TCS: దేశంలోనే విలువైన బ్రాండ్‌... టీసీఎస్‌!

ఒక కంపెనీ... దానికోసం ఐఐటీల్లో కొత్త కోర్సులు పెట్టాల్సి వచ్చింది. కంప్యూటర్‌ ఇంజినీర్లు విదేశాలకువెళ్లి ఉద్యోగం చేయడంమొదలెట్టిందీ దానివల్లే. ఇప్పుడు దేశంలోఅరవై లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఉన్నారంటే... ఏటా ఇరవై లక్షల కోట్ల రూపాయల ఆదాయం తెస్తున్నారంటే... దానికి పునాది వేసింది ఆ కంపెనీయే.

Updated : 22 Oct 2023 09:23 IST
ఒక కంపెనీ... దానికోసం ఐఐటీల్లో కొత్త కోర్సులు పెట్టాల్సి వచ్చింది. కంప్యూటర్‌ ఇంజినీర్లు విదేశాలకువెళ్లి ఉద్యోగం చేయడంమొదలెట్టిందీ దానివల్లే. ఇప్పుడు దేశంలోఅరవై లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఉన్నారంటే... ఏటా ఇరవై లక్షల కోట్ల రూపాయల ఆదాయం తెస్తున్నారంటే... దానికి పునాది వేసింది ఆ కంపెనీయే. భారతదేశానికి ఐటీని పరిచయం చేసిన టీసీఎస్‌ ఇప్పుడు దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌. కంప్యూటర్‌ అంటే తెలియని రోజుల్లో పుట్టి ఇంతింతై... అన్నట్లుగా పెరిగి ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న ఈ టాటా గ్రూపు సంస్థ ప్రస్థానం ఆసాంతం ఆసక్తిదాయకం.

వంటింట్లో వాడే ఉప్పు నుంచి ఇంటి పైకప్పుకి వాడే ఉక్కు వరకూ... టాటా కంపెనీ ప్రవేశించని రంగం లేదంటే అతిశయోక్తి కాదేమో. దేశానికి ఎప్పుడు ఏది అవసరమో కనిపెట్టి, ఆ రంగంలో ప్రవేశిస్తూ నూట యాభై ఏళ్లుగా పలురంగాల్లో నాణ్యమైన సేవలందిస్తున్న టాటా గ్రూపులో వందకు పైగా సంస్థలున్నాయి. వాటిల్లో ముప్ఫైకి పైగా లిస్టెడ్‌ కంపెనీలే.

ప్రతి కంపెనీకీ ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది. ఈ ఏడాది బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇండియా ర్యాంకింగ్స్‌లో టాప్‌ బ్రాండ్‌గా మరోసారి నిలిచింది... టాటా. పాతిక బిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువను దాటిన తొలిభారతీయ బ్రాండ్‌గానూ చరిత్ర సృష్టించింది.

స్ట్రాంగెస్ట్‌ బ్రాండ్‌గా వరసగా మూడోసారి ఎంపికైంది తాజ్‌ హోటల్‌.

మైనింగ్‌ అండ్‌ మెటల్స్‌ విభాగంలో టాటా స్టీల్‌ది టాప్‌ ర్యాంక్‌.

ఇక, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌- అత్యంత విలువైన భారతీయ బ్రాండ్‌గా రెండోసారి ఎంపికైంది.

మొత్తం టాటా కంపెనీల విలువలో మూడింట రెండొంతులు టీసీఎస్‌ వాటానే. అంతేకాదు, సాలీనా వచ్చే లాభాల్లో దాదాపు డెబ్భైశాతం టీసీఎస్‌ నుంచే.

అసలు మనదేశంలో ఎక్కువ మందికి ఉద్యోగాలిచ్చే కంపెనీల్లో మొదటి స్థానంలో ఉన్నది కూడా ఇదే. ఆరు లక్షల పదహారు వేలకు పైగా ఉద్యోగులు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్నారు. రిలయెన్స్‌,ఇన్ఫోసిస్‌ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.  

మరి ఇంత పెద్ద కంపెనీ ఎలా పుట్టిందీ, ఈ స్థాయికి ఎలా చేరిందీ, ఆ క్రమంలో ఎలాంటి సవాళ్లను అధిగమించిందీ... అన్నది తెలుసుకోవడం ఆసక్తికరమే కదూ..!

