సబ్బు ఒక్కటే... లాభాలే బోలెడు!

రకరకాల సబ్బులు దొరుకుతున్న ఈ రోజుల్లో... నచ్చినదాన్ని ఎంచుకోవడం చాలా తేలిక. అయితే.. ఆ సబ్బులు చర్మాన్ని శుభ్రపరచడంతోపాటూ అదనపు ప్రయోజనాలనూ తెచ్చిపెడితే ఎలా ఉంటుందంటారూ... అర్థంకాలేదా... వీటిని చూసేయండోసారి మరి.

Updated : 16 Apr 2023 00:39 IST

సబ్బు ఒక్కటే... లాభాలే బోలెడు!

రకరకాల సబ్బులు దొరుకుతున్న ఈ రోజుల్లో... నచ్చినదాన్ని ఎంచుకోవడం చాలా తేలిక. అయితే.. ఆ సబ్బులు చర్మాన్ని శుభ్రపరచడంతోపాటూ అదనపు ప్రయోజనాలనూ తెచ్చిపెడితే ఎలా ఉంటుందంటారూ... అర్థంకాలేదా... వీటిని చూసేయండోసారి మరి.

ఇదీ షాంపూనే

ఇప్పుడంటే రకరకాల షాంపూలూ, కండిషనర్లూ వాడుతున్నాం కానీ... ఒకప్పుడు తలకూ సబ్బునే వాడేవారు. తయారీదారులు ఆ పాత పద్ధతిని మళ్లీ వాడుకలోకి తేవాలనుకున్నారో ఏమో... ఇప్పుడు షాంపూ, కండిషనర్లను సబ్బుల రూపంలోనూ రూపొందిస్తున్నారు. ముఖానికి సబ్బు రుద్దుకున్నట్లుగానే వీటినీ తలకు రాసుకోవచ్చు. పైగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ సబ్బుల్ని తీసుకెళ్లడమూ తేలిక. షాంపూల్లో బోలెడు రకాలు ఉన్నట్లుగానే ఈ షాంపూబార్లూ, కండిషనర్లూ కూడా... రంగురంగుల్లో, ఫ్లేవర్లలో, హెర్బల్‌ రకాల్లోనూ దొరుకుతున్నాయి.


పీచుతో పనేముంది

ఒకప్పుడు చర్మంపైన పేరుకున్న మృతకణాలూ, మురికీ వదిలించేందుకు పీచును వాడేవారు. క్రమంగా లూఫా అందుబాటులోకి రావడంతో దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇప్పుడా పనిని మరింత సులువు చేస్తున్నాయి పీచు సబ్బులు. అంటే... ఈ సబ్బులోనే పీచు కూడా ఉంటుంది కాబట్టి అదనంగా పీచు వాడాల్సిన పని ఉండదు. పైగా ఈ సబ్బులను ప్రధానంగా కలబంద, కాఫీ, నిమ్మ వంటి వాటితోనే తయారుచేయడం వల్ల చర్మం కూడా మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది.


 

రైస్‌సోప్‌ వచ్చేసింది

జపనీయులూ, కొరియన్లూ పాటించే సౌందర్య సంరక్షణలో బియ్యప్పిండి లేదా అన్నంతో తయారుచేసిన ప్యాక్‌, బియ్యం కడిగిన నీళ్లు వంటివి ఎక్కువగా ఉంటాయి. బియ్యం నుంచి అందే పోషకాలతో చర్మం, జుట్టూ మృదువుగా ఆరోగ్యంగా ఉంటాయనీ, వార్థక్యపు ఛాయలూ త్వరగా రావనీ వాళ్ల నమ్మకం మరి. తయారీదారులు దాన్ని గుర్తించే... రైస్‌మిల్క్‌ సోప్‌ను అందుబాటులోకి తెచ్చారిప్పుడు. బ్రౌన్‌రైస్‌ లేదా ఆర్గానిక్‌ రైస్‌, బాదంనూనె, షియాబటర్‌, సోప్‌బేస్‌... వంటివి కలిపి తయారుచేసే ఈ సబ్బు చర్మాన్ని మృదువుగా మార్చడంతోపాటూ మృతకణాలనూ తొలగిస్తుంది. పైగా ఈ సబ్బును చర్మానికే కాదు జుట్టుకీ షాంపూ బదులుగా వాడుకోవచ్చట.


సున్నిపిండి రాయక్కర్లేదిక

‘పదిహేనురోజులకోసారి చక్కగా నలుగుపెట్టుకుని కాసేపయ్యాక స్నానం చేస్తే చాలు. చర్మం ఎంత మృదువుగా ఉంటుందో తెలుసా. మా కాలంలో అదే మాకు క్లెన్సర్‌, ఫేస్‌ప్యాక్‌ అన్నీ...’ అంటూ అమ్మమ్మ చెబితే... అంత తీరిక ఎక్కడుంటుందీ.. పైగా ఆ పిండిని రాసుకోవడం, అది పోయేదాకా శుభ్రం చేసుకోవడం పెద్ద పని అని కొట్టిపారేస్తుంటుంది ఈతరం. అలాంటివాళ్లను దృష్టిలో పెట్టుకునే సున్నిపిండిని సబ్బురూపంలో తీసుకొచ్చేశారు తయారీదారులు. సున్నిపిండిని ఎక్కువ మోతాదులో ఉపయోగించి తయారుచేసిన ఈ సబ్బును వాడితే నలుగుపెట్టుకుని స్నానం చేసినట్లుగానే అనిపిస్తుంది. ముఖానికి అప్పుడప్పుడూ సెనగపిండి ప్యాక్‌ వేసుకోవడం కష్టం అనుకునేవారికీ ఇప్పుడు సెనగపిండితో తయారుచేసిన సబ్బులు కూడా దొరుకుతున్నాయి. దీన్ని కూడా సున్నిపిండి సబ్బు తరహాలోనే వాడుకోవచ్చు. అదేవిధంగా ముల్తానీమట్టిని ప్యాక్‌లా వేసుకుని ఆరబెట్టుకుని ఆ తరువాత శుభ్రం చేసుకునే తీరికలేదనుకునే వారికి ముల్తానీమట్టి సోప్‌బార్‌లూ దొరుకుతున్నాయిప్పుడు.


సబ్బులో స్క్రబ్‌

మోచేతులూ, మోకాళ్లూ పొడిబారినప్పుడూ మృతకణాలు ఎక్కువగా ఉన్నప్పుడూ కాస్త బరకగా ఉండే ప్యాక్‌ను వేసుకోవడం మామూలే. కానీ ఆ ప్యాక్‌ తయారుచేసుకునేందుకు కాఫీపొడి, చక్కెర వంటివన్నీ సిద్ధంచేసుకోవాలి. వాటికి ప్రత్యామ్నాయంగా స్క్రబ్‌లు వచ్చినా... ఇప్పుడు ఆ పనిని మరింత సులువు చేస్తున్నాయి స్క్రబ్‌సోప్‌లు. సాధారణ సబ్బులతో పోలిస్తే ఇవి కాస్త బరకగా ఉండటం వల్ల అచ్చంగా స్క్రబ్‌లానే పనిచేస్తాయి. కాఫీ పొడి, పెసలు-పెరుగు, నిమ్మతొక్కలపొడి వంటి వాటితో తయారయ్యే ఈ సబ్బులతో సమస్య తీరడమే కాదు చర్మం కూడా తాజాగా ఉంటుంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..