స్వెటర్‌... స్టైల్‌ మారింది..!

చలికాలం మొదలైంది... ఎప్పట్లా బీరువాలో అడుగు అరలో దాచిపెట్టిన స్వెటర్లు బయటకు తీసి వాటినే మార్చి మార్చి వేయాలంటే నేటి స్మార్ట్‌ తరానికి ఎంతమాత్రం నచ్చదు సరికదా, ఫ్యాషన్‌ని మిస్‌ అయిపోతున్నామని తెగ బాధపడిపోతుంటారు.

Updated : 27 Nov 2022 03:33 IST

స్వెటర్‌... స్టైల్‌ మారింది..!

చలికాలం మొదలైంది... ఎప్పట్లా బీరువాలో అడుగు అరలో దాచిపెట్టిన స్వెటర్లు బయటకు తీసి వాటినే మార్చి మార్చి వేయాలంటే నేటి స్మార్ట్‌ తరానికి ఎంతమాత్రం నచ్చదు సరికదా, ఫ్యాషన్‌ని మిస్‌ అయిపోతున్నామని తెగ బాధపడిపోతుంటారు. అందుకే ఇప్పుడు వాళ్లకోసం డ్రెస్సుపైన మళ్లీ విడిగా స్వెటర్‌ని తొడుక్కునే బాధ లేకుండా వెచ్చదనాన్ని అందించే దుస్తులే నేరుగా వచ్చేస్తున్నాయి. అలా మార్కెట్లో సందడి చేస్తోన్న తాజా ఉలెన్‌ ఫ్యాషన్లే ఇవన్నీ...

మనతో పోలిస్తే కాలానుగుణంగా ఫ్యాషన్లూ మారిపోవడం ఒకప్పుడు పాశ్చాత్యదేశాల్లోనే ఎక్కువ. గ్లోబలైజేషన్‌తో ఆ ట్రెండ్‌ మనకీ బాగానే ఒంటబట్టింది. అందుకే అప్పట్లో మరీ చలి వేస్తే ఏ కొద్దిమంది మాత్రమే స్వెటర్‌ లేదా స్వెటర్‌ షర్ట్స్‌ ధరించేవారు. ఊళ్లలో అయితే తలకి మఫ్లర్‌ చుట్టుకోవడమో లేదా కంబళి కప్పుకోవడమో చేసేవారు తప్ప ప్రత్యేకించి ఉన్ని దుస్తులు కొనేవారు కాదు. ఆ రోజులకు ఎప్పుడోనో కాలం చెల్లిపోయింది. ఇప్పుడు వెచ్చదనం కోసం రకరకాల స్వెటర్లు వేసుకోవడం సాక్సులూ షూ ధరించడం అంతటా కామన్‌గా మారింది. అయితే ఏదో చిన్న చిన్న తేడాలతో ఉండే ఆ స్వెటర్లనే ఎప్పుడూ వేసుకోవాలంటే యువతరానికి అస్సలు నచ్చదు. అవునుమరి... ఎప్పటికప్పుడు స్మార్ట్‌ ఫోన్‌లో ఫీచర్లు అప్‌డేట్‌ చేసుకున్నట్లే కాలాన్ని బట్టి ఫ్యాషన్లలోనూ యమా స్మార్ట్‌గా అప్‌డేట్‌ అయిపోతుంటుందీ తరం. అందుకే ఆయా కాలానికి తగ్గట్లుగా డిజైనర్లూ ఉలెన్‌తోనే సరికొత్త డిజైన్లు సృష్టించేస్తున్నారు. ఇవి బయట వాతావరణం ఎంత చల్లగా ఉన్నా శరీరంలోని వేడి బయటకు పోకుండా వెచ్చగా ఉండేలా చేస్తాయి. పైగా వీటిల్లో చాలావరకూ రకరకాల ప్రింట్స్‌ కూడా రావడంతో ఏదో సాదాసీదా చలికోటు వేసుకున్నట్లు కాకుండా ఫ్యాషనబుల్‌గానూ ఉంటున్నాయి.