అనుకోకుండా...

నిజానికి గొప్ప గొప్ప విషయాలు చాలాసార్లు అనుకోకుండా... ఎలాంటి ప్రణాళికా లేకుండానే మొదలవుతాయి. కొందరు వ్యక్తుల చేతుల్లో పడి అవి అద్భుతాలై నిలుస్తాయి. టీసీఎస్‌ కూడా అలాంటి ఓ అద్భుతమే!
అది 1962. టాటా సన్స్‌ సంస్థకి ఛైర్మన్‌గా ఉన్నారు జె.ఆర్‌.డి.టాటా. ఒకరోజు తన బావగారైన కల్నల్‌ లెస్లీ సాహ్నీతో మాట్లాడుతున్నప్పుడు ‘డేటా’ గురించి ప్రస్తావన వచ్చింది. ‘ఈమధ్య విదేశాల్లో డేటా గురించి చర్చ ఎక్కువ జరుగుతోంది, మనకి కూడా చాలా సంస్థలున్నాయి. వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని భద్రంగా దాచడమూ, అవసరమైనప్పుడు వెతుక్కోవడమూ కష్టంగానే ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా బయట కంపెనీకి డేటా నిర్వహణ బాధ్యత అప్పగించాల్సి వస్తుందేమో...’ అన్నారట సాహ్ని.

‘బయట కంపెనీకి ఎందుకూ? మనమే సొంతంగా పెట్టుకుంటే సరి’ అన్నారట టాటా. అనడమే కాదు, యాభై లక్షల పెట్టుబడి పెట్టి ఒక మేనేజర్ల బృందాన్ని ఎంపిక చేసి ఆ పనినీ సాహ్నికే అప్పజెప్పారు. టాటా సన్స్‌ కార్యాలయంలోనే ఒక పక్కన కూర్చుని వాళ్లు ఒక్కో కంపెనీ డేటానీ పొందుపరచడం మొదలెట్టారు. పని ఎక్కువైన కొద్దీ సిబ్బంది సంఖ్య పెరుగుతూపోయింది. అప్పుడొచ్చింది మరో ఆలోచన... కొత్త సంస్థలో జరిగేదంతా సొంత గ్రూపు సంస్థలకు సంబంధించిన పనే. దాంతో దానికి ఆదాయమంటూ లేదు. అందుకని బయటి సంస్థలనుంచి కూడా పని తీసుకుందాం... అనుకున్నారు.

కానీ అరవయ్యేళ్ల క్రితం సమాజంలో ఒక సంస్థ బయటివాళ్లను నమ్మి తన సమాచారాన్ని ఇస్తుందా? అసలు డేటా నిర్వహణ అంటే ఎంతమందికి తెలుసు? కంప్యూటర్‌ అంటేనే భయపడే రోజులు. దాంతో వాళ్లు అనుకున్న పని దొరకలేదు.

అప్పుడు మరో ఆలోచన... డేటా అంటే ఎవరూ రావడం లేదు కాబట్టి మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ అందాం... అనుకున్నారు. ‘మీ కంపెనీ నిర్వహణలో ఏమైనా సమస్యలుంటే మాకు చెప్పండి, మేం పరిష్కరించి పెడతాం’ అంటూ సహాయహస్తం చాపారు. అప్పుడు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ శాఖల మధ్య ఏవో సర్దుబాట్లు అవసరమై సహాయం కోరింది. ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఎలా పరిష్కరించవచ్చో చెప్పారు. చేసి చూపించారు. ఎంతోకాలం వేధించిన సమస్య అంత తేలిగ్గా పరిష్కారమయ్యేసరికి బ్యాంకు యాజమాన్యం సంతోషించింది. విషయం ఆనోటా ఈనోటా పాకి టాటా కంప్యూటర్‌ సర్వీసెస్‌గా వాడుకలోకి వచ్చిన ఆ సంస్థ ముందు బ్యాంకులు క్యూ కట్టాయి. అవే కాదు, దిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ లాంటి సంస్థలూ వినియోగదారులుగా మారాయి. సంస్థకి మంచి భవిష్యత్తు ఉన్నట్లు కన్పించడంతో ఒకేసారి నాలుగు కొత్త విభాగాలను ఏర్పాటుచేశారు జేఆర్‌డీ టాటా. టాటా కన్సల్టింగ్‌ ఇంజినీర్స్‌, ఎకనమిక్‌ కన్సల్టింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లతో పాటు ఏర్పడిందే టాటా కన్సల్టింగ్‌ సర్వీసెస్‌(టీసీఎస్‌). టాటా కంప్యూటర్‌ సెంటర్‌ని దీంట్లో కలిపేశారు. ఆ సమయంలో టాటా ఎలక్ట్రిక్‌కి హెడ్‌గా ఉన్న పీఎం అగర్వాల్‌ని ఈ సంస్థని కూడా చూసుకోమన్నారు జేఆర్‌డీ. ఇక్కడ పని బాగా జరగడం చూసిన అగర్వాల్‌ చురుకైన యువబృందం ఉంటే ఇంకా బాగుంటుందని భావించి తన దగ్గర పనిచేస్తున్న ఫకీర్‌ చంద్‌ కోహ్లిని రమ్మన్నారు. తనకు కరెంటుకి సంబంధించిన పనే బాగా తెలుసనీ ఇక్కడికి రాననీ అన్నారట ఆయన. అగర్వాల్‌ ఊరుకోలేదు. ‘ఎంఐటీలో చదువుకుని వచ్చినవాడివి. నీ అవసరం ఈ సంస్థకే ఉంది’ అని నచ్చజెప్పారు. టాటా చేత కూడా చెప్పించి కోహ్లిని ఒప్పించారు. అలా టీసీఎస్‌ ఏర్పడిన ఏడాదికి 1969 సెప్టెంబరులో దానికి జనరల్‌ మేనేజరు అయ్యారు ఫకీర్‌ చంద్‌ కోహ్లి. ఆ కొత్త సంస్థ దేశ భవిష్యత్తునే మలుపు తిప్పబోతోందనీ, ఐటీ పితామహుడిగా తన పేరు దేశ చరిత్రలో నిలిచిపోతుందనీ బహుశా అప్పుడు ఆయన ఊహించి ఉండరు.

ఎవరీయన..?

అవిభక్త భారతదేశంలో పెషావర్‌లోని ఒక వ్యాపార కుటుంబంలో 1924లో పుట్టిన ఫకీర్‌చంద్‌ లాహోర్‌ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా తండ్రి చనిపోయారు. దాంతో డిగ్రీ అవగానే నేవీలో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టారు. ఉద్యోగం వచ్చింది కానీ చేరడానికి చాలా టైముంది. ఆ సమయంలో కెనడాలో చదవడానికి ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ సౌకర్యం ఉన్నట్లు తెలిసి అప్లై చేశారు. అది రావడంతో స్వాతంత్య్రానికి పూర్వమే కెనడా వెళ్లి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివి కొన్నాళ్లు కెనెడియన్‌ జనరల్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీలో పనిచేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి ఎంఐటీలో మాస్టర్స్‌ చేసి పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్స్‌లో శిక్షణపొంది స్వదేశానికి తిరిగి వచ్చేసరికి దేశ విభజన జరిగిపోయింది. ఆస్తులన్నీ వదులుకుని కట్టుబట్టలతో లఖ్‌నవూ వచ్చి స్థిరపడిన ఆయన కుటుంబం కటిక పేదరికాన్ని అనుభవిస్తోంది. కోహ్లి టాటా గ్రూపులో ఉద్యోగంలో చేరడంతో క్రమంగా పరిస్థితులు మెరుగుపడ్డాయి. టాటా ఎలక్ట్రిక్‌లో ఆయన డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. మధ్యలో కొంతకాలం టాటా కన్సల్టింగ్‌ ఇంజినీర్స్‌ కోసం పనిచేయడంతో మెయిన్‌ఫ్రేమ్‌ కంప్యూటర్స్‌, పవర్‌ సిస్టమ్‌ డిజైన్‌ లాంటివాటితో పరిచయం ఏర్పడింది. ముంబయి విద్యుత్తు సరఫరా విధానాన్ని న్యూయార్క్‌ తరహాలో తీర్చిదిద్దారు. దేశానికి మొట్టమొదటి లోడ్‌ డిస్పాచింగ్‌ సిస్టమ్‌ని రూపొందించారు. అప్పుడే ఆయన ప్రతిభ అందరికీ తెలిసింది. సాంకేతికత అంటే ప్రాణం పెట్టడం, కొత్తవి నేర్చుకోవడంలో శ్రద్ధా, వినియోగదారుడి కోణంలో ఆలోచించడం... లాంటి గుణాలన్నీ గుర్తించిన జేఆర్‌డీ- గ్రూపులోని పలు సంస్థల బోర్డుల్లో ఆయన్ని సభ్యుణ్ణి చేశారు.

తొలి బీపీఓ

కోహ్లీ వచ్చేసరికి సంస్థలో 200 మంది ఆపరేటర్లూ 10 మంది కన్సల్టెంట్లూ ఉండేవారు. పనులు బాగానే జరుగుతున్నాయనుకుంటున్న సమయంలో ప్రభుత్వం బ్యాంకుల్ని జాతీయం చేసింది. దాంతో టీసీఎస్‌కి పని తగ్గిపోయింది. దేశానికే పరిమితమైతే ఎప్పుడైనా సమస్యే కాబట్టి విదేశాలకు సేవల్ని విస్తరించడమే మార్గం అనుకున్నారు. 1977లో ఐబీఎం మన దేశం నుంచి వెళ్లిపోయాక టీసీఎస్‌ లాంటి కంపెనీల దశ తిరిగింది. పెద్ద పెద్ద సంస్థలతో పరిచయం పెంచుకుని తరచూ అమెరికా వెళ్లడం వల్ల డెట్రాయిట్‌లోని ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ బరోస్‌... టీసీఎస్‌కి హెల్త్‌కేర్‌కి సంబంధించిన ప్రాజెక్టుని అప్పగించింది. దాంతో సంస్థ ప్రోగ్రామర్లను అమెరికా పంపడానికి వీలయ్యింది. మనదేశంలో అవుట్‌ సోర్సింగ్‌ విధానానికి తెరలేచింది దానితోనే. బరోస్‌ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరించడంతో టీసీఎస్‌కి కొన్నేళ్లపాటు 90శాతం ఆదాయం ఆ సంస్థ నుంచే వచ్చేది. అప్పటివరకూ ఐబీఎం అద్దె కంప్యూటర్లతో ఎలాగో అవస్థపడుతూ వచ్చారు కానీ ఇక కొత్తవి కొనాలనుకున్నారు. అయితే కంప్యూటర్ల పట్ల ఏమాత్రం ఆసక్తి లేని ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు పెట్టింది. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిస్తూ 11 అప్లికేషన్లు నింపితే అనుమతి రావడానికి 9 నుంచి 12 నెలలు పట్టేది. దానికీ సిద్ధపడినా అసలు కథ ఇంకోటుంది. కంప్యూటరు ధర 3 లక్షల డాలర్లు. అంత విదేశీ మారకం ఖర్చుపెడుతున్నందుకు ఐదేళ్లలో దానికి రెట్టింపు విదేశీ మారకం తెస్తామని హామీపత్రం రాసివ్వాలి. లేకపోతే జప్తు చేసుకుంటారు. దానికి తోడు 101 శాతం ఇంపోర్ట్‌ డ్యూటీ. అంటే ఆరు లక్షలయ్యేది. అంత డబ్బు ఖర్చు పెట్టి, అన్ని కష్టాలు పడి కంప్యూటర్లు తెచ్చుకుంటే నాలుగేళ్లకల్లా బరోస్‌తో బంధం తెగిపోయింది. అసలు మొదట్లోనే బరోస్‌కు సంబంధించిన కంప్యూటర్‌ పరికరాలను ఇక్కడే తయారుచేసేందుకు లైసెన్స్‌ ఇవ్వమని కోరింది టీసీఎస్‌. అందుకు వాళ్లు అంగీకరించలేదు. అది కానీ జరిగి ఉంటే- మనదేశం కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ రంగంలోనూ ఓ వెలుగు వెలిగేది. ఈలోపు దేశంలోనూ కంప్యూటరైజేషన్‌ ప్రక్రియ మొదలైంది. రిజర్వ్‌బ్యాంక్‌కి ఇంటర్‌ బ్రాంచ్‌ రికన్సిలియేషన్‌ సిస్టమ్‌ను రూపొందించే ప్రాజెక్టు వచ్చింది టీసీఎస్‌కి. మనదేశంలో మొట్టమొదటి సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టు అదే. ఇక వెనుదిరిగి చూసే అవసరం రాలేదు. బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి, హెచ్‌ఏఎల్‌, ఎన్‌పీసీఎల్‌... లాంటి పెద్ద పెద్ద సంస్థల ప్రాజెక్టులూ, పాన్‌కార్డులూ, ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్న్‌లూ, డీమ్యాట్‌ ఎకౌంట్‌లూ, పాస్‌పోర్టు సేవాకేంద్రాలూ... వీటన్నిటి కంప్యూటర్‌ సేవలూ టీసీఎస్‌ చలవే. 1992లో ఏర్పాటైన జాతీయ స్టాక్‌ ఎక్స్చేంజి ప్రపంచంలోనే మూడో పెద్ద ఎక్స్చేంజి. రోజుకు సగటున 70లక్షల లావాదేవీలు జరుగుతాయి. ఆ ప్రాజెక్టుని టీసీఎస్‌ అద్భుతంగా రూపొందించి భేష్‌ అనిపించుకుంది. మరోపక్క విదేశాల్లోనూ దూసుకుపోయింది. జొహన్నెస్‌బర్గ్‌ స్టాక్‌ ఎక్స్చేంజి, కెనెడియన్‌ డిపాజిటరీ సిస్టమ్‌ వంటివాటికి అవసరమైన ప్రాజెక్టులూ చేసిపెట్టింది. ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌, జనరల్‌ ఎలక్ట్రిక్‌, హెచ్‌పీ, మోర్గాన్‌ స్టాన్లీ, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, సిటీ బ్యాంక్‌, ఎరిక్‌సన్‌, మెరిల్‌ లించ్‌ లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ టీసీఎస్‌ వినియోగదారుల జాబితాలో చేరాయి. 1979లోనే ఎస్‌.రామదొరై ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో తొలి సేల్స్‌ ఆఫీసు పెట్టింది టీసీఎస్‌.

విదేశాల్లో ఆఫ్‌షోర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. 1981లో దేశ తొలి సాఫ్ట్‌వేర్‌ రీసెర్చ్‌ సెంటర్‌- టాటా రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిజైన్‌ సెంటర్‌(టీఆర్‌డీడీసీ)ని పుణెలో ప్రారంభించి జేఆర్‌డీ టాటా కలను సాకారం చేసింది కోహ్లి బృందం.

ఆరోజుల్లోనే ఇన్ని ప్రాజెక్టులు చేయాలంటే ఎంతమంది నిపుణులు కావాలీ... వారిని ఎక్కడినుంచి తెచ్చుకున్నారూ... అది మరో కథ.

ఐఐటీల్లో కంప్యూటర్‌ సైన్స్‌

అప్పటికి ఐఐటీలు కొన్నే ఉండేవి. వాటిల్లోనూ కంప్యూటర్‌ సైన్సు కోర్సు లేదు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన వారికి కోడింగ్‌లో శిక్షణ ఇచ్చి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా మార్చుకునేవాళ్లు. ఐఐటీ కాన్పూర్‌ వీసీ తన స్నేహితుడే కావడంతో అక్కడ చదువుకున్నవాళ్లందరికీ తానే ఉద్యోగమిస్తానన్న హామీతో కంప్యూటర్‌ సైన్సు కోర్సు పెట్టించారు కోహ్లి. అలాగే ఇచ్చారు కూడా. అయితే అన్నిట్లోనూ అలా చేయడం సాధ్యంకాదు కాబట్టి
పేరొందిన ఇంజినీరింగ్‌ కళాశాలల్నే ఐఐటీ స్థాయిలో మెంటార్‌ చేయాలనుకున్నారు. అందుకుగాను మొట్టమొదట పుణె ఇంజినీరింగ్‌ కాలేజీనీ ఐఐటీ బోంబేతో సమానంగా తీర్చిదిద్దారు. కనీసం యాభై కళాశాలలను అలా చేయగలిగితే చాలు, దేశ అవసరాలు తీరతాయని భావించేవారాయన. ఐఐటీ బోంబేలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు రోబోటిక్స్‌లో శిక్షణ ఇచ్చే ‘ఈ- యంత్ర’ అనే ప్రాజెక్టుకి ఆయన మెంటార్‌గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా 400 కళాశాలల్లో తక్కువ ఖర్చుతో రోబోటిక్‌ ల్యాబ్‌లను ఏర్పాటుచేశారు.

‘వలస పాలనలో ఉండి పారిశ్రామిక విప్లవాన్ని మనం మిస్సయ్యాం. ఇప్పుడు ఏ యంత్రాలూ అక్కర్లేదు. ఎవరి ఉపాధి మార్గమూ దెబ్బతినదు. మేధస్సే పెట్టుబడి. అది మనకి పుష్కలంగా ఉంది. అందుకే దాన్ని పూర్తిగా వినియోగించుకుందాం. ముందు తరానికి ఆదర్శంగా నిలుద్దాం...’ అనేవారు కోహ్లి. అన్నట్లుగానే ఆయన నెలకొల్పిన సంస్థేకాదు, మొత్తంగా ఐటీ పరిశ్రమ దేశాన్ని ప్రపంచపటంలో సగర్వంగా నిలిపింది. టీసీఎస్‌ స్ఫూర్తితో వచ్చినవే విప్రో, ఇన్ఫోసిస్‌ లాంటి సంస్థలన్నీ. టీసీఎస్‌ కోసం మొదలుపెట్టిన కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టు దేశంలోని ప్రతి ఇంజినీరింగ్‌ కాలేజీలోనూ అత్యంత ఆదరణ పొందిన సబ్జెక్టు అయింది. ఇప్పుడు లక్షలాది నిపుణుల్ని ప్రపంచానికి అందిస్తోంది.

కోహ్లి టీసీఎస్‌ని ఒక్కదాన్నే చూసుకుంటూ ఉండిపోలేదు. నాస్కామ్‌(నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌), సీఎస్‌ఐ(కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా), ఐఈఈఈ(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలెక్ట్రానిక్స్‌ ఇంజినీర్స్‌)... లాంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థల వ్యవస్థాపకుల్లో ఒకరయ్యారు. వ్యక్తులుగా కన్నా సంస్థలుగా కలిసి కదిలితే వేగంగా అభివృద్ధి సాధించవచ్చన్నది ఆయన అభిమతం. ఐటీ కంపెనీలు తమను తాము మంచి వ్యాపార సంస్థలుగా కాక సమస్యల పరిష్కర్తలుగా చూసుకోవాలనేవారు ఆయన. ప్రభుత్వం ఇచ్చిన ఉపకారవేతనం సాయంతో విదేశాలకు వెళ్లి పై చదువులు చదువుకున్నందుకు దేశ రుణం తీర్చుకోవాలి... అంటూ ఆయన 96 ఏళ్ల వరకూ ఆఫీసుకు వచ్చేవారట. 

వారసుల్లోనూ అదే స్ఫూర్తి

కోహ్లి తర్వాత సారథ్య బాధ్యతలు చేపట్టినవారు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించడంతో టీసీఎస్‌ ప్రగతి అప్రతిహతంగా కొనసాగింది. 2002లో బిలియన్‌ డాలర్ల ఆదాయం సాధించి దేశంలో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అయింది. ఆ తర్వాత రెండేళ్లకి స్టాక్‌మార్కెట్లో నమోదైంది.

10.6 ట్రిలియన్ల మార్కెట్‌ వాల్యుయేషన్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ బిజినెస్‌ సంస్థగా టీసీఎస్‌ 2020లో చరిత్ర సృష్టించింది. డిసెంబరు 2020 నాటికి సంస్థ షేరు రూ.2,898కి చేరింది. సరిగ్గా దానికి పదేళ్ల క్రితం ఆ షేరు రూ.375 ఉండేది. ఒక్క దశాబ్ద కాలంలో సంస్థ మార్కెట్‌ విలువ 47 వేల కోట్లనుంచి దాదాపు ఐదు లక్షల కోట్లకి పెరిగింది. భారతీయ లిస్టెడ్‌ సంస్థల్లో అతి పెద్ద సంస్థగా నిలబడింది. సాంకేతికతను సమాజం కోసం ఉపయోగించాలన్న టాటాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎన్నో సమాజహిత కార్యక్రమాలు చేపడుతోంది టీసీఎస్‌. క్లినికల్‌ రీసెర్చ్‌కి సంబంధించి ఫైజర్‌, నొవార్టిస్‌ లాంటి పెద్ద పెద్ద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. పుణెలోని రీసెర్చ్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘సుజల్‌’, ‘స్వచ్ఛ్‌’ లాంటి వాటర్‌ ప్యూరిఫయర్‌లను తక్కువ ఖర్చుతో తయారుచేసి ప్రకృతి విపత్తులు సంభవించినచోట నీటి వసతి కల్పిస్తున్నారు. సామాజిక బాధ్యత కింద యువతలో నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యమివ్వడమే కాక ఈ సంస్థ ఉద్యోగులూ స్వచ్ఛంద సేవకు సమయం కేటాయిస్తున్నారు.

ఇవన్నీ చూసేనేమో... ‘నేను అన్ని కంపెనీల బోర్డు మీటింగులకీ సలహాలు ఇవ్వడానికి వెళ్తాను. టీసీఎస్‌కి మాత్రం నేర్చుకోవడానికి వెళ్తాను’ అంటారు ‘బిజినెస్‌ గురు’గా పేరొందిన క్లేటన్‌ క్రిస్టెన్‌సేన్‌.


పుస్తకాలూ పురస్కారాలూ

టీసీఎస్‌ సారథులు ఐటీ రంగానికి అందించిన సేవల్ని ప్రభుత్వమూ గుర్తించింది. ముగ్గురు సీఈఓలను ‘పద్మభూషణ్‌’ పురస్కారాలతో సత్కరించింది. తొలి సీఈఓ ఎఫ్‌.సి.కోహ్లి(2002), ఆ తర్వాత సీఈఓగా సేవలందించిన సుబ్రహ్మణ్యం రామదొరై(2006), ఎన్‌.చంద్రశేఖరన్‌(2022)లు ‘పద్మభూషణ్‌’ గ్రహీతలు. దాదాపు నలభై ఏళ్లపాటు సంస్థతో కలిసి నడుస్తూ దేశంలో ఐటీ రంగ అభివృద్ధికి బాటలు వేసిన మొదటి ఇద్దరూ తమ ప్రస్థానాన్ని అక్షరబద్ధం చేయడం విశేషం. కోహ్లి ‘ద ఐటీ రివల్యూషన్‌ ఇన్‌ ఇండియా’ అన్న పుస్తకం రాశారు. వెయ్యి రూపాయల జీతంతో ప్రోగ్రామర్‌గా ఉద్యోగంలో చేరి సీఈఓ స్థాయికి ఎదిగిన ఎస్‌.రామదొరై- ‘ద టీసీఎస్‌ స్టోరీ అండ్‌ బియాండ్‌’ అనే పుస్తకం రాశారు. ‘హౌ టీసీఎస్‌ బిల్ట్‌ యాన్‌ ఇండస్ట్రీ ఫర్‌ ఇండియా’ అనే పుస్తకాన్ని ఆర్‌. గోపాలకృష్ణన్‌, తులసీ జయకుమార్‌లు రాశారు.


హైదరాబాద్‌లో మొదటి పెద్ద కంపెనీ

హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మొట్టమొదటి పెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌. 1979లో ప్రారంభమైంది. ఇప్పుడు మొత్తం ఏడు కార్యాలయాలున్నాయి. ప్రస్తుతం సంస్థలో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌కి గ్లోబల్‌ హెడ్‌గా ఉన్న వి.రాజన్న 2007లో హైదరాబాద్‌లో టీసీఎస్‌ విస్తరణ బాధ్యత చేపట్టారు. ఆయన కృషి ఫలితంగా అప్పటివరకూ 4500 ఉన్న ఉద్యోగుల సంఖ్య ఇరవై రెట్లు పెరిగింది. 2011లో  ప్రారంభించిన శిక్షణ కేంద్రంలో ఒకేసారి ఆరువేల మంది శిక్షణ పొందవచ్చు. నగరంలో ఉన్న 1500లకు పైగా ఐటీ కంపెనీల్లో తొమ్మిది లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా ఒక్క టీసీఎస్‌లోనే 88 వేలమంది పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం టీసీఎస్‌ కేంద్రాల్లో హైదరాబాద్‌ది రెండో స్థానం కాగా తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతుల్లో టీసీఎస్‌ వాటా 10-12 శాతం ఉంటుంది.


ఉద్యోగులకు అండాదండా ‘మైత్రి’

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో ఒత్తిళ్లు సహజం. దానివల్ల అనారోగ్యాలకు గురవడమూ భార్యాబిడ్డలతో సమయం గడపలేక ఇంట్లో గొడవలు పడడమూ కద్దు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ఏర్పాటైందే- ‘మైత్రి’. రామదొరై భార్య మాల ప్రతిపాదనతో ఇది రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీసీఎస్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యులంతా దీంట్లో సభ్యులే. వాళ్లుండే ప్రాంతాల్లోని స్కూళ్లూ, ఇళ్లూ, ఆస్పత్రులూ తదితర సమాచారాన్ని అంతా ఇందులో పెడతారు. బదిలీల సమయంలో ఇదెంతో ఉపయోగపడుతుంది. ట్రెకింగ్‌, విహారయాత్రలు, డాన్సులు, వర్కుషాపులు, శిక్షణ కార్యక్రమాలు లాంటి వినోద, విజ్ఞాన కార్యక్రమాలెన్నో నిర్వహిస్తారు. మైత్రి వల్ల టీసీఎస్‌ సిబ్బందిలో కుటుంబ వివాదాలు బాగా తగ్గాయట.


విజయ సూత్రాలు

టీసీఎస్‌ విజయానికి ఐదు ప్రధాన కారణాలు చెబుతారు నిపుణులు.

  • సాంకేతికంగా రాబోయే మార్పును పసిగట్టి అందుకు సరైన వనరులతో ఆర్నెల్ల ముందే సిద్ధంగా ఉంటుంది. ఆదాయంలో ఒకటిన్నర శాతం రీసెర్చ్‌కి కేటాయిస్తుంది. కొన్ని వేల మందిఈ విభాగంలో పనిచేస్తున్నారు.
  • ఉద్యోగుల శిక్షణకు ఆదాయంలో నాలుగు శాతం ఖర్చుపెడుతుంది. అసలు ఏమీ రానివారికీ, ఉద్యోగంలో ఉన్నవారికీ వేర్వేరు శిక్షణలు ఉంటాయి. దాంతో ప్రతిభావంతులైన సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.
  • నాణ్యతకీ వినియోగదారుల సంతృప్తికీ అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఒకసారి సేవలు పొందినవాళ్లు శాశ్వత వినియోగదారులుగా మారిపోతారు.
  • ప్రపంచంలో గొప్ప సంస్థలుగా పేరొందిన వాటిని పరిశీలించి అవి అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అనుసరిస్తుంది.
  • చివరిదీ అన్నిటికన్నా ముఖ్యమైనదీ... టీసీఎస్‌ సారథులు. యాభై ఐదేళ్ల చరిత్ర గల ఈ సంస్థకి ఇప్పటివరకూ నలుగురే సీఈఓలు మారారు. వాళ్లంతా ఒకరిని మించి ఒకరు చొప్పున సంస్థ అభివృద్ధికి కృషిచేశారు. కోహ్లి చేరినప్పుడు 200 ఉన్న సిబ్బంది సంఖ్య ఆయన రిటైరయ్యేనాటికి 14వేలు అయింది. ఆదాయం వెయ్యికోట్లు దాటింది. రామదొరై ఆదాయాన్ని పాతిక రెట్లూ, ఉద్యోగుల సంఖ్యని పది రెట్లూ పెంచారు. ఇక నటరాజన్‌ చంద్రశేఖరన్‌ అయితే టీసీఎస్‌లో ఇంటర్న్‌గా చేరి సీఈఓ అవడమే కాక ఆ తర్వాత టాటా గ్రూపుకే ఛైర్మన్‌ అవడం విశేషం. ఆయన హయాంలో టీసీఎస్‌ ప్రపంచంలోనే రెండో విలువైన కంపెనీగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సీఈఓ అయిన రాజేశ్‌ గోపీనాథన్‌ ఈ ఏడాది మార్చిలో రిటైరవగా ఆయన స్థానంలో కృతివాసన్‌ సీఈఓ అయ్యారు. ఇప్పుడు మనదేశంలో నంబర్‌వన్‌ ఐటీ కంపెనీగా ఉన్న టీసీఎస్‌కి 40కి పైగా దేశాల్లో కార్యాలయాలున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..