పర్యటకుల స్వర్గధామం... బర్మింగ్‌హామ్‌

‘ప్రకృతిలోని అందాలూ పచ్చదనంలోని ఆహ్లాదం; సృజనను రేకెత్తించే కళలూ జిజ్ఞాసను రేకెత్తించే విజ్ఞానం... వీటన్నింటి సమాహారమే బర్మింగ్‌హామ్‌.

Updated : 22 Jan 2023 03:43 IST

పర్యటకుల స్వర్గధామం... బర్మింగ్‌హామ్‌

‘ప్రకృతిలోని అందాలూ పచ్చదనంలోని ఆహ్లాదం; సృజనను రేకెత్తించే కళలూ జిజ్ఞాసను రేకెత్తించే విజ్ఞానం... వీటన్నింటి సమాహారమే బర్మింగ్‌హామ్‌. బ్రిటన్‌లో రెండో పెద్ద నగరమైన ఈ ప్రదేశం, పర్యటకుల పాలిట నిజంగా స్వర్గధామమే’ అంటూ గతేడాది జరిగిన కామన్వెల్త్‌ క్రీడల సందర్భంగా ఈ నగరాన్ని సందర్శించి, అక్కడి విశేషాలను చెబుతున్నారు హైదరాబాద్‌కు చెందిన వరికుప్పల రమేష్‌.

బ్రిటన్‌లోని వెస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌లో ఉందీ నగరం. ఇది రాతియుగం నాటికే ఉందనీ అప్పట్లో బియోర్మా అనే గిరిజన తెగ నివసించడంతో దీన్ని బియోర్మింగహామ్‌ అనేవారనీ, అదే బర్మింగ్‌హామ్‌గా మారిందనీ అంటారు. అయితే దీన్ని యూరప్‌లోనేయంగెస్ట్‌ సిటీగా పిలుస్తున్నారిప్పుడు. ఎందుకంటే జనాభాలో నలభైశాతం పాతికేళ్లలోపువారే.

విమానం దిగి ట్యాక్సీలో మేం బస చేసిన రూమ్‌కి వెళుతుంటే... చిత్రమైన అనుభూతి. సంప్రదాయ భవంతులూ అత్యాధునిక నిర్మాణాలతో పాతకొత్తల మేలుకలయికగా కళకళలాడుతోంది బర్మింగ్‌హామ్‌. నగరంలో రోజూ పండుగ వాతావరణమే కనిపిస్తుందట. ఏడాదికి యాభై సాంస్కృతిక వేడుకలయినా జరుగుతాయి... అదీ ఎంతో ఘనంగా. అందుకే వీధులన్నీ విద్యుద్దీప కాంతులతో మెరిసిపోతున్నాయి. ఇక, పార్కులూ రెస్టరంట్లూ థియేటర్లూ మ్యూజియంలూ ఆర్ట్‌ గ్యాలరీలూ షాపింగ్‌ కాంప్లెక్సులకయితే లెక్కేలేదు. విక్టోరియా కాలంలో ఈ నగరాన్ని ‘సిటీ ఆఫ్‌ థౌజండ్‌ ట్రేడ్స్‌’ అనీ ‘వర్క్‌షాప్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ అనీ పిలిచేవారట.

విక్టోరియా కూడలి!

బర్మింగ్‌హామ్‌లో క్రిస్మస్‌ సందడినీ, న్యూ ఇయర్‌ వేడుకల్నీ చూసి తీరాల్సిందేనట. ఆ సమయంలో నగరం మరింత శోభాయమానంగా వెలిగిపోతుంటుంది. విక్టోరియా స్క్వేర్‌ దగ్గర పెట్టే ఫ్రాంక్‌ఫర్ట్‌ క్రిస్మస్‌ మార్కెట్‌ను చూడ్డానికి రెండు కళ్లూ చాలవని చెబుతుంటారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో తయారైనవన్నీ తీసుకొచ్చి అమ్మడంవల్లే దీన్ని ఆ పేరుతో పిలుస్తారు. ఆరుబయట పెట్టే దుకాణాల్లో క్రిస్మస్‌కు సంబంధించిన వస్తువులూ బొమ్మలూ నగలూ శాంటాక్లాజ్‌ తెచ్చే బహుమతులతో కళకళలాడుతుందీ మార్కెట్‌.

అందుకే ముందుగా విక్టోరియా స్క్వేర్‌ను చూద్దామని నడుచుకుంటూ వెళ్లాం. దీన్నే ‘సోషల్‌ హార్ట్‌ ఆఫ్‌ ద బర్మింగ్‌హామ్‌’ అని పిలుస్తారు. ఇక్కడ ఆటోలూ కార్లూ నిషిద్ధం. నగరం మధ్యలో ఉన్న ఈ కూడలిలో భవంతులూ ఫౌంటెయిన్లూ విగ్రహాల్ని చూస్తుంటే కాలమే తెలియలేదు. బుల్‌ రింగ్‌, బ్రిండ్లే ప్లేస్‌ ప్రాంతాల మధ్యలో ఉంటుందీ స్క్వేర్‌. ఇక్కడ ఉన్న కౌన్సిల్‌ హౌస్‌ కారణంగా దీన్ని మొదట్లో ఆ పేరుతోనే పిలిచేవారట. విక్టోరియా మరణానంతరం ఆమె పేరు పెట్టారట. పాలరాతితో చెక్కి ఆపై కంచు పోత పోసిన విక్టోరియా విగ్రహం కళ్లను కట్టిపడేస్తుంది. భారత్‌కు చెందిన ధ్రువ్‌ మిస్త్రీ అనే కళాకారుడు చెక్కిన నీళ్ల మధ్యలో ఉన్న అమ్మాయి బొమ్మా(ద రివర్‌), ఐరన్‌ మ్యాన్‌ అని మరో విగ్రహమూ సందర్శకుల్ని ఆకట్టుకుంటాయి. కామన్వెల్త్‌ క్రీడల ముగింపు సందర్భంగా ఈ ప్రదేశంలోనే నిర్వహించిన మారథాన్‌ కన్నులపండువగా సాగింది. ఇక్కడ జరిగే లైవ్‌ మ్యూజిక్‌ ప్రోగామ్స్‌కోసం జనం క్యూ కడుతుంటారు. బర్మింగ్‌హామ్‌ వాసులకి కళలంటే తగని మక్కువ.

పచ్చని లోగిలి

ఇక్కడకు సమీపంలోనే ఉన్న మ్యూజియం అండ్‌ ఆర్ట్‌ గ్యాలరీలో మూడువేలకు పైగా కళాఖండాలు ఉన్నాయి. స్థానిక కళాకారులతోపాటు అంతర్జాతీయంగా పేరొందిన కళాకారుల చిత్రాలెన్నో కళ్లకు విందు చేస్తాయి. వీటిల్లో ఎక్కువగా పందొమ్మిదో శతాబ్దానికి చెందినవే. తరవాత ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, సింఫనీ హాల్‌ నిర్మాణాలు చూడ్డానికి వెళ్లాం. వీటన్నింటినీ నడుచుకుంటూనే వెళ్లి చూడొచ్చు. తరవాత యూరప్‌లోకెల్లా పొడవైన అర్బన్‌ పార్కుని చూశాం. ఇది ఎంతో ఆహ్లాదంగా ఉంది. బ్రిటన్‌లోకెల్లా పచ్చని ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ నగరంలో ఎనిమిది వేలకు పైగా ఎకరాల్లో ఆరు వందలకు పైగా పార్కులూ తోటలూ ఉన్నాయట. వాటిల్లో సగం చూడాలన్నా కనీసం ఓ నెలరోజులైనా అక్కడ ఉండాల్సిందే. అక్కడి సటన్‌ పార్కు పెద్ద చెట్లూ నదులూ కొండలతో ఓ పెద్ద అడవినే మరపిస్తుంది. కామన్వెల్త్‌ క్రీడల్లోని కొన్ని అథ్లెటిక్‌ పోటీలు ఇక్కడే జరగడంతో ఈ పార్కులో కొంతవరకూ చూడగలిగాం.

ఈ నగరాన్ని సందర్శించినవాళ్లెవరైనా జ్యుయెలరీ క్వార్టర్‌ను చూడకుండా వెనుతిరగరు. బ్రిటన్‌లోని ఆభరణాల్లో నలభై శాతం ఈ బజారులోనే తయారవుతాయట. 800కి పైగా దుకాణాలు ఉన్నాయి. బంగారం, వజ్రాలు, ముత్యాలు... వంటి వాటితో చేసిన అక్కడి నగల్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఇక్కడ దొరికే మెటల్‌ జ్యుయెలరీ మరెక్కడా దొరకదట. బ్రిటన్‌లో ఒకప్పుడు ప్రముఖ నగల బ్రాండ్‌గా పేరొందిన స్మిత్‌ అండ్‌ పెప్పర్‌ కంపెనీకి చెందిన కుటుంబం నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చారు. అందులో నాటి వర్క్‌షాపు నేటికీ ఉంది. ఇక్కడే ఉన్న ఛాంబర్‌లెయిన్‌ క్లాక్‌ ఈ వీధికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనికి ఉత్తర దిశగానే ఉంటుంది గన్‌ క్వార్టర్‌. ఒకప్పుడు బ్రిటన్‌లోకెల్లా అత్యధికంగా తుపాకులు ఇక్కడే తయారయ్యేవట. ఇవన్నీ చూసుకుంటూ ‘సెయింట్‌ చాడ్స్‌ కేథలిక్‌ కేథడ్రల్‌’ చూద్దామని వెళ్లాం. 1841లో నిర్మించిన ఈ చర్చి నాటి బ్రిటన్‌ సంస్కృతికి అద్దం పడుతోంది. చర్చిగోడలకున్న స్టెయిన్డ్‌ గ్లాస్‌ ఆర్ట్‌తో చేసిన కిటికీలు కళ్లు తిప్పుకోనీయవు. తరవాత సెంటినరీ స్క్వేర్‌ దగ్గర బర్మింగ్‌హామ్‌ లైబ్రరీని చూశాం.

క్యాడ్‌బరీ ప్రపంచం!

మరో రోజు నగరానికి దక్షిణంగా ఉన్న క్యాడ్‌బరీ వరల్డ్‌లోకి వెళ్లాం. అక్కడ చాక్లెట్‌ చరిత్ర, తయారీతోపాటు క్యాడ్‌బరీ కంపెనీ గురించిన విషయాలెన్నో తెలుసుకోవచ్చు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్యాడ్‌బరీ షాప్‌ ఇక్కడే ఉంది. రకరకాల చాక్లెట్లతోపాటు స్పెషల్‌ ఆఫర్లూ ఇస్తున్నారు. కస్టమైజ్‌డ్‌ చాక్లెట్లు కూడా చేసి ఇస్తారట. చాక్లెట్‌తో చేసిన టీపాట్‌, షూ, ఫుట్‌బాల్‌... ఇలా రకరకాల చాక్లెట్‌ వస్తువులు చేస్తారు. అక్కడున్న మినీ థియేటర్‌లో ఐరోపాలోకి చాక్లెట్‌ ఎలా అడుగుపెట్టిందనే విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. క్యాడ్‌బరీ ఎక్కడ, ఎలా మొదలైందీ, వెయ్యేళ్లక్రితం మెక్సికోలోని అజ్‌టెక్‌లు కోకో చెట్లను గుర్తించిన వైనం... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.

షాపింగ్‌ షాపింగ్‌...

సాంస్కృతిక వేడుకలతోపాటు షాపింగ్‌కు కూడా ఇది చిరునామాగా పేరొందింది. బుల్‌రింగ్‌ అండ్‌ గ్రాండ్‌ సెంట్రల్‌, ద మెయిల్‌ బాక్స్‌, ఐసీసీ మాల్‌... వంటి వాటిల్లో వందలకొద్దీ దుకాణాలు ఉంటాయి. ఏ షాపులోకి వెళ్లాలో ఓ పట్టాన అర్థం కాదు. బుల్‌రింగ్‌ దగ్గర పెట్టిన ఆరుబయట దుకాణాల్లోనూ కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఇవి పన్నెండో శతాబ్దం నుంచీ ఉన్నాయట. యూరప్‌లోని అతిపెద్ద షాపింగ్‌ సెంటర్లలో బుల్‌రింగ్‌ ఒకటి. ఇక్కడి ఎద్దు విగ్రహాన్ని చూడ్డానికైనా చాలామంది రోజూ ఈ ప్రాంతానికొస్తారు. మధ్యాహ్నం పన్నెండింటికి ఈ ఎద్దు కదులుతుంది.మరోరోజు ర్యాగ్‌ మార్కెట్‌కు వెళ్లాం.వీధి పొడవునా రకరకాల వస్తువులతో కనిపించే ఈ మార్కెట్‌ నుంచి బయటకు రావడం కష్టంగానే అనిపించింది.

వెనిస్‌ కన్నా ఎక్కువగా!

అందరూ వెనిస్‌లోనే కాలువలు ఎక్కువనుకుంటారుగానీ బర్మింగ్‌హామ్‌లో అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. కాలువలకు పక్కనే ఉన్న రోడ్లూ వాటిమీదుగా కట్టిన వంతెనల మీదుగా తిరుగుతూ నగరాన్ని సందర్శించడం గమ్మత్తైన అనుభూతిని కలిగించింది. సిటీ కెనాల్‌ టూర్స్‌ కూడా ఉంటాయి. సన్నగా పొడవుగా ఉండే పడవల్లో కూర్చుని నగరమంతా తిరిగి రావచ్చు. సిటీలో అడుగుపెట్టాక బస్సులూ ట్రామ్‌ల ద్వారానూ సందర్శించవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లకి బైకులూ సైకిళ్లూ కూడా అద్దెకు దొరుకుతాయి. కారు రేసింగులకీ ఈ నగరం పెట్టింది పేరు. 1986-90 మధ్యలో నగర వీధుల్లోనే రేసులు ఎక్కువగా జరిగేవట. ఇప్పటికీ రాత్రిపూట వీధుల్లో రేసర్లు దూసుకుపోతూనే ఉంటారు.

కళల కాణాచి...

బర్మింగ్‌హామ్‌లో కళామతల్లి కోట కట్టుకుని కూర్చుందా అనిపిస్తుంది కొత్తవాళ్లకు. ఇక్కడ ఉన్నన్ని మ్యూజియంలూ గ్యాలరీలూ మరెక్కడా ఉండవు మరి. చిత్రకళ, వాస్తుశిల్పరీతుల్లో వీళ్లకు వీళ్లే సాటి. ఏడాదిపొడవునా థియేటర్లలో నాటకాలు నడుస్తూనే ఉంటాయి. మ్యూజిక్‌ ఫెస్టివల్స్‌ జరుగుతూనే ఉంటాయి. ద స్ట్రీట్స్‌, యూబీ40, ద మూడీ బ్లూస్‌, ఓషన్‌ కలర్‌సీన్‌, మిడ్‌నైట్‌ రన్నర్స్‌... వంటి ప్రముఖ బ్యాండ్స్‌ ఇక్కడే ఉన్నాయి. పిల్లలకు చిన్నప్పటినుంచే వాళ్లకిష్టమైన కళల్ని స్కూల్లోనే నేర్పిస్తుంటారు. యూనివర్సిటీల్లోనూ కోర్సులు చాలానే ఉన్నాయి. అందుకే ఈ నగరం కళాకారులకు నిలయం.

కామన్వెల్త్‌ క్రీడలకు...

ఫుట్‌బాల్‌ అంటే ఎంత ఇష్టమున్నా రగ్బీ, గోల్ఫ్‌, క్రికెట్‌, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌తోపాటు అథ్లెటిక్స్‌లోనూ ప్రతిభావంతులైన క్రీడాకారులెందరినో తయారుచేసిందీ నగరం. గతేడాది ఇక్కడ జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో 72 దేశాలు పాల్గొన్నాయి. 13 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇక్కడ మహిళలకోసం ఎక్కువ ఈవెంట్స్‌ జరిగాయి. ఆటలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల్నీ భారీగా నిర్వహించింది. పదకొండు రోజులపాటు జరిగిన గేమ్స్‌లో ఇరవై క్రీడలకోసం మనదేశానికి చెందిన 210 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. మొత్తంగా అరవయ్యొక్క పతకాలు సాధించి దేశాన్ని నాలుగో స్థానంలో నిలిపి మన జెండాను సగర్వంగా ఎగరేశారు.

బర్మింగ్‌హామ్‌లో భారతీయ వంటకాల్ని మిస్సవుతాం అన్న ఫీల్‌ కలగదు. గాయని ఆశాభోంస్లేకు చెందిన ఆశాస్‌, ఇండియన్‌ కేఫ్‌ కార్నర్‌, వైస్రాయ్‌ తందూరీ, ఇండియన్‌ స్ట్రీటరీ, స్వీట్‌ చిల్లీస్‌... వంటి చోట్ల చపాతీ దగ్గర్నుంచి దమ్‌ బిర్యానీ వరకూ అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే ఈ నగరంలో నివసించే భారతీయుల సంఖ్య ఎక్కువే. పైగా ధరలు కూడా మరీ ఎక్కువేం కాదు. అయితే కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు స్థానిక వంటకాలు రుచి చూడాలనుకునేవాళ్లకి ఈ నగరం ది బెస్ట్‌ అనే చెప్పాలి. ‘తిను, తాగు, జీవించు...’ అన్నట్లుగా వంటకాల్నీ పానీయాల్నీ అందిస్తుంటారు ఇక్కడి షెఫ్‌లు. కేకులూ బిస్కెట్లూ కలిపి చేసే ష్రూస్‌బరీ కేక్‌, 18వ శతాబ్దంనాటి బర్మింగ్‌హామ్‌ సూప్‌, పికెలెట్స్‌ అని పిలుచుకునే ప్యాన్‌కేక్స్‌, టర్కిష్‌ ఫ్లేవర్లతో చేసే డానర్‌ కబాబ్‌... ఇలా ఈ నగరానికే ప్రత్యేకమైన వంటకాలు చాలానే రుచి చూశాం. ఇలా చెప్పుకుంటూ పోవాలేగానీ బర్మింగ్‌హామ్‌ గురించిన సంగతులెన్నో... రంగుల పూలతోటలూ సుందర నిర్మాణాలూ పచ్చని వనాలూ పరవళ్లు తొక్కే నదులూ రెప్పలార్పనివ్వవూ అడుగు పడనివ్వవూ... అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..