కుర్తీలా... స్వెటర్లా..!

అమ్మాయిలకయితే... జీన్స్‌ లేదా లెగ్గింగ్‌లమీదకి వేసుకునే సంప్రదాయ కుర్తీలూ వెస్టర్న్‌ టాప్‌లూ, ఫ్రాక్‌లూ, లాంగ్‌ ఫ్రాక్‌లూ, స్కర్టులూ అన్నీ కూడా ఉలెన్‌ వేర్‌లో దొరుకుతున్నాయి. చీరలమీదకి వేసుకునే బ్లౌజులు సైతం ఉన్నితోనే ఎంతో అందంగా కుట్టేస్తున్నారు. సెలెబ్రిటీలూ ఫ్యాషనిస్టులూ
అయితే కాస్త పొట్టిగా ఉండే ఉలెన్‌ టాప్స్‌నే శారీ బ్లౌజ్‌గానూ ధరిస్తున్నారు. ఇక, కొత్తగా వస్తోన్న ప్లీటెడ్‌ ఫ్యాషన్‌ ఉలెన్‌ ఫ్రాక్స్‌లోకీ చొరబడింది. కుర్తీ, టీషర్ట్‌, చీర... ఇలా దేనిమీదకైనా వేసుకునేలా లాంగ్‌ కోట్లు వచ్చినట్లే పొడవాటి ఉలెన్‌ కోట్‌లూ వస్తున్నాయి. వీటిని కూడా లోపల వేసుకునే డ్రెస్‌కి మ్యాచయ్యేలా వేస్తూ ఓ కొత్త ఫ్యాషన్‌ సృష్టించేస్తున్నారు నేటి అమ్మాయిలు. అంతేకాదు, కుర్తీమీద ష్రగ్‌ వేసుకున్నట్లే డబుల్‌ పీస్‌ ఉలెన్‌ కుర్తీలూ వస్తున్నాయి. లేటెస్ట్‌ ఫ్యాషన్‌ని ఏమాత్రం మిస్‌ కాకుండా ఆఫ్‌ షోల్డర్‌, సింగిల్‌ స్లీవ్‌, షోల్డర్‌ స్లీవ్స్‌... వంటి ఫ్యాషన్లన్నీ ఉలెన్‌ టాప్‌ల్లోనూ ఫ్రాకుల్లోనూ కూడా కనిపిస్తున్నాయి. బటన్స్‌తో కాస్త లూజుగా ఉండే బాయ్‌ఫ్రెండ్‌ స్వెటర్‌ మోడల్‌ అయితే ఎవర్‌గ్రీన్‌ ఫ్యాషన్‌ అనే చెప్పాలి. పైగా ఒకప్పుడు అబ్బాయిల స్వెటర్లలో మాత్రమే కనిపించే క్రూ, రౌండ్‌, టర్టిల్‌, షాల్‌ కాలర్‌, వి... వంటి నెక్‌ డిజైన్లు అమ్మాయిల దుస్తుల్లోనూ చొప్పించేస్తున్నారు. కాళ్లకు సైతం వెచ్చదనం ఉండేలా స్కర్టులూ లెగ్గింగుల్ని సైతం ఉలెన్‌ ఫ్యాబ్రిక్కుతోనే తయారుచేస్తున్నారు. దాంతో ఒకప్పటి చలికోటు కాస్తా ఈనాటి ట్రెండీ ఉలెన్‌ డ్రెస్‌గా మారిపోయింది. దాంతో నేటి తరం అమ్మాయిలు వీటిని ఎంచక్కా ఆఫీసులకీ కాలేజీలకీ వేసుకెళ్లిపోతూ ‘చలికాలం ట్రెండ్‌ ఇదే’ అనేస్తున్నారు.

పోతే, ఫ్యాషన్లన్నీ అమ్మాయిలకే అనుకునే రోజులకి కాలం చెల్లి కూడా చాలాకాలమే అయింది. కాబట్టే అబ్బాయిల కోసం కూడా కుర్తాలూ స్వెటర్‌ షర్ట్‌లూ టీషర్ట్‌లూ ఫార్మల్‌ షర్ట్‌లూ వెస్ట్‌లూ బ్లేజర్‌లూ కోట్‌లూ జాకెట్‌లూ ప్యాంట్లూ... ఇలా ఎన్నో రకాల ఉలెన్‌ గార్మెంట్స్‌ మార్కెట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే కొత్తగా ఎన్ని వస్తున్నా గళ్ల డిజైన్‌తో చొక్కామీద చొక్కా వేసినట్లుగా కనిపించే స్వెటర్‌ షర్ట్‌లమీదే అబ్బాయిలు ఎక్కువగా మనసు పారేసుకుంటున్నారట. వీటిల్లోనూ హుడీ ఉండేవీ, మెడ దగ్గర వదులుగా వేలాడుతున్నట్లుగా ఉండేవీ, మెడ దగ్గర బటన్స్‌ లేదా జిప్‌తో ఉండేవీ... ఇలా చాలా రకాలే ఉన్నాయి. చొక్కా కాలర్‌లా కనిపించే వాటితోబాటు మెడ దగ్గర స్కార్ఫ్‌ లేదా స్టోల్‌ అందంగా మడిచినట్లుగా కుట్టినవీ వస్తున్నాయి. వీటిని అవసరం లేదు అనుకున్నప్పుడు తీసేయవచ్చు కూడా.

చిన్నారులకీ...

పెద్దవాళ్లకే ఇన్ని రకాలొస్తే పిల్లలకు మరెన్ని రావాలి... అసలే ‘నేటి బాలలే రేపటి ఫ్యాషన్‌ ఐకాన్స్‌‘ అన్న రీతిలో వాళ్లకి గంటకో డ్రెస్సు మారుస్తూ ఇన్‌స్టా రీల్స్‌ చేయించేస్తున్నారు ఈతరం అమ్మలు. అందుకే చిన్నారులకోసం సాదా వెరైటీలతో పాటు త్రీడీ పువ్వులూ జంతువుల బొమ్మలతోనూ ఉలెన్‌ డ్రెసెస్‌ వస్తున్నాయి. అంతేనా... క్రిస్‌మస్‌, న్యూ ఇయర్‌, కామిక్‌ క్యారెక్టర్లతో వస్తున్న థీమ్‌లకైతే లెక్కే లేదు. ఎందుకంటే ఒకప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్లకైనా స్వెటర్‌ అంటే- ఉన్ని దారాలతో అల్లినదో లేదా మెషీన్‌మీద రూపొందించినదో మాత్రమే. కానీ ఇప్పుడలా కాదు, అచ్చంగా ఊలుతో కాకుండా కాటన్‌, రేయాన్‌, నైలాన్‌... వంటి దారాల్నీ జోడించి మరీ ఉలెన్‌ దుస్తుల్ని తయారుచేస్తున్నారు. దాంతో అవన్నీ సుతిమెత్తగా ఉంటూనే వెచ్చదనాన్నీ ఇస్తున్నాయి. అదీగాక, అచ్చంగా అంగోరా, అల్పాకా, మెరీనొ, కశ్మీరీ మేకల ఊలు రకాలతో చేసే స్వెటర్ల ధరలు మరీ ఎక్కువ. అందుకే మిక్స్‌డ్‌ దారాలతో తయారు చేస్తోన్న ఈ సరికొత్త ఉలెన్‌ దుస్తులు అందరికీ అందుబాటు ధరల్లో ఉంటున్నాయి... బోలెడు వెరైటీల్లోనూ దొరుకుతున్నాయి. దాంతో ఈ సరికొత్త ఉలెన్‌ ఫ్యాషన్స్‌ చిన్నాపెద్దా అందరినీ ఆకట్టుకుంటూ చలికాలాన్ని హాయిగా గడిపేలా చేస్తున్నాయి. మీకూ నచ్చాయా మరి..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు