పల్లె అనుభవమే...అంకురమైంది!

కెరియర్‌లో ఎంత దూరం వెళ్లినా మూలాల్ని మర్చిపోలేరు కొందరు. పల్లెటూళ్లో పుట్టి పెరిగిన వీళ్లూ అంతే. చిన్ననాటి అనుభవాలూ, జ్ఞాపకాలే వీళ్లని ఉద్యోగాలు వదిలి వ్యాపారులుగా మారేందుకు ప్రేరణగా నిలిచాయి

Updated : 08 Oct 2023 01:03 IST

గానుగ నూనెల ‘గ్రామియా’

ప్పుడు దోశెలు తిన్నా... చిన్నప్పుడు అమ్మ చేతి దోశెలు గుర్తొచ్చేవి శిబి మణివన్నన్‌కి. ‘ఆ వాసన, ఆ రుచి... ఇప్పుడు లేకపోవడానికి కారణం ఏంటి?’ అనుకునేవాడు. అప్పట్లో వేరుసెనగ, నువ్వుల నూనెని ఉపయోగించేవారు. వాటి వాసన ఇల్లంతా వ్యాపించేది. ఇప్పుడంతా రిఫైన్డ్‌ నూనెలే. తేడా అదేనని గుర్తించాడు శిబి. ఇంజినీరింగ్‌ తర్వాత కుటుంబం నడిపే రెస్టరెంట్‌ వ్యాపారంలో అడుగుపెట్టాడు. ఆ సమయంలోనే నూనెల్లో నాణ్యత లేకపోవడం గమనించాడు. ఒకప్పుడు వీళ్ల తాతయ్యకి గానుగతో నూనెలు తయారుచేసే వ్యాపారం ఉండేది. వాటినే ఇంట్లో వాడేవారు. ఆ తరహా ఆరోగ్యకరమైన నూనెల్ని ఈతరానికి చేర్చాలనుకున్నాడు శిబి. అతడికి యాసిన్‌, నవీన్‌ రాజ్‌మారన్‌ తోడు రాగా... 2017లో ‘గ్రామియా’ని ప్రారంభించాడు. తమిళనాడు, రాజస్థాన్‌, కేరళల్లోని రైతుల నుంచి వేరుసెనగ, నువ్వులు, కొబ్బరి సేకరిస్తారు. ‘సేకరించిన గింజలూ, కొబ్బరిని మొదట ఎండలో బాగా ఆరబెడతాం. తర్వాత రాతి గానుగలో కట్టెతో అదిమే యంత్రాలతో నూనెల్ని తీస్తాం. గింజల నుంచి తక్కువ మోతాదులోనే నూనెల్ని తీయడంవల్ల మంచి వాసనతోపాటు పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉంటాయి. ఆ నూనెను పేపర్‌బోర్డ్‌తో చేసిన బాటిళ్లలో నింపుతాం. నిల్వ పదార్థాలేవీ కలపకపోయినా నిల్వ ఉంటాయివి’ అని చెబుతాడు శిబి. వీటి ధర రిఫైన్డ్‌ నూనెల ధరకంటే ఎక్కువగా ఉన్నా, నాణ్యతలో అవేవీ సరితూగవంటాడు. ప్రస్తుతం సంస్థ వార్షిక ఆదాయం రూ.15 కోట్లకుపైనే. నెలకు 50వేల లీటర్ల నూనెల్ని అమ్ముతున్నారు. సగం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.


కెరియర్‌లో ఎంత దూరం వెళ్లినా మూలాల్ని మర్చిపోలేరు కొందరు. పల్లెటూళ్లో పుట్టి పెరిగిన వీళ్లూ అంతే. చిన్ననాటి అనుభవాలూ, జ్ఞాపకాలే వీళ్లని ఉద్యోగాలు వదిలి వ్యాపారులుగా మారేందుకు ప్రేరణగా నిలిచాయి


కొబ్బరి ఉత్పత్తుల ‘తెంగిన్‌’

నిమిదేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసిన మధు కర్గుంద్‌... ఉద్యోగం మానేస్తానని ఇంట్లో చెప్పేసరికి అవాక్కయ్యారు తల్లిదండ్రులు. రైతుల కోసం పనిచేస్తాననడం వాళ్లని ఇంకాస్త ఆందోళనకు గురిచేసింది. మధుది కర్ణాటక హసన్‌ జిల్లాలోని కర్గుంద. ఆ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. చిన్నప్పుడు నాన్నకి కొబ్బరి తోట పనుల్లో సాయపడేవాడు. ఉద్యోగం చేస్తున్నన్ని రోజులూ రైతులకు దళారీ వ్యవస్థ నుంచి విముక్తి కల్పించడం గురించే ఆలోచించేవాడు మధు. సుభాష్‌ పాలేకర్‌ దగ్గర జీరో బడ్జెట్‌, ప్రకృతి వ్యవసాయం గురించి శిక్షణ తీసుకున్నాడు. అప్పుడే తమ కొబ్బరి తోటలో అంతర పంటల్నీ సాగు చేస్తూ ఇతరులకూ అవగాహన కల్పించాడు. కొబ్బరి ఒక కల్ప వృక్షం. ఈనె నుంచి నూనె వరకూ ప్రతిదీ పనికొచ్చేదే. వృథానే లేదు. కానీ రైతులకు లాభాలు అంతంత మాత్రమే. అలా కొబ్బరి రైతుల మీద దృష్టి పెడుతూ 2018లో తెంగిన్‌(కన్నడలో కొబ్బరి) సంస్థని ఏర్పాటుచేశాడు. కొబ్బరి నూనె, పంచదార, బెల్లం, బర్ఫీ, చిప్స్‌, కొబ్బరి చిప్పలతో కాఫీ మగ్‌లూ, పాత్రలూ, దీపాలూ, కొబ్బరి పీచుతో డిష్‌ స్క్రబ్బర్లు, ఈనెలతో చీపుర్లు... ఇలా అనేక రకాలైన ఉత్పత్తుల్ని తెస్తున్నాడు. తన గ్రామంలోని మహిళలకు వీటి తయారీలో శిక్షణ ఇప్పిస్తున్నాడు. మొదట్లో ఎగ్జిబిషన్లూ, అపార్ట్‌మెంట్ల దగ్గరకు వెళ్లి ఉత్పత్తుల్ని అమ్మేవాడు. ప్రస్తుతం ఆన్‌లైన్లో అందుబాటులోకి తెచ్చాడు. కర్ణాటక, గోవాల్లో 50 మంది కొబ్బరి రైతులకు మంచి ధర ఇస్తూ మేలు చేస్తున్నాడు. సంస్థ ఆదాయం సుమారు రూ.కోటి పైనే.


‘అమ్మమ్మ’ చేతి వంట

ముంబయికి చెందిన అపూర్వ పురోహిత్‌... కార్పొరేట్‌ రంగంలో మూడు దశాబ్దాలు పనిచేసి ఓ సంస్థ ప్రెసిడెంట్‌ స్థాయికి చేరుకున్నారు. ‘నిరుపేదలూ, గ్రామీణులకు ఏమీ చేయలేకపోయానే’ అన్న అసంతృప్తి ఆమెను వేధించేది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లబ్బాయి సిద్ధార్థ్‌కి ఈ విషయాన్ని చెబితే... తనూ ఆ విభాగంలో పనిచేయడానికి ఆసక్తి చూపాడు. వెంటనే ఉద్యోగాలకి రాజీనామా చేసి అధ్యయనం మొదలుపెట్టారు. ముంబయిలో జరిగే ‘మహాలక్ష్మి సారస్‌ ఎగ్జిబిషన్‌’కి వెళ్లారు... అక్కడ స్వయం సహాయక బృందాలు తయారుచేసిన సంప్రదాయ మరాఠా వంటకాల్ని చూశారు. ‘నాణ్యమైన ఉత్పత్తులు. వాటిలో చాలావరకూ చిన్నప్పుడు తిన్నవే. ఎలాంటి నిల్వ పదార్థాలూ లేకుండా తయారుచేస్తూ... మళ్లీ వెలుగులోకి తెస్తున్నారు. కానీ సరైన మార్కెట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. అప్పుడే తయారుచేసేవాళ్లకీ, కొనుగోలుదారుకూ మధ్య వారధిగా ఉండాలనుకున్నా’ అంటారు అపూర్వ. అలా 2021లో ‘ఆజోల్‌’(అమ్మమ్మగారి ఇల్లు) ప్రారంభమైంది. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్లింట్లో రుచి చూసిన చట్నీలూ, పిండివంటలూ, అప్పడాలూ, లడ్డూలే అవన్నీ... అందుకే ఆ పేరు. రుచితోపాటు జ్ఞాపకాల్నీ పంచడంతో వీటికి గిరాకీ ఏర్పడింది. స్వయం సహాయక బృందాలకు చెందిన వందలమంది ఈ సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్నారు. కొందరు నెలకు రూ.20-30 వేలు సంపాదిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..