కొనియాడాడు ఆదికవి. ఆ విచక్షణా గుణమే.. నాయకులలో ఉత్తమ నాయకుడిగా, యోధులలో మహాయోధుడిగా, పాలకులలో అత్యుత్తమ పాలకుడిగా రామ సార్వభౌముడికి పట్టాభిషేకం చేసింది. ప్రస్తుతం   ప్రపంచానికి కావలసింది ఇలాంటి నాయకత్వమే.

పదితలల ప్రత్యర్థి

కొందరికి అపారమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. జనాన్ని ఉర్రూతలూగించే వాక్పటిమ ఉంటుంది. చట్టాల గురించి లోతైన అవగాహనా ఉంటుంది. ఎన్ని మంచి లక్షణాలున్నా.. కించిత్‌ అసురగుణం తోడైతే పాలగిన్నెలో విషపు చుక్క విదిలించినట్టే. అలాంటి వ్యక్తి ప్రమాదకారి అవుతాడు. వ్యవస్థను మింగేస్తాడు. ఖజానాను ఖాళీ చేస్తాడు. రావణుడు కూడా ఇలాంటి ప్రతినాయకుడే! దశకంఠుడి రూపవర్ణన చేస్తూ ‘అతను మృత్యువులా ఉంటాడు. అతని సమక్షంలో వీచేందుకు వాయువు కూడా భయపడుతుంది. అతణ్ని చూడగానే సముద్రం సైతం నిశ్చలం అవుతుంది’ అంటాడు వాల్మీకి మహర్షి. అదీ అసుర బలం. అప్పటి వరకూ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేతలు కూడా స్వయంకృతాల కారణంగా పతనం వైపు పయనిస్తారు. సీతాపహరణం అలాంటి ఘట్టమే. బ్రహ్మ వంశంలో పుట్టినా, బ్రహ్మాండాన్ని జయించినా.. చివరికి మానవమాత్రుడైన రాముడి చేతిలో మరణం అనివార్యమైంది. ఓటమిని తప్పించుకోడానికి చివరి నిమిషం వరకూ ప్రయత్నించాడు. మాయలు చేశాడు. కుట్రలు పన్నాడు. విభజించి పాలించాలని చూశాడు. ఎన్నికల వ్యవస్థలో.. నైతిక విలువల్లేని నాయకుడు ఏమేం చేస్తాడో, అన్నీ చేశాడు. అయినా పతనం ఆగలేదు. పదితలలూ తెగిపోక తప్పలేదు. అవినీతి, అధికార దుర్వినియోగం, ప్రకృతివనరుల దోపిడి, రక్తపు మరకల రాజకీయాలు.. రావణాంశ సంభూతుల లక్షణాలు.

‘డీప్‌ఫేక్‌’ కుట్రలు

కనిపించేది నిజం కాదు. వినిపించేదీ నిజం కాదు. ఆ దృశ్యం వెనుక అనేక అదృశ్య శక్తులు. వ్యక్తిత్వ హననం నుంచి లైంగిక వేధింపుల వరకు.. డీప్‌ఫేక్‌ లక్ష్యం ఏదైనా కావచ్చు. అందులోనూ, ఎన్నికల వేళ ఈ వికృత కళ వేయి పడగల విషనాగులా బుసలు కొడుతుంది. దీని తోబుట్టువు ఫేక్‌ న్యూస్‌. అక్షరాన్ని హాలాహలంలో ముంచి తీసే కథనాలివి. ఈ తరహా అనైతిక ప్రచారాలూ, అబద్ధపు అవతారాలూ రామాయణ కాలంలోనూ ఉన్నాయి. అందులోనూ, మారీచుడు కామరూప విద్యలో ఆరితేరినవాడు. అవసరాన్ని బట్టి అతని రూపం మారేది. బంగారు జింకలా మరులు గొలిపి సీతాపహరణంలో రావణుడికి సహకరించాడు. నేలకూలుతూ కూడా ‘హే సీతా, తమ్ముడూ లక్ష్మణా’ అంటూ శ్రీరాముడి గొంతుకను అనుకరించాడు. ఫేక్‌ వాయిస్‌తో బోల్తాకొట్టించాడు. ఎన్నికల సీజన్‌లో మారీచ సంతతిదే సందడి. లేనిది ఉన్నట్టూ, ఉన్నది లేనట్టూ, చెప్పింది చెప్పనట్టూ, చెప్పంది చెప్పినట్టూ భ్రమింపజేస్తారు. విద్వేషాలు వెదజల్లుతారు. యుద్ధ సమయంలో రావణాసురుడు ఇలాంటి ‘డీప్‌ ఫేక్‌’ కుట్రలు చాలానే పన్నాడు. విద్యుత్‌ జిహ్వుడనే మాయగాడి సాయంతో రాముడి కృత్రిమ శిరస్సును సృష్టించాడు. దాన్ని తీసుకెళ్లి.. సీత ముందుంచాడు. భర్త ఎటూ యుద్ధంలో మరణించాడ[ు కాబట్టి, తనకు లొంగిపోతే సకల సౌఖ్యాలూ సమకూరుస్తానని ఊరించాడు. సీతమ్మ ఆ నక్కజిత్తులను నమ్మలేదు. ఛీ పొమ్మంది. ఇంద్రజిత్తు తండ్రిని మించిన జిత్తులమారి. సైబర్‌ అటాక్స్‌ను తలపించే అదృశ్య దాడులలో సిద్ధహస్తుడు. ఎన్ని కుట్రలు పన్నినా.. అబద్ధం బద్దలైంది. అసత్యం అంతమైంది. ఏ యుగంలో అయినా, నిజానిదే అంతిమ విజయం.

కార్యకర్తలే సర్వస్వం

నాయకుడికి కార్యకర్తలే బలమూ బలగమూ. ఎన్నికల సంగ్రామంలో తెగించి పోరాడేదీ, పట్టుదలతో ప్రత్యర్థిని మట్టికరిపించేదీ ఆ అనుచరగణమే. రామకార్యమే ప్రథమ కర్తవ్యంగా భావించిన.. హనుమ, జాంబవంత, సుగ్రీవాదులు రామాయణంలో అత్యుత్తమ కార్యకర్తలుగా, అలుపెరుగని కార్యసాధకులుగా పేరుతెచ్చుకున్నారు. నిజానికి, ఆ సమయానికి.. రాముడికి అధికారం లేదు. అంగబలం లేదు. అర్థబలం లేదు. అయినా సరే.. రాముడి నాయకత్వాన్ని ఆమోదించారు. రాముడి ఆదేశాన్ని శిరసావహించారు. సీతమ్మను అపహరించుకుని వెళ్తున్న రావణుడిని నిలువరించే ప్రయత్నంలో జటాయువు ప్రాణాలు కోల్పోయింది. శ్రీరాముడి పలకరింపు కోసం జీవితకాలం ఎదురుచూసింది శబరి. నాయకుడిని తన నావలో ఒడ్డుకు చేర్చిన మహదానందం గుహుడిది. హనుమంతుడు.. దాసగుణానికి ప్రతీక, ధీశాలి, వివేకి. కాబట్టే, ‘అమేయాత్మా’ అని కొనియాడాడు వాల్మీకి మహర్షి. నిజానికి, రాముడితో పోలిస్తే రావణుడి బలగమే పెద్దది. కానీ, అందులో చాలామందికి అధినాయకుడి పట్ల
నమ్మకం లేదు. అతను ఎంచుకున్న విధానం పట్ల విశ్వాసం లేదు. సీతను అపహరించడాన్ని తీవ్రంగా గర్హించారు. దీంతో, రామరావణ సంగ్రామంలో త్రికరణ శుద్ధిగా పోరాడలేక పోయారు.    

క్యాంప్‌ ఆఫీస్‌ పాలిటిక్స్‌

అసెంబ్లీ లాబీ రాజకీయాల్నీ, పార్టీ ఆఫీసు మంత్రాంగాల్నీ సులభంగానే ఊహించవచ్చు. కానీ, ముఖ్యనేతల క్యాంప్‌ ఆఫీసులో.. నాలుగు గోడల మధ్య జరిగే పరిణామాల్ని ఓ పట్టాన అంచనా వేయలేం. రాజ కుటుంబాల తీరే వేరు. అధినాయకుడి కూతురిదో దారి, అల్లుడిదో వ్యూహం. తనయుడి లెక్కలు తనయుడివి. కోడలి పంతాలు కోడలివి. అయోధ్యపురిలోని దశరథుడి రాజప్రాసాదంలోనూ రకరకాల మనుషులు, అనేకానేక మనస్తత్వాలు. పేరుకు సార్వభౌముడే అయినా.. దశరథుడు బలహీనుడు. వయోధికుడు. ముగ్గురు రాణులున్నా, కైకేయిదే పెత్తనం. జనప్రియుడైన రాముడికి పట్టాభిషేకం చేయాలనేది దశరథుడి ఆలోచన. కాదు కాదు, తన బిడ్డ భరతుడినే పీఠం ఎక్కించాలని కైకేయి పంతం. దాసి మంథర ఆమెలో విద్వేషాన్ని ఎగదోసింది. పాత వరాల సంగతి గుర్తుచేసింది. ఆ అంతర్గత కుట్రను లక్ష్మణ, శత్రుఘ్నులు ఖండించారు. రాముడి పక్షానే నిలబడ్డారు. అవసరమైతే తిరుగుబాటు చేసి సింహాసనాన్ని ఆక్రమించుకోమని సూచించాడు లక్ష్మణుడు. తనను బంధించి రాజ్యాన్ని ఏలుకోమని సాక్షాత్తు దశరథుడే సలహా ఇచ్చాడు. కానీ రాముడు ఎవరి మాటా వినలేదు. పుత్ర ధర్మాన్ని పాటించాడు. పితృవాక్యాన్ని పాలించాడు. భర్త నిర్ణయమే తనకు వేదవాక్కు అని స్పష్టం చేసింది సీతాదేవి. ప్రవాసం నుంచి వచ్చీరాగానే భరతుడూ భగ్గుమన్నాడు. కైకేయిపై కయ్యిమంటూ లేచాడు. చిన్నరాణి, పెద్దదాసి మినహా.. అంతఃపురమంతా రాముడికి అండగా నిలిచింది. అయినా, సీతాలక్ష్మణ సమేతుడై అడవుల బాట పట్టాడు దాశరథి. నాయకుడికి బంధుగణమే సగం బలం. అతని ఎదుగుదలకు కుటుంబమే పునాది. కానీ, అయినవారి ధనదాహం వల్ల అధికారాన్ని కోల్పోయి, అవినీతి ఊబిలో చిక్కుకుపోయిన నేతలు ఎంతోమంది.

ఫిరాయింపులు

‘పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడినై’, ‘అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడంతో’.. ఫిరాయింపు నేతల పత్రికా ప్రకటనలలో కనిపించే పదజాలం వేరు, తెర వెనుక నిజాలు వేరు. పదవులు, కాంట్రాక్టులు, పాతకేసులు, సూట్‌కేసులు.. ప్రలోభానికి కారణం ఏమైనా కావచ్చు. రామ-రావణ యుద్ధం లోనూ ఫిరాయింపుల ఘట్టం ఉంది. రావణుడి సోదరుడైన విభీషణుడు అన్నను కాదని, శ్రీరాముడి శిబిరంలో చేరడం ఓ కీలక మలుపు. అంతరాత్మ ప్రబోధమే ఆ ఫిరాయింపునకు కారణం. ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. సీతమ్మను రాముడికి అప్పగించు. రామచంద్రుడిని శరణువేడు’ అని విభీషణుడు బతిమాలాడు. బుజ్జగించాడు. అయినా, రావణుడు వినలేదు. పైపెచ్చు తమ్ముడిని తూలనాడాడు. తీవ్రంగా అవమానించాడు. అన్నలో మార్పు అసాధ్యమని అర్థమై పోయింది. విధిలేని పరిస్థితుల్లో తన అనుంగు అనుచరులతో కలిసి వెళ్లి శ్రీరాముడిని ఆశ్రయించాడు విభీషణుడు.

ఎన్నికల ఫిరాయింపులతో పార్టీలకు లాభం జరిగినా, జరగకపోయినా.. చిన్నాచితకా లీడర్లు మాత్రం బాగుపడతారు. కానీ, ఇక్కడ మాత్రం.. విభీషణుడి చేరికతో శ్రీరామ సైన్యానికి సరికొత్త బలం వచ్చింది. అతను రాజకుటుంబీకుడు. అంతఃపుర బలాలూ, బలహీనతలూ తెలిసినవాడు. ఇంద్రజిత్‌ దివ్యాస్త్రాల ప్రభావానికి రామలక్ష్మణులు మూర్ఛపోయినప్పుడు, వానరసేనకు ధైర్యం నూరిపోసింది విభీషణుడే. అంతెత్తు కుంభకర్ణుడిని చూసి రామదండు పారిపోతున్నప్పుడు.. అదొక మరయంత్ర మంటూ అవసరార్థ అబద్ధం చెప్పి వాతావరణాన్ని తేలికపరిచిందీ విభీషణుడే.  ఇంద్రజిత్తును లక్ష్మణదేవుడు చిత్తుగా ఓడించింది కూడా విభీషణుడి సలహాతోనే. రావణుడి ప్రాణ రహస్యాన్నీ తానే బట్టబయలు చేశాడు. అన్నను కాదనుకుని మరీ రామన్న బృందంలో చేరినందుకు విభీషణుడు చరితార్థుడయ్యాడు. రావణ సంహారం తర్వాత లంకాధిపతి హోదా దక్కింది. రావణుడి భార్య మండోదరి, సోదరుడు కుంభకర్ణుడు.. ఇద్దరూ రావణుడి చర్యలను తప్పుపట్టినా, శిబిరం మారేంత ధైర్యం చేయలేదు. కుబేరుడు నేరుగా పార్టీ మారలేదు కానీ, నేటి అసమ్మతి నేతల్లా సీతమ్మను విడిచిపెట్టమంటూ రావణుడికి లేఖాస్త్రం సంధించాడు.

రామదండులో సుగ్రీవుడి పాత్ర కీలకం. అతనిని కనుక తప్పిస్తే.. ప్రత్యర్థి బలహీనపడటం ఖాయమని భావించాడు రావణుడు. ఇదీ సమకాలీన రాజకీయాలను తలపించే పన్నాగమే. కొన్నిసార్లు ‘ఆ పార్టీలోనే ఉండిపో. కానీ ప్రచారానికి రావొద్దు. జనాన్ని ఓట్లు అడగొద్దు. మిగతా విషయాలు నేను చూసుకుంటా’ అంటూ ఎంతోకొంత బలమైన నేతలతో బేరాలు చేసే  అగ్రనాయకులూ ఉన్నారు. అచ్చంగా అలాంటి పన్నాగంతోనే రావణాసురుడు యుద్ధ సమయంలో శుకాసురుడు అనే రాక్షసుడిని సుగ్రీవుని విడిదికి పంపాడు. రావణునికి, వాలితో ఉన్న స్నేహాన్ని దృష్టిలో ఉంచుకుని.. కాడి వదిలేసి కిష్కింధకు తిరిగి వెళ్లిపోవాలని రావణుని మాటగా చెప్పాడు శుకాసురుడు.

ఆ ప్రతిపాదనకు గట్టిగానే జవాబిచ్చాడు సుగ్రీవుడు. ఫక్తు రాజకీయ నాయకుడిలా రావణుడు దొంగచాటు వ్యవహారాలనూ ప్రోత్సహించాడు. శుక-సారణులనే మంత్రులకు ఆ రహస్య బాధ్యత అప్పగించాడు. శ్రీరాముడి సైన్యంలో కలిసిపోయి.. అక్కడ జరిగే ప్రతి విషయాన్నీ తనకు పూసగుచ్చినట్టు నివేదించమని ఆదేశించాడు. అది చాలదన్నట్టు శార్దూలుడనే గూఢచారినీ పురమాయించాడు. అయినా, ధర్మమే నిలిచింది, గెలిచింది.   

      *           *           *

యథా ప్రజ.. తథా రాజ. ప్రజల్ని బట్టే పాలకుడి నిర్ణయాలు ఉంటాయి. జనం స్వల్పకాలిక ప్రయోజనాల్ని ఆశించేవారో, తాత్కాలిక ఆనందాల్ని కోరుకునేవారో అయితే.. పాలకుడు కూడా ముందుచూపు లేని విధానాలతో కాలం వెళ్లదీస్తాడు.

వరాల ఎర వేస్తూ జనాన్ని బద్ధకస్తులుగా తయారు చేస్తాడు. రాముడు అరణ్యవాసానికి బయల్దేరుతున్న సమయంలో వేలాది పౌరులు ఆయన వెనకాలే నడిచారు. రాముడి కష్టాన్ని తమ కష్టంగా భావించారు. యువరాజుకు మద్దతు తెలపడం తమ బాధ్యత అనుకున్నారు. అలా అని, పౌరులుగా తమ హక్కులను మరిచిపోలేదు. పాలకుల్ని ప్రశ్నించడం మానలేదు.
‘రాజా కాలస్య కారణం’ అంటుంది శాస్త్రం. తన ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా.. రాజ్యంలో జరిగే ప్రతి సంఘటనకూ పాలకుడే బాధ్యత వహించాలి. తన పుత్రుడి అకాల మరణానికి అయోధ్యాపతి రాముడిదే బాధ్యత అంటూ ఓ పౌరుడు రాజసౌధం ముందు నిరసనకు దిగిన సంఘటన రామాయణంలో ఉంది. సార్వభౌముడు కూడా ఆ ఫిర్యాదుకు శీఘ్రంగా స్పందించాడు. సమస్య మూలాల్ని తెలుసుకుని, పరిష్కారం అందించాడు. ఉత్తమ పౌరులు.. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నిస్తారు. నిలదీయాల్సిన సమయంలో నిలదీస్తారు. గెలిపించాల్సిన సమయంలో గెలిపిస్తారు.
రామరాజ్యం అంటే.. పాలకుడైన రాముడే కాదు. పాలితులైన అయోధ్య ప్రజలు కూడా.

పాజిటివ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌

ప్రతి యుగంలో సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులు కొందరు ఉంటారు. ఆ ప్రభావశీల సమూహాల్ని నేటి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో పోల్చవచ్చు. రామరాజ్యంలో ఆ కీలక బాధ్యత విశ్వామిత్రాది మహర్షులదే. వాళ్లంతా అటు పాలకులకూ, ఇటు పాలితులకూ పెద్ద దిక్కుగా నిలిచారు. కరవుకాటకాల సమయంలో ప్రకృతి కటాక్షం కోసం యజ్ఞ యాగాదులు చేయించారు. మొత్తంగా మహర్షి వాణి పౌరుల ఆలోచనలనూ, అభిప్రాయాలనూ తీర్చిదిద్దేది. సమాజాన్ని మంచి వైపు నడిపించేది. ఇక్ష్వాకు కుల గురువుగా వసిష్ఠ మహర్షి శ్రీరాముడి వ్యక్తిత్వానికి ఓ రూపం ఇచ్చాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దివ్యాస్త్రాలు అందించాడు. రామరావణ యుద్ధ సమయంలో.. ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించి రాముడికి మనోబలాన్ని ప్రసాదించాడు అగస్త్యుడు. ఆదికావ్యాన్ని జనంలోకి తీసుకెళ్లి కొడుకుగా, భర్తగా, సోదరుడిగా, నాయకుడిగా.. మనిషన్నవాడు ఎలా ఉండాలో సోదాహరణంగా వివరించాడు వాల్మీకి. రుషుల ఆశ్రమాలు విలువల విశ్వవిద్యాలయాలుగా విరాజిల్లాయి. ఆ రోజుల్లో ధర్మం మూడుపాదాలా నడిచిందంటే.. అదంతా ప్రభావశీలురైన రుషుల చలవే. కానీ, నేటి సామాజిక మాధ్యమాల ఇన్‌ఫ్లుయెన్సర్లు ఫక్తు మాటల వ్యాపారులుగా మారిపోతున్నారు. మార్కెట్‌కు అనుగుణంగా స్వరాలు మారుస్తున్నారు.

అధికారం తలకెక్కితే..

హుషుడు గొప్ప చక్రవర్తి. తపోబలంతో ఇంద్రపదవిని దక్కించుకుంటాడు. ఆ అధికార గర్వంతో దేవేంద్రుడి సతీమణి శచీదేవిపై మనసు పడతాడు. ఆ మదానికితోడు అహం. మహర్షులతో తన రథాన్ని లాగించుకుంటాడు. మరింత వేగంగా వెళ్లమంటూ అగస్త్య మహామునిని కాలితో తంతాడు. దీంతో అగస్త్యుడికి కోపం వస్తుంది. ‘మహాసర్పంగా మారిపో’ అని తీవ్రంగా శపిస్తాడు. దీంతో నహుషుడి పదవి పోతుంది. అధికారమూ అంతమవుతుంది. దుందుభి అనే అసురుడి కథా ఇలాంటిదే. వేయి ఏనుగుల బలం తనది. సముుద్రుడి ముందు నిలబడి తొడగొడతాడు. తనకు పోరాడే శక్తి లేదనీ, చేతనైతే హిమాలయాలతో తలబడమనీ రెచ్చగొడతాడు సముద్రుడు. హిమాలయాలూ చేతులెత్తేస్తాయి. దమ్ముంటే వాలిని గెలవమని సూచిస్తాయి. దీంతో నేరుగా వాలి ముందు వాలిపోతాడు. మహాబలవంతుడైన వాలి ఆ అసురుడిని చిత్తుచిత్తుగా ఓడిస్తాడు. ఈ రెండు కథలూ రామాయణంలోనివే. అహానికి అంతం తప్పదనే సంకేతాలే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